పక్షవాతం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
పక్షవాతం నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. శరీరములోని వివిధ అవయవాలు ప్రయత్నపూర్వక చలనాలను కోల్పోయే రుగ్మతను 'పక్షవాతము' (Paralysis) అంటారు. శరీరం బిగుసుకుపోవడం, మూతి వంకర తిరిగి పోవడం, కాళ్లు చేతులు మెలితిరిగి పోవడం, గుండె కూడా పనిచేయకపోవడం ఇలా శరీరంలో ప్రతి అవయవంపై పక్షవాతప్రభావం ఉంటుంది. ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి వారి జీవిత కాలంలో పక్షవాతం వస్తోంది. ప్రతి ఆరు సెకెండ్లకు ఒకరు పక్షవాతంతో మృతి చెందుతున్నారు. మన దేశంలోనూ ఈ వ్యాధి వల్ల రోజుకు రెండు వేల మంది చనిపోతున్నారు. కేవలం 10 శాతం మందికే పక్షవాతంపై అవగాహన ఉంది. దీని వల్ల సగానికి పైగా తమ పని కూడా చేసుకోలేనంతగా అంగవైకల్యానికి గురవుతున్నారు. పక్షవాతంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 29న వరల్డ్ స్ట్రోక్ డేను నిర్వహిస్తున్నారు. గతంలో ఈ వ్యాధి వృద్ధుల్లోనే కనిపించేది. ప్రస్తుతం పక్షవాతం కేసుల్లో 25 నుంచి 30 శాతం వరకు చిన్నవయసు వారుంటున్నారు. అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి, ధూమపానం, మద్యపానం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, ఊబకాయం ఉన్నవారికి పక్షవాతం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కళ్ళు తిరగటం, తాత్కాలికంగా దృష్టి మందగించడం, లేదా రెండుగా కనిపించడం, కాళ్ళూ, చేతులు ఉన్నట్లుండి బలహీనంగా అవడం, మాటల్లో తడబాటు వంటివన్నీ పక్షవాతానికి ముందస్తు సంకేతాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే కనీసం గంటలోపు స్ట్రోక్ యూనిట్ సౌకర్యం ఉన్న వైద్యశాలకు తీసుకురాగలిగితే వారికి త్రాంబోలైటిక్ థెరపీ ద్వారా రక్తప్రసరణ పునరుద్ధరించి, మెదడు ఎక్కువగా దెబ్బతినకుండా కాపాడవచ్చు. అయితే దురదృష్టవశాత్తు ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడం వల్ల 10 శాతం మంది కూడా గంటలోపు ఆసుపత్రికి రావడం లేదు. కొన్ని వ్యాధుల్లో లక్షణాలు ముందే బయటపడతాయి. వాటిని గుర్తించి త్వరగా చికిత్స తీసుకోగలిగితే నష్టాన్ని నివారించడానికి సాధ్యమవుతుంది. అలాంటి సమస్యల్లో ముఖ్యమైనది పక్షవాతం (స్ట్రోక్). పక్షవాతానికి సంబంధించిన లక్షణాలు కనిపించినపుడు మొదటి మూడుగంటల్లో ఆసుపత్రికి చేరుకోగలిగితే మెదడుకు నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు.
లక్షణాలు
[మార్చు]మెదడుకు రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడినపుడు కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఈ లక్షణాల సమూహాన్ని కలిపి స్ట్రోక్ అని పిలుస్తారు. మెదడులోని రక్తనాళాల్లో క్లాట్ ఏర్పడటం మూలంగా రక్తసరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. రక్తసరఫరా తగ్గడమే కారణం స్ట్రోక్ వచ్చిన వారిలో మెదడుకు రక్తం సరఫరా తగ్గడం వల్ల సమస్య ఉత్పన్నమవుతుంది. రక్తం సరఫరా తగ్గడం వల్ల మెదడుకు ఆక్సిజన్ అందదు. ఫలితంగా మెదడు నుంచి సంకేతాలు అందక కొన్ని అవయవాలు పనిచేయడం మానేస్తాయి.
- తిమ్మిర్లు రావడం, ఒక కాలు, చేతిలో శక్తి తక్కువ అయినట్లు అనిపించడం, శరీరంలో ఒకవైపు ఈ లక్షణాలు కనిపించడం జరుగుతుంది.
- మాట్లాడలేకపోతారు. ఇతరులు చెప్పింది అర్థం చేసుకోలేకపోతారు. చూపు మసకబారుతుంది. నడవాలని లేచినపుడు బ్యాలెన్స్ తప్పినట్టు అవుతుంది. తీవ్రమైన తలనొప్పి మొదలవుతుంది.
- 45 ఏళ్లు పైబడిన వారిలో రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. 55 ఏళ్లు పైబడిన స్త్రీలలో రిస్క్ మరింత ఎక్కువ.
ఎవరిలో రిస్క్ ఎక్కువ
[మార్చు]- కుటుంబ చరిత్ర : తల్లిదండ్రులు, అన్నాచెల్లెళ్లు, తాతయ్య, నానమ్మలో ఎవరైనా స్ట్రోక్ బారినపడినట్లయితే పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువే ఉంటాయి. ఒకవేళ తండ్రి లేక అన్న 55 ఏళ్లు పైబడకముందే, తల్లి లేక చెల్లె 65 ఏళ్లు పైబడక ముందే హార్ట్ఎటాక్ బారినపడినట్లయితే పిల్లలకు రిస్క్ ఎక్కువే ఉంటుంది.
- రక్తపోటు : రక్తపోటు 140/90 కన్నా ఎక్కువున్నా, రక్తపోటు ఎక్కువ ఉందని వైద్యులు ధ్రువీకరించినా రిస్క్ పెరిగినట్లే.
- ధూమపానం : పొగతాగే అలవాటు ఉన్నా జాగ్రత్తపడాల్సిందే.
- మధుమేహము : ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 ఎమ్‌జీ/డీఎల్ ఉంటే స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతున్నట్లే.
- కొలెస్ట్రాల్ : కొలెస్ట్రాల్ స్థాయి 240 ఎమ్‌జీ/డీఎల్ ఉన్నా, మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) 40 ఎమ్‌జీ/డీఎల్ కంటే తక్కువ ఉన్నా ముప్పు ఉన్నట్లే.
- శారీరక వ్యాయామం : రోజూ కనీసం అరగంటపాటు వ్యాయామం చేయకపోయినట్లయితే స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది.
- అధిక బరువు : ఎత్తుకు తగిన బరువు కన్నా 10 కేజీలు అదనంగా ఉన్నా రిస్క్ ఉంటుంది.
- ఆరోగ్య చరిత్ర : గతంలో ఒకసారి స్ట్రోక్, ట్రాన్సియెంట్ ఇష్కెమిక్ అటాక్ వచ్చింది. కాలి రక్తనాళాలకు సంబంధించిన జబ్బు ఉంది. ఎర్రరక్తకణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సికిల్ సెల్ ఎనీమియా ఉంది. ఒకసారి హార్ట్ఎటాక్ వచ్చింది. ఇలాంటి మెడికల్ హిస్టరీ ఉన్నవారిలో స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జీవనవిధానంలో మార్పులు చేసుకోవాలి.
ముఖపక్షవాతం
[మార్చు]ముఖ కండరాలకు సరఫరా చేసే ఏడవ క్రేనియల్ నాడీకి వచ్చే సమస్యలు (ఇన్‌ఫ్లమేషన్) వల్ల మూతి వంకరపోతుంది. ఈ సమస్యనే వైద్య పరిభాషలో బెల్స్ పాల్సి అంటారు. చలికాలంలో రాత్రులు బస్సులో ప్రయాణిస్తుంటే కిటిక పక్కన కూర్చున్న వారి చెవిలోకి చలిగాలిపోయి నరంపై ఒత్తిడి తగిలి బెల్స్ పాల్సి వచ్చే అవకాశం ఉంది. 'హెర్పస్ జోస్టర్ వైరస్' ఇన్‌ఫెక్షన్ కొన్ని సందర్భాల్లో సమస్యగా మారొచ్చు.బెల్స్ పాల్సి (ముఖ పక్షవాతం) కి గురైన వారిలో ముఖంలో ఒకవైపు కండరాలు చచ్చు బడిపోతాయి. చెవి దగ్గర కొద్దిగా నొప్పి ఉంటుంది. పెదవుల చుట్టూ తిమ్మిర్లు, కళ్లు ఎండిపోయినట్లు వుండొచ్చు. నాలుక పక్కకు ఉంటుంది. కన్ను మూయలేక పోవడం వల్ల దుమ్ముపడి 'కెరిటైటిస్' అనే సమస్య వచ్చి కళ్ల వెంట నీరు కారుతుంది. కుడివైపు ముఖ పక్షవాతం వచ్చినవారు నవ్వినప్పుడు మూతి ఎడమవైపునకు లాగినట్లు వంకరపోయి కనిపిస్తుంది. బెలూన్ ఊదలేకపోవడం, నోటి నుంచి చొంగ కారడం, దవడలో ఆహారం ఉంచుకోలేకపోవడం జరుగుతాయి. మాటలో మార్పు కనిపిస్తుంది. నుదురుమీద ముడతలు ఏర్పడవు. ఈలవేయలేరు. పెదవుల్లో కదలికలు మందగిస్తాయి.
మెదడులో సునామీ
[మార్చు]పక్షవాతం వచ్చినప్పుడు ప్రతి సెకనుకు 32 వేల నాడీ కణాలు చనిపోతాయి. ఆ లెక్కన నిమిషానికి 19 లక్షల నాడీ కణాలు చనిపోతాయి. అదే నిమిషం సమయంలో నాడీకణాల -న్యూరాన్లు- మధ్య జరిగే 14 వందల భావ ప్రసారాలు నిలిచిపోతాయి. అంతే సమయంలో మైలినేటెడ్ ఫైబర్స్ ద్వారా 7.5 మైళ్ల దూరం ప్రయాణించాల్సిన ఆలోచనలను మెదడు నష్టపోతుంది.మెదడుకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో రక్తపు గడ్డలు అడ్డుపడి, మెదడుకు రక్త ప్రసారం తగ్గిపోవడమే పక్షవాతానికి మూలం.పక్షవాతంతో మెదడుకు తీవ్ర నష్టం కలిగే అవకాశం నాడీకణాలు మరణించే సంఖ్యపైనే ఆధారపడి ఉండుంది. అందుకే పక్షవాతం లక్షణాలు కనబడిన వెంటనే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. ముఖ్యంగా పక్షవాతానికి గురైన మొదటి మూడు గంటల్లో రక్తపు గడ్డలను కరిగించే మాత్రలను వేసుకుంటే, దీనివల్ల అవయవాలు చచ్చుబడిపోవడం లాంటి నష్టాలు చాలావరకు తగ్గుతాయని వైద్యుల వివరిస్తున్నారు. శరీరంలోని ఏదైనా అవయవానికి ఇలా రక్తం సరఫరా చేసే నాళంలో అడ్డంకి ఏర్పడితే ఆ అవయవానికి సంబంధించి స్ట్రోక్ సంభవిస్తుంది. స్ట్రోక్స్‌లో గుండెపోటు, పక్షవాతం ముఖ్యమైనవి. తర్వాత ఊపిరితిత్తులు, కాళ్లలో ఇలాగే రక్తం గడ్డకట్టే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటోంది. ఇలా ఒంట్లో ఎక్కడ స్ట్రోక్ వచ్చినా ఆస్పిరిన్ మాత్ర వేసుకోవాలట. ఛాతీలో గుండెనొప్పి వచ్చినప్పుడు ఆస్ప్రిన్ మాత్ర వేసుకుంటే మరణాన్ని తప్పించుకోగలిగినట్లే పక్షవాతం వచ్చిన సందర్భాల్లో కూడా ఆస్ప్రిన్ మాత్ర చప్పరిస్తే తాత్కాలిక ఫలితాలు ఉంటాయి.
కారణాలు
[మార్చు]పక్షవాతానికి ముఖ్యమైన కారణాలు:అధిక రక్తపోటు, మెదడుకు రక్తసరఫరాలో అంతరాయం, పోలియో వంటి వైరస్ సంబంధిత రోగాలు, ప్రమాదాలు, వెన్నెముకలలోని కొన్ని లోపాలు, కొన్ని రకాల విష పదార్ధాలు.నిత్యం గర్భ నిరోధక మాత్రలు వాడే మహిళలు, యువతుల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు రెండు రెట్లు అధికమట.
వైద్యం
[మార్చు]దీనికి పనిచేసే మందులు: క్షీరబల తైలం, హెపారిన్. న్యూరాలజి చికిత్సతోపాటు ఫిజియోథెరపీ చికిత్స . న్యూరోమస్కులార్ ఎలక్ట్రికల్ స్టిములేషన్‌తో పనిచేయని కండరాల్లోని శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు. కండరాలను ఉత్తేజపరచడానికి థెరప్యూటిక్ మసాజ్, మాన్యువల్ థెరపీ ముఖ కండరాలకు వ్యాయామం చేయిస్తారు. దీని వల్ల ముఖ కండరాల్లో శక్తి పెరుగుతుంది.
- రోగి శ్వాస తీసుకోవడం, రక్తపోటు ఎలా ఉంది పరీక్షించాలి.
- రక్తపోటు ఎక్కువగా ఉన్నట్లయితే తగ్గించాలి.
- ఆక్సిజన్ అవసరమైతే ఇవ్వాలి. ఈసీజీ, షుగర్ టెస్ట్ చేయించాలి. తరువాత సీటీ స్కాన్ చేయించాలి.
- సీటీ స్కాన్‌లో రక్తనాళం చిట్లినట్లయితే తెలిసిపోతుంది. బ్లీడింగ్ లేనట్లయితే రక్తం సరఫరా తగ్గడం వల్ల స్ట్రోక్ వచ్చిందని నిర్ధారణ చేసుకోవచ్చు. హైబీపీ ఉంటే నెమ్మదిగా తగ్గించాలి. అదే సమయంలో మెదడులో ఒత్తిడిని తగ్గించడానికి మందులు ఇవ్వాలి. షుగర్ ఉంటే నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి.
మెదడులో మైక్రోచిప్
[మార్చు]నిశ్చలనంగా పడిఉన్న పక్షవాతం రోగుల మదిలోభావాలను గ్రహించి తదనుగుణంగా నాడీవ్యవస్థను చైతన్యపరచే 'మైక్రోచిప్'ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు సెంటీమీటరు వెడల్పులో ఉండే ఈ పలుచని చిప్‌ను మెదడులో అమరుస్తారు. రోగి ఆలోచనను పసిగట్టే ఈ మైక్రోచిప్... ఆ సంకేతాలను అచేతన అవయవాల కదలికలుగా మార్చేస్తుంది.