నడాదూరు రంగ రామానుజాచార్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నడాదూరు రంగ రామానుజాచార్య(జననం 1896 ప్రాంతం-మరణం 1949 ప్రాంతం) ఇరవయ్యవ శతాబ్ది పూర్వభాగంలో కొంతకాలం నెల్లూరు మూలపేటలో, తర్వాత రంగనాయకులపేటలో నివాసం ఉంటూ, వేదసంస్కృత పాఠశాలలో కొంతకాలం సంస్కృతం బోధించిన మహాపండితులు. ఈయన అనేక శాస్త్రాలు అధ్యయనం చేసిన గొప్ప విద్వాంసులని, తర్కం, వ్యాకరాణం మొదలయిన నాలుగు శాస్త్రాలలో పండితులని పేరుతెచ్చుకున్నారు.

వీరి పూర్వీకులు కాశ్మీరంలోని శ్రీనగర్ ప్రాంతంలో నడాదూర్ గ్రామ వాసులనీ, ముస్లింల బాధలు భరించలేక 600 సంవత్సరాల క్రితం పాండిచ్చేరి సమీపంలోని కొందమూరు గ్రామంలో స్థిరపడ్డారని, ఒక కథ కుటుంబంలో తరతరాలుగా ప్రచారంలో ఉంది. అప్పటినుంచి ఈ అగ్రహారమే వీరి సొంత ఊరు. రంగ రామానుజాచార్యులు వడగలై తెగకు చెందిన వైష్ణవులు, మాతృభాష తమిళం, వీరి తాత నరసింహాచారి, తండ్రి రంగనాథాచారి, తల్లి లక్ష్మి, కొందమూరులో ఇంటి వద్దనే పాఠశాల నిర్వహించారు, వీరి తాతగారు కొందమూరులో ఆదినారాయణస్వామి దేవాలయం కట్టించారు.

తిరుపతిలో చదువులు

శ్రీ రంగ రామానుజాచార్యులవారు తిరుపతిలో బావాజీమఠం సమీపంలోని పాఠశాలలో చదివారు, తిరుచానూరు కోయియారంస్వామి వద్ద వేదాంతవిద్య అభ్యసించారు. తిరుపతి నుండి తిరుచానూరుకు ప్రతిరోజూ పాదరక్షలు లేకుండా నడిచేవారు, భూమాతపై గౌరవంతో జీవితాంతం ఆయన నియమంగా పాదరక్షలు ధరించలేదు. తిరుపతిలో మాధ్వ పండితులు సేతుమాధవాచార్యులు వీరి గురువులు. రంగ రామానుజాచార్యులు కొంతకాలం నెల్లూరు రంగనాయకులపేటలో, కొన్నేళ్ళు మూలపేట సంస్కృతపాఠశాల ఆవరణలో నివాసం ఉండి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. కృష్ణమూర్తి ఘనాపాఠి ఇక్కడ సహ అధ్యాపకులు. 1947లో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ రచనాసంఘం ఏర్పడినపుడు, ఆ సభ్యుల సందేహాలు తీర్చి, వివరించడానికి భారత ప్రభుత్వం ఒక పండిత వర్గాన్ని నియమించింది. అందులో నడాదూరు రంగ రామానుజాచార్య పేరు కూడా ఉంది. దురదృష్టవశాత్తు, ఆ సమాచారం అందే సమయానికి కొద్దిరోజుల ముందే ఆయన చనిపోయారు. అట్లాగే మద్రాసు విశ్వవిద్యాలయం పరీక్షకులుగా నియమించి గౌరవించి, సంస్కృత పరీక్షలకు ప్రశ్నాపత్రాలు తయారుచేసే బాధ్యత అప్పగించింది. ఆ బాధ్యత చేపట్టకముందే, జలోదర (కాలేయ) వ్యాధితో 54వ ఏట మరణించారు. వీరి ధర్మపత్ని పద్మాసని 94 సంవత్సరాలు జీవించారు.

జస్టిస్ పార్టీ నాయకులు ఓమాండూరు రామస్వామిరెడ్డి కుటుంబానికి రంగ రామానుజాచార్యులు ఆధ్యాత్మిక గురువులు. నెల్లూరు శ్రీ రేబాల పట్టాభిరామరెడ్డిగారి నివాసంలో వీరు కొంతకాలం శ్రీవాల్మీకి రామాయణం ప్రవచనం చేశారు. మహాభాష్యానికి వ్యాఖ్యానం రాయడానికి పూనుకున్నారు గాని, అది నెరవేరలేదు.

ఆచార్యులు తమ సంపాదనలో చాలాభాగం పుస్తకాలు కొనడానికే ఖర్చుచేసేవారు, వారింట్లో మూడు పెద్ద బీరువాల నిండుగా పుస్తకాలుండేవి. library లోని పుస్తకాలు ఆయర్వేదంలో ఆయన ఆసక్తిని సూచిస్తాయి. వీరి మనుమలు గోపాలాచారి తనకు ఈ గ్రంథాలు చాలా ఉపయోగపడ్డాయని అన్నారు.

ఆచార్యులవారు ఎంత నిష్ఠాపరులయినా, స్మార్తులు, శైవులనే భేదభావం లేకుండా చక్కగా మైత్రి కొనసాగించారు. వారికి నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు, కుమారుడు చెన్నైలో స్థిరపడ్డారు,ఇతనికి ఇద్దరు పుత్రులు, ఒక పుత్రిక.

మైసూరు రాజాస్థానం రంగ రామానుజాచార్యులు పాండిత్యాన్ని గౌరవించి ”మైసూర్ విద్వాన్” పట్టా, బిరుదు ఇచ్చింది, రాజమండ్రి గౌతమీవిద్యాపీఠం వారు ఘనసన్మానం చేశారు. కామకోటి పరమాచార్యులు వీరికి ఆత్మీయమిత్రులు. నెల్లూరులో కాళిదాసు వెంకటసుబ్బాశాస్త్రి, పుష్పగిరి వెంకట కృష్ణయ్య, గాజులపల్లి హనుమచ్చాస్త్రి, కృష్ణమూర్తి ఘనాపాఠి వంటి గొప్ప పండితులు ఈయన సన్నిహిత మిత్రులు.

54వ ఏట, జలోదర వ్యాధి(కాలేయవ్యాధి) తో ఆచార్యులవారు మరణించారు, ఆయన ధర్మపత్ని పద్మాసని పరిపూర్ణ జీవితంగడిపి, 94వ ఏట పోయారు.‌

రచనలు:

  1. మంజూషా వ్యాఖ్య
  2. పంచకావ్య వ్యాఖ్యలు
  3. ఆగమమీమాంసా
  4. ధాతుపాఠ కారికలు
  5. పూర్వమీమాంసా పరామర్శ
  6. గీతాభాష్యం పరామర్శము

వీరి అల్లుడు పి.ఎం.కృష్ణస్వామి నెల్లూరు వేద సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా, మనుమడు పి.గోపాలాచార్యులు నెల్లూరు వి.ఆర్.కళాశాలలో చరిత్ర ఉపన్యాసకులుగా పనిచేశారు.

మూలాలు

[మార్చు]

1. విక్రమ సింహపురి మండల సర్వస్వం, సంపాదకులు: ఎన్.ఎస్.కృష్ణమూర్తి, నెల్లూరు జిల్లాపరిషద్ ప్రచురణ, 1964, తృతీయ ఖండం లోని ఉడాలి సుబ్బారామశాస్త్రి వ్యాసం "నెల్లూరు మండల సంస్కృత విద్యా పరిచయము" pp 133-140 2.రంగ రామానుజాచార్య మనుమలు పి.గోపాలాచార్య తెలియజేసిన వివరాలు.