Jump to content

తర్క శాస్త్రము

వికీపీడియా నుండి

క్రమ బద్ధమైన చింతనా ప్రక్రియ ద్వారా సాధారణీకరణలు, ఆధరికి అమూర్తీకరణలు సాధించడంతో సంబంధమున్న విజ్ఞాన శాస్త్రం తర్కం. వివేచనా గుణం గురించి, సాక్ష్య బలం గురించి, ప్రవచనాల ఆపాదనల మీద ఆధారపడే అనుమాన ప్రామాణ్యం గురించి అది అధ్యయనం చేస్తుంది.

అమూర్తీకరించే లక్షణం, అంటే వస్తువుల సారమందుకోవడం బుద్ధికి మూల స్థంబం. విభాగాలను సామస్త్యం తోనూ, వ్యక్తులను సమూహాలతోను సంధానించడం, సాధారణీకరించడం, వర్గీకరించడం, అమూర్తీకరించడం బౌద్ధిక చర్యలో ఎప్పుడూ ఆపాదితమయి ఉంటాయి. ఉదాహరణకు కింది లక్షణాలను గమనించామనుకోండి - దీర్ఘ చతురప ఘనం, కాగిత పదార్థం, ముద్రిత పుటలు, ఏదో ఒకరకమైన బైండింగ్ అర్థవంతమైయిన వార్తావహనం - పత్రిక, కట్టకట్టడం, చాక్‌లేట్ పెట్టె, పుస్తకం వంటి అనేక వస్తువుల్లో వీటిలో ఏవో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే ప్రస్తావిత లక్షణాలన్నీ పుస్తకానికుంటాయి. కనుక ఈ లక్షణాల నుంచి ఎవరయినా పుస్తకమనే భావాన్ని అమూర్తీకరిస్తారు. అట్లాగే క్రింది లక్షణాల పట్టిక నుండి ఎవరయినా సాధారణీకరించగలుగుతారు - తల, కాలు, మూలకోళ్ళు, ఆధర చట్రం. వాటిలో ఏదో ఒక లక్షణమో అనేక లక్షణాలో జంతువు, మేడమెట్లు, పక్క (బెడ్) మొదలయిన వాటిలో ఉంటాయి. ఈ అంశాల నుండి అమూర్తీకరిస్తే అవన్నీ పక్కకే సరిపోయాయని గుర్తిస్తారు.

తర్కానికి నిశితమైన నిర్వచనమివ్వలేక పోయినా ఒక ప్రతిజ్ఞా వాక్యం నుంచి గాని, అనేక ప్రతిజ్ఞావాక్యాల నుంచిగాని, మరొక ప్రతిజ్ఞా వాక్యాన్ని ఆవశ్యంగా అంగమించడానికి (follows) గాని, నిగమిమడానికి (deduce) గానీ అవసరమైన ఉపాధులను అధ్యయనం చేయడం దాని వృత్తి అనవచ్చు. ఆలోచనా నియమాల అధ్యనాన్ని గూడా తర్కమన్నారు. వివేచన వంటి వాటిద్వారా సాగే ఈ తార్కిక నియంత్రణమే మానవుని తెలివిగా సమస్యలలో తలపడేటట్లు చేస్తుంది. ఆ విధంగా మానవుడు చింతన చేయగలగడం వల్ల తన చింతనకు వివేచనను అనువర్తింపజేసుకోగలగడం వల్లనే అరిస్టాటిల్ అనే గొప్ప గ్రీకు తాత్వికుడు "మానవుడు వివేచనాజీవి" అని నిర్వచించాడు. ప్రత్యయాలను (concept) మాటలను అర్థం చింతనలో అంతర్భావంగా ఉంటుంది. ప్రత్యయమంటే ఒక భావం. అది ఒక వివిక్త వస్తువుకు సంబంధించిన భావంగావచ్చు, అనుభవ నిర్మితమైన అమూర్త లక్షణాలకు సంబంధించినది కావచ్చు. జ్ఞాన వ్యవస్థా నిర్మాణంలో ప్రత్యయాల వినియోగం గురించి, వాటి సక్రమ వినియోగానికి సంబంధించిన నియమాలను గురించి తర్క శాస్త్రం అధ్యయనం చేస్తుంది.[1]

మనకి జ్ఞానం ఆమోద యోగ్యమైన విధానంలో కలిగింది అనే చెప్పేదాన్ని ప్రమాణం అంటారు. హైందవ తర్క శాస్త్రంలో 8 ప్రమాణాలున్నాయి. వీటిని అన్నం భట్టు తన తక్క సంగ్రహం, తర్క దీపిక అనే గ్రంథాలలో వివరించాడు. కందుల నాగభూషణం తన వ్యాసంలో వీటి గురించి కొంత సమాచారాన్ని అందించాడు.[2]

చూపు, వినికిడి, వాసన, స్పర్శ, రుచి, ల ద్వారా అంటే పంచేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించే విధానాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. ఇందులో పరిశీలకుడు, పరిశీలన వేరు అనే భావం ఇమిడి ఉంది.

రెండో ముఖ్యమైన ప్రమాణం అనుమానం. ఒక హేతువు నుంచి సాధ్యాన్ని నిర్థారించే పద్ధతిలో జ్ఞానాన్ని ఆర్జించే విధానం. తర్క శాస్త్ర బద్ధంగా జరిగితే ఈ జ్ఞానం ఆమోదయోగ్యం అవుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం జ్ఞానార్జనకి మనం ఏ విధానం అనుసరించినా, ప్రత్యేకమైన అర్థాలతో వాడే పదజాలం ఉంటుంది. ప్రత్యేకమైన అర్థంలో వాడే పదాలను (తర్కం, శాస్త్రం, సైన్సు మొదలైన) అపార్థం కలిగించేలా వాడడం లేక అపార్థం చేసుకోవడం సర్వసాధారణం

వాడిన పదానికి పాఠకుడి భావనకి సమన్వయం కుదరాలంటే, పాఠకుడికి ఆలోచన, మననం, వివేచనా అవసరమవుతాయి. భర్తృహరి అటువంటి వర్గానికి చెందని వారి గురించి అబోధోపహతులు అని నిస్పృహ పడతాడు.

కొన్ని ఆమోదయోగ్యమైన "న్యాయ సూత్రాల"ననుసరించి చర్చించి, ఫలితాన్ని (నిగమనాన్ని) నిర్థారించే ఆమోదయోగ్యమైన పద్ధతిని అనుమాన ప్రమానం అంటాము.

మోడో ప్రమాణం అర్థాపత్తి. అందిన సమాచారాన్ని విశ్లేషించి పొంతన లేని విషయాలను ఒక ఉచితమైన ఊహ ద్వారా సమన్వయం చేస్తే ఆ సమన్వయం మనకి కొత్త జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ విధానాన్ని అర్థాపత్తి అంటాం.

కాంతి కణ రూపంలో ఉంటోందన్న సమాచారాన్ని, తరంగ రూపంలో ఉంటోందన్న సమాచారాన్ని, కాంతి వెలువడే చోటే, చేరే చోట కణ రూపంలోనూ, ప్రయాణం చేసేటప్పుడు తరంగ రూపంలోనూ ఉంటుందని శాస్త్రవేత్తలు సమన్వయం చేయడం ఈ ప్రమాణానికి ఉదాహరణ. అయితే ప్రయోగాల ద్వారా ఈ విషయాన్ని విజ్ఞానశాస్త్రంలో ఋజువు చేసారు.

ఓపిక, జ్ఞానం సరైన ఆధార జ్ఞానం ఉన్న వారెవరైనా ఈ ప్రయోగాలను చేసి చూడవచ్చు. ప్రయోగం చేసి ఋజువు చేస్తే విజ్ఞానశాస్త్రమవుతుంది. ఊహ చేసి వదిలివేస్తే తర్కం అవుతుంది.[3]

చివరగా ఋషులు లేక గురువులు లేక పెద్దలు తమ అసాధారన స్ఫురణ శక్తితో సత్యాన్ని గ్రహించి చెప్తారు. అటువంటి వారి ద్వారా జ్ఞానార్జన జరిగితే దానిని దృష్టి ప్రమాణం అంటారు. న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం, ఐన్‌స్టీన్ వక్రప్రదేశ సిద్ధాంతం, జన్యుశాస్త్రంలోని, జంట హెలిక్సుల నమూనాలలు ఇటువంటి యోగ దృష్టి వలన సిద్ధించినవే అని కొందరు అనవచ్చు అయితే విజ్ఞాన శాస్త్రంలో ఈ సిద్ధాంతాలు, నమూనాలు ఇచ్చే ఫలితాల్లో మనం పరిక్షించగలిగినవి ఉంటే పరీక్షించి తీరాలి. పరికరాలు లేనిచో అవి అమరే వరకు ఆగి తీరాలి.

మూలాలు

[మార్చు]
  1. "Tarkam - SAstram - SP Gupta - Telugu Academy - [PDF Document]". vdocuments.site (in ఇంగ్లీష్). Retrieved 2020-05-17.[permanent dead link]
  2. https://kavanasarma.files.wordpress.com/2017/11/haindavatarkasastramu.pdf[permanent dead link]
  3. "model 002". Kavana Sarma Kaburlu - Sarada Anuvakkulu (in ఇంగ్లీష్). 2014-09-24. Retrieved 2020-05-17.