నండూరి బంగారయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నండూరి బంగారయ్య
జననం1903
చెయ్యేరు, తూర్పు గోదావరి జిల్లా.
మరణం1970
వృత్తిన్యాయవాది, రచయిత

నండూరి బంగారయ్య (1903-1970) సుప్రసిద్ధ సాహిత్య విమర్శకులు, నాటకకర్త, న్యాయవాది.

వీరు తూర్పు గోదావరి జిల్లా చెయ్యేరు గ్రామంలో 1903 నవంబరు 20 తేదీన జన్మించారు.

వీరు న్యాయశాస్త్రంలో పట్టభద్రులై రాజమండ్రిలో ప్రాక్టీసు ప్రారంభించారు. పత్రికలలో సాహిత్య విమర్శక వ్యాసాలు రాస్తూ పలువురు సాహితీవేత్తల దృష్టిని ఆకర్షించారు. పానుగంటివారి నాటకాల మిద, కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం మీద వీరు రచించిన విమర్శలు విద్వాంసుల మన్ననలందుకున్నాయి. నాటకకర్తగా వీరు రాజ్యలక్ష్మి (1928), ఆంధ్ర తేజము (1938) వంటి నాటకాలు రచించారు. ఇందు రాజ్యలక్షి నాటకం ఒక నూతన ప్రయోగం. ఆంధ్ర నాటకరంగ సంస్మరణం దీనిలోని ఇతివృత్తం. నాటకాలలో స్త్రీపాత్రలు స్త్రీలే ధరించాలని దీనిలో ప్రతిపాదించబడింది. వీరు ' వాగరి ' అనే కలం పేరుతో కొన్ని వ్యాసాలు రాశారు. తెలుగా ? ఆంధ్రమా ? అని వీరు రాసిన వ్యాసం వాగరి కలంపేరుతో ప్రచురించబడింది. మొత్తంగా బంగారయ్య సుమారు 40 వరకు సాహితీ విమర్శక వ్యాసాలను రాసి 1922-1956 మధ్య వివిధ పత్రికలలో ప్రకటించారు. వీరు సమాశ్వాస గీతిక వంటి కొన్ని గేయాలను కూడా రచించారు.

వీరు 1970 దశకంలో పరమపదించారు.

రాజ్యలక్ష్మి

[మార్చు]

ఇది నండూరి బంగారయ్య రచించిన తొలి నాటకం. నాట్యం, నాటక కళల ఔన్నత్యమును నిరూపించుట ఈ నాటకం ముఖ్యోద్దేశం. కనుపర్తి వరలక్ష్మమ్మ రచించిన "ఒట్టు" కథ చదవగా ఇందులోని కొంత భాగం స్ఫురించిందని కవి స్వయంగా చెప్పుకున్నారు.[1] ఇందులోని హిందీ పాటను కొమండూరి గోవిందరాజాచార్యులు రచించారు. నాటకకర్త నాటకాలలో స్త్రీపాత్రలను స్త్రీలే పోషించాలని ప్రతిపాదించారు.

శాకుంతల విమర్శనము

[మార్చు]

అభిజ్ఞాన శాకుంతలము మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకములన్నిటిలోనూ అత్యంత ప్రాచుర్యము నొందిన నాటకము. ఇందు ఏడు అంకములు గలవు. శాకుంతలము ఒక గొప్ప శృంగారభరిత నాటకము. ఈ నాటకాన్ని చదివి జర్మన్ మహాకవి గేథే ఆనందతాండవం చేశాడని ప్రతీతి. శాకుంతలానికి భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం ఉంది. ఫ్రెంచి సంగీతవేత్త ఎర్నెస్ట్ రేయర్ శాకొంతల పేరుతో బ్యాలే రచించగా ఇటాలియన్ ఫ్రాంకో ఆల్ఫనో "లా లెగ్గెండా డి శకుంతల" (శకుంతల చరిత్రము) అనే ఒపేరాను తయారుచేశారు. హంగేరియన్ కంపోజర్ కార్ల్ గోల్డ్‌మార్క్, నార్వేజియన్ సంగీతకారుడు అమెతిస్టియమ్ గీతాలు రచించారు. అంత విఖ్యాత నాటకంలోని విశేషాలు తెలిసేలా గ్రంథకర్త ఈ విమర్శన గ్రంథం రాశారు.[2]

మూలాలు

[మార్చు]
  • బంగారయ్య, నండూరి, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీలు: 370-1.