దీర్ఘ కృపాణ రాత్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దీర్ఘ కృపాణ రాత్రి (నైట్ ఆఫ్ లాంగ్ నైవ్స్)
కర్ట్ డాల్యూజ్ పోలీసు అధికారి; హీన్రిచ్ హిమ్లర్ (ఎస్.ఎస్ ముఖ్యాధికారి); ఎర్నెస్ట్ రోహ్మ్, స్టార్మ్‌ట్రూపర్స్ నేత
స్థానిక నామం Unternehmen Kolibri (అంటర్నెహ్‌మెన్ కోలిబ్రి)
వ్యవథి1934, జూన్ 30 – జూలై 2
ప్రదేశంనాజీ జర్మనీ
ఇలా కూడా అంటారుఆపరేషన్ హమ్మింగ్‌బర్డ్, రోహ్మ్ కుట్ర, రక్తపాత కుట్ర
కారణం
  • అధికారాన్ని సుస్థిర పరచుకోవడం, పాత పగలను తీర్చుకోవడం వంటి హిట్లర్ కోరికలు
  • ఎస్.ఎ పట్ల వెర్మాక్ట్ కున్న ఆందోళన
  • "జాతీయ సామ్యవాద విప్లవం" కొనసాగించాలన్న ఎర్నెస్ట్ రోహ్మ్ కోరిక
  • హిట్లర్ వెర్మాక్ట్‌ను తన నియంత్రణ లోకి తెచ్చుకోవాల్సిన అవసరం
నిర్వాహకులు
  • అడాల్ఫ్ హిట్లర్
  • హెర్మన్ గోరింగ్
  • హీన్రిచ్ హిమ్లర్
  • రీన్‌హార్డ్ హీడ్రిచ్
పాలుపంచుకున్నవారు
  • షుట్జ్‌స్టాఫెల్
ఫలితం
  • అడాల్ఫ్ హిట్లరు అధికారం దృఢపడింది
  • ఎస్.ఏ నుంచి ఎదురైన అపాయం తొలగిపోయింది
  • ప్రభుత్వ వ్యతిరేకత చాలావరకు తగ్గిపోయింది
  • హిట్లరు, వెర్మాక్ట్ ల మధ్య బాంధవ్యం బలపడింది
బాధితులు
అధికారికంగా 85. 150–200 దాకా ఉండే అవకాశం

1934 లో జూన్ 30, జూలై 2 ల మధ్య నాజీ జర్మనీలో హిట్లర్ తన అనుయాయులలో ఉన్న వ్యతిరేకులను హత్య చేసిన కార్యక్రమమే దీర్ఘ కృపాణ రాత్రి. దీనినే రోహ్మ్ ఏరివేత అని, ఆపరేషన్  హమ్మింగ్‌బర్డ్ (జర్మన్ భాషలో అంటర్‌నెహ్మెన్ కోలిబ్రి) అనీ కూడా అంటారు. తన అధికారాన్ని సుస్థిర పరచుకునేందుకు గాను చట్టానికి అతీతంగా హిట్లర్ జరిపిన మారణ హోమమే ఈ ఆపరేషను. నాజీలకు చెందిన పారామిలిటరీ సంస్థ స్టర్మాబ్టీలంగ్ (ఎస్.ఏ) నుండి, దాని నేత ఎర్నెస్ట్ రోహ్మ్ నుండి జర్మను సైనిక బలగాలకు ముప్పుందని భావించి, హిట్లర్ ఈ అపరేషన్ జరిపాడు. నాజీ ప్రచార యంత్రాంగం మాత్రం, రోహ్మ్ తలపెట్టిన కుట్రను ఛేదించేందుకే ఈ హత్యలు చెయ్యాల్సి వచ్చినట్లుగా చూపింది.

హిట్లర్ జరిపిన ఈ ఆపరేషన్‌లో ప్రధాన పాత్ర వహించింది, షుట్జ్‌స్టాఫెల్ (ఎస్.ఎస్), గెస్టాపో అని పిలిచే రహస్య పోలీసు సంస్థలు. ఎస్.ఎస్‌కు సారథి హిమ్లర్. ఈ ఏరివేతలో చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది ఎస్.ఏ కు చెందిన నేతలు. వీరిలో పేరు పొందినవాడు ఎస్.ఏ అధినేత, హిట్లరుకు అనుయాయీ అయిన రోహ్మ్. నాజీ పార్టీలోని స్ట్రాసెరిస్ట్ వర్గపు నాయకుడు గ్రెగోర్ స్ట్రాసర్‌తో సహా ఆ వర్గంలోని ముఖ్య నేతలను కూడా చంపేసారు. బవేరియా రాజకీయ నాయకుడు గుస్టావ్ రిట్టర్ వాన్ కార్ వంటి నాజీ వ్యతిరేకులను కూడా చంపారు. ఎస్.ఏ దౌర్జన్యాల పట్ల విసుగెత్తి ఉన్న జర్మనుల మనసు చూరగొనేందుకు కూడా ఈ హత్యలను ఉద్దేశించారు.

ఎస్.ఏ స్వతంత్రంగా వ్యవహరించడం, దాని సభ్యులు వీధి రౌడీల్లాగా ప్రవర్తించడం వంటివి తన అధికారానికి చేటు కాగలవని హిట్లరు భావించాడు. ఎస్.ఏ లోకి జర్మను మిలిటరీ - రీచ్‌స్వేర్ -ని విలీనం చేసి, మిలిటరీకి కూడా తానే నేతను కావాలనే ఆలోచన రోహ్మ్‌కు ఉందని మిలిటరీ అధికారులు భయపడేవారు. వారిని సముదాయించాలని కూడా హిట్లరు భావించాడు. దానికి తోడు, సంపదను పునఃపంపకం చేసేందుకు రెండవ విప్లవం రావాలనే నినాదానికి రోహ్మ్ బహిరంగంగా మద్దతు తెలపడం హిట్లరుకు నచ్చలేదు. 1933 జనవరి 30 న ప్రెసిడెంటు[a] హిండెన్‌బర్గ్ హిట్లరును చాన్సలరుగా నియమించడంతో నాజీ పార్టీ అధికారానికి వచ్చినప్పటికీ, పార్టీకున్న ఇతర పెద్ద లక్ష్యాలు నెరవేరలేదని రోహ్మ్ అభిప్రాయం. తన ప్రభుత్వ విమర్శకులను, ముఖ్యంగా వైస్ చాన్సలరు ఫ్రాంజ్ వాన్ పాపెన్ అనుయాయులను, తన పాత శత్రువులనూ అంతమొందించేందుకు కూడా హిట్లరు ఈ దాడులను ఉపయోగించుకున్నాడు.[b]

ఈ మారణ కాండలో కనీసం 85 మంది హతులయ్యారు. అసలు సంఖ్య వందల్లో ఉండవచ్చు.[c][d][e] అత్యధిక అంచనాల ప్రకారం హతుల సంఖ్య 700 నుండి 1,000 దాకా ఉండి ఉండవచ్చు.[1] వ్యతిరేకులని భావించిన వాళ్ళను వెయ్యిమంది దాకా ఖైదు చేసారు.[2]  ఈ కాండతో హిట్లరుకు మిలిటరీ మద్దతు బలపడింది. దీర్ఘ కృపాణ రాత్రి జర్మను ప్రభుత్వానికి ఒక మేలిమలుపు వంటిది.[3] హిట్లరును జర్మను ప్రజలకు సర్వంసహాధికారిగా నిలబెట్టింది. రీచ్‌స్టాగ్‌లో జూలై 13 న చేసిన ప్రసంగంలో హిట్లరు ఈ సంగతే చెప్పాడు.

ఈ మారణకాండను అమలు జరిపే ముందు, వ్యూహకర్తలు ఈ పథకాన్ని కోలిబ్రి (హమ్మింగ్‌బర్డ్) అనే సంకేత నామంతో పిలిచేవారు.[4] దీర్ఘ కృపాణ రాత్రి (నఖ్ట్ డెర్ లాంగెన్ మెస్సర్) అనే పేరు మాత్రం జర్మను భాషలో ఈ హత్యలకు ముందే వాడుకలో ఉంది. ప్రతీకార సంఘటనలను ఈ పేరుతో వ్యవహరించేవారు. 

ఏరివేత

[మార్చు]
ఆగస్టు ష్నీఢూబర్ మ్యూనిక్ పోలీసు నేత

1934, జూన్ 30 తెల్లవారు ఝామున 4:30 కి హిట్లరు, అతడి అనుచరగణంతో మ్యూనిక్ లో దిగాడు. విమానాశ్రయం నుండి నేరుగా బవేరియా అంతర్గత మంత్రిత్వ శాఖ ఆపీసుకు వెళ్ళి అక్కడ ఎస్.ఏ అధికారులతో సమావేశమయ్యాడు. వాళ్ళంతా అంతకు ముందు రాత్రి నగర వీధుల్లో హింసకు దిగి రచ్చ చేసిన వాళ్ళే. శాంతిభద్రతలు నెలకొల్పడంలో వైఫల్యం కారణంగా  మ్యూనిక్ పోలీసు అధికారి ఆగస్టు ష్నీఢూబర్‌పై  హిట్లరు కోపంతో ఊగిపోయాడు. అతడి చొక్కాకుండే భుజకీర్తులను పీకి పడేసాడు. అతణ్ణి విశ్వాసఘాతకుడిగా నిందించాడు.[5] ష్నీఢూబర్‌కు మరణశిక్ష విధించి ఆ రోజే అమలు చేసారు. ఆ తరువాత కొంతమంది ఎస్.ఎస్ ఆఫీసర్లు, కొందరు పోలీసులనూ తీసుకుని హిట్లరు, బాడ్‌వీస్‌లో రోహ్మ్ బస చేసిన హోటల్ హ్యాన్‌సెల్‌బాయర్‌కు వెళ్ళాడు.[6]

ఉదయం 06:00,  07:00 గంటల మధ్య హిట్లరు హోటలును చేరుకున్నప్పటికి, ఎస్.ఏ నాయకులు ఇంకా సరిగ్గా మేలుకోలేదు. హిట్లరు రాక వాళ్ళకు ఆశ్చర్యం కలిగించింది. రోహ్మ్‌ను, అతడి అనుచరులనూ హిట్లరు దగ్గరుండి అరెస్టు చేయించాడు. ఎస్.ఏ నాయకుడు, ఎడ్మండ్ హీన్స్ ఎస్.ఏ కు చెందిన ఓ 18 ఏళ్ళ యువకుడితో ఒకే మంచంపై ఉండగా ఎస్.ఎస్ అధికారులు చూసారు.[7] గోబెల్స్, ఈ అంశాన్ని ఉదహరిస్తూ ఈ ఊచకోతలను సమర్ధించుకుంటూ నైతికంగా పతనమైన వాళ్ళు అంటూ తాను చేసిన ప్రచారం కోసం వాడుకున్నాడు.[8] హీన్స్ ను, ఆ కుర్రాణ్ణీ హోటల్ బయటికి తీసుకెళ్ళి కాల్చెయ్యమని హిట్లరు ఆదేశించాడు.[5] ఎస్.ఏకు చెందిన ఇతర నాయకులు హిట్లరుతోటి, రోహ్మ్ తోటీ జరగనున్న సమావేశానికి హాజరయ్యేందుకు వస్తూ రైలు దిగగానే ఎస్.ఎస్ అరెస్టు చేసింది.[9]

రోహ్మ్, ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర చేస్తున్నాడనేందుకు రుజువు లేకపోయినా హిట్లరు ఎస్.ఏ నాయకత్వాన్ని నిందిస్తూ పోయాడు.[8] మ్యూనిక్‌లో పార్టీ ఆఫీసుకు వెళ్ళి, అక్కడ గుమిగూడిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాడు. ఆగ్రహంతో ఊగిపోతూ "ప్రపంచంలోనే అత్యంత హీనమైన ద్రోహాన్ని" ఖండించాడు. "క్రమశిక్షణ లేని అవిధేయులను, మానసిక రోగగ్రస్తులను, అసాంఘిక శక్తులనూ నిర్మూలించేస్తామ"ని అతడు ప్రజలకు చెప్పాడు. పార్టీ సభ్యులు, అరెస్టులను తప్పించుకున్న అదృష్టవంతులైన ఎస్.ఏ సభ్యులూ ఆ గుంపులో ఉన్నారు. వాళ్ళంతా పెద్దగా అరుస్తూ తమ అంగీకారాన్ని తెలియజేసారు. వాళ్ళలో ఉన్న హెస్ అయితే, "ద్రోహులను" కాల్చి పారేసేందుకు తాను సిద్ధమని చెప్పాడు.[9]

బాడ్‌వీస్ వద్ద హిట్లరు తోనే ఉన్న జోసెఫ్ గోబెల్స్, తమ పథకంలోని తుది దశకు శ్రీకారం చుట్టాడు. బెర్లిన్‌కు తిరిగి రాగానే, గోబెల్స్, 10 గంటలకు గోరింగ్‌కు ఫోను చేసి, కోలిబ్రి అనే తమ కోడ్‌వర్డ్ చెప్పి, మిగిలిన ద్రోహుల ఊచకోతకు ఆదేశించాడు.[8] స్టాడెల్‌హీమ్ జైలులో ఉన్న ఎస్.ఏ అధికారులను చంపేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చెయ్యాలని హిట్లరు లీబ్‌స్టాండార్టే నేత అయిన సెప్ డీట్రిచ్‌ను ఆదేశించాడు.[10] జైలు ఆవరణలో ఈ బృందం, ఐదుగురు ఎస్.ఎ జనరళ్ళను, ఒక కల్నలునూ కాల్చి చంపారు.[11] చంపకుండా వదలిన వారిని లీబ్‌స్టాండార్టే బ్యారక్‌లకు తీసుకు వెళ్ళి అక్కడ ఒకే నిముషపు "విచారణ"లు జరిపి కాల్చి చంపారు.[12]

సంప్రదాయవాదులు, పాత శత్రువులకు వ్యతిరేకంగా

[మార్చు]
యూనిఫారములో జనరల్ కర్ట్ వాన్ ష్లీషర్. హిట్లరుకు ముందరి చాన్సలర్, 1932 లో
1920 లో గుస్టావ్ వాన్ కార్

ఎస్.ఏ ను క్షాళన చెయ్యడంతో ప్రభుత్వం ఆగలేదు. సంప్రదాయవాదుల్లో విశ్వసనీయ వ్యక్తులు కాదు అనుకున్నవారిపై హిట్లరు దృష్టిపెట్టాడు. వైస్ చాన్సలరు పాపెన్, అతని దగ్గరి అనుచరులూ కూడా వీరిలో ఉన్నారు. గోరింగ్ ఆఅదేశాల మేరకు ఎస్.ఎస్ విభాగం ఒకటి వైస్ చాన్సలరు నివాసాన్ని చుట్టుముట్టింది. గెస్టాపో కు చెందిన ఆఫీసర్లు పాపెన్ సెక్రెటరీని హతమార్చారు. అతణ్ణి అరెస్టు చేసే శ్రమ కూడా తీసుకోలేదు. పాపెన్ అనుంగు అనుచరుడు ఎడ్గార్ జంగ్ ను చంపేసి, అతడి శవాన్ని ఒక గుంటలో పడేసారు.[13] తాను వైస్ చాన్సలరునని, తన్ను అరెస్టు చెయ్యకూడదనీ మొత్తుకున్నప్పటికీ, పాపెన్‌ను అరెస్టు చేసారు. తరువాత కొన్నాళ్లకు హిట్లరు అతణ్ణి విడుదల చేసాడు. అయితే ఆ తరువాత పాపెన్ హిట్లరును విమర్శించే ధైర్యం చెయ్యలేదు. అతణ్ణి వియన్నాకు రాయబారిగా నియమించారు.[14]

హిట్లరు, హిమ్లర్‌లు తమ పాత  శత్రువులపైకి కూడా గెస్టాపోను ఉసిగొలిపారు. హిట్లరుకు ముందు వైస్ చాన్సలరుగా పనిచేసిన కర్ట్ వాన్ ష్లీషర్‌ను అతని భార్యనూ అతడి ఇంటివద్దే హత్య చేసారు. 1932 లో నాజీ పార్టీకి రాజీనామా చేసి హిట్లరుకు కోపం తెప్పించిన గ్రెగోర్ స్ట్రాసర్, 1923 లో బీర్ హాల్ కుట్రను భగ్నం చేసిన గుస్టావ్ రిట్టర్ కార్ లను కూడా చంపేసారు.[15] కార్‌ను మరీ క్రూరంగా గొడ్డళ్ళతో నరికి చంపారు. మ్యూనిక్ బయట ఒక అడవిలో అతడి శవం దొరికింది. హతుల్లో వార్తాపత్రికలో సంగీత సమీక్షకుడు విల్లీ ష్మిడ్ట్ కూడా ఉన్నాడు. అతణ్ణి పొరపాటున చంపేసారు.[16][12] ఈ మొత్తం వ్యవహారంలో స్నేహం, విధేయతలను ఎక్కడా అడ్డు రానీయలేదని హిమ్లర్ వ్యక్తిగత సహాయకుడు కార్ల్ వుల్ఫ్ చెప్పాడు:

వాళ్ళలో కార్ల్ వాన్ స్ప్రేటి [అనే] రోహ్మ్‌ వ్యకిగత సహాయకుడు కూడా ఉన్నాడు. నేను హిమ్లర్ దగ్గర చేస్తున్న పనే అతడు రోహ్మ్ దగ్గర చేస్తున్నాడు. "హెయిల్ హిట్లర్" అనే మాట [అతడి] పెదాలపైనే ఉంది. అతడు నేనూ స్నేహితులం. అప్పుడప్పుడూ ఇద్దరం కలిసి బెర్లిన్‌లో భోంచేసే వాళ్ళం. అతడు నాజీల పద్ధతిలో చెయ్యెత్తి "హెయిల్ హిట్లర్, నేను జర్మనీని ప్రేమిస్తున్నాను" అని నినదించాడు.[17]

కొందరు ఎస్.ఏ సభ్యులు "హెయిల్ హిట్లర్" అని చెబుతూ చనిపోయారు. తమను చంపుతున్నది హిట్లరును వ్యతిరేకిస్తున్న ఎస్.ఎస్ సభ్యులని వాళ్ళు భావించారు.[12] కాథోలిక్ సెంటర్ పార్టీ సభ్యులను కూడా ఈ ఏరివేతలో చంపేసారు. ఆ పార్టీ నాజీయిజాన్ని వ్యతిరేకించింది. కానీ హిట్లరుకు నియంతృత్వ అధికారాలను కట్టబెట్టిన 1933 చట్టానికి అనుకూలంగా వోటేసింది [18]

రోహ్మ్ గతి

[మార్చు]

రోహ్మ్ ను కొంతకాలం మ్యూనిక్‌ లోని స్టాడెల్‌హీమ్ జైల్లో ఉంచారు.[f] అతడిని ఏం చెయ్యాలా అని హిట్లరు ఆలోచించాడు. చివరికి, అతడు చనిపోవాల్సిందే అని అతడు నిశ్చయించాడు. జూలై 1 న హిట్లరు అజ్ఞ మేరకు, థియోడోర్ ఐకే, తన అనుచరుడు మైకెల్ లిప్పర్ట్‌తో కలిసి రోహ్మ్ వద్దకు వెళ్ళాడు. రోహ్మ్‌కు తుపాకి ఇచ్చి, 10 నిముషాల్లో కాల్చుకొమ్మని, లేదంటే తామే కాలుస్తామనీ చెప్పారు. రోహ్మ్‌, "నేను చావాల్సిందే అని నిశ్చయిస్తే, హిట్లరునే స్వయంగా చంపమనండి" అని వాళ్ళకు చెప్పాడు. [5] ఇచ్చిన సమయంలో తుపాకీ మోత ఏమీ వినబడకపోయేసరికి, 14:50 కి వాళ్ళిద్దరూ రోహ్మ్ గదిలోకి వెళ్ళారు. అక్కడ రోహ్మ్ ఛాతీ కనబడేలా చొక్కా గుండీలు విప్పుకుని, బోర విరుచుకుని ధిక్కార సూచనగా నిలబడి ఉన్నాడు.[19] ఐకే, లిప్పర్ట్‌లు రోహ్మ్ ను కాల్చి చంపారు.[20] 1957 లో, రోహ్మ్  హత్యకు గాను, మ్యూనిక్‌లో జర్మను అధికారులు లిప్పర్ట్‌ను విచారించి, అతడికి 18 నెలల జైలుశిక్ష విధించారు.

పర్యవసానాలు

[మార్చు]
విజయోత్సాహంతో హిట్లరు: 1935 లో ఎస్.ఏను పరిశీలిస్తున్న హిట్లరు. కారులో హిట్లరుతో ఉన్నది బ్లుట్‌ఫాన్కారు వెనక ఉన్నది ఎస్.ఎస్ నేత జాకబ్ గ్రిమ్మింగర్

ఈ ఊచకోతలో అంత మంది ప్రముఖ జర్మనులు ప్రాణం కోల్పోయాక, ఇక దాన్ని రహస్యంగా ఉంచడం బహు కష్టమైంది. మొదట్లో, ఈ ఘటనతో ఎలా వ్యవహరించాలనే విషయమై వ్యూహకర్తల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు అనిపించింది. "గత రెండు రోజులుగా జరిగిన చర్యకు సంబంధించిన దస్త్రాలన్నిటినీ తగలబెట్టెయ్యమ"ని గోరింగ్ పోలీసు స్టేషన్లను ఆదేశించాడు.[21] ఈలోగా గోబెల్స్, చనిపోయినవారి జాబితాను వార్తా పత్రికలు ప్రచురించకుండా అడ్డుకునే ప్రయత్నం చేసాడు. కానీ జూలై 2 న రేడియోలో చేసిన ప్రసంగంలో మాత్రం, ప్రభుత్వాన్ని కూలదోసి, దేశాన్ని అల్లకల్లోలం చేసేందుకు రోహ్మ్, ష్లీషర్‌లు చేసిన కుట్రను హిట్లరు వెంట్రుక వాసిలో ఛేదించాడు అని గోబెల్స్ చెప్పాడు.[16] 1934 జూలై 13 న రీచ్‌స్టాగ్‌లో చేసిన ప్రసంగంలో ఇలా అన్నాడు:

మామూలు కోర్టుల ద్వారా విచారణ జరిపించలేదేమని నన్ను ఎవరైనా అడిగితే, నేను వాళ్ళకు చెప్పేది ఇదే: ఈ క్షణాన, జర్మను ప్రజల భవిష్యత్తుకు నేను బాధ్యుణ్ణి. అంచేత నేను ప్రజలందరి తరపున అత్యున్నత న్యాయాధికారి నయ్యాను. ఈ దేశద్రోహ కుట్రలో పాల్గొన్న నాయకులను కాల్చెయ్యమని నేను ఆదేశించాను. జాతి జీవనంలో చీడలా దాపురించిన వాళ్ళను ఏరెయ్యమని కూడా నేను ఆదేశించాను. జాతి ఉనికికి చేటు తెచ్చేవారు ఎవరైనా సరే శిక్ష తప్పించుకోలేరని అందరూ తెలుసుకోవాలి. రాజ్యాన్ని దెబ్బతీసేందుకు చెయ్యెత్తే వాడికి చావే గతి. ఇది తరతరాలకూ గుర్తుండి పోవాలి.[22][23]

ప్రతిస్పందన

[మార్చు]
జాతీయ అత్యవసర భద్రతా చర్యలకు సంబంధించిన చట్టం.[24]
1932 ఎన్నికలలో హిండెన్‌బర్గ్ పోస్టరు.(అనువాదం: "అతడి తోటే")

ష్లీషర్‌కు పునరావాసం కల్పించాలని జనరల్ కర్ట్ వాన్ హ్యామర్‌స్టీన్, ఫీల్డ్ మార్షల్ ఆగస్టు వాన్ మాకెన్‌సెన్ లు మొదట్లో ఉద్యమించారు.[25] ష్లీషర్, హ్యామర్‌స్టీన్‌లు గాఢ స్నేహితులు. ష్లీషర్ అంత్యక్రియలు జరిగే చోటికి ఎస్.ఎస్ మనుషులు హ్యామర్‌స్టీన్‌ను వెళ్ళనివ్వలేదు. అతడు తెచ్చిన పూలగుచ్ఛాన్ని లాగేసుకున్నారు. అందుకతడు ఖేదపడ్డాడు.[25] జూలై 18 న ప్రెసిడెంట్ హిండెన్‌బర్గ్‌కు రాసిన ఒక లేఖలో హ్యామర్‌స్టీన్, మాకెన్‌సెన్‌లు ష్లీషర్, బ్రెడో ల హత్యలకు దారితీసిన పరిస్థితులను వివరించారు. పాపెన్ వెంట్రుక వాసిలో బయటపడ్డాడని వాళ్ళు రాసారు.[26] దీనికి బాధ్యులను శిక్షించాలని వాళ్ళు హిండెన్‌బర్గ్‌ను ఆ లేఖలో కోరారు. ష్లీషర్, బ్రెడో ల హత్యలకు మద్దతు ఇచ్చిన బ్లోంబెర్గ్‌ను విమర్శించారు.[26] గోరింగ్, బ్లోంబెర్గ్, గోబెల్స్ వగైరాలను మంత్రివర్గం నుండి తొలగించాలని వాళ్ళు హిండెన్‌బర్గ్‌ను కోరారు.[26] దేశాన్ని పాలించేందుకు ఒక డైరెక్టొరేట్‌ను సృష్టించాలని అందులో ఛాన్సలరు (పేరు ఉదహరించలేదు) తో పాటు, జనరల్ వాన్ ఫ్రిష్‌ను వైస్ ఛాన్సలరుగా, హ్యామర్‌స్టీన్‌ను రక్షణమంత్రిగా, ఆర్థిక మంత్రి (పేరు ఉదహరించలేదు),రుడాల్ఫ్ నడోల్నీని విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉంచాలని కూడా వాళ్ళు కోరారు.[26] లేఖ అంతాన హ్యామర్‌స్టీన్, మాకెన్‌సెన్‌లు ఇలా రాసారు:

ఎక్సెలెన్సీ, ప్రస్తుత పరిస్థితి లోని తీవ్రత, సర్వ సైన్యాధ్యక్షుడైన మీకు ఈ లేఖ రాసేందుకు మమ్మల్ని పురికొల్పింది. మన దేశ భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. గతంలో మూడు సార్లు - తానెన్‌బర్గ్‌ వద్ద, యుద్ధం తరువాతా, మీరు అధ్యక్షుడిగా ఎన్నికయ్యేటపుడూ - మీరు ఈ దేశాన్ని రక్షించారు. ఎక్సెలెన్సీ, నాలుగో సారి జర్మనీని రక్షించండి! కింద సంతకం పెట్టిన జనరల్‌లు, సీనియర్ అధికారులూ ఆఖరి శ్వాస దాకా మీకు, పితృభూమికీ విధేయులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారు.[26]

హిండెన్‌బర్గ్ ఆ లేఖకు సమాధానం రాయలేదు. అసలతడు దాన్ని చదివాడో లేదో కూడా అనుమానమే.. ఎందుకంటే నాజీలతోనే తన భవిష్యత్తు ఉందని భావించిన అధ్యక్షుడి సెక్రెటరీ ఓట్టో మీబ్నర్ ఆ లేఖను హిండెన్‌బర్గ్‌ వరకూ చేరనిచ్చి ఉండడు.[27] విశేషమేంటంటే ఈ హత్యల పట్ల బాధ పడిన హ్యామర్‌స్టీన్, మాకెన్‌సెన్‌ వంటి అధికారులెవరూ కూడా హిట్లరును నిందించలేదు. అతడు ఛాన్సలరుగా కొనసాగాలనే వాళ్ళు కోరుకున్నారు. హిట్లరు అనుచరులు కొంతమందిని తొలగించాలని కోరడం వరకూ చేసారంతే.[28]

నెదర్లండ్స్‌లో ప్రవాసంలో ఉన్న మాజీ కైజర్, విల్‌హెల్మ్ 2 ఈ ఊచకోత గురించి విని నిర్ఘాంతపోయాడు. "నేనే గనక అలాంటి పని చేసి ఉంటే ప్రజలు ఏమని ఉండేవాళ్ళు?" అని అడిగాఢతడు.[29] మాజీ చాన్సలరు కర్ట్ వాన్ ష్లీషర్‌ను అతడి భార్యనూ చంపిన సంగతి తెలిసి అతడు, "మనం చట్టబద్ధ సమాజంలో జీవించడం లేదు. నాజీలు ఇంట్లోకి తోసుకొచ్చి, ప్రజల్ని గోడకెదురుగా నిలబెట్టే పరిస్థితి కోసం ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఉండాలి." అని అన్నాడు.

ఎస్.ఏ నాయకత్వం

[మార్చు]

రోహ్మ్ తరువాత విక్టర్ లుట్జెను ఎస్.ఏ నేతగా హిట్లర్ నియమించాడు. ఎస్.ఏలో "స్వలింగ సంపర్కాన్ని, వ్యభిచారాన్ని, తాగుడును, విలాస జీవనాన్నీ తుదముట్టించాలని" హిట్లర్ అతణ్ణి ఆదేశించినట్లుగా ఒక చరిత్రకారుడు చెప్పాడు.[30] ఎస్.ఏ నిధులను ఖరీదైన కార్ల మీద, విందు వినోదాల మీదా ఖర్చు పెట్టడం ఆపమని హిట్లరు ఆదేశించాడు.[30] ఆ తరువాతి కాలంలో ఎస్.ఏ స్వతంత్రతను నిలబెట్టేందుకు లుట్జె చేసిందేమీ లేదు. 1934 ఆగస్టులో 29 లక్షలుగా ఉన్న ఆ సంస్థ సభ్యుల సంఖ్య 1938 ఏప్రిల్ నాటికి 12 లక్షలకు పడిపోయింది.[31]

సాహిత్యంలో ఈ ఘటన

[మార్చు]

గరికిపాటి నరసింహారావు తన సాగర ఘోష పద్య కావ్యంలో దీర్ఘ కృపాణ రాత్రి ఘటనను స్పృశించాడు. ఈ ఘటనను ఉదహరించిన పద్యం (చంపకమాల వృత్తంలో) ఇక్కడ:

పరమ కిరాతక ప్రకృతి భళ్ళున బైటకుతన్నె గ్యాసు చాం
బరుల విషమ్ము నింపి ఒకమారె వధించెను లక్ష యూదులన్
ధరణి భరింప గల్గినది దారుణ దీర్ఘ కృపాణ రాత్రి ని
ష్కరుణ కఠోర కర్కశ నిషాద విషాద పిశాచ చేష్టలన్

అయితే హిట్లరు యూదులపై జరిపిన మారణకాండను, ఈ ఘటననూ కలిపి ఈ పద్యంలో చెప్పాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

వివరణలు

[మార్చు]

నోట్స్

[మార్చు]
  1. జర్మనీ ప్రెసిడెంటు భారత రాష్ట్రపతి లాగానే దేశాధినేత, దేశంలోనే అత్యున్నత స్థాయి పదవి. దేశ పార్లమెంటు (బుండెస్టాగ్), రాష్ట్రాల ప్రతినిధులూ కలిసి ప్రెసిడెంటును ఎన్నుకుంటారు. రెండవ అత్యున్నత స్థాయి పదవి బుండెస్టాగ్ ప్రెసిడెంటు. లోక్‌సభ స్పీకరు వంటిది. మూడవ అత్యున్నత స్థాయి పదవి ఛాన్సలరు- ప్రభుత్వాధినేత. ఇది భారతదేశ ప్రధానమంత్రి పదవికి సమానమైనది. ఛాన్సలరును బుండెస్టాగ్ ఎన్నుకుంటుంది.
  2. పాపెన్ అనుంగు అనుచరులు హతులైనా అతడు మాత్రం తన పదవిలో కొనసాగాడు. నాజీ ప్రభుత్వాన్ని విమర్శించిన అతడి మార్బర్గ్ ప్రసంగాన్ని రాసిపెట్టిన ఎడ్గార్ జంగ్ కూడా హతుల్లో ఒకడు.
  3. "న్యాయ విచారణేమీ లేకుండానే కనీసం 85 మందిని చంపేసారు. గోరింగ్ ఒక్కడే వెయ్యి మందికి పైగా అరెస్టు చేయించాడు." Evans 2005, p. 39.
  4. "85 మంది హతుల పేర్లు [ఉన్నాయి], వాళ్ళలో 50 మంది మాత్రమే ఎస్.ఏ మనుషులు. కొన్ని అంచనాల ప్రకారం హతుల సంఖ్య 150, 200 మధ్య ఉంటుంది." Kershaw 1999, p. 517.
  5. జాంసన్ ప్రకారం హతుల సంఖ్య 150. Johnson 1991, p. 298.
  6. కాకతాళీయంగా, స్టాడెల్‌హీమ్‌ జైల్లోనే హిట్లరును కూడా ఐదు వారాలు ఖైదు చేసారు. 1921 జనవరిలో ప్రత్యర్ధి పార్టీ రాజకీయ ఊరేగింపును చెదరగొట్టినందుకు గని అతడికి ఈ శిక్ష పడింది.

మూలాలు

[మార్చు]
  1. Larson, Erik (2011) In the Garden of Beasts New York: Broadway Paperbacks p. 314 ISBN 978-0-307-40885-3; citing: - memoranda in the W. E. Dodd papers; - Wheeler-Bennett, John W. (1953) The Nemesis of Power: The German Army in Politics 1918-1945, London: Macmillan p. 323; - Gallo, Max (1972) The Night of the Long Knives New York: Harper & Row, pp. 256, 258; - Rürup, Reinhard (ed.) (1996) Topography of Terror: SS, Gestapo and Reichssichherheitshauptamt on the "Prinz-Albrecht-Terrain", A Documentation Berlin: Verlag Willmuth Arenhovel, pp. 53, 223; - Kershaw Hubris p. 515; - Evans (2005), pp. 34–36; - Strasser, Otto and Stern, Michael (1943) Flight from Terror New York: Robert M. McBride, pp. 252, 263; - Gisevius, Hans Bernd (1947) To the Bitter End New York: Houghton Mifflin, p. 153; - Metcalfe, Phillip (1988) 1933 Sag Harbor, New York: Permanent Press, p. 269
  2. Evans 2005, p. 39.
  3. Johnson 1991, pp. 298–299.
  4. Kershaw 1999, p. 515.
  5. 5.0 5.1 5.2 Shirer 1960, p. 221.
  6. Bullock 1958, p. 166.
  7. Kempka 1971.
  8. 8.0 8.1 8.2 Kershaw 1999, p. 514.
  9. 9.0 9.1 Evans 2005, p. 32.
  10. Cook & Bender 1994, pp. 22, 23.
  11. Cook & Bender 1994, p. 23.
  12. 12.0 12.1 12.2 Gunther, John (1940). Inside Europe. New York: Harper & Brothers. pp. 51, 57.
  13. Evans 2005, p. 34.
  14. Evans 2005, pp. 33–34.
  15. Spielvogel 1996, pp. 78–79.
  16. 16.0 16.1 Evans 2005, p. 36.
  17. The Waffen-SS 2002.
  18. United States Holocaust Memorial Museum.
  19. Evans 2005, p. 33.
  20. Kershaw 2008, p. 312.
  21. Kershaw 1999, p. 517.
  22. Shirer 1960, p. 226.
  23. Fest 1974, p. 469.
  24. Roderick Stackelberg, Sally A. Winkle, The Nazi Germany Sourcebook: An Anthology of Texts, p. 173
  25. 25.0 25.1 Wheeler-Bennett 1967, p. 328.
  26. 26.0 26.1 26.2 26.3 26.4 Wheeler-Bennett 1967, p. 329.
  27. Wheeler-Bennett 1967, p. 330.
  28. Wheeler-Bennett 1967, pp. 329–330.
  29. Macdonogh 2001, pp. 452–53
  30. 30.0 30.1 Kershaw 1999, p. 520.
  31. Evans 2005, p. 40.

గ్రంథసూచీ

[మార్చు]
Online
Media
  • The Waffen-SS. Gladiators of World War II. World Media Rights. 2002.

మరింతగా తెలుసుకునేందుకు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]