Jump to content

తమిళ దేశపు జానపద కథలు

వికీపీడియా నుండి

తమిళ దేశపు జానపద కథలు. తమిళ ప్రజలు పల్లెల్లో చెప్పుకొనే జానపద కథలను సేకరించిసుప్రసిద్ధ తమిళ రచయిత ఏ.ఎన్.పెరుమాళ్ పుస్తకరూపంలో తెచ్చారు, పాతికేళ్ల క్రిందటే దాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ చల్లా రాధాకృష్ణశర్మ గారిచేత తెలుగు చేయించి, 1999లో ప్రచురించింది. ఈ పుస్తకం ఏదో పిల్లల కథల పుస్తకం అనుకుంటాము. ఈ జానపద కథల్లో మన ప్రజల జీవితం, అదీ శ్రామికులు, గ్రామీణుల పాత్రలతో కథలు. కొన్ని అచ్చం జానపద కథలు, కొన్ని హాస్యం వెనుక మానవ మనస్తత్వాన్ని వ్యక్తీకరించే కథలు, కొన్ని కథలు అలీబాబా కథలను గుర్తు చేస్తాయి. ఇందులో మొత్తం 49 కథలున్నాయి. “జానపద కథల్ని శైలిని బట్టి రెండు భాగాలుగా విభజించవచ్చు. సత్యాన్ని ప్రాతీపదికగా చేసుకొని అసత్యాన్ని గుర్తించడం సులభం. అందువల్ల కథల్లో అసత్యం కనిపించినా, అది సత్యం కనుగొనేందుకు ఉపకరిస్తుందని భావించాలి. .. ఎవరో ఒకరి మనస్సులో తోచి, తరతరాలుగా చెప్పబడుతూ పాఠకుల్ని అలరిస్తున్నాయి ఈ కట్టుకథలు. వీటిని “కర్ణ పరంపర కథలు” అని వ్యవహరిస్తారు. .. వినికిడి ద్వారా పరంపరానుగతంగా వస్తున్న కథలివి. వీటిలో కల్పనాంశాలూ జీవిత సూత్రాలూ ఉన్నాయి. .. పెక్కు కథలు కుటుంబంలో గొడవల గురించి ప్రస్తావిస్తున్నవి. అత్తాకోడళ్ళ కలహం, అక్రమ సంబంధాలు (విధుల్ని గురించి), తల్లీ కొడుకుల అభిప్రాయ భేదాలు, సోదరులు కలహం వంటివి పెక్కు కథల్లో చోటు చేసుకున్నాయి. సమాజంలో కనిపించే దొంగతనం, మోసం, దారి దోపిడి మొదలైన విషయాలకు సంబంధించి కొన్ని కథలున్నాయి. .. జంతువుల కథలు వంటి వాటిలోనూ మానవుల భావాలే మిక్కుటంగా కనిపిస్తున్నాయి. ..సర్పరాజుకథ, మూర్ఖుని బ్రతుకు తెరువు వంటి కథలు సవతితల్లి పెట్టే హింసలు అభివర్ణిస్తున్నవి… జీవిత సంఘటనలే కట్టుకథలు సృష్టిచేందుకు తోడ్పడుతున్నవి. బలవంతులు చేసే పొరపాటుని ఎత్తి చూపడానికి వీలుండదు. .. పరోక్షంగా ఆదోషాలను నివారించాలనే ఆవేశం, తపన అనేక కథలలో బహిర్గతమయినాయి. .. మానవ జీవితం అభిలషించిన విధంగా ఉండదు. కాని అభిలషించిన విధంగా దర్శించడానికి కల్పన చేయూతనిచ్చి తోడ్పడుతుంది. .. అలాంటి కథలను నిర్ధనులు స్వీకరించి సంతోషించడం సహజం. .. జానపదుల జీవిత విధానాన్ని, వారి జీవితచరిత్రను తెలుసుకోడానికి కట్టుకథలబాగా ఉపకరిస్తాయి. ఈపుస్తకానికి రాయబడ్డ ఉపోద్ఘాతంలో కట్టుకథల మీదగొప్ప అవగాహన కలిగించారు.

ఈ పుస్తకంలోని 49 కథల్లో కొన్ని ఏదో రూపంలో పాఠకులు వినే ఉంటారు. షుమారు రెండు వేల సంవత్సరాల నాటి జాతక కథలు, హితోపదేశం లోని కథలు ఖండాంతరాలకు చేరి, వారి కథల్లో కలిసి పోయాయి. అలాగే ప్రాచీన కాలం నాటి యాత్రికులు, వ్యాపారులు, నావికుల ద్వారా అటునుంచి కూడా మనకు కథలు వచ్చి వుంటాయి. తమిళ దేశపు జానపద కథలు కూడా కొన్ని తెలుగు దేశంలో విని వుంటారు. కోడళ్ళను ఆరేళ్ళు పెట్టే అత్తలు, తోడికోడళ్ళు ఒకరికి ఒకరు అపకారం చేయాలనే కుట్రలు, స్నేహానికి ప్రాణం మిచ్చే మిత్రులు రకరకాల పాత్రలు. ఇందులో చిన్న పిల్లలకి ఆనందం కలిగించే శాడిజం కథలు కొన్ని. గాడిదగా మారిన అత్తగారు కథ సంవిధానంలో చదువరులు చాలా కథలు వినే వుంటారు. "కాళికి వెలిగించిన దీపం" కథలో సవతితల్లి తల్లిలేని పిల్లల్ని పెట్టే బాధలు, పొట్టివాడు కథలో ఆత్మన్యూనతా భావం (inferiority complex)తో బాధపడే మనిషి జీవితం, శక్తికి మించిన పనులకు పూనుకొనే మనిషి కథ పిట్టసాయం..లో, కోడలికి భోజనం చేయడానికి ఒక తుమ్మ చెట్టు ఆకును ఇచ్చే పిసినారి దుష్ట అత్త, మేకలు కాచుకొనే యువతి, మాయలాడి మగువలు, అవిటి అమ్మాయి జీవితం, కొన్ని పక్షులు, సర్పాల కథలూ, ఇట్లా చాలా వైవిధ్యం ఉన్న కథలు, ఒకనాటి సమాజం, మనుషులు, వాళ్ళ కష్టసుఖాలు ఈ 49కథల్లో చూడవచ్చు. తమిళంలో ఈ కథలను సేకరించి కూర్చిన ఏ.ఎస్.పెరుమాళ్ ప్రసిద్ధులు, అనువాదకులు చల్లా రామకృష్ణశర్మ కూడా అంతే ప్రసిద్ధ పండితులు. పుస్తకం ముఖచిత్రం కూడా ఆకర్షణీయంగా ఉంది. కేంద్ర సాహిత్య అకాడమీ, హైదరాబాదులో తెలుగు సాహిత్య అకాడమీ తెలుగు సాహిత్యానికి గొప్ప సేచేశాయి. ఆనాటివారి శ్రద్ధ, అంకితభావం ఇటువంటి పుస్తకాలు చూచినపుడల్లా గుర్తొస్తుంది. మూలాలు: Tamil Deshapu jaanapada Kathalu(Telugu),ISBN:81-260-0658-7. SahityaAkademi,Newdelhi, First published:1999.