మహామృత్యుంజయ మంత్రం

వికీపీడియా నుండి
(త్ర్యంబక మంత్రము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దస్త్రం:Shiva stops Ganga who is falling from the sky.jpg
Mrityunjaya Shiva

మృత్యంజయ మంత్రము లేదా మహామృత్యుంజయ మంత్రము ఋగ్వేదం (7.59.12)లోని ఒక మంత్రము. ఇది ఋగ్వేదంలో 7వ మండలం, 59వ సూత్రంలో 12వ మంత్రంగా వస్తుంది. దీనినే "త్ర్యంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం (1.8.6.i; 3.60)లో కూడా ఉన్నది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు. గాయత్రీ మంత్రములాగానే ఇది కూడా హిందూ మతములో ఒక సుప్రసిద్ధమైన మంత్రము. మృత్యుంజయ స్తోత్రము

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

ప్రయోజనం

[మార్చు]

చనిపోతామనే భయంతో ఉన్న వారు ఈ మంత్రాన్ని పారాయణ చేస్తే ఆ భయానికి దూరం అవుతారు. దీర్ఘరోగం తో బాధపడేవారు ఈ మృత్యుంజయ స్తోత్రాన్ని నిత్య పారాయణగా ఆచరిస్తే శివుడు ఆ రోగం బారినుంచి వారిని, తీగనుంచి దోసకాయను దూరం చేసినట్లు, దూరంచేస్తాడు.

విశేషాలు

[మార్చు]

ఈ మంత్రమునకు ఋషి వశిష్ఠుడు. ఛందస్సు అనుష్టుప్. దేవుడు శివుడు (శ్రీ మృత్యుంజయ త్ర్యంబకేశ్వరుడు). బీజము "హామ్". శక్తి దేవి అమృతేశ్వరి.

ఈ మంత్రాన్ని శివుడు శుక్రాచార్యునికి ఉపదేశించాడు.

అర్థం

[మార్చు]

ఈ మంత్రం తైత్తిరీయోపనిషత్తు లోని నారాయణప్రశ్నము లోనిది. ఇది తైత్తిరీయం లో 56 వ అనువాకం.

" సుగంధ పరిమళం కలిగి, పుష్టిని వృద్ధి చేసే, మూడు కన్నుల పరమేశ్వరా ! నిన్ను పూజిస్తున్నాను. బంధనాత్ = బంధనం నుంచి ( అంటే తీగనుంచి లేదా తొడిమనుంచి ); ఉర్వారుకమివ = దోసకాయను వలె ; మృత్యోః = చావునుంచి ; ముక్షీయ = విడివడిన వాడను అగుదును గాక; అమృతాత్ = మోక్షము నుంచి; మా = వద్దు ( వదిలిపెట్టబడినవాడను కాకుండా ఉండునుగాక )

తొడిమ నుండి దోసపండును ఎలా వేరుచేస్తున్నావో అలాగే మృత్యువు నుంచి నన్ను వేరుచేయుము. అమృత సమానమైన మోక్షము నుండి నేను విడివడకుండ ఉండును గాక."

మృత్యుంజయ స్తోత్రము

[మార్చు]

ఇది కాక "మృత్యుంజయ స్తోత్రము" లేదా "మహామృత్యుంజయ స్తోత్రము" అనే స్తోత్రం కూడా ఉంది. ఈ స్తోత్రానికి మార్కండేయుడు ద్రష్ట. స్తోత్ర పాఠంలో కొద్ది పాదాలు దిగువన ఇవ్వడమైనవి.

ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమాపతిం - నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి
కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం - నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి
నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభుం - నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి
వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం - నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

మహా మృత్యుంజయ మంత్ర పద తాత్పర్యాలు

[మార్చు]

ఓం భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మజ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మ అనే అక్షరాల సంగమమే ఓంకారం. ఋగ్వేదం నుండి అకారం, యజుర్వేదం నుండి ఉకారం, సామవేదం నుండి మ కారం పుట్టాయి. ఈ మూడింటి సంగమంతో ఓంకారం ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుంటుంది.

త్య్రంబకం భూత, భవిష్యత, వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు. త్య్రంబకమంటే మూడు నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలోనున్న సూక్ష్మరూప నేత్రం మూడవనేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహక శక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి.

యజామహే అంటే ధ్యానిస్తున్నానని అర్థం సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి.

సుగంధిం సు-మంచిదైన, గంధ- సువానసన ద్రవ్యం. మంచి వాసనలతో కూడుకొన్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు ఆ స్వామి మనపై తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు.

పుష్టివర్ధనం మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున్న ఆ స్వామి సర్వత్రా నెలకొనియున్నాడు. సృష్టి యావత్తూ ఆయన అధీనంలో ఉంది. ఉర్వారుకం ఇవ బంధనం దోసకాయ పక్వానికి వచ్చినప్పుడు దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనల్ని అన్ని సమస్యల నుండి గట్టెక్కించుతాడు. మృత్యోర్ముక్షీయ అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని మృత్యువు నుంచి కూడా మనకు రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమే కాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే.

అమృతాత్ స్వామి అల్ప సంతోషి. సులభప్రసన్నుడు

వనరులు

[మార్చు]