ది మూవీస్ మిస్టర్ గ్రిఫిత్ అండ్ మి
The Movies Mr Griffith and Me Lillian Gish (with Ann Pinchot) సినిమాలను, చలనచిత్రాలను కళావాహికలుగా, కళామాధ్యమాలుగా తీర్చిదిద్దిన మహానుభావుడు D.W.గ్రిఫిత్. ఆయన చిత్రాలలో నాయికగా పనిచేసిన తొలితరం హాలీవుడ్ నటి లిలియన్ గిష్ రచించిన ఈ పుస్తకంలో అమెరికాలో సినిమా పరిశ్రమ, తొలి దర్శకులు, నటీనటులు ఇంకా అనేక విషయాలను వివరంగా ప్రస్తావించింది. సినిమాకు ఒకభాష, వ్యాకరణం ఏర్పరచిన మహామనీషి గ్రిఫిత్. ఎడిటింగ్, స్క్రీన్ ప్లే వంటి అన్ని శాఖలలో కొత్త త్రోవలు తొక్కి, మార్గదర్శనం చేసిన, ఈనాటి ఆధునిక సినిమాకు రూపకల్పన చేసిన వ్యక్తి ఆయన. లిలియన్ గిష్ 1906 ప్రాంతంనుంచి 1920 వరకూ గ్రిఫిత్.తో కలిసి పనిచేసింది. గ్రిఫిత్ “బర్త్ ఆఫ్ ఎ నేషన్”, “ఇంటాలరెన్సు”, వంటి అనేక చిత్రాలలో నటించింది. గిష్ బాలనటిగా రంగస్థలం మీద, తర్వాత సినిమానటిగా జీవికగా ఆరంభించింది. గ్రిఫిత్ ప్రోత్సాహంవల్ల ఆమె నాటకం నుంచి సినిమాకు మారింది. ఆయన సినిమాలలో నటించక ముందు ఆమెకు కళాకారిణిగా గుర్తింపులేదు. ఆరోజుల్లో సినిమా ఒక చౌకరకం, మురికివాడల ప్రజలకోసం వినోదం అనే అభిప్రాయం ఉండేది. ఆ ప్రజలే ప్రేక్షకులు. రెండు రీళ్ల కాలక్షేపం సినిమాలను కాదని, గ్రిఫిత్ 1914 లో తీసిన “బర్త్ ఆఫ్ ఎ నేషన్” పూర్తి నిడివి కళాత్మక చిత్రం సినిమాలకు ఒక మార్గం చూపింది. ఒక మూస నమూనా అయింది. ఆర్వాత ఆయన తీసిన Intolerance చిత్రంతో తొలిచిత్రం లాభాలన్నీ హరించుకొని పోయాయి. సమకాలీన ప్రేక్షకులకు ఆ సినిమా అర్థంకాలేదు. ఆనాటి ప్రేక్షకులు ఆ స్థాయికి ఇంకా ఎదగలేదన్నమాట. లిలియన్ గిష్ ఈ సినిమాలో అనంతంగా ఉయ్యాల ఊపే తల్లి పాత్ర ధరించింది. ఇది చాలా చిన్న పాత్ర, కానీ చాలా ముఖ్యమయిన పాత్ర. అనంత కాలవాహినిని కలిపేపాత్ర. గ్రిఫిత్ క్లోసప్, క్రాస్ కటింగ్ , వ్యక్తి స్మృతులను తెరమీద చూపడానికి క్లోస్ అప్ చూపిన తర్వాత ఆ స్మృతిశకలాలను చూపి, కాలం, స్థలం నిబంధనలను తిరస్కరించి, కథను కొనసాగించడం వంటి అనేక నూతన విధానాలను ప్రవేశపెట్టాడు. మంచి పాత్రలు, దుష్టపాత్రలను ప్రవేశపెట్టడం అనే విధానం తర్వాత సినిమాకు ఒక నమూనాగా మారింది. గ్రిఫిత్ మీద డికెన్స్ ప్రభావం ఉందని పరిశీలకులు అంటారు. గ్రిఫిత్ గొప్ప సాహితీపరుడు, నాటకాలు రాశాడు, ప్రదర్శించాడు, కవిత్వం, చరిత్ర, కళలు అన్నీ అతనికి బాగా తెలుసు. తన సినిమాల ద్వారా గొప్ప కళను ఆవిష్కరిస్తున్నాననే, తన చేతుల్లో గొప్ప కళ పురుడుపోసుకొంటున్నదనే స్పృహ ఆయనకు ఉంది. ఆయన శిక్షణలో అనామకులు మహా కళాకారులయ్యారు, తారాపథం అందుకొన్నారు, మహాకళాకారులని పేరుపొందారు. హాలీవుడ్.లో అనేక సినిమా సాంప్రదాయాలు ఆతనితోనే మొదలయ్యాయి. D>W.Grifith వ్యక్తిగత జీవితాన్ని కూడా గిష్ ఈ పుస్తకంలో వివరించింది. ఆయన సినిమా కళకే జీవితాన్ని అర్పించాడు. వివాహం, కుటుంబం అన్నీ అతని కళాజీవితానికి సంకెళ్లయ్యాయి. అతను రెండు పర్యాయాలు పెళ్లి చేసుకొన్నాడు, రెండూ విఫలమయ్యాయి. Extended bachelor అనే మాట ఆయన విషయంలో సార్థకమవుతుందని గిష్ అంటుంది. అతన్ని సన్నిహితంగా చూచి అర్థంచేసుకున్న మనిషి ఆమె. అతని జీవితం ఆరంభం నుంచి చివరవరకు చక్కగా బోధపరచుకొన్నవ్యక్తి. తను ఆయన అభిమాని, ఆరాధించింది. గ్రిఫిత్ చేస్తున్న పనేమిటో ఆయనతో ఉన్నవారికి తెలియకపోయినా, ఆయన గొప్ప కళాసృష్టి చేస్తున్నాడని మాత్రం వారికి తెలుసు. ఇంటాలరెన్సు సినిమా వల్ల ఆర్థికంగా చితికిపోయి జీవితాంతం ఆయన కోలుకోలేక పోయాడు. లిలియన్ గిష్ ఆనాటి అమెరికా సినిమా పరిశ్రమ ఆవిర్భావం, అభివృద్ధి వంటి సంగతులు ఇందులో చక్కగా వివరించింది. సినిమా దర్శకుడి భావనలు, అభిప్రాయాలకు అనుగుణంగా తయారయ్యే కళారూపం, క్రమంగా పెట్టుబడి ప్రాముఖ్యం పెరిగి, పరిశ్రమగా మారినతర్వాత అందరూ కూలీలే ఆయారని గిష్ వ్యాఖ్యానిస్తుంది. సినిమాలో కథాంశంకన్న ధనాశం ప్రాముఖ్యం పెరిగింది. ఒక సినిమా విజయవంతమయితే మూస సినిమాలు తీసేవారు. సినిమాకు ప్రచారం, స్టూడియోల ప్రాముఖ్యం, యాక్టర్ల ప్రాముఖ్యం పెరిగింది. నటులు తారలయ్యారు, స్టార్ వేల్యూ అధికమయింది. ఈ మార్పులకు గ్రిఫిత్ తట్టుకొని నిలబడలేకపోయాడని ఆమె అంటుంది. అమెరికా చలనచిత్ర పరిశ్రమ గ్రిఫిత్ ప్రవేశపెట్టిన technique లన్నీ, శిల్పాలన్నీ వాడుకొన్నా, ఆయన కృషిని, ఆయన చిత్రపరిశ్రమకు చేసిన సేవలను చాలా ఆలస్యంగా మాత్రమే గుర్తించినట్లు, గుర్తించినా ఆయనను చివరిరోజులలో ఆదుకోలేదని లిలియన్ గిష్ అంటుంది. గిష్ ప్రోత్సాహంతో గ్రిఫిత్ మీద టీ.వీకోసం సినిమా తీశారు. లిలియన్ గిష్ ఈ పుస్తకంలో గ్రిఫిత్ జీవితాన్ని మాత్రమే కాక, అమెరికా సినిమా పరిశ్రమ ఆరంభ దశను గురించి వివరంగా రాసింది.
ఆకరాలు:The Movies Mr Griffith and Me Lillian Gish (with Ann Pinchot)