జీవితం ఒక నాటకరంగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జీవితం ఒక నాటకరంగం పుస్తకం పన్నాలాల్ పటేల్ గుజరాతీ భాషలో రచించిన మానవీనీ భవాయీ నవలకు తెలుగు అనువాదం.

రచన నేపథ్యం[మార్చు]

గుజరాతీలో మానవీనీ భవాయీగా వెలువడ్డ ఈ నవల గ్రామీణ జీవితం నేపథ్యంగా రచించబడింది. సాంఘిక స్థితిగతులు, వాతావరణ వైపరీత్యాలు రైతు జీవితంపై ఎటువంటి ప్రభావం చూపాయనేది ఆనాటి సంధి కాలానికి ముడిపెట్టి పన్నాలాల్ పటేల్ ఈ నవలను ప్రతిభావంతంగా రచించారు. పన్నాలాల్ ఈ నవల గుజరాతీ మూలాన్ని 1947లో రచించారు. ఈ విశిష్టమైన నవలను నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు భారతదేశంలోని పలు భాషల్లోకి నవలను అనువాదాలు చేయించి ప్రచురించారు. ఆ క్రమంలో 1971లో అంతర భారతీయ గ్రంథమాల పథకం కింద తెలుగులో జీవితం ఒక నాటక రంగం పేరిట అనువాదాన్ని ప్రచురించారు. ఈ నవలను వేమూరి ఆంజనేయశర్మ ప్రచురించారు. అనువాదం 1990లో ద్వితీయ ముద్రణను పొందింది. మానవీనీ భవాయీ నవలా రచనకు 1985లో పన్నాలాల్ పటేల్ ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్నారు.

ఇతివృత్తం[మార్చు]

జీవితం ఒక నాటకరంగం నవల కథాక్షేత్రం గుజరాత్ లో వర్షాభావ ప్రాంతానికి చెందిన ఒక గ్రామం. కరువు రావడానికి ఇరవై ఐదు సంవత్సరాల ముందు కథానాయకుడు కాళా జన్మించేవేళ ఇతివృత్తం ప్రారంభమవుతుంది. కాళా తండ్రి వాలా పటేల్ చిన్న కమతం కలిగిన రైతు. అతని పెద్ద వయస్సులో కాళా జన్మిస్తాడు. కాళాకు యుక్తవయస్సు వచ్చే లోగానే వాలా పటేల్ మరణిస్తారు. కాళా పెద్దనాన్న కుటుంబానికి అతని అభివృద్ధి గిట్టదు. పైగా ప్రతి చిన్న విషయంలోనూ తమ కొడుకులే కాళా కన్నా ముందుండాలని పెద్దమ్మ ఆశిస్తూంటుంది. ఒకరికొకరు వ్యక్తం చేసుకోకున్నా కథానాయిక రాజు (స్త్రీపాత్ర పేరు), కాళా పరస్పరం ఇష్టపడతారు. కాళాకు రాజుకు వివాహం నిశ్చయం అవుతున్న సమయంలో కాళా పెదనాన్న కుటుంబం ఆ సంబంధాన్ని తప్పించి రాజును తమ కొడుకుకు ఇచ్చి చేసే ప్రయత్నాలు చేస్తారు. నాటకీయ పరిణామాల మధ్య రాజుకు కాళాతోనూ, కాళా పెద్దనాన్న కొడుకుతోనూ కాక వేరే వ్యక్తితో పెళ్లవుతుంది. ఆ వ్యక్తి చెల్లెలిని కాళా పెళ్ళాడాల్సివస్తుంది. పరస్పరం ఉన్న ప్రేమను వివాహబందం అడ్డుకోవడంతో బాధపడే వారి మధ్యలో కరువు కాటకాలు వస్తాయి. ఆ కాటకం అందరి జీవితాలను మలుపులు తిప్పడం ఇతివృత్తంలోని మిగతాభాగం.[1]

శైలి, శిల్పం[మార్చు]

గుజరాతీ గ్రామీణ జీవితాన్ని పన్నాలాల్ పటేల్ ఎంతో నేర్పుతో ఈ నవలలో చిత్రీకరించారు. గుజరాతీ సాహిత్యవేత్త దర్శక్ ఈ నవలలోని పాత్రల గురించి చెప్తూ ముసలి వాలా పటేల్ గ్రామీణుల్లోని వాడే, ఈర్ష్యాళువైన మాలీ గ్రామసమాజంలోని అంతర్భాగమే, మంత్రగత్తె పూలీ, బేచాత్, కాసిమ్ కూడా గ్రామీణులే, కథానాయకుడు, గొప్ప వ్యక్తిత్వం కలిగినవాడైన కాళా కూడా గ్రామీణుడే అంటారు. దీని ద్వారా గ్రామీణ జీవితాన్ని ఎంతగా పునఃసృష్టించారో తెలుస్తుంది. దర్శక్ విశ్లేషణ ప్రకారం కథానాయిక రాజూలాంటి మానవతి మాత్రం ప్రతీ గ్రామంలోనూ కనిపించే వ్యక్తి కాదు. ప్రముఖ బెంగాలీ సాహిత్యవేత్త శరత్ సృష్టించిన అలక, భైరవీ, పారో, రాజలక్ష్మి, అన్నద వంటి గొప్ప వనితారత్నాలను ఎందరినో ఆరాధించి గ్రామకేదారంలో (పన్నాలాల్) పండించిన సస్యరాజమని వ్యాఖ్యానిచారు ఆయన.
కాలానుగుణమైన మార్పుల వల్ల వ్యక్తిత్వాలు, జీవితాలు ఎలా రూపుదిద్దుకుంటానే కోణంలో ఈ నవల విశిష్టమైనది. కథంతటికీ కీలకమైన పాత్ర కాలం అనీ, మిగిలిన పాత్రలన్నీ ఆ కేంద్రంపైనే ఆధారపడి సాగుతున్నాయనీ నవల ప్రత్యేకతను వ్యాఖ్యానించారు దర్శక్.[2]

మూలాలు[మార్చు]

  1. జీవితం ఒక నాటకరంగం:మూ.పన్నాలాల్ పటేల్, అ.వేమూరి ఆంజనేయశర్మ:నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా:1990 ముద్రణ
  2. మానవీనీ భవాయీ నవలకు వాచవి శీర్షికన దర్శక్ రాసిన విశ్లేషణ:అ.వేమూరి ఆంజనేయశర్మ