ధ్వజ స్తంభం

వికీపీడియా నుండి
(ధ్వజస్తంభము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఇది తిరుపతి దగ్గర వున్న శ్రీనివాస మంగాపురంలో వున్న శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వున్న ద్వజ స్తంభం

ధ్వజ స్తంభం హిందూ దేవాలయాలలో ఒక భాగం. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తరువాత దైవదర్శనం చేసుకోవటం ఆచారం.ధ్వజ స్తంభం దగ్గర కొట్టే గంటను బలి అంటారు. ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి. వీటి ఆధారంగా, ఏ గుడినో, పల్లెనో చేరుకొని ప్రజలు అక్కడ తలదాచుకొనేవారు. ఇప్పుడా అవసరం లేకపోయినా కార్తీకమాసములో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశదీపం వెలిగించి మహాదాత మయూరధ్వజుని గౌరవిస్తున్నారు.ఇంటి ముందు ఎవరైనా అడ్డంగా నిలబడితే, ఏమిటలా ధ్వజస్తంభంలా నిల్చున్నావు అంటుంటారు.కానీ ఆలయమనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు.ఆలయ ప్రాకారాలు చేతులవంటివి. నిత్యహారతులు జరిగే దేవాలయాలలో షోడశోపచార పూజావిధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి.దీపారాధనలు, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి.దేవాలయాలలో నిర్మలమైన వాతావరణం, భగవద్ద్యానం వంటివి మానసిక ప్రశాంతత కలిగిస్తాయి.ఆలయంలో మూలవిరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం.ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది. లేకపోతే అవి మందిరాలు అవుతాయి. పూర్తయిన విగ్రహాన్ని కొంతకాలం ధాన్యంలో దాచుతారు. దానిని ధాన్యాధివాసం అంటారు. అలా కొన్నాళ్లు గడిచాక తీసి నీళ్లలో దాచుతారు. దానిని జలాధివాసం అంటారు.

తయారీ విధానం

[మార్చు]
ఇది అప్పలాయగుంట గ్రామంలో వున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం ప్రధాన గోపురం

మూల విరాట్టు దృష్టికోణానికి ఎదురుగా దేవాలయాలలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. బాగా చేవ కలిగిన కొన్ని రకాలైన వృక్షశాఖలను మాత్రమే ధ్వజస్తంభానికి ఉపయోగిస్తారు.వీటిని ప్రతిష్ఠ చేసే ముందు ఈ దారువు (చెక్క) ను కూడా నీళ్లలో, ధాన్యంలో ఉంచి ఆ తరువాత ప్రతిష్ఠ చేస్తారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్ఠతో సమానమే. మూలవిరాట్టుకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. మూల విరాట్టు గర్భాలయంలో ఉంటే ధ్వజస్తంభం దేవాలయానికి ముందు భాగంలో బయట ఉంటుంది. ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూలవిరాట్టును చూడకూడదు. ధ్వజస్తంభం లేని దేవాలయాలకు స్వాములు, సన్యాసులు దేవాలయ గుర్తింపు ఇవ్వరు. ధ్వజస్తంభానికి జీవధ్వజం అని మరో పేరు ఉంది. దీనిని దారు బేరం అని కూడా అంటారు. విగ్రహాల అనుష్ఠాన, అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది. అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు, శక్తి కూడా లభిస్తుంది. ధ్వజస్తంభానికి కూడా బలిహరణాలు, అర్చనలు జరుగుతుంటాయి. పలాస - మోదుగ, అశ్వత్థ - రావి, బిల్వ - మారేడు, బంధూకం - వేగిస, పనస - పనస, వకుళ - బొగడ, అర్జున - మద్ది, నారవేప,

ధ్వజస్తంభాల కోసం ప్రత్యేకం

[మార్చు]

సోమిద వృక్షాలను ధ్వజస్తంభాల కోసం ఉపయోగించినట్లయితే అవి కొన్ని సంవత్సరాల పాటు బలంగా ఉంటాయి. పాడైపోయినవి, ఛిద్రమైనవి, వేరే పనుల కోసం వినియోగించే వృక్షాలను దీనికి వాడకూడదు. ధ్వజస్తంభం పొడవు విమాన చక్రం అంత ఎత్తు ఉన్నది మాత్రమే తీసుకురావాలి. ధ్వజస్తంభానికి కింద కూర్మయంత్రం వేయాలి. వైష్ణవాలయాలలో పైన పతాకంలాగ మూడు వరసల్లో జెండా ఎగురుతున్నట్టు ఉంటుంది. ఇలా మూడు బద్దలుగా ఉన్న భాగాన్నిమేఖల అంటారు. దానికి చిరుగంటలు ఉండి చిరుగాలికి సవ్వడి చేస్తుంటాయి. ధ్వజస్తంభం నిడివి 12 అంగుళాల నుంచి 24 అంగుళాల వరకు ఉండచ్చు. చెక్కతో తయారుచేసిన ఈ ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు వేస్తారు. కొన్ని కొన్ని దేవాలయాలో వెండితో, బంగారంతో కూడా తొడుగు చేయిస్తారు. ఈ తొడుగును మేఖలకు కూడా వేస్తారు. మేఖల కింద సుదర్శన చక్రం (వైష్ణవాలయాలలో), నందీశ్వరుడు (శివాలయాలలో) ఉంటాయి. గుడిలో భగవంతునికి చేసే నైవేద్యాలు ధ్వజస్తంభానికి కూడా జరుగుతాయి. ఎందుకంటే వీటి స్థాయి మూల విరాట్టుతో సమానం.దేవాలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి చేయాలి. అప్పుడే ప్రదక్షిణలు పూర్తయినట్టు. దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి సాష్టాంగ ప్రణామం చేయాలి. ఎందుకంటే ఇది కూడా స్వామి రూపమే. లోపలుండే మూలవిరాట్టుకు ఉత్సవమూర్తి ఎలాగో ఇది కూడా అటువంటిదే. దారురూపంగా దీన్ని భావించాలి. మూలవిరాట్టుకు ఇచ్చే మర్యాద, గౌరవం మన్నన ధ్వజస్తంభానికి కూడా ఇవ్వాలి. నమస్కార ప్రదక్షిణాలు పూర్తిచేసిన తరువాతే భగవద్దర్శనం కోసం లోపలికి ప్రవేశించాలి. ధ్వజస్తంభం జీవితకాలం పూర్తయిన తరువాత మళ్లీ కొత్త దానిని ప్రతిష్ఠిస్తారు. ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు ధ్వజారోహణం చేస్తారు. అంటే జయపతాకను కట్టి పై దాకా ఎగురవేస్తారు. పతాకం చూడగానే దూరాన ఉన్నవారు కూడా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయనే విషయాన్ని తెలుసుకుంటారు. ఉత్సవాలు అయిపోగానే పతాకాన్ని దింపుతారు. దానినే ధ్వజావనతం అంటారు. వైష్ణవాలయాల్లో ఈ జెండా మీద గరుత్మంతుని చిహ్నం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నం, అమ్మవారి దేవాలయాల్లో సింహ చిహ్నం ఉంటాయి. కొన్ని దేవాలయాలలో రాతిధ్వజస్తంభాలు కూడా ఉన్నాయి. గోపుర కలశం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమం, కలశంతో సమానంగా ఉంటే మధ్యమం, కలశం కంటే తక్కువ ఎత్తులో ఉంటే అధమం . ధ్వజస్తంభానికి కింద ఉండే పీఠానికి నాలుగు వైపులా దేవతలను ప్రతిష్ఠిస్తారు. పక్కనే బలిపీఠం పెడతారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం పూజ చేస్తారు. వైష్ణవాలయాలలో మూలవిరాట్టుకు ఎదురుగా గరుత్మంతుడు, శివాలయాలలో వీరభద్రుడు, రామాలయాలలో హనుమంతుడు విగ్రహాలు ఉంటాయి.

మయూరధ్వజుని కథ

[మార్చు]
మంగళగిరి ఆలయంలోని ద్వజస్తంభం

భారత యుద్ధానంతరం సింహాసనాన్ని అధిష్టించిన ధర్మరాజు అధర్మానికి తావులేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. ధర్మమూర్తిగా, ఎదురులేని దాతగా కీర్తి పతాకం అందుకోవాలనే కాంక్షతో ఎడతెరిపి లేకుండా దానధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. ఇది గమనిస్తున్న కృష్ణుడు అతనికి తగు గుణపాఠం నేర్పాలనుకున్నాడు. ధర్మరాజుకి అశ్వమేధ యాగం చేసి, శత్రురాజులను జయించి, దేవ బ్రాహ్మణులను సంతుష్టుల్ని చేసి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేసుకొమ్మని సలహా ఇస్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వమును నకుల సహదేవులు సైన్యంతో యాగశ్వరక్షకులై బయలుదేరాలు. ఆ యాగాశ్వం చివరికి మణిపుర రాజ్యం చేరింది. ఆ రాజ్యాన్ని మయూర ధ్వజుడు పాలించేవాడు. ఆయన మహా పరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచాడు. మయూరధ్వజుని కుమారుడైన తామ్ర ధ్వజుడు పాండవుల యాగాశ్వమును బంధించాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములు ఓడిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా బయలుదేరగా కృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజున్ని జయించేందుకు ఒక కపటోపాయాన్ని చెబుతాడు. దాని మేరకు శ్రీకృష్ణుడు, ధర్మరాజులిద్దరూ వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరారు. వారిని చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకోమని అన్నాడు. అందుకు శ్రీకృష్ణుడు, తమ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారున్ని పట్టుకుంది. బాలుని విడిచిపట్టవలసిందని పార్థించగా అందుకా సింహము మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజ్యాధిపతి మయూరధ్వజుని శరీరంలో సగభాగం నాకు ఆహారంగా ఇప్పించమని కోరింది. ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరమున సగభాగం దానమిచ్చి బాలుని కాపాడమని కోరుకుంటారు. వారి మాటలు విని అందుకు అంగీకరించిన మీదట కృష్ణుడు తమ భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వాలనే నియమాన్ని కూడా విధించాడు. అందుకు తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు రావటం గమనించిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అన్నాడు. అందుకు మహత్మా తమరు పొరపాటుపడ్డారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది; ఆ భాగ్యం నాకు కలుగలేదు కదా అని ఎడమ కన్ను మిగుల బాధపడుతోంది అంటూ వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపమును చూపి ఏదేని వరం కోరుకోమన్నాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందుఉండేటట్లు దీవించండి" అని కోరుకోగా. అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు పలికాడు. మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందునూ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు విధిగా ప్రతిష్ఠించడం ఆచారమయింది.[1][2]

దేవాలయ కొన్ని నిబంధనలు

[మార్చు]

హిందు మతం ప్రకారము దేవాలయముకు కొన్నినిబందనలు ఉన్నాయి. అందులో కొన్ని, గర్బాలయం: ప్రధాన దేవతా విగ్రహం వుంటుంది. అంతరాళం: ఇది గర్బగుడి ముందున్న ప్రదేశం. ద్వజస్తంభం: ఇది ప్రధాన ఆలయం ఎదురుగా ఉంటుంది.ఇది ఒక స్తంభం. దీనిని కర్రతోగాని, రాయితోగాని, లోహముతోతో గాని తయారు చేసి నిలబెడతారు. గోపురం: ఇది ఆలయానికి ప్రధాన ద్వారం ఇది ఎత్తైన గోపురంతో గాని, లేదా సాధారణంగా గాని వుంటుంది. ఇవి ప్రధానమైన ఆలయ లక్షణాలు.

మూలాలు

[మార్చు]
  1. Manasa, Laxmi (2016-05-11). "మయూర ధ్వజుని పరోపకారం | Story of Mayura Dhvaja in Telugu". Hari Ome (in ఇంగ్లీష్). Retrieved 2023-07-31.
  2. Sanjaypatel2010, ~ (2010-06-19). "Mayurdhwaj – A Great Daanveer". Karna The Great (in ఇంగ్లీష్). Retrieved 2023-07-31. {{cite web}}: |first= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)

యితర లింకులు

[మార్చు]