తెలంగాణ విమోచన దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదరాబాద్ విమోచనకు ఏడాది నిండిన సందర్భంగా 1949 సెప్టెంబరులో ప్రచురించిన ఆంధ్రపత్రిక ప్రత్యేక సంచిక

నిజాం కబంధ హస్తాల నుండి హైదరాబాదు సంస్థానం విముక్తి పొందిన రోజును తెలంగాణ విమోచన[1] లేదా విలీన దినంగా పాటిస్తారు.

తెలంగాణ విమోచన దినోత్సవం వెనకున్న చరిత్ర

[మార్చు]

1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు. హైదరాబాద్ అటు ఇండియాలో, ఇటు పాకిస్తాన్లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు. కానీ సంస్థానంలోని ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా ప్యూడల్ పాలన కొనసాగుతోంది. ఒకవైపు దేశ్ముఖ్, జాగీర్దార్, దొరల వెట్టి చాకిరిలో గ్రామీణ ప్రజానీకం మగ్గిపోతుంటే, మరోవైపు నిజాం అండతో రజాకార్లు చెలరేగిపోయారు.. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని, హత్యాకాండను కొనసాగించారు. నిజాం ప్రోద్బలంతో రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగురేస్తానని విర్ర వీగాడు.. ఇలాంటి పరిస్థితిలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ఆర్యసమాజ్ తమ తమ మార్గాల్లో పోరాటాన్ని చేపట్టాయి. ఈ సంస్థలన్నింటినీ నిషేధించాడు ఉస్మాన్ అలీఖాన్. భారత దేశ నడిబొడ్డున క్యాన్సర్ కణితిలా మారిన హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ నిర్ణయించుకున్నారు. పరిస్థితిని ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్తాన్ సాయం కోసం వర్తమానం పంపడంతో పాటు, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. దీనికి పోలీస్ యాక్షన్ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత సెప్టెంబరు 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్ర్యం వచ్చింది. హైదరాబాదు రాష్ట్రం ఏర్పడింది. అందుకే సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తారు.

వేడుకలు

[మార్చు]

రాచరిక వ్యవస్థ నుండి తెలంగాణ సమాజం ప్రజాస్వామిక వ్యవస్థలోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబరు 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటిస్తూ 2022 సెప్టెంబరు 16, 17, 18 తేదీలలో మూడురోజులపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలనూ, 2023 సెప్టెంబరు 16, 17, 18 తేదీలలో ముగింపు వేడుకలనూ ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.[2][3]

ఇవి చదవండి

[మార్చు]

తెలంగాణ విమోచనోద్యమం

మూలాలు

[మార్చు]
  1. "సెప్టెంబరు 17: తెలంగాణ విమోచన/ విలీన దినోత్సవం!". Samayam Telugu. Retrieved 2021-09-12.
  2. "Telangana News: సెప్టెంబరు 17 జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తాం: కేబినెట్‌". EENADU. 2022-09-03. Archived from the original on 2022-09-03. Retrieved 2022-09-03.
  3. telugu, NT News (2022-09-03). "కేబినెట్ కీల‌క నిర్ణ‌యం.. సెప్టెంబ‌ర్ 17న‌ తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినం." Namasthe Telangana. Archived from the original on 2022-09-03. Retrieved 2022-09-03.