ది స్కై గెట్స్ డార్క్ స్లోలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ది స్కై గెట్స్ డార్క్ స్లోలీ జో డాక్విన్ అనే చైనీస్ రచయిత వృద్ధాప్యం గురించి, వృద్ధుల సమస్యల గురించి చిత్రీకరించిన నవల. ప్రతీ వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు వృద్ధాప్యంలోకి అడుగుపెడతాడు. అందులో అనివార్యమైనవి, సున్నితమైనవి అయిన ఎన్నో అంశాలు ఈ నవలలో ఉన్నాయి. వాటిని సరిగా అర్థం చేసుకోలేక మనోవ్యథకు గురయ్యే వృద్ధుల గురించి ఈ నవలలో వర్ణించడం జరిగింది.

అపరాథ భావంతోనో, అహంభావంతోనో లేదా మితిమీరిన ఆత్మస్థైర్యంతోనో లేక అంతుపట్టని ఆత్మ న్యూనతా భావంతోనో సతమయమయ్యే ఎందరో వయో వృద్ధుల జీవితాలలోకి తొంగిచూసి, వారి ఆత్మగత భావాలను, అనుభవాలను క్రోడీకరించి వారిన విశ్లేషణాత్మక గ్రంథమిది. [1]

నేపథ్యం[మార్చు]

జో డాక్విన్ పేరొందిన రచయిత. తండ్రి వృద్ధాప్యంలో అల్జీమీర్సు వ్యాధితో క్రమక్రమంగా అన్నీ మరచిపోవడం వంటి దశలన్నీ ప్రత్యక్షంగా చూశాడు. వృద్ధాప్యం అనివార్యం, కానీ దాన్ని గురించిన ఎరుక కలిగి వుండడం అందరికీ అవసరం. తల్లి, తండ్రి, ఆత్మీయులు ఎవరైనా వృద్ధులు ఉన్నప్పుడు వారి సమస్యలను అర్థంచేసుకోను ఈ జ్ఞానం పనికి వస్తుంది. వృద్ధుల హృదయాల్లో అణగివుండి బహిర్గతం కాని అనేక విషయాలను గూర్చి పాఠకులను ఈ నవలలో సెన్సిటైజ్ చేసారు.

కథాంశం[మార్చు]

వృద్ధులు అనుభవం వల్ల తమకన్నీ తెలుసని భావిస్తారు. కాని వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యలు వారికీ తెలియవు. షష్టిపూర్తి అయి పశ్చిమాకాశంలో వెలుగు మాయమై నక్షత్ర గానంలో లీనమయ్యేవరకు వేసవిలో సంధ్యాకాలం చీకట్లు ముసురుకున్నట్లు వృద్ధాప్యం మెల్లమెల్లగా కమ్ముకుంటుంది. వినికిడి తగ్గిపోతుంది. చూపు మందగిస్తుంది. మిత్రులు, సమకాలికులు క్రమక్రమంగా వెళ్ళిపోతారు. తల్లి వైపు, తండ్రి వైపు బంధువుల్లో పెద్దవాళ్ళు పండుటాకులు రాలినట్లు రాలిపోతారు. కన్నబిడ్డలు వాళ్ళవాళ్ళ కుటుంబాలతో, ఉద్యోగవ్యవహారాల్లో తీరికలేకుండా ఉంటారు. సమాజం కూడా వృద్ధులపట్ల ఉపేక్ష వహిస్తుంది. ఒంటరిగా, దారంతా శూన్యంగా అనిపిస్తుంది. కొందరికి జీవన సహచరో, సహచరుడో ముందుగా వెళ్ళిపోతారు. ఎంత గొప్ప ఉద్యోగం చేసినా, ఎంత పెద్ద పదవిలో ఉన్నవారైనా ఇప్పుడు అనామకంగా మారిపోతారు. నీ మనసు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా నువ్వు వృద్ధుడివి. ముసలివాడివి లేదా ముసల్దానివి. నువ్వు ఇక స్పాట్ లైట్ లో వుండవు. ఒక పక్కన మౌనంగా ఉండాలి. ఇతరులను చూచి అసూయ పడకూడదు.

నీదారి రహదారి కాదు. కంటకపరీవృతము, ఎగుడు దిగుడు రాళ్ళూరప్పలూ దారంతా ఉంటాయి. వృద్ధాప్యంలో రోగాలు నిన్ను వరించడానికి కాచుకొని ఉంటాయి. హృద్రోగం, బి.పి, చక్కెర వ్యాధి ఏదోఒకటి. సానుకూల దృక్పథంతో సద్దుకుపోవాలి. వ్యాయామం మరవొద్దు.

పడకెక్కడానికి సిద్ధంగా వుండు. శైశవంలో అమ్మపక్కన సుఖంగా పడుకొన్నావు. ఎన్నో మలుపులు, ఉరుకులు, పరుగులు మళ్ళీ అమ్మ ఒడిలోకి. అమ్మ నడిపించింది. అడుగు అడుగుకు అమ్మ ఆలంబనంగా. ఇప్పుడు అమ్మలేదు. పిల్లలు నియమించిన కేర్ టేకర్లు. నీతో ఏసంబంధమూ లేనివాళ్ళు. ఏ అనుబంధమూ లేని వాళ్ళు. నీకు సేవలు చేయను వచ్చినవాళ్ళు. వాళ్ళతో జాగ్రత్తగా మెలగు, కాస్త ఆప్యాయంగా గ్రేస్ ఫుల్ గా మాట్లాడు, సంతోషంగా మసలుకో.

వృద్ధాప్యంలో మోసగాళ్ళు, దగుల్బాజీలు, నీ సంపదకోసం, కూడబెట్టకున్న డబ్బుకోసం రకరకాల మోసాలు చెయ్యొచ్చు. ఇమెయిల్స్, ఫోన్ కాల్స్, మెసేజ్లు, అనేక రకాలుగా ఆశచూపుతారు. వాటికి దూరంగా వుండు.

మీకోసం మీ పిల్లలు, ఆత్మీయులు సహాయకుల్ని ఏర్పాటు చేస్తారు. ఆ యువతీయువకులకు మీ మీద ఆత్మీయత ఏముంటుంది? కనుక వారిపట్ల గౌరవంగా, ప్రేమతో వ్యవహరించండి.

ఆకాశంలో చీకట్లు ముసురుకుంటున్నపుడు నీముందు దారి కనపడదు. సమాజం సమస్యలన్నీ నీ సమస్యలని కలవరపడకు. ఇప్పుడు అవేవీ నీవికావు. నీ పిల్లలు, మనమళ్ళు, మనమరాళ్ళ సమస్యలు నీవికావు. ఆరాటం విడిచి పెట్టు. లేకపోతే నీ ఆరోగ్యం చెడుతుంది, శాంతి కరువైపోతుంది. జీవితం దుఃఖభాజనమవుతుంది. మరింత బాధ కలుగుతుంది.

ఓ బాటసారి! అనంత ఆకాశంలో నక్షత్రాలసంగీతం వినేవరకు జాగరూకతతో మెలగు. అనే సందేశం ఈ నవలద్వారా రచయిత ఇస్తారు. విశేషంగా, విపరీతంగా అమ్ముడుపోయిన నవల ది స్కై గెట్స్ డార్క్ స్లోలీ.

మూలాలు[మార్చు]

  1. "The Sky Gets Dark Slowly-Review | PDF". Scribd (in ఇంగ్లీష్). Retrieved 2024-04-25.

బాహ్య లంకెలు[మార్చు]