Jump to content

నత్తి

వికీపీడియా నుండి

నత్తి అనగా అసంకల్పిత పునరుక్తుల ద్వారా ప్రసంగ ప్రవహమునకు విఘాతం కలిగించే ప్రసంగ లోపం, దీనిలో శబ్దాలు, పదాంశాలు, పదాలు లేదా పదబంధాల యొక్క పొడిగింపు అలాగే అసంకల్పిత నిశ్శబ్ద అంతరాయాలు లేదా నిరోధాలు ఉంటాయి, అందువలన నత్తి ఉన్న వ్యక్తి ధ్వనులను స్పష్టంగా పలకడం సాధ్యం కాదు. ఎవరైనా మాట్లాడేటప్పుడు మాటలు తడబడటం లేదా ముద్ద ముద్దగా మాట్లాడటం, కొన్ని అక్షరాలు సరిగా పలక లేకపోవడం జరుగుతుంటుంది, ఈ విధంగా తరచుగా జరుగుతున్నట్లయితే వారికి నత్తి ఉందని అర్థం.

నత్తి ఎందుకు వస్తుంది

[మార్చు]

మనం మాట్లాడేటప్పుడు అక్షరాలు ఒకదాని తరువాత మరోటి నిర్దిష్ట సమయంలో ఉచ్చరించడం వలన ఇతరులకు ఆ ధ్వనులు స్పష్టంగా వినిపిస్తాయి. ఊపిరితిత్తుల నుండి బయటకు వచ్చేగాలి, స్వరపేటికలోని స్వరతంత్రుల ప్రకంపనలతో స్వరంగా మారి బయటకు వచ్చునప్పుడు నాలుక పలు విధాలుగా కదిలించడం వలన అనేక శబ్దాలు ఉచ్చరించగలుగుతాము. ఈ ప్రక్రియ మొత్తం మెదడు పర్యవేక్షణలో అతివేగంగా జరుగుతూ కొన్ని సెకండ్ల వ్యవధిలోనే పూర్తవుతుంటుంది. అయితే ఈ ప్రక్రియలో ఒక్కోసారి కొన్ని అసమానతలు తలెత్తి స్వరతంత్రులు సరైన సమయానికి తెరచుకోకపోవడం, నాలుక నిర్దిష్ట సమయంలో కదలకపోవడం లేదా నాలుక ఒకే చోట ఎక్కువ సేపు ఉండిపోవడం వలన శబ్దాలు, పదాలు, వాక్యాలు ఆగి ఆగి రావడం లేదా అవే ధ్వనులు మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంది.

నత్తి ఏ వయస్సులో వస్తుంది

[మార్చు]

చాలామందిలో నత్తి సమస్య చిన్న వయస్సులోనే మొదలవుతుంది. చాలా అరుదుగా కొద్దిమందిలో మాత్రం మెదడుకు సంబంధించిన జబ్బుల వల్ల మధ్యలో కూడా రావచ్చు. ఈ సమస్య అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువగా వస్తుంది.

నత్తిని తగ్గించుటకు

[మార్చు]

నత్తిగా మాట్లాడేవారిని ఎగతాళి చేయకూడదు, ఎందుకంటే ఇతరులు ఎగతాళి చేసిన కొద్దీ వారి సమస్య మరింత పెరగగలదు. నత్తి అనేది రోగం కాదు, వీరిలో శారీరకంగా ఎటువంటి సమస్యలూ ఉండవు అందువలన మందులు శస్త్ర చికిత్సల వలన ఇది నయం కాదు, కాని వారిలో మానసిక ఒత్తిడిని, భయాన్ని తగ్గించే ప్రత్యేక చికిత్సా విధానం ద్వారా నత్తిని నయం చేయవచ్చు. ఈ ప్రత్యేక చికిత్సా విధానంలో మాట్లాడే క్రమంలో స్వరతంత్రులు, నాలుక, పెదవుల కదలికలు, గాలి సరఫరాలోని అసమానతలు సరిచేయడం, వాటిని సమన్వయంతో పని చేయించగలడం జరుగుతుంది, తద్వారా నత్తి ఉన్నవారు మామూలుగా మాట్లాడగలుగుతారు.

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • సాక్షి దినపత్రిక - 22-10-2014 (నత్తి ఎందుకు వస్తుంది?)
"https://te.wikipedia.org/w/index.php?title=నత్తి&oldid=3274932" నుండి వెలికితీశారు