పేరడైజ్ లాస్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Gustave Doré, Depiction of Satan, the antagonist of John Milton's Paradise Lost c. 1866

పరిశుద్ధ గ్రంథము (Holy Bible)లో పాతనిబంధన (Old Testament) ఆదికాండము (Genesis)లో ఉన్న ఆదాము (Adam), అవ్వ (Eve) ల చరిత్ర యొక్క అద్భుత కావ్య రూపమే పేరడైజ్ లాస్ట్ (Paradise Lost). ఇది ఇంగ్లండుకు చెందిన జాన్ మిల్టన్ (John Milton) చే వ్రాయబడినది. ఈ కావ్యము ఆంగ్ల సాహిత్యములో బహు ఖ్యాతినొందినది . పన్నెండు పుస్తకాలుగా విభజింపబడిన ఈ కావ్యములో సైతాను (Satan) మాయతో భార్యా భర్తలైన ఆదాము అవ్వలు దేవుడికి వ్యతిరేకంగా ఆజ్ఞాతిక్రమణ చేయడం, ఫలితంగా వారు ఏధేను వనము (Garden of Eden) నుండి బహిష్కరింపబడటం వంటి దృశ్యాలను జాన్ మిల్టన్ చక్కగా అభివర్ణించాడు.

రచయిత[మార్చు]

జాన్ మిల్టన్ (1608-1674)

సారాంశం[మార్చు]

సైతాను, అతని సైన్యం నరక లోకంలో ఉన్న అగ్నినదిలో పడివుంటారు. సైతాను ఒడ్డుకు చేరి అందరినీ పిలుస్తాడు. నదీ తీరంలో దుష్ట ఆత్మలన్నీ పెండిమోనియం (Pandemonium) అనే భవనాన్ని నిర్మించుకొంటాయి . భవనంలో చర్చ ముగిసిన తర్వాత పధకం ప్రకారం సాతాను తన కుమారులైన 'పాపం' (Sin), 'మరణం' (Death) లను తోడ్కొని విశ్వంలో ప్రయాణిస్తూ భూమిని కనుగొంటాడు.

భూమిని చేరుతున్న సాతానుని దేవుడు పసిగడతాడు. జరుగబోయేది గ్రహిస్తాడు. మనుష్యుడు కేవలం తన కృప వలన రక్షింపబడునని, ఆ మనుష్యుడు. తన బదులు ఎవరైనా బలియాగం అవ్వడంవల్ల రక్షింపబడునని భావిస్తాడు. దీన్ని అధికమించడానికి దేవుని కుమారుడే మనిషిగా జన్మ ఎత్తి మరణ శిక్ష పొందాలని నిర్ణయించుకొంటాడు. . దేవదూతలు హర్షిస్తారు. భూమిపై మనుష్యుని జాడ తెలియక సాతాను చెరబ్ (Cherub/రెక్కలు గల బాలుడు) రూపంలో ఏడుగురి దేవదూతల్లో ఒకరైన యురియల్ (Uriel) వద్దకు వెళ్ళి మనుష్యుని జాడ తెలుసుకుంటాడు.

మొదటిగా భూమియొక్క అందాలను తిలకించి మైమరచిపోతాడు, ఆదాము అవ్వల అందాలను చూచి ఆశ్చర్యపోతాడు . జ్ఞాన ఫలము (Fruit of Knowledge) ను తింటే చస్తారు అను దేవుని ఆజ్ఞ గూర్చి ఆదాము అవ్వలు మాట్లాడుకుంటుండగా సైతాను విని వెంటనే పధకాన్ని రూపొందించడం మొదలుపెడతాడు. చెరబ్ పై అనుమానం వచ్చి యురియల్ గబ్రియేలు (Gabriel) అను దూతను హెచ్చరించడానికి వెళతాడు. ఒక రాత్రి గబ్రియేలు సహాయకులైన ఇతురియేలు (Ithuriel), జెఫ్రాను (Zephron) ఒంటరిగా ఉన్న అవ్వ చెవిలో ఎదో చెబుతున్న సైతాను ను బంధించి గబ్రియేలు వద్దకు తీసుకొస్తారు. గబ్రియేలు దేవుడి సహాయంతో సైతానును భూమ్మీదనుండి గెంటివేస్తాడు.

జరిగిన దాని గురించి అవ్వ తన భర్త అయిన ఆదాముతో చెప్పగా, దేవుడు చెప్పినది విన్నంత కాలం ఏ కీడు జరగదని అభయమిస్తాడు. సైతాను వేస్తున్న ఎత్తుగడలను వివరించడానికి దేవుడు ఆదాము అవ్వల వద్దకు రాఫేలు (Raphael) అను దూతను పంపిస్తాడు. జరుగుతున్న తిరుగుబాటు గురించి అదాము అవ్వలకు రాఫేలు వివరిస్తాడు.

లూసిఫర్ (అలియాస్ సాతాను) దైవ కుమారుడి పట్ల అసూయగా ఉన్నందున తెలివైన మాటల ద్వారా సుమారు మూడవ వంతు దేవదూతలను ఉత్తర దిశలో తీసుకెళ్ళాడని, వారిలోనుండి అబిదియేలు (Abdiel) అను దేవదూత మాత్రమే దేవుడి వైపు తిరగడం జరిగిందని చెబుతాడు. సాతాను తన సైన్యంతో దేవుడిని ముట్టడించాడని, సైతాను మిఖాయేలు (Michael) దేవదూత చే ముక్కలు చేయబడ్డా చావలేదని, మొదటిరోజు యుద్ధం తర్వాత సైతాను సైన్యం ఫిరంగిని నిర్మించుకొన్నది. రెండవరోజున పాక్షికంగా విజయమొందారని, తరువాత దేవుడి సైన్యం కొండలను సాతాను సైన్యం మీదకు విసిరేయగా సాతాను సైన్యం ఆ కొండల క్రింద నాశనమైయ్యారని, దేవుడు తన కుమారుడిని రథం మీద పంపాడని, ఫలితంగా సాతాను సైన్యం నరకంలోకి త్రోసివేయబడిందని చెబుతాడు.

దేవుడు ఆరు రోజుల్లో సృష్టిని సృష్టించిన విధానాన్ని మిఖాయేలు అదాముకు వివరించి చెబుతాడు. ఆదాము గ్రహాల కదలికల గురించి ప్రశ్నలు అడుగగా, కొన్ని ప్రశ్నలు దేవుడి విజ్ఞానికే వదిలేయాలని చెబుతాడు. ఆదాము కూడా తాను సృష్టింపబడిన విధానం, ఏధేను వన పరిచయం, అవ్వ సృష్టింపబడిన విధానం వగైరా అన్నీ మిఖాయేలుకు వివరించి చెబుతాడు. అవ్వతో తాను సాగించే దాంపత్య జీవనంలో ఉన్న మాధుర్యాన్ని కూడా చెబుతాడు. అంతా విన్న తరువాత రాఫేలు ఆదాముకు సాతాను గురించి హెచ్చరించి అక్కడనుండి నిష్క్రమిస్తాడు.

ఎనిమిది రోజుల తర్వాత సాతాను మనుష్యుని మోసపుచ్చుట కొరకు ఏధేను వనానికి తిరిగివచ్చి నిషిధ ఫల వృక్షానికి చేరువలో ఉన్న జల ఊట వద్ద సర్ప అవతారమెత్తి వేచియుంటాడు. కలిసికట్టుగా ఉంటే సాతాను మోసపుచ్చలేడని ఆదాము తన భార్య అయిన అవ్వతో చెబుతాడు. ఆదాము మాటలను అవ్వ పురుషాధిక్య మాటలుగా భావిస్తుంది. భర్త అయిన అదాము ఆలోచనకు వ్యతిరేకంగా అవ్వ ఒంటరిగా తోట పని చేయడానికి దూరంగా వెళుతుంది. పురుషుని కంటే స్త్రీని ప్రలోభపెట్టడం తేలికగా భావించిన సాతాను అవ్వ వెనుకకు వస్తాడు. సాతాను తన తెలివైన లౌకిక మాటలతో అవ్వ నిషేధ ఫలాన్ని తినేలా చేసి అదృశ్యమైపోతాడు.

అవ్వకు లోక రీతిగా కళ్ళు తెరవబడతాయి. తాను సాయంత్రంలోగా ఇంటికి చేరతానని భర్త అయిన ఆదాముకు ఇచ్చిన మాటను గుర్తుచేసుకొంటుంది, సాతాను ప్రలోభంతో తాను చేసిన పాపానికి దేవుడు తనను శపిస్తాడని, ఆదాముకు వేరే స్త్రీని ప్రధానం చేస్తాడని, ఆదాముకు కూడా నిషేధ ఫలాన్ని ఇస్తే తనతో సమానమవుతాడని భావించి భర్త అయిన ఆదాము వద్దకు వెళుతుంది. తాను జ్ఞానాన్నిచ్చే ఫలాన్ని తిన్నానని అందువలన కళ్ళు తెరువబడ్డాయని అవ్వ కంగారుగా చెప్పడంతో ఆదాము విస్మయం చెందుతాడు. ఆదాము తన భార్య చేసిన ఆజ్ఞాతిక్రమ పాపాన్ని పంచుకోవాలని ఉద్దేశ్యంతో నిషేధ ఫలాన్ని అవ్వనుండి తీసుకొని తింటాడు, తన భార్యను మోహపు చూపుతో చూస్తాడు. లైంగిక కార్యం కోసం వారిద్దరూ పొదల్లోకి పారిపోతారు. ఒకరినొకరు నగ్నంగా ఉండుట చూసుకొని సిగ్గు పడి వారి మర్మాంగాలను ఆకులతో కప్పుకుంటారు. ఒకరినొకరు నిందించుకొంటారు.

మనిషి పతనమైనట్లు దేవలోకంలో దూతలు చెప్పుకొంటారు. మనుష్యుల మీదను, సర్పము మీదను తీర్పు తీర్చుటకు దేవుడు తన కుమారుడిని పంపిస్తాడు. కేవలం కృప ద్వారానే మనుష్యుడు మరణాన్ని జయించవచ్చని దేవుని కుమారుడు చెబుతాడు. జాలితో కుమారుడు ఆదాము అవ్వలకు వస్త్రములు ఇస్తాడు.

పాపము, మరణము భూమికి, నరకానికి మధ్య ఒక మార్గాన్ని సృష్టిస్తాయి. నరకలోకంలో సాతాను సింహాసనంపై కూర్చొని తన విజయాన్ని ఇతర దెయ్యాలతో పంచుకుంటాడు. అందరూ సర్పాలుగా మారిపోతారు. వారి మధ్య కనిపించిన జ్ఞాన ఫలము తినగా అది బూడిదైపోతుంది. భూమి పైకి వెళ్ళిన పాపము, మరణం అను దెయ్యాలను దేవుడు నరక లోకంలో బంధిస్తాడు.

ఆదాము అవ్వలు పశ్చాత్తాప పడతారు. అవ్వ ఆదాముకు లోబడి క్షమాపణ కోరుకుంటుంది. శొకసంద్రంలో ఉన్న అవ్వను ఆదాము ఓదారుస్తాడు. ఆదాము అవ్వలను ఏధేను వనంనుండి బయటకు పంపడానికి దేవుడు మిఖాయేలు దూతను పంపిస్తాడు. మిఖాయేలు ఆదామును ఒక కొండ పైకి తీసుకువెళ్ళి బైబిలు సంబధిత చరిత్రను రక్షకుడైన ఏసుక్రీస్తు జననం వరకూ వివరిస్తాడు. మిఖాయేలు ఆదాము అవ్వలను ఏధేను వనము బయటకు సాగనింపుతాడు. వారిద్దరూ క్రొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టి క్రొత్త జీవితాన్ని మొదలుపెడతారు.

ఇతరవిషయాలు[మార్చు]

బైబిలులో ఆజ్ఞాతిక్రమము అనగా దేవుడు చేయవద్దన్న పని చేయడం. ఆదికాండంలో దేవుడు లోక జ్ఞానాన్నిచ్చే ఫలాన్ని తినవద్దని ఆదాము అవ్వలకు ఆజ్ఞను జారీ చేశాడు. సాతాను ప్రలోభంతో ఆదాము అవ్వలు నిషేధ ఫలాన్ని తిని ఆజ్ఞాతిక్రమము చేసారు. క్రైస్తవేతరులు పొరపాటుగా మానవులు లైంగిక కార్యంలో పాల్గొనడం ఆజ్ఞాతిక్రమం అని బైబిలు చెబుతోందని భావిస్తారు. పేరడైజ్ లాస్ట్ లో జాన్ మిల్టన్ బైబిల్ లో కొద్దిగా ఉన్న ఆదాము అవ్వల చరిత్రను కల్పితంగా పొడిగించి అద్భుత కావ్య రూపంగా చేశాడు.

లంకెలు[మార్చు]