డేటాబేస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డేటాబేస్ (లేదా దత్తకోశం, దత్తనిధి, దత్తాంశనిధి, దత్తాంశ భాండాగారం) అనేది దత్తాంశాలని (డేటాని) ఒక క్రమపద్ధతిలో అమర్చిన భాండాగారం.[1]

గ్రంథాలయ పోలిక

[మార్చు]

ఒక క్రమ పద్ధతిలో పుస్తకాలని అమర్చినప్పుడు దానిని పుస్తక భాండాగారం అనో గ్రంథాలయం అన్నట్లే దత్తాంశాలని ఒక క్రమ పద్ధతిలో అమర్చినప్పుడు దానిని దత్తాంశ భాండాగారం అనో, దత్తాంశాలయం అనో దత్తాంశనిధి అనో అంటాము.

గ్రంథాలయంలో పుస్తకాలని అందరూ ఒకే విధంగా అమర్చాలని నిబంధన ఏదీ లేదు. పిల్లల పుస్తకాలు వేరు గానూ, పెద్దల పుస్తకాలు వేరుగానూ అమర్చవచ్చు. లేదా, ఇంగ్లీషు పుస్తకాలు ఒక బీరువాలోనూ, తెలుగు పుస్తకాలు మరొక బీరువాలోనూ, భాషలవారీగా అమర్చవచ్చు. లేదా, లెక్కల పుస్తకాలు ఒక చోట, తెలుగు పుస్తకాలు మరొక చోట, అంశాలని విడగొట్టి బీరువాలలో అమర్చవచ్చు. ఇదే విధంగా దత్తాంశాలని రకరకాలుగా అమర్చి దాచవచ్చు. ఇలా అమచే పద్ధతిని పరిభాషలో స్కీమా (schema) అంటారు. ఈ స్కీమాని "వంశవృక్షం" మాదిరి అమర్చవచ్చు, లేదా పట్టికల రూపంలో అమర్చవచ్చు. దత్తాంశాలని పట్టికల రూపంలో అమర్చినప్పుడు దానిని "రిలేషనల్ డేటాబేస్" (relational database) అంటారు. ఇంతవరకు దత్తాంశాలని భద్రపరచటం గురించి ఆలోచన జరిగింది కదా. ఇప్పుడు భద్రపరచిన సమాచారాన్ని వెతికి వెలికి తియ్యడం ఎలా అన్నది రెండవ ప్రశ్న. "ఫలానా వ్యక్తి జీతం ఎంత?" "ఆ వ్యక్తి ఏమిటి చదువుకున్నాడు?" "మన కంపెనీలో 5 అడుగుల 6 అంగుళాలు కంటె ఎక్కువ పొడుగున్న ఉద్యోగుల పేర్లు ఏమిటి?" వగైరా ప్రశ్నలని "ప్రశ్నలు" అని కాని క్వెరీలు అని కాని అంటారు. మనం అడిగిన ప్రశ్నలకి సమాధానం "రిపోర్ట్" అవుతుంది. మనం నిక్షిప్తం చేసిన దత్తాంశ భాండాగారాన్ని రకరకాల కోణాలలో "చూసి" నప్పుడు ఆ చూపులని దృష్టి (లేదా వ్యూ) అంటారు.

దత్తాంశ నిర్వహణ వ్యవస్థ

[మార్చు]

దత్తాంశ నిర్వహణ వ్యవస్థ(DBMS) లేదా దత్తాంశ ప్రవిద్య అనేది ఒక అనువర్తన తంత్రాంశ నిధి (application software suite). ఇది తుది-ఉపయోక్తలతో (end user) కాని, ఇతర అనువర్తనాలతో కాని ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకోడానికి వెసులుబాటు కల్పిస్తుంది. దత్తాంశ నిర్వహణ వ్యవస్థలలో రకాలు ఉన్నాయి; ఒకొక్క రకం ఒకొక్క దత్తాంశ నమూనాని దన్నుగా వాడుకుంటుంది. ఎక్కువ ప్రచారంలో ఉన్న దత్తాంశ నమూనా (data model) లేదా దత్తాంశనిధి నమూనా (database model) పేరు Relational Data Model. ఈ రిలేషనల్ నమూనాలో దత్తాంశాలు పట్టికల (tables) రూపంలో అమర్చబడి ఉంటాయి. ఈ పట్టీకలలో నిక్షిప్తం అయి ఉన్న దత్తాంశాలని ప్రశ్నించి (క్వెరీ చేసి) సమాధానాలు రాబట్టడానికి SQL (సీక్వెల్ అని ఉచ్చరిస్తారు) అనే భాషని ఎక్కువగా వాడతారు. ఇటీవలి కాలంలో పట్టికల రూపంలో కాకుండా ఇతర రూపాలలో కూడ దత్తాంశాలని దాచుతున్నారు (ఉదా: వచనం రూపంలో). అటువంటి సందర్భాలలో ప్రశ్నించడానికి NoSQL (నో సీక్వెల్) అనే భాషని ఎక్కువగా వాడుతున్నారు.[2]

Database_models.jpg

దత్తాంశ పరిచారికలు

[మార్చు]

పరిచారికలు (servers) పరిచర్యలు అందించే యంత్రాలు. పరిచారిక అనేది కూడా ఒక కంప్యూటరే కనుక, పరిచారికలలో కూడా రెండు భాగాలు ఉంటాయి: స్థూలకాయం లేదా యంత్రకాయం (hardware), ఆ స్థూలకాయానికి ప్రాణం పోసే నిరవాకి (operating system) అనే సూక్ష్మకాయం లేదా తంత్రకాయం(software). ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది కనుక మనం "పరిచారిక" అన్నప్పుడు ఈ రెండు కలసి ఉన్న కంప్యూటరుని ఉద్దేశించి అయినా కావచ్చు, లేదా కేవలం నిరవాకిని ఉద్దేశించి అయినా కావచ్చు. "రామయ్య" అన్నప్పుడు ప్రాణం లేని కట్టెని సంబోధిస్తున్నామా, లేక కట్టెలో ఉన్న ఆత్మని సంబోధిస్తున్నామా, లేక రెండింటిని కలిపి సంబోథిస్తున్నామా? అలాగే ఇక్కడ కూడా. సమయానుకూలంగా అర్థం చేసుకోవాలి.

కొన్ని పరిచారికలు ప్రత్యేకించి దత్తాంశ నిర్వహణ వ్యవస్థ చెయ్యవలసిన పనులకి మాత్రమే కేటాయిస్తారు. అటువంటి పరిచారికలని దత్తాంశ పరిచారికలు (database servers) అంటారు.

మూలాలు

[మార్చు]
  1. "Database - Definition of database by Merriam-Webster". merriam-webster.com.
  2. "SQL, NoSQL, NewSQL – Tutorials" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-11-15.
"https://te.wikipedia.org/w/index.php?title=డేటాబేస్&oldid=3252023" నుండి వెలికితీశారు