పియా కా ఘర్
పియా కా గఢ్ Piya Ka Ghar | |
---|---|
దర్శకత్వం | బసు చటర్జీ |
రచన | బాసు చటర్జీ (సంభాషణలు), వసంత్ పి. కాలే (కథ) |
నిర్మాత | తారాచంద్ బర్జాత్యా, కమల్ కుమార్ బర్జాత్యా, రాజ్ కుమార్ బర్జాత్యా; రాజశ్రీ ప్రొడక్షన్స్ |
తారాగణం | జయ భాదురీ, అనిల్ ధవన్, పెయింటల్ |
ఛాయాగ్రహణం | కె. కె. మహాజన్ |
సంగీతం | లక్ష్మీకాంత్ ప్యారేలాల్ |
విడుదల తేదీ | 1972 |
సినిమా నిడివి | దాదాపుగా. 135 నిమిషాలు |
దేశం | భారత దేశం |
భాష | హిందీ |
పియా కా గఢ్ (హిందీ: पिया का घर, ఉర్దూ: پیا کا گھر, అనువాదం: నా ప్రియమైన ఇల్లు) 1972 నాటి హిందీ కామెడీ సినిమా. ఈ సినిమా 1970ల నాటి బొంబాయి నగరం నేపథ్యంగా సాగుతుంది. నగర జీవనం, సంసారం, మధ్యతరగతి జీవితం వంటి థీమ్స్ నేపథ్యంలో సాగుతుంది. రాజా ఠాకూర్ తీసిన మరాఠీ సినిమా ముంబై చా జావైకి రీమేక్. 1970ల్లో బొంబాయి నగరంలో సామాన్య గృహస్తుల జీవితంలో అనుభవించే ఇబ్బందులు హాస్యరీతిలో చూపించే సినిమా ఇది.
పల్లెటూరులో విశాలమైన ప్రదేశంలో జీవించిన మాలతికి వివాహమై బొంబాయి నగరంలోని ఓ ఇరుకు ఇంట్లో జీవించాల్సివస్తుంది. సరైన దాపులేని ప్రదేశం కావడంతో భర్తకు చేరువకాకుండా దూరంగానే ఉండిపోతుంది. వారిద్దరికీ ఏకాంతం కల్పించాలని చేసిన ప్రయత్నాలన్నీ వమ్ము అవుతాయి. చివరకి పల్లెటూరు పెద్దమనిషి అయిన ఆమె పెదనాన్నకి విషయం తెలసి తీసుకెళ్ళబోతాడు. మాలతి మీది అభిమానంతో ఇంట్లోవాళ్ళంతా తమ కొద్దిపాటి ప్రదేశాన్నీ త్యాగం చేయడం, చుట్టుపక్కల వారూ తమ ప్రయత్నం తాము చేయడం చూసిన మాలతి వారి ప్రేమకి లొంగి ఉండిపోతుంది. ఆమె చివరకి పట్నవాసం పిల్ల కావడం ముగింపు.
బొంబాయిలో స్థలాభావం వల్ల మధ్యతరగతి వారు ఆరేడుగురు కలిసి ఒకే గదిలో సర్దుకుని జీవించే చాల్స్ పుట్టుకువచ్చాయి. భార్యాభర్తల మధ్య ఏకాంతానికి కూడా సావకాశం లేని నగర జీవన విషాదాన్ని హాస్యంగా మలిచారు. నగరీకరణ, స్థలాభావం, మధ్యతరగతి జీవితం వంటివి ఇతివృత్తానికి ప్రధానమైన థీమ్స్.
ఇతివృత్తం
[మార్చు]పల్లెటూరులో విశాలమైన ఇంట్లో పెరిగిన అమ్మాయి మాలతి (జయా బాదురీ) కి పెళ్ళిళ్ళ పేరయ్య బొంబాయి సంబంధం తీసుకువస్తాడు. ఆ పెళ్ళికొడుకు రామ్ (అనిల్ ధావన్) బొంబాయిలో బహుళ అంతస్తుల పాత భవనంలో చిన్న ఇంట్లో నివసిస్తుంటాడు. ఐతే పెళ్ళి జరగాలన్న ఉద్దేశంతో వాళ్ళుండేది పెద్ద మేన్షన్లో అంటూ అబద్ధం చెప్తాడు పెళ్ళిళ్ళ పేరయ్య (ఉండేది పెద్ద భవంతిలో అయినా వారిది చిన్న ఇల్లు). పెళ్ళయ్యాకా ఇంటికి వచ్చి చూస్తే అత్తమామలు, తోడికోడలు బావగారూ, తనూ భర్త ఉండాల్సిన ఇల్లు చిన్నగా, ఇరుకుగా ఉండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది.
కుటుంబం మొత్తానికి 180 అడుగులున్న ఒకే గదిలో సర్దుకోవాల్సి రావడంతో, అట్టలతో గదిని విడదీసుకుని జీవిస్తూంటారు. వంటగదిలో వారికి కేటాయించిన స్థలాన్ని మరోవైపు అట్టముక్క అడ్డుగా పెట్టి తయారుచేస్తారు, దీనికి తోడు మరోవైపునున్న కిటికీ తెరుచుకునే ఉంటుంది. అట్టముక్కకి అవతలివైపు మాలతి బావగారూ, తోడికోడలికి కేటాయించిన చోటు (మరో అట్టముక్కతో దాన్ని తయారుచేశారు), గదికి వెలుపల అత్తామావలు, మరిది ఉంటారు. మాటలు, చేతలు అందరికీ వినిపిస్తూంటాయని, కనిపిస్తూంటాయని మాలతి భయం. మాలతి మాత్రం పెళ్ళై ఎన్ని రోజులైనా ఆ దాపులేని స్థలంలో భర్తను సమీపించడానికి సంకోచిస్తుంది. భర్త ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె మాత్రం దరిచేరదు. భర్తను బయటకి వెళ్ళి పడుకొమ్మంటుంది.
ఒకరోజు అనుకోకుండా అందరూ నాటకానికి వెళ్తారు, ఆమె సంబరపడగా ఈ సంగతి తెలియని భర్త ఆలస్యంగా వచ్చి అవకాశాన్ని జారవిడుస్తాడు. వీళ్ళ అవస్థ తెలుసుకున్న పెద్దలు మరోసారి కావాలనే సినిమాకి పరివారాన్ని అంతా వెంటబెట్టుకుని సినిమాకి వెళ్తారు. సినిమాకి అని వెళ్ళిన పెద్దలు కూడా జంటలు జంటలుగా ఏకాంతం కోసం విడిపోతారు. తల్లిదండ్రులు బీచ్ కి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటే, అన్నావదినలు లాడ్జికి వెళ్తారు. ఆ ఇరుకు ప్రదేశంలో అనుభవించలేని ఏకాంతం కోసం. ఐతే దురదృష్టవశాత్తూ ఇంట్లోని కొత్తజంట ఏకాంతాన్ని మాత్రం భగ్నం చేస్తూ అనుకోని అతిథులు దిగుతారు. అన్నయ్య రామ్ తో ఏదైనా హోటల్ లో రూం తీసుకుని, హాయిగా తిరిగిరా అని సలహా ఇస్తాడు. ఆ ప్రయత్నమూ పోలీసులు రావడంతో రసాభాస అయి, వికటిస్తుంది.
ఈ ఇబ్బందులన్నీ పల్లెటూరులోని మాలతి పెదనాన్నకు తెలుస్తుంది. ఇలాంటి చాల్ (కథానాయకుడి కుటుంబం ఉండే అపార్ట్ మెంట్స్ వంటిదాన్ని చాల్ అనేవారు బొంబాయిలో) లో ఉండాల్సిన ఖర్మ నా కూతురుకు పట్టలేదు, మా ఊరు తీసుకుపోతాను అని కోపంగా వస్తాడు. మాలతికి కూడా ఇరుకు ఇరుకు బతుకుతో విసిగొచ్చి వెళ్ళిపోయేందుకు తగ్గ మనస్థితిలో ఉంటుంది. తమను వదిలి ఆమె వెళ్ళిపోవడాన్ని అక్కడివారెవరూ అంగీకరించలేకపోతారు. ఆమె ఏకాంతం కోసం అత్తమామలు తీర్థయాత్రలకు బయల్దేరగా, తోడికోడలు-బావగారూ గది ఖాళీచేసి సామాన్లు సర్దుకుని వెళ్లిపోవడానికి సిద్ధపడతారు. చుట్టుపక్కల వారు కూడా తల తాకట్టైనా పెట్టి వారిద్దరికీ ఓ ఇల్లు చూసిపెడతామని పెద్దాయనకు మాట ఇస్తారు. తాను ఇందరి ప్రేమకు పాత్రురాలయ్యానని, ఇల్లు ఇరుకైనా వీరి మనసు విశాలమని గ్రహించిన ఆమె ఉండిపోతుంది. తన కోసం ఇన్ని వదులుకోవడానికి వీరు సిద్ధపడితే, తాను ఆ మాత్రం సర్దుకోలేనా అంటూ కలిసిపోతుంది. బొంబాయి నగర జీవితంలో భాగమైపోతుంది.[1]
థీమ్స్
[మార్చు]- నగర జీవితంలో నివాసం: బొంబాయి మహానగరం జనాభాకు అనుగుణంగా పరిణామంలో విస్తరించే వీలులేనిది కావడంతో 1950ల కల్లా నగరంలో జీవించేందుకు స్థలం పెద్ద సమస్య అయికూర్చుంది. ఈ నేపథ్యంలో పేదవాళ్ళతో మురికివాడలు తయారుకాగా, మధ్యతరగతి వాళ్ళకి చాల్స్ ఏర్పడ్డాయి. బ్రిటీష్ కాలంలో జైళ్ళుగా ఉన్నవాటిని కూడా తర్వాతికాలంలో చాల్స్ గా మార్చారని ప్రతీతి. ఒక్కో గదీ కనీసం ఆరేడుగురు ఉండే కుటుంబానికి నివాసంగా అద్దెకి ఇచ్చే చాల్స్ ఏర్పడ్డాయి.[1]
- మనుషుల నగరీకరణ: కథానాయిక బొంబాయిలోని ఇరుకిళ్ళలో సర్దుకోలేకపోవడానికి ఆమె పల్లెటూరులో విశాలమైన ఇంట్లో నివసించడమే కారణంగా చూపుతారు దర్శకుడు. అదే చాల్ లో జీవిస్తున్న వారికి పెద్దగా లేని సంకోచం కూడా ఆమెకు రావడానికి తను పల్లె నేపథ్యమే కారణం. ఆఖరుకు ఆమె నగరీకరణ చెందుతుంది, ఆ జీవితాన్నే ఇష్టంగా చేసుకుంటుంది. అందుకు సంకేతంగా మాలతి ప్రారంభంలో విమానం వెళ్తున్న శబ్దం వినిపించగానే పరుగెత్తుకెళ్ళి కిటికీలోంచి చూస్తుంది, సినిమా చివరి సన్నివేశంలో మాత్రం విమానం శబ్దం వినిపించినా చూడదు, భర్త గుర్తుచేసినా పట్టించుకోదు. బొంబాయి జీవితంలో బయటివారికి విడ్డూరంగా కనిపించే విచిత్రాలు ఆమెకు ఇక సామాన్యమని, ఆమె స్థానికురాలైపోయిందని చూపించారు దర్శకుడు.[1]
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పియా కా ఘర్
- MusicIndiaOnline page - includes first three songs and lyrics to "Ye Jeevan Hai"
- Piya Ka Ghar