జీవిత బీమా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యార్క్‌షైర్ ఫైర్ అండ్ లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీ, ఇంగ్లాండు వారు జారీచేసిన జీవిత భీమా సర్టిఫికేటు

జీవిత బీమా (ఆంగ్లం: Life insurance) అంటే పాలసీదారు, బీమా సంస్థ మధ్య జరిగే ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం బీమా సంస్థ ముందుగా కొంత సొమ్మును తీసుకుని, బీమా చేయబడిన వ్యక్తులు (సాధారణంగా పాలసీదారు) మరణిస్తే దానికి బదులుగా నిర్దేశించబడిన లబ్దిదారులకు పెద్దమొత్తంలో ధనం (పరిహారం) చెల్లిస్తుంది. ఒప్పందాన్ని బట్టి కొన్నిసార్లు మరణానికి దారితీసే జబ్బులు సంక్రమించినపుడు, లేదా తీవ్ర అనారోగ్యం సంక్రమించినపుడు కూడా చెల్లింపులు ఉండవచ్చు. ఇందుకోసం పాలసీదారు సాధారణంగా ఒక ప్రీమియం సొమ్మును నిర్ణీత కాలవ్యవధిలోనో లేదా అంతా ఒక్కసారే చెల్లిస్తాడు. కొన్ని సందర్భాల్లో అంత్యక్రియల ఖర్చులు వంటి ఇతర ఖర్చులను కూడా ప్రయోజనాలలో చేర్చవచ్చు.[1]

జీవిత బీమా చట్టపరమైన ఒప్పందం. చట్టం దీనికి రక్షణ కల్పిస్తుంది. ఈ ఒప్పందంలో బీమా ఏయే పరిస్థితుల్లో వర్తిస్తుందో నిబంధనల రూపంలో ఉంటాయి. బీమా సంస్థల బాధ్యతను పరిమితం చేయడానికి కొన్ని మినహాయింపులు కూడా ఒప్పందంలో ఉంటాయి. ఉదాహరణకు ఆత్మహత్యలు, అల్లర్లు, యుద్ధం, మోసాలు, పౌర ఆందోళనలు మొదలైన వాటినుంచి బీమా సంస్థలకు పరిహారం చెల్లించకుండా మినహాయింపు ఉంటుంది.

ఆధునిక బీమా సంస్థలు ఆస్తి నిర్వహణ సంస్థలను (Asset Management Companies) పోలి ఉన్నాయి.[2] ఈ సంస్థలు తమ సేవలు, ఉత్పత్తులను పదవీ విరమణకు ఉపకరించే వార్షిక భృతి (Annuity) లాంటి సేవలకు కూడా విస్తరించాయి.[3]

జీవిత బీమా పాలసీలను ప్రధానంగా రెండు వర్గాలుగా విభజించవచ్చు. ఒకటి పూర్తి స్థాయి రక్షణ పాలసీలు (Term insurance), రెండోది పెట్టుబడి పాలసీలు (Investment policies). పూర్తి స్థాయి రక్షణ పాలసీల్లో ఒప్పందంలో పేర్కొన్న సంఘటన ఏదైనా జరిగినప్పుడు పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించబడుతుంది. ఏమీ జరగనప్పుడు ఎలాంటి సొమ్ము చేతికి రాదు. పెట్టుబడి పాలసీల్లో పాలసీదారు క్రమం తప్పకుండా చెల్లించే ప్రీమియం, లేదా ఒక్కసారి చెల్లించే ప్రీమియం విలువ పెరుగుతూ వస్తుంది. చివరిదాకా ఎటువంటి సంఘటన జరగనప్పుడు ఈ మొత్తం చేతికి అందుతుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Insurance Basics - IndiaFirst Life Insurance". www.indiafirstlife.com. Retrieved 2021-03-09.
  2. "The Industry Handbook: The Insurance Industry". Investopedia (in ఇంగ్లీష్). 2004-01-07. Archived from the original on 2018-09-07. Retrieved 2018-11-28.
  3. "Industry Overview: Life Insurance". www.valueline.com (in ఇంగ్లీష్). ValueLine. Retrieved 2018-11-28.