తెలుఁగునాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుఁగునాడు - అను ఆంధ్రవీధిలోబాహ్మణ ప్రశంస మొదటి భాగము ఒక పద్య కావ్యము . దీనిని దాసు శ్రీరామమంత్రి (దాసు శ్రీరాములు 1846-1908) 1892లో తెలుగు ప్రాంతంలోని వివిధ కులాలు, వర్గాల గురించి వివరించడానికి రాయడం ప్రారంభించారు. మొదటి భాగంలో బ్రాహ్మణ శాఖల గురించి వ్రాసి, మిగిలిన భాగాలు దివంగతులవుటచేత పూర్తి చేయలేకపోయారు.[1]

గ్రంథ వివరాలు[మార్చు]

ఈ పద్య కావ్యము మొదట 1899లో ప్రచురితమైంది. 1974లో మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి, హైదరాబాద్ వారు 6వ సారి ముద్రించారు. శ్రీరాములు వర్ధంతి సందర్భంగా 6 మే 1974న శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రభాషానిలయం, హైదరాబాద్ లో దేవులపల్లి రామానుజ రావు ఈ కావ్యావిష్కరణ కావించారు. ఈ పుస్తకమునకు తొలిపలుకు ఆచార్య దివాకర్ల వెంకటావధాని వ్రాసారు. కళాప్రపూర్ణ నిడదవోలు వెంకట రావు కవి పరిచయము కావించారు. పీఠికను శతావధాని చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి వ్రాసారు. మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి అధ్యక్షులు దాసు పద్మనాభరావు ఈ కావ్య నివేదనము వ్రాసారు.

దీనిలో ఆంధ్ర బ్రాహ్మణులలోని ఈ క్రింది తెఱఁగులవారి కులవర్తనములు, ఆచార వ్యవహారములు, వేష భాషలు మున్నగునవి పద్య రూపంలో వ్రాయుఁబడినది. ఇందులో 201 పద్యాలున్నాయి. ఈ పుస్తకపు పీఠికలో రచయత “కవిత్వపు పస చెడకుండ సాధ్యమైనంత నిష్పక్షపాత బుద్ధితో నాశక్తి కొలఁది వర్ణించియుంటినే గాని వేరొండు గాదని చెప్పగలను. ఇదియునుంగాక మనదేశములో బ్రాహ్మణ జాతిలోఁగల వివిధ శాఖలవారు అనవసరముగాఁ గల్పించుకొను వివాదలు తగ్గింపవలెనని నా యుద్దేశము.” అని తన రచన గురించి ప్రస్తావించారు.

తెలుగునాడు
  • వైదికులు
  • నియోగులు
  • స్మార్తులు
  • మాధ్వులు
  • వైష్ణవులు
  • శైవులు
  • కరణకమ్మలు
  • యాజ్ఞవల్క్యులు
  • గోలకొండ వ్యాపారులు
  • ద్రావిడులు

ఇందులో ఆంధ్ర బ్రాహ్మణుల ఆచార వ్యవహారముల లో సాధారణ విషయాలు, వివాహాలు, తెలుగు వారు జరుపుకునే సంక్రాతి, అట్లతద్ది, దీపావళి, వినాయకచవితి, సంవత్సరాది పండుగలు, అత్తా కోడండ్ర వ్యవహారాలూ, తదితర విషయాలు హాస్యధోరణిలో వర్ణించారు, చమత్కారంగా వివరించారు.[2]

ఇతర రచయితల అభిప్రాయాలు[మార్చు]

పూర్వ కవులలో శ్రీ నాధ కవిసార్వభౌముడు క్రీడాభిరామమనే వీధినాటకం లో ఆకాలము నాటి రాజకీయ, సాంఘిక విషయ వర్ణనలు వ్రాసారు. శ్రీ రామకవి ఆంద్ర దేశమున అన్ని జాతుల వారి వేష భాష సంప్రదాయాదులను వర్ణింప వలెనను ఈ గ్రంధము రచించారని దివాకర్ల వెంకటావధాని ఈ కావ్యం తొలిపలుకు లో పేర్కొన్నారు. ఇంకా వర్ణన విధానము గురించి "మిక్కిలి రమణీయమై ఎడానెడా హాస్య ఛాయలతో గూడి చదివిన కొలది చదువవలెనను నుత్కంట రేకెత్తించుచున్నది" అని పేర్కొన్నారు.[1]

నిడదవోలు వెంకట రావు తెలుగునాడు అను ఆంధ్ర వీధి గురించి - ఇది స్వతంత్రమగు సాంఘిక కావ్యము. 14వ శతాబ్దిని క్రీడాభిరామము వెనుక వెలసిన సాంఘిక వ్యవస్థ నిరూపించు కృతి ఇదే, అని వ్రాసారు.[3]

గ్రామాలలో జరుపుకునే పండుగల లో సంవత్సరాది (ఉగాది) నాటి పంచాంగ శ్రవణం లో ఆదరించే వారికి అనుకూలముగా చెప్పే ఆదాయ వ్యయాలు, కందాయ ఫలములు గురించి రాస్తూ , దాసు అచ్యుత రావు ఒక శతాబ్దము క్రితమే బహుళ ప్రచారము లో ఉన్న తెలుగునాడు పద్య కావ్యంలో ఈ విషయము ప్రస్తావించబడింది అని వ్రాసారు. [4]

  
సీ. అలవణ నింబవు ష్పామ్లరసాలశ
             లాటుఖండములుతొల్త గబళించి
ఇష్టమృష్టాన్నముల్ తుష్టిగాభుజియించి
      విప్రోత్త ముఁడుగ్రామ వీధిజేరి
పదిమందిరయితుల గుది గూర్చి కూర్చుండి
      క్రొత్త పంచాంగంబు నెత్తిచదివి
ఆదాయములును వ్య యంబులు సెప్సి కం
      దాయంబులకు వేళ యాయెననిన
గీ. దుడ్డునిండుగనిచ్చిన దొడ్డవారి
కన్నికందాయములు పూర్ణమనుచు జెప్పు
దుడ్డుదుగ్గాని లేదన్న గొడ్డుబోతు
కన్నికందాయముల శూన్య మనుచు జెప్పు
నౌర బాపన సంవత్సరాదినాడు.

ఇద్దరు శుద్ధ శ్రోత్రియ స్త్రీలు మాట్లాడుకునే భాష తీరు, బాల్య వివాహాల నిరసన, తెలుగు నాడు అను ఆంధ్రవీధి కావ్యం లో పద్యం వ్యక్తపరుస్తోందని రామడుగు వెంకటేశ్వర శర్మ వివరించారు.[5]

శా. ఆస్సే చూస్సివషేవొషే చెవుడుషేఅష్లాగషే యేమిషే
విస్సావర్హులవారిబుర్రినష యావిస్సాయకిస్సారుషే
విస్సండెంతడివాడె యేళ్ళుపదిషే వెయ్యేళ్ళ కీడేషుమా
ఓస్సేబుర్రికి యీడషే వొయిషు కే ముంచుందిలే మంచివో
ర్పెస్సేయందురుశ్రోత్రియో త్తమపద స్త్రీలాంధ్ర దేశంబున౯.

బ్రాహ్మణ వర్గ వేషధారణ లో ఆచార వ్యవహారంలో లోపాలను సభ్యతా పూర్వక చమత్కారముగా ఈ క్రింది పద్యము విస్తరిస్తోందని పేర్కొన్నారు.

సీ. మెలిబెట్టివిడిచినమిాసాలపై గొప్ప .
                నిమ్మకాయలురెండుఃనిలుపవచ్చు
తేటగా తెల్లగాతెగగాలు లంకాకు
                పొాగచుట్ట జుంజురు బోల్పవచ్చు
నడువీధి రెడ్డిగాలిడి రచ్చదీర్చుచో
                 సివిలుజడ్జీలని జెప్పవచ్చు .
అసదుగాబొసగించి నొసట బెట్టినబొట్టు
                 లొక్కమా రుప్ఫనియూదవచ్చు
గీ.వడివడిగ చిన్ననాడైన వడుగునాడు
తడబడుచుఁ జెప్పుకొన్నట్టి తప్పుసంధ్య
ముక్క నాలుగునిముపాలముగియవచ్చు
భళిరయనవచ్చు లౌకిక బ్రాహ్మాణులను.

ఆచార్య ముదిగొండ శివప్రసాద్ - ఇది 18వ శతాబ్దపు బ్రాహ్మణుల స్థితిగతులు వేషభాషలు చమత్కారంగా చిత్రించబడ్డాయని, వైదీకులు దయనీయమైన ఆర్ధిక పరిస్థితులలో ఉన్నట్లు ఈ గ్రంధం సాక్ష్యం చెపుతోంది అని ప్రస్తావించారు. "ఆస్సే చూస్సివషేవొషే చెవుడుషేఅష్లాగషే యేమిషే ...యందురు శ్రోత్రియో త్తమపద స్త్రీలాంధ్ర దేశంబున౯." అను పద్యము శ్రీకాకుళం జిల్లాలోని శ్రోత్రియ కుటుంబాల యాసను చిత్రీకరించడముతో బాటు ఆనాటి బాల్య వివాహాలవంటి సాంఘిక దురాచారాలను రమ్యం గా ఎత్తిచూపారని చెప్పారు. ఇంకా తరువాతి తరాలలో "ధరణికి గిరి భారమా", "ద్యుతి నీవు గతి నీవు" వంటి కొన్ని చలన చిత్ర గీతాలకు కూడా మూలాలు ఈ గ్రంధం లో ఉన్నాయని అన్నారు.[6]

వనరులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 వెంకటావధాని, దివాకర్ల (1974). "తొలిపలుకు". తెలుఁగునాడు అను ఆంధ్రవీధి లో బ్రాహ్మణ ప్రశంస - మొదటి భాగము (PDF). హైదరాబాద్: మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి. pp. iii–vi.
  2. శ్రీరాములు, దాసు (1974). తెలుగునాడు అను ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస (PDF) (6 ed.). హైదరాబాద్: మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి.
  3. వెంకటరావు, నిడదవోలు (1974). "కవి పరిచయము". తెలుగునాడు అను ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస (PDF) (6 ed.). హైదరాబాద్: మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి. pp. x–xvii.
  4. అచ్యుత రావు, దాసు (జూన్ 21, 2015). "దాసు శ్రీరామకవి 'తెలుగు నాడు' లో సంవత్సరాది". ఆంధ్రప్రభ.
  5. వెంకటేశ్వర శర్మ, రామడుగు (అక్టోబరు 21, 2019). "తెలుగు సాహిత్య విరాట్ విశ్వరూపం". ఆంధ్రభూమి.
  6. శివప్రసాద్, దాసు (మార్చి 5, 2012). "దాసు వారి తెలుగు నాడు". ఆంద్ర భూమి.