ధ్యానాంజనేయస్వామి ఆలయం, కర్మన్‌ఘాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధ్యానాంజనేయస్వామి ఆలయం, కర్మన్‌ఘాట్

స్వయంభువుగా వెల్సిన శ్రీ ధ్యానాంజనేయస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం కర్మన్‌ఘాట్‌లో ఉంది.
హైదరాబాదు నగర పరిధిలోకి వచ్చే ఈ ఆలయం రంగారెడ్డిజిల్లాలోని ప్రాచీన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయ సముదాయంలో ఆంజనేయస్వామి ఆలయంతో పాటు పలు దేవతలకు సంబంధించిన ఆలయాలు కొలువై ఉన్నాయి. పౌర్ణమి రోజున భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

ఆలయ చరిత్ర

[మార్చు]

పూర్వం ఈ ప్రాంతం లక్ష్మీపురం పేరుతో పిలువబడుతూ అరణ్యంగా ఉండేది. కాకతీయ ప్రతాపరుద్రుడు ఒకరోజు వేటలో భాగంగా ఈ అరణ్యానికి రాగా పులి గాండ్రింపు వినిపించింది. ప్రతాపరుద్రుడు శబ్దం వస్తున్న దిక్కునే వెళ్ళిననూ కొంత సమయం తర్వాత గాండ్రింపు శబ్దం ఆగిపోయింది. ఎంత వెదికినా పులి కూడా కనిపించలేదు. అలసిపోయిన చక్రవర్తి ఒక చెట్టు కిందుగా విశ్రమించగా "శ్రీరాం" అనే తారకమంత్రం వినిపించింది. రామశబ్దం వస్తున్న చోటులో వెదకగా ఆంజనేయస్వామి విగ్రహం లభించింది. అదేరోజు రాత్రి కలలో ఆంజనేయుడు ప్రత్యక్షమై విగ్రహం ఉన్నచోట ఆలయం నిర్మించమని ఉపదేశించినట్లు, ప్రతాపరుద్రుడు ఆ కార్యాన్ని పూర్తిచేసినట్లు క్షేత్రచరిత్ర వివరిస్తుంది.