నారాయణ సన్యాల్ (మావోయిస్టు నేత)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నారాయణ సన్యాల్

నారాయణ సన్యాల్ భారతదేశంలో నక్సలైట్‌ ఉద్యమాన్ని ప్రారంభించిన తొలితరం నాయకుల్లో ఒకరు. ఆయన మావోయిస్టు పార్టీ అధిపతి గణపతి తరువాత, ఆ స్థాయి దళపతి.

జీవిత విశేషాలు[మార్చు]

అవిభక్త బెంగాల్‌లోని బోగ్రా గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో జన్మించిన నారాయణ సన్యాల్‌, ఉద్యమ కాలంలో అనేకమంది ఆసాములను హత్యచేసిన ఘటనల్లో పాల్గొన్నారు. 1940లో ఆయన కుటుంబం కోల్‌కతాలో స్థిరపడింది. తండ్రి ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు. సరోజినీదేవి సహా ఎందరో కాంగ్రెస్‌ ప్రముఖులతో ఆయనకు దగ్గర సంబంధాలున్నాయి. అందరు బెంగాలీ యువకుల్లాగే ఫుట్‌బాల్‌ క్రీడని ఇష్టపడిన సన్యాల్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కోల్‌కతా శాఖలో ఉద్యోగం చేశారు. 1967లో చారు మజూందర్‌ పిలుపుతో వసంత మేఘ గర్జనగా పిలిచే, నక్సలైట్‌ ఉద్యమం మొదలుకావడంతోనే.. ఉద్యోగాన్ని వదిలి సన్యాల్‌ ఉద్యమంలోకి వచ్చారు. బిహార్‌లో సత్యనారాయణ సింగ్‌తో కలిసి సీపీఐ (ఎం-ఎల్‌) పార్టీలో పనిచేశారు. [1]

ఉద్యమ జీవితం[మార్చు]

బీహార్‌ కేంద్రంగా తాను నాయకత్వం వహిస్తున్న పార్టీ యూనిటీని ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా పనిచేస్తున్న పీపుల్స్‌వార్‌లో 1998లో సన్యాల్‌ విలీనం చేశారు. బిహార్‌లో బలపడిన మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ (ఎంసీసీ), దండకారణ్యంలో నిలదొక్కుకున్న పీపుల్స్‌వార్‌ కలిసి.. 2004లో మావోయిస్టు పార్టీగా అవతరించడంలో కీలక భూమిక సన్యాల్‌దే. అప్పటి పీపుల్స్‌వార్‌ తరఫున ఎంసీసీతో విలీన చర్చలు జరిపిన బృందానికి సన్యాల్‌ నాయకత్వం వహించారు. నిజానికి, అప్పటికి ఎంసీసీ, పీపుల్స్‌వార్‌ మధ్య సంకుల సమరం సాగుతుండేది. బిహార్‌పై పట్టుకోసం ఇరు పార్టీలూ పరస్పర హత్యలు, అపహరణలకు పాల్పడుతుండేది. ఈ పరిస్థితిని మార్చి, ఎంసీసీని చర్చలకు ఒప్పించి, విలీనం దాకా నడిపించింది సన్యాలేనని చెబుతారు. ఈ విలీనఠింతో ఏర్పడిన మావోయిస్టు పార్టీలో పొలిట్‌బ్యూరోకు ఎన్నికయి, 2005లో అరెస్టు అయ్యేదాకా కొనసాగారు.

నారాయణ సన్యాల్‌ అలియాస్‌ ఎన్‌ ప్రసాద్‌ అలియాస్‌ విజయ్‌ పేరిట ఆంధ్రప్రదేశ్‌ కమిటీల్లో పనిచేశారు. ఈ క్రమంలో 2005 జనవరి మూడో తేదీన ఖమ్మం జిల్లా భద్రాచలం వెళ్లారు. ఆర్టీసీ బస్టాండ్‌లో సన్యాల్‌ బస్సు కోసం ఎదురుచూస్తుండగా, పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీ్‌సగఢ్‌లోని రాయపూర్‌లో అరెస్టు చూపించి, జైలుకు పంపించారు. అరెస్టు సమయంలో ఆయన నుంచి ఎంఎం పిస్టల్‌ స్వాధీనం చేసుకొన్నారు. చాలాకాలం వరంగల్‌ సెంట్రల్‌ జైలులో సన్యాల్‌ గడిపారు. నిజానికి, యాభై ఏళ్ల ఉద్యమ జీవితంలో సన్యాల్‌ చాలాసార్లు పోలీసులకు దొరికారు.[2]

మరణం[మార్చు]

కేన్సర్‌ సహా అనేక రుగ్మతలతో, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 17 2017 న కోల్‌కతాలో కన్నుమూశారు. [3]

మూలాలు[మార్చు]

  1. Top Maoist leader Narayan Sanyal passes away - Suvojit Bagchi
  2. మూగబోయిన వసంత మేఘ గర్జన
  3. "మావో అగ్రనేత నారాయణ సన్యాల్ మృతి". Archived from the original on 2017-04-25. Retrieved 2017-05-03.