ధర్మాద్వైతస్థితి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విద్వత్సంస్తవసనీయ భవ్యకవితావేశుడు విజ్ఞాన సం
పద్విఖ్యాతుడు సంయమిప్రకర సంభావ్యాసుభావుండు గృ
ష్ణద్వైపాయనుడర్ధిలోకహితనిష్ఠంబూని కావించె ధ
ర్మాద్వైతస్థితి భారతాఖ్యమగు లేఖ్యంబైన యామ్నాయమున్!

విద్వాంసులచే స్తుతింపబడే భవ్యకవితావేశం కలవాడూ, తన విజ్ఞానసంపదచే ప్రసిద్ధుడైనవాడూ, మహర్షుల బృందంచే గౌరవింపబడే సహజ సద్గుణాలూ కలవాడూ అయిన వేదవ్యాస మహర్షి లోకహిత నిష్ఠతో ధర్మాద్వైతస్థితితో కూడిన భారత మనే లేఖ్యమైన అమ్నాయాన్ని రచించాడు అని తిక్కనగారు వ్యాసభగవాణున్ని తన విరాట పర్వము అవతారికలో కీర్తించారు. ఈకీర్తించడంలో వ్యాసుడు భారతంలో ధర్మాద్వైతస్థితిని సమకూర్చాడు అన్న అంశం పెద్దల్లో చాలామందిని బాగా ఆకర్షించింది. భారతం యొక్క అంతరాత్మ ధర్మాద్వైతమని తిక్కన దర్సించడానికి కీ.శే. పింగళి లక్ష్మీకాంతం చెప్పారు. ఆచార్య దివాకర్ల వేంకటావధాని భారతం సర్వధర్మాలకూ సమాన ప్రతిపత్తిని చెప్పుతున్నదనీ, ధర్మబోధ ప్రధానంగాకల ఇతిహాసం అవ్వటం చేత దీన్ని తిక్కన ధర్మాద్వైత స్థితి గల గ్రంధంగా కీర్తించి ఉండవచ్చునని తిక్కన జీవితంలో కూడా ధర్మాద్వైతస్థితి ప్రతిఫలిస్తున్నదనీ తమ వ్యాసంలో భావించారు.

మహాభారతం- ధర్మాద్వైతస్థితి ప్రతిపాదన

[మార్చు]

ధర్మాద్వైతాలంటే కర్మజ్ఞానాలు. ధర్మం అంటే కర్మ. అద్వైతం అంటే జ్ఞానం. ధర్మాద్వైతస్థితి అంటే కర్మజ్ఞానాల యొక్క కలిమి.గీతలో కృష్ణుడు లోకేస్మిన్ ద్వివిధానిష్ఠా..అనేశ్లోకంలో కర్మజ్ఞానాలందలి నిష్ఠనే తాను ఏర్పరిచానని చెప్పాడు.వేదం కూడా పూర్వోత్తర కాండల్లో కర్మజ్ఞానాలతో కూడుకొని ఉంది.కర్మజ్ఞానాలను ప్రతిపాదించినది. కాబట్టె భారతం పంచమవేదం అయినది.ధర్మాద్వైతస్థితి అనే సమస్తపదంలో ధర్మ+ అద్వైత+స్థితి అనే మూడు పదాలున్నాయి.ధర్మం అంటే వేదవిహిత కర్మం. అద్వైతం అంటే భేదరహిత జ్ఞానం. ధర్మాద్వైతస్థితి అంటే వేదంలోని కర్మకాండచే తెల్పబడిన ధర్మస్థితిలోనూ, జ్ఞానకాండ చే ప్రతిపాదించిన జ్ఞానస్థితితోనూ వ్యాసభగవానుడు భారతాన్ని రచించినాడు.

రెండు ధర్మాలు విప్రతిపన్నాలు అయినపుడు అందులో ఏది పరమధర్మమో దాన్నే అనుసరించాలి.అప్పుడు రెండవ ధర్మానికి ఉపహతి కలిగించినా ఆచరించింది ధర్మమే అవుతుంది.ఈ విధంగా స్వార్ధాన్ని కుటుంబం కోసం, కుటుంబాన్ని దేశంకోసం, దేశాన్ని విశ్వమానవ శ్రేయస్సుకోసం త్యజించాలి. ధర్మానికీ, అధర్మానికీ వైరుధ్యం ఏర్పడినప్పుడు ధర్మాన్నే స్వీకరించాలి. రెండూ అధర్మాలే అయినప్పుడు రెండూ విడిచిపెట్టదగినవే. రెండూ ధర్మాలయినప్పుడు, సంఘర్షణ వచ్చినప్పుడు విప్రతిపన్న ధర్మాలకూ, ధర్మ వికల్పాలకూ సమంవయం కల్పించి పరమ ధర్మాన్ని నిర్వహించి ధర్మాద్వైతస్థితిని నిరూపించేది మహాభారతం.

"వేదాలకూ, అఖిలస్మృతి వాదాలకూ" అన్న తిక్కనగారి పద్యాన్ని ఆధారంగా చేసుకొని భారతంలో ధర్మాద్వైతస్థితిని సమకూర్చాడు వ్యాసుడు. సాధుకుడు ప్రాధమికావస్థలో ఉన్నప్పుడు మాత్రమే అతడికి క్రొత్తగా గోచరమైన ధర్మం పాతధర్మాన్ని కొట్టివేస్తుంది.కాని సాధకుడు ఆస్థితిని దాటిన తర్వాత కొత్తగా దర్సనం ఇచ్చిన ధర్మాలు, సిద్ధాంతాలు పాత ధర్మాలను కొట్టివేయవు.వాటిపై క్రొత్త వెలుగును ప్రవర్తింపజేస్తాయి.అప్పుడు సమన్వయం ఏర్పడి ధర్మాద్వైతస్థితి అబ్బుతుంది. జీవితంలో అన్ని ధర్మాలకు స్థానం ఉంటుంది.వాటి పరస్పర సంఘర్షణలకు మాత్రం తావు ఉండదు. ఈస్థితినే భారతం ప్రతిపాదిస్తుంది.బ్రహ్మచర్యమే జీవిత ధ్యేయంగా భావించి అనుష్ఠిస్తున్న జరాత్కరుడికి చెట్టుకు వ్రేలాడుతున్న పితృదేవతలు కనబడి మొరపెట్టుకోవడంతో అతడి మనస్సులో క్రొత్త వెలుగు కనబడి అతడు గృహస్థాశ్రం స్వీకరించడానికి అంగీకరిస్తాడు.అంటే బ్రహ్మచర్యం తప్పనిగాని గృహస్థాశ్రమం మంచిదనిగానీ అతడికి అనిపించలేదు.జీవితంలో వీటిస్థానాలు అతనికి బోధపడ్డాయి.ఇక్కడ ఒక ధర్మం మరొక ధర్మాన్ని కొట్టివేయడం లేదు. క్రొత్త వెలుగును ప్రసరింపజేసింది.ఆ వెలుగులో రెండు ధర్మాలూ పరమధర్మంతో అద్వైతస్థితిని అనుభవిస్తున్నాయి. భారతం ప్రతిపాదిస్తున్న ధర్మాద్వైతస్థితి ఇటువంటిదే.

వ్యాసుడు ధర్మాద్వైతస్థితిలో నిలిచి ధర్మాద్వైతస్థితితో కూడిన భారతాన్ని లేఖ్యమైన అమ్నాయంగా రచించాడు. దాన్ని అనువదింపగోరిన తిక్కనగారికి కూడా ధర్మాద్వైతస్థితి అనుగ్రహించబడింది. భారతం మనస్సుపెట్టి చదివిన వారికి వ్యాసుడు వివరించినస్థితీ, తిక్కన గారు పొందిన స్థితీ అయిన ధర్మాద్వైతస్థితి తప్పక కనిపిస్తుంది.

మూలాలు

[మార్చు]
  • 1987 భారతి మాసపత్రిక-వ్యాసము:ధర్మాద్వైతస్థితి-అభిప్రాయపరిశీలనా సిద్ధాంత ప్రతిపాదన-వ్యాసకర్త: డా: మోపిదేవి కృష్ణస్వామి.