దశకుమారచరిత్రము
దశకుమార చరిత్రము దండి మహాకవి రచించిన సంస్కృతం గద్య కావ్యానికి కేతన అనువదించిన తెలుగు పద్యకావ్యం. ఇందులో పది మంది యువకుల సాహస, ప్రేమ గాధలను కవి పద్యాలలో వర్ణించాడు. ఇది 12 అధ్యాయాలు, 1625 పద్యాలు ఉన్న కావ్యం. ఇందులో కేతన ఆనాటి సంఘం స్వరూపాన్ని, ఆచారాలను. ఆభరణాలను వర్ణించాడు. సంస్కృత మూలంలో లేని పెక్కు సంప్రదాయాల వర్ణన ఈ కావ్యంలో కేతన పొందుపరచాడు. ఆంధ్ర ప్రాంతపు "కోడి పందేలాట"ను కూడా కేతన వర్ణించాడు. ఇది మరొక కవియైన తిక్కనకు అంకితం ఈయబడింది. ఈ గ్రంథం 1901 లో ఒకసారి ప్రచురించగా, తర్వాత 1925 లో శేషాద్రి రమణ కవులు పరిష్కరించగా వావిళ్ళ వారు ప్రచురించారు.
రచయిత గురించి
[మార్చు]ఈ కావ్యాన్ని రచించిన కేతన వేంగీ దేశమున వెంటిరాలు అనే అగ్రహారానికి అధిపతి. కౌండిన్యస గోత్రుడు. ఈయన ఇంటి పేరు మూలఘటిక వారు. తండ్రి పేరు మ్రానయ్య. దండి రచించిన ప్రముఖమైన ఈ కావ్యాన్ని తెలుగులోకి అనువదించడం చేత ఈయనకు అభినవ దండి అనే పేరు వచ్చింది.[1] ఈయన దశకుమారచరిత్రముతోబాటు విజ్ఞానేశ్వరీయము, ఆంధ్రభాషాభూషణము అనే మరో రెండు పుస్తకాలు కూడా రచించాడు.[2]
సారాంశం
[మార్చు]కేతన మూలగ్రంథం లోని కథల వర్ణనాంశాలను కొంచెం తగ్గించి కొన్ని కథాంశాలను పెంచి రాశాడు. పన్నెండవ ఆశ్వాసములో ఉన్న అపహారవర్మ కథలో మాత్రం అక్కడక్కడ మూలగ్రంథంతో తేడాలున్నాయి. ఈ గ్రంథం అద్భుత గాధలతో కూడుకుని ఉన్నప్పటికీ కథలలో తరచుగా వాస్తవికత కూడా కనిపిస్తూ ఉంటుంది. పేరులో చెప్పినట్లుగా ఇది పది మంది యువకుల కథ. చిన్నప్పటి నుంచీ కలిసి పెరిగిన ఈ పదిమంది సాహసయాత్ర చేస్తూ విడిపోతారు. తిరిగి వీళ్ళందరూ కలుసుకున్నప్పుడు ఆ పదిమందిలో నాయకుడిగా చెప్పబడేవానికి మిగతా వారు తామ అద్భుత అనుభవాలను చెప్పడం ఈ గ్రంథ వృత్తాంతం. ఈ కథలు శాఖోపశాఖలుగా విస్తరించినప్పటికీ ఒక మూలకథకు ముడివేస్తాడు కేతన.[3]
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/కేతన. వికీసోర్స్.
- ↑ దశకుమారచరిత్రము. చెన్నపురి: వావిళ్ల రామశాస్త్రులు అండ్ సన్స్. వికీసోర్స్.
- ↑ మందలపర్తి కిషోర్. "అద్భుత కథాకావ్య రచనకు కేతనమెత్తిన కేతన!". www.andhrabhoomi.net. Archived from the original on 2021-10-06. Retrieved 2021-10-06.