నింగలెన్నె కమ్యూనిస్టాకి
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
నింగలెన్నె కమ్యూనిస్టాకి (నన్ను కమ్యూనిస్టుగా మార్చావు) అనే నాటకం కేరళ సమాజంలో ప్రకంపనలు సృష్టించింది. ఆనాటి సమాజంలో భూస్వాముల పెత్తనానికి, దోపిడికి వ్యతిరేకంగా పోరాడండి అనే సందేశంతో రూపొందించిన ఈ నాటకం ప్రజలను ఉద్యమంలోకి దింపింది. భూస్వామ్య దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలను కదనానికి కదలించింది.
తొప్పిలి భాసి రచించిన ఈ నాటకాన్ని కేరళ పీపుల్స్ ఆర్ట్ క్లబ్ (కె.పి.ఎ.సి.) 1952 డిసెంబరు 6 తేదీన తలశేరి పట్టణంలో సుదర్శన్ హాల్లో ప్రపథమంగా ప్రదర్శించింది. అప్పటివరకూ తమిళనాడుకు చెందిన నాటక సమాజాలు పౌరాణిక నాటకాలను కేరళలో ప్రదర్శిస్తుండేవి. జనార్దన్ కురూప్, ఎన్.రాజగోపాలన్ నాయక్, కె.ఎస్.రాజామణి, ఒఎన్‌వి శివరాజన్ తదితరులు తొప్పిలి భాసి రచించిన నాటకాన్ని సమాజంలో జరుగుతున్న భూస్వామ్య దోపిడికీ, దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచడానికి సాధనంగా వినయోగించుకోనాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల ప్రదర్శనలు నిర్వహించారు.
నాటక సారాంశం
[మార్చు]ఒక భూస్వామి కొడుకు కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితుడై, పార్టీ ఆశయాలకు అనుగుణంగా పని చేయడం ప్రారంభిస్తాడు. భూస్వామి అయిన తండ్రిని ఎదురించి పోరాటం చేస్తాడు. భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా వ్యవసాయ కూలీలను సమీకరిస్తాడు. ఉద్యమాలు నిర్వహిస్తాడు. ఈ నాటకం చివరిలో కథా నాయకుడి తండ్రి (భూస్వామి) భూస్వామ్య విధానం మారాలన్న తన కుమారుని ఆశయాన్ని అంగీకరిస్తాడు. 'నన్నూ కమ్యూనిస్టుగా మార్చావు. నాకు ఎర్రజెండా ఇవ్వు...' అని కొడుకుతో అనడంతో నాటకం ముగుస్తుంది.
ఫలితాలు
[మార్చు]ఈ నాటకం కేరళ ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. వారి ఆలోచనలపై ఎంతో ప్రభావం చూపింది. భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో వేలాదిమంది ఆకర్షితం కావటానికి ఎంతో దోహద పడింది. 1952లో కేరళలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రావడానికి ఈ నాటకం కూడా దోహదపడిందని అప్పట్లో పత్రికలు వ్యాఖ్యానించాయి. దీనిని బట్టి అర్థం చేసుకోవొచ్చు : మలయాళ సమాజంపై ఈ నాటకం ఎంతటి ప్రభావాన్ని చూపిందో..!
60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2012 డిసెంబరు 6న ఈ నాటకాన్ని తొలి ప్రదర్శన జరిగిన హాల్లోనే ప్రదర్శించటం చాలా ఉత్తేజం కలిగించింది.
కళ కళకోసం కాదు, ప్రజల కోసం ... అన్న సూక్తిని అనుసరించి, కళల ద్వారా ప్రజలను చైతన్య పరచి, వారిని ఉద్యమాల్లోకి తీసుకురావటానికి కమ్యూనిస్టు పార్టీలు ప్రజా కళల ద్వారా కృషి చేస్తూనే ఉన్నాయి. ఈ కృషి మరింత ఉధృతంగా జరగాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. స్వాతంత్య్రానంతరం ప్రజల సొమ్ముతో, సోషలిస్టు రష్యా సహకారంతో నిర్మించిన అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నేడు క్రమంగా ప్రైవేటు పరం చేస్తున్న వైనం మనం చూస్తూనే ఉన్నాం. భూమి, ఖనిజాలు వంటి సహజ సంపదలను బడా పెట్టుబడిదారులకు అప్పనంగా ధారాదత్తం చేస్తున్నారు నేటి పాలకులు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దండుకుంటున్నారు. ఇదంతా కప్పిపుచ్చడానికి ప్రజలను యాచకులుగా మారుస్తున్నారు. భూ సంస్కరణలు అమలు చేస్తామని, ప్రకృతి వనరుల ఫలితాలను ప్రజలకు అందిస్తామని; ప్రజలందరికీ కూడు, గూడు, గుడ్డ వంటి మౌలిక అవసరాలు సమకూరుస్తామని వాగ్దానం చేసిన పాలకులు వాటన్నింటినీ తుంగలో తొక్కి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. విద్య, వైద్యం ప్రాథమిక అవసరాలు ప్రజలకు అందకుండా చేసి, రూపాయికి కిలో బియ్యం, ఉచితంగా ల్యాప్‌టాప్‌లు వంటి ఆకర్షక పథకాలతో ఓట్ల పంట పండించుకోవాలని తహతహలాడుతున్నారు.