డాంగ్లిన్ దేవాలయం (జియాంగ్సీ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Main hall of the Donglin Temple

డాంగ్లిన్ దేవాలయం చైనా దేశంలోని జియాంగ్సీకి చెందిన జియుజియాంకు 20 కి.మీ దూరంలో ఉన్న భౌద్ద క్షేత్రం. దీనిని సా.శ. 386లో నిర్మించారు.

విశేషాలు[మార్చు]

తూర్పు చైనాలో జియాంక్సి ప్రావెన్సీలో క్సింగీ కౌంటీలో జియూ జియాంగ్ నగరంలో డాంగ్లిన్ దేవాలయం (బుద్ధవిహార) ఉంది. ఈ దేవాలయం సమీపంలో ప్రపంచంలో ఎత్తయిన బుద్ధుని కంచు విగ్రహం ఉంది. ఆరుబయట స్థలంలో 48 మీటర్ల ఎత్తు కలిగిన ఈ బుద్ధ కంచు విగ్రహాన్ని "అమితాభ బుద్ధ" అని పిలుస్తారు. ఈ విగ్రహానికి 48 కిలోల బరువు గల బంగారు దుస్తులు ధరింపచేశారు. ప్రపంచంలో వున్న కంచు విగ్రహాల్లోకెల్లా అత్యంత ఎత్తయిన ఈ విగ్రహం ఒక విశేషమైతే, ఇక్కడి డాంగ్లిన్ పర్వత బౌద్ధ దేవాలయ చరిత్ర ఎంతో ప్రాచీనమైనదే కాక, విశిష్టమైనది కూడా.

డాంగ్లిన్ దేవాలయం అంటే హిందూ ఆధ్యాత్మిక అర్థంలోని నిర్వచనం ఇక్కడ సరిపోలదు బౌద్ధ సంప్రదాయాల ప్రకారం బౌద్ధభిక్షువులు, బౌద్ధ బోధనల అధ్యయనం, విపశ్యనా ధ్యానం. వివిధ దేశాల్లోగల బౌద్ధ విహారాలు-అధ్యయన కేంద్రాలతో సంబంధాలు బౌద్ధ ఆహార విహరాదుల ఇత్యాది కార్యక్రమాలు జరిగే కేంద్రంగా (monastery) అర్థం చేసుకోవాల్సి ఉంది.

జియాంగ్ జింగ్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో వున్న డాంగ్లిన్ దేవాలయం క్రీస్తుశకం 386లో నిర్మితమైంది. ఈ విహారకు ప్రకృతి ఉత్పాతాలు, అనేక ఆటుపోట్లు ఎదురయ్యాయి బౌద్ధుల త్యాగనిరతి, దృఢ దీక్షా సంకల్పాల వల్ల ఈ విహార పునర్నిర్మితమై చెక్కుచెదరకుండా రక్షింపబడింది. దేవాలయం ఆర్థిక వెసులుబాటుకు గాను సమీపంలో ఒక గ్రామం ఉంది. డాంగ్లిన్ దేవాలయం చుట్టుపక్కల అనేక సంస్థలు, ప్రదేశాలు, కట్టడాలు, ఉద్యానవనాలున్నాయి వీటన్నింటీనీ డాంగ్లిన్ పేరుతో వ్యవహరిస్తారు.

చైనాలో భౌద్దానికి సంబంధించి మూడు అంతర్జాతీయ సమాచార కార్యాలయాలున్నాయి. వాటిల్లో ఒకటి డాంగ్లిన్ విహారం. రెండవది సన్హే కార్యాలయ విహారం, మూడవది యుంజూ పర్వత కార్యాలయం. డాంగ్లిన్ దేవాలయం పునర్నిర్మాణం జరిగిన నాటినుండి సందర్శించే బౌద్ధుల, పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఈ దేవాలయ నిర్మాణం వెనుక వున్న కథనాన్ని ప్రజలు ఆసక్తికరంగా చెప్పకుంటూ వుంటారు.

చరిత్ర[మార్చు]

హుయియుయాన్ ఒక బౌద్ధ భిక్టు. ఈయనే డాంగ్లిన్ దేవాలయాన్ని నిర్మించాడు. లూషన్ పర్వత ప్రాంతానికి హుయి వచ్చినప్పుడు బౌద్ధ దేవాలయ నిర్మాణం ఆలోచన ఆయనకు లేదు. ఒకరోజు రాత్రి ఆయనకు బుదుడు కలలో కనిపించి లూషన్ పర్వతం మీదనే బౌద్ధవిహారం నిర్మించమని ఆదేశించాడని, ఆరోజు రాత్రే భయంకరమైన పెనుగాలులు వీచి భూమి నుండి చెట్లు వేళ్ళతో సహా పెళ్లగించుకుని పైకి వచ్చి ఒరిగిపోయాయని, ఆ విధంగా విహార నిర్మాణానికి కావలసిన కలప కూడా లభించిందని జనశ్రుతి. బౌద్ధంలో వున్న అనేక శాఖల్లో లోటస్ సెక్ట్ (పరిశుద్ధ భూమి శాఖ) ఒకటి. ఈ పరిశుద్ధభూమి శాఖకు హుయి ఆద్యుడు. చైనాలో ఎక్కువమం బౌద్ధులు ఈ శాఖలోనే ఉన్నారు. పరిశుద్ధభూమి శాఖతోపాటే డాంగ్లిన్ బౌద్ధవిహార కూడా దినదిన ప్రవర్ధమానమైంది.

బుద్ధునికి గౌరవ సూచకంగా దాదాపు అన్ని బౌద్ధవిహారాల్లో నిర్మించే ప్రధాన సభాస్థలికి "మహావీర హాల్" అని పేరు పెడతారు. కానీ డాంగ్లిన్ మందిరంలో మాత్రం షెన్యూన్ హాల్ అని పేరు పెట్టారు. అంటే బుద్ధుడు ఆశీర్వదించిన హాలు అని అర్థం.

డాంగ్లిన్ దేవాలయం-చారిత్రక నేపథ్యం[మార్చు]

డాంగ్లిన్ దేవాలయం చారిత్రక కథలకు నిలయంగా ఉంది. విహారలో అనేక నిర్మాణాలున్నాయి. ప్రధాన హాలు వెనుక అనేక నీటి ఊటలున్నాయి. విహార సింహద్వారం ముందు ఒక నీటి ప్రవాహంలో నిత్యం నీరు ప్రవహిస్తూ వుంటుంది. ప్రాచీనకాలంలో దీనిని డ్రాగన్ ఊట అని పిలిచేవారు. లూషన్ పర్వత ప్రాంతంలో హుయి డాంగ్లిన్ విహారం ఎక్కడ నిర్మించాలో నిర్ణయించడానికి-ఆయన ఒక బౌద్ధబెత్తాన్ని చేతిలో పట్టుకుని భూమిపై తాటిసూ "సరైన స్థలంలో నీటి ఊట కనిపించాలి" అని ప్రార్థిస్తూ ఆ ప్రాంతమంతా తిరిగాడని, అలా తిరుగుతుండగా ఒకచోట నీటి ఊట కనిపించిందని ప్రజల్లో ప్రచారం ఉంది. కరువు సంభవించినప్పడు హుయి వర్షం కోసం ప్రార్థనలు చేశాడని, అప్పటికప్పుడు ఒక మహాసర్పం (డ్రాగన్) నీటి ఊటనుండి బయటకు రాగా, సరిగ్గా అదే సమయంలో సముద్రం నుండి ఉవ్వెత్తున పైనుతుఫాను లేచి వర్షించిందని, ఆ కారణంగా ఈ ఊటకు మహాసర్ప (డ్రాగన్) ఊట అని పేరు వచ్చిందని ఇక్కడి ప్రజలు చెప్పకునే కథనం. ఈ కథనంలోని హేతుబద్ధత ఎలా వున్నప్పటికీ ఈ నీటి ఊటను దర్శించిన ఒక ప్రభుత్వాధికారి ఉత్తేజంతో ధారాళమైన శైలిలో బౌద్ధ ప్రవచనాలు పలికాడు. నాటినుండి ఈ ప్రవాహం “విజ్ఞాన ప్రవాహం" అనే పేరుతో విరాజిల్లుతుంది. ఈ ప్రవాహాన్ని సందర్శించడానికి నిత్యం ప్రజలు అసంఖ్యాకంగా వస్తుంటారు. ఆ నీటి ప్రవాహంలో భక్తితో నాణాలు కూడా వేస్తారు.

డాంగ్లిన్ మందిరంలో పద్ధతులు[మార్చు]

డాంగ్లిన్ బౌద్ధ విహారంలో వేలమంది బౌద్ధ భికులున్నారు. పర్యాటకులు వీరితో కలసి శాకాహార భోజనం చేయవచ్చు. భోజనశాలలో మగవారు కుడివైపు లైనులోను, మహిళలు ఎడమవైపు లైనులోను కూర్చుంటారు. బౌద్ధభిక్టులు రెండు వరసలలో నిల్చుని బుద్ధునికభిముఖంగా వజ్రాసనంలో కూర్చుని నుదురును నేలకు ఆనించి బౌద్ధ ప్రవచనాలు చేస్తారు. వారి సంప్రదాయం ప్రకారం మతపరమైన మృదుమధుర సంగీతాన్ని వినిపిస్తారు. భోజనం చేసేటప్పుడు పర్యాటకులు ఎలాంటి శబ్దం చేయకూడదు. అదనంగా ఆహారం కావాలంటే భోజనం చేయుటకు ఉపయోగించు చెక్కపుల్లలను వృత్తాకారంలో గీస్తూ సూచించాలి. అప్పడు భిక్షువులు ఆహారాన్ని వడ్డిస్తారు. భోజనానంతరం పర్యాటకుల్ని ఆశీర్వదించాల్సిందిగా బుద్ధునికి ప్రార్థనలు చేస్తారు. ఈ పద్ధతులను చూసిన పర్యాటకులకు బౌద్ధ మత సంస్కృతి, వాతావరణం, పర్యావరణం, నిబద్ధతల గురించి మంచి అవగాహన ఏర్పడుతుంది. డాంగ్లిన్ మందిర నిర్మాత హుయి సమాధి కూడా ఇక్కడే ఉంది. ఇంకా చారిత్రక విశేషాలు కలిగిన వంతెనలు, తోటలు, పర్వతశిఖరాలు, 1500 సంవత్సరాలనాటి ఫైన్ చెట్లు, కర్పూర చెట్లు, విలో (గుల్మజాతి) చెట్లు ఉన్నాయి. జియూ జియాంగ్ నగరంలోని డాంగ్లిన్ పర్వతానికి 1600 సంవత్సరాల చరిత్ర ఉంది. బౌద్ధమతాభిమానం గల ప్రతివారు తప్పక సందర్శించదగిన బౌద్ధయాత్రా స్థలమిది. 29.7 ఎకరాల స్థలంలో 1.1 ఎకరాల విస్తీర్ణంలో డాంగ్లిన్ మందిరం నిర్మించబడింది. చుట్టూ కొండలు, మనసుకి ఉత్తేజం కలిగించే అందమైన హరిత వాతావరణం, శరీరానికి హాయిని గొలిపే చల్లదనం.అదొక అపురూపమైన అనుభూతి సందర్శకుల అనుభవంలోకి వస్తుంది.

డాంగ్లిన్ బౌద్ధవిహారంలో వుండే వేలాది బౌద్ధభికులు సంవత్సరాల తరబడి తాత్విక పరిశోధనలు చేసి అమూల్య గ్రంథాలను రచించారు. జపాన్ బౌద్ధ తత్వజ్ఞులతో తమ భావ వీచికలను పంచుకున్నారు. డాంగ్లిన్ బౌద్ధవిహార నిర్మాణానికి ప్రపంచంలోని బౌద్ధులందరూ విరాళాలు పంపారు. డాంగ్లిన్ మందిరంతోపాటు, "అమితాభ బుద్ధ కంచువిగ్రహం 2013 మార్చి 6 నాటికి పూర్తయింది. మొత్తం ఈ మందిర నిర్మాణానికి 1,61,00,000 డాలర్లు ఖర్చయ్యాయి.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  • Official site
  • చైనాలో ప్రపంచం లోనే ఎత్తైన కంచు బుద్ధ విగ్రహం -బుద్ధభూమి -2013 అక్టోబరు సంచిక

ఇతర లింకులు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.