పద్మిని మలయాళ చిత్రం
పద్మిని మలయాళ చిత్రం, తెలుగు డబ్బింగ్ కూడా ఒ.టి.టిలో అందుబాటులో ఉన్నాయి. కేరళలో యువతీయువకులకు వివాహ సంబంధాలు కుదరక,పెళ్ళిళ్ళ పేరయ్యలద్వారా సంబంధాలు నిశ్చయించుకోనే పరిస్థితి, కొన్నిసార్లు ఆ యువతులు ఆషాఢభూతుల బారినపడి, వివాహాలు విచ్ఛిన్నం అవడం, తల్లి తండ్రుల బలవంతంమీద తాళి కట్టించుకొని ప్రియుడితో పారిపోయే అమ్మాయిలు, విద్యాధికులు, విశ్వవిద్యాలయంలో ఆచార్యులు అయినా పెళ్ళచూపులకు వచ్చి, వధువు ఇంటివాస్తు బాగా లేదని, తనకు నచ్చని పద్మిని బ్రాండ్ కారు వధువు తాలూకు వారికి ఉండని, అమ్మాయిని చూడకుండానే వెళ్ళిపోయే మూఢనమ్మకాల పెళ్ళికొడుకులు…హాస్యరసం వెనక యువతీయువకుల జీవితాల్లో విషాదాలను ఈసినిమాలో దర్శకుడు హాస్యం చక్కెరపూత పూసి ప్రదర్శిస్తారు.
కథానాయకుడు రమేష్ ఆస్తిపరుడు, విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు, కవి. అతని తొలిపెళ్లి శోభనంరాత్రే పెటాకులవుతుంది. పెళ్ళికూతురు శోభనం గదిలోనుండి మాయమై ప్రియుడితో ఉడాయిస్తుంది. ఆ అమ్మాయి ప్రియుడితో పారిపోవడానికి పాత పద్మిని కారు వాడింది కనుక ఆవూళ్ళో అతని విఫల వివాహాన్ని అందరూ 'పద్మిని' పేరుతో వ్యంగ్యంగా, హాస్యంగా చెప్తూ ఉంటారు. రమేష్ కి పద్మిని అనే మాట వినపడితేచాలు కంపరం, తనమీద అదుపుతప్పి పిచ్చిగా ప్రవర్తిస్తాడు. పద్మిని పదమే అతనికి ఒక ఫోబియాగా తయారవుతుంది. పెళ్ళంటే వైముఖ్యం. పద్మిని అనే కారు పేరును రమేష్ ను అపహాస్యం చేయడానికి ప్రతివారు వాడుతారు. కాలేజీలో తుంటరి విద్యార్థులు గోడలమీద పద్మిని అని రాసి అవమానపరుస్తారు. పద్మిని అనేమాట వింటేనే అతనికి గంగవెర్రెక్కిపోయి, అతనిలో ఆత్మన్యూనతాభావం పాతుకొనిపోతుంది. పరిచయస్థుల ఓదార్పు మాటలు మరింత బాధిస్తాయి.
రెండేళ్ళ విరామం తర్వాత మళ్లీ రమేష్ అయిష్టంగానే పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడతాడు.
32 సంవత్సరాల లాయర్ సంబంధం. పెళ్లి చూపులకు వెళ్ళి అమ్మాయి ఇంటి ముందున్న పద్మిని కారు చూచి వెలవరపోయి, ఆ యింటి వాస్తుకు వంకలుపెట్టి, కాబోయే వధువు శ్రీదేవిని పరిహసించి వెళ్ళిపోతాడు. ఆమె కూడా ఆత్మాభిమానంతో అతడణ్ణి చెడామడా చీవాట్లు పెట్టింది. ఆమె ప్రాక్టీసులేని న్యాయవాది, వయసు పైబడుతున్న తనకు పెళ్ళయితేనే గాని చెల్లి పెళ్లి కాదు.
కాలేజీలో గణితశాస్త్రం బోధించే యువతి పద్మినితో రమేష్ పెళ్లి కుదురుతుంది. అప్పటికి అతని 'పద్మిని' ఫోబియా కూడా కాస్త సద్దుకొంటుంది. పద్మిని తండ్రి కూడా రమేష్ హోదాకు తగిన పోలీసు అధికారి.
తీరా ముహూర్తం పెట్టుకొనే ముందు రమేష్ అధికారికంగా మొదటి భార్యతో విడాకులు తీసుకోవాలంటారు ఆడపెళ్లివాళ్ళు. అతను యాదృచ్ఛికంగా మొదట వాస్తు వంకపెట్టి వెనక్కి వచ్చిన యువతి శ్రీదేవి-లాయరుకే విడాకులు కేసు అప్పగించాల్సి వస్తుంది, ఆమెకూ అదే తొలికేసు. కోర్టు దృశ్యాలు చాలా హాస్యంగా, రమేష్ కు బాధాకరంగా సాగుతాయి. కాబోయే భార్య కుటుంబం కూడా కేసు విచారణ చూడడానికి కోర్టుకు హాజరవుతారు. ఆలస్యం జరిగే కొద్దీ వాళ్ళ వేదన అధికమవుతుంది. చివరకు మొదటి భార్యను కోర్టులో హాజరుపరిస్తే అన్యోన్య అంగీకారంతో విడాకులు మంజూరు చేస్తానంటాడు మేజిస్ట్రేట్.
తప్పనిసరై రమేష్, అతని న్యాయవాది శ్రీదేవి రహస్యంగా మద్రాసు ప్రయాణమవుతారు. అప్పటికే ఆ న్యాయవాది శ్రీదేవికి ఒక పరుపుల కంపెనీ యజమానితో పెళ్ళి నిశ్చయం అయివుంటుంది. అతను తన కాబోయే భార్య ఎవరికి చెప్పకుండా మద్రాసు ఎందుకు వెళ్ళిందో అని, మద్రాసులో ఆమెవెళ్ళినచోటికి వెళ్ళి తన కాబోయే భార్య-అడ్వకేటు, రమేష్ ఏకాంతంగా ఉండడం చూసి ఆమెమీద అపవాదులు వేస్తాడు. ఆమె, రమేష్, రమేష్ తొలి భార్యను విడాకులకు వప్పించడానికే వెళ్ళారని తెలుస్తుంది.
రమేష్ తొలి భార్యదొక విషాధగాధ. వెనకాముందూ ఆలోచించకుండా శోభనం గదినుంచి ప్రియుడితో పారిపోయి, ఆ మోసగాడిచేతిలో తన్నులు తింటూ బ్రతుకు వెళ్ళిపోస్తూ ఉంటుంది. వాడు మళ్ళీ మరొక యువతిని బురిడీ కొట్టించి పెళ్ళాడే ప్రయత్నంలో ఉంటాడు. ఆ సమయంలో రమేష్, అతని న్యాయవాది శ్రీదేవి ఆమెను కాపాడి వెంటతీసుకొని పోతారు.
రమేష్ తొలి భార్య మళ్ళీ రమేష్ అవకాశం ఇస్తే అతనితో ఉండాలని అనుకొంటోంది కాని రమేష్ సందివ్వడు. కోర్టులో సమయానికి ఆమె మెజిస్ట్రేట్ ముందు హాజరు కాకపోవడంతో విడాకులకేసు వాయిదా పడుతుంది. రమేష్ కు కాబోయే భార్య కుటుంబం ఈ సంబంధం రద్దు చేసుకొని, అతణ్ణి అవమానించి వెళ్ళి పోతుంది.
ఈ క్రమంలో రమేష్, అతని మహిళా న్యాయవాది శ్రీదేవి మధ్య అవగాహన పెరిగి, ప్రణయంగా మారి, ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని పద్మిని కార్లో హనీమూన్ బయలుదేరుతున్నట్లు చూపడంతో కథ ముగుస్తుంది.
రమేష్, అతని కుటుంబం హృదయం లేని సమాజంలో అనేక పరిహాసాలకు గురికావడం, యువతులు తమకు పెళ్ళికాదని అభద్రతా భావంతో జీవించడం విషాదం, రమేష్ పెళ్ళికూతురును లేపుకొని పోయిన దగుల్బాజీ చివరన మరొక యువతిని చేసుకొని మోసగించకుండా రమేష్, అతని న్యాయవాది శ్రీదేవి కాపాడుతారు. ఆ మోసగాడు లేవదీసుకొని పోయిన యువతిని ఏలుకొనేట్లు బుద్ధి చెబుతారు. దగుల్బాజీ పెళ్లి కొడుకుతో తన వివాహం తప్పినా, ఆ వధువు ఇంకా నన్నెవరు చేసుకొంటారు అని ఆక్రోశించడం బీభత్సరసానికి పరాకాష్ఠ. భారతీయ సమాజంలో కన్యలకు పెళ్లి అతిముఖ్యమనే భావన ఎంతగా నాటుకొని పోయిందో ఈ సినిమా సూచిస్తుంది.
సినిమా బీభత్సరస ప్రధానంగా సాగుతూ, తరచూ కన్యాశుల్కం నాటకంలో పాత్రలను గుర్తుకు తెస్తూ ఉంటుంది. హాస్యం వెనుక మానవజీవితంలో విషాదం తరచూ తొంగి చూస్తుంది.