Jump to content

ఫలరసం

వికీపీడియా నుండి
బత్తాయి రసం

ఫలరసం (ఫ్రూట్ జ్యూస్) పండ్ల నుండి తయారుచేసే పానీయం. రసాలు పండ్లు, కూరగాయల నుండి తీసే ద్రవ పదార్ధాలు. వీటిని తాజా పండ్ల నుండి పిండి లేదా కొన్ని చేతి యంత్రాల సాయంతో తీస్తారు. వీటిని వేడి చేయకుండా లేదా ఇతర రకాల పదార్ధాలు కలుపకుండా తాజాగా తాగుతారు. ఈ రసాన్ని తీయడానికి కొన్ని యంత్రాలు ఉపయోగిస్తారు. కొన్నింటిలో రసం తీసిన తర్వాత వడపోసి రసాన్ని, పిప్పిని వేరుచేస్తారు. రసాలు కొన్ని చిక్కగా ఉంటే తగినన్ని నీరు కలుపుకొని తాగుతారు. రసాలలో అవసరమైతే తీపిని పెంచడానికి పంచదారను కలుపుతారు. కొన్ని రకాల రసాలు నిలువ ఉంచడం కోసం ఇతర పదార్ధాలను కలుపుతారు. కానీ వీటి రుచి తాజా ఫలరసం కంటే వేరుగా ఉంటుంది.[1]

శబ్దవిజ్ఞానం

[మార్చు]

"జ్యూస్" అనే పదం ప్రాచీన ఫ్రెంచ్ పదాలైన jus, juis, jouis నుండి సుమారు 13వ శతాబ్దంలో అభివృద్ధి చెందింది. "హెర్బ్స్ ను మరిగించడం ద్వారా పొందిన ద్రవం" అనేది దీని అర్ధం. "జ్యూస్" అనే పదం ప్రోటో-ఇండో-యూరోపియర్ మూలం *yeue- ("ఆహారాన్ని కలపడం, మిక్స్ చేయడం") నుండి వచ్చింది. ఇది ప్రాచీన ఫ్రెంచి భాషలో jus ("జ్యూస్, సాప్, ద్రవం") (13వ శతాబ్దం), లాటిన్ ius ("బ్రోత్, సాస్, జ్యూస్, సూప్") నుండి వచ్చింది.

పండ్లు లేదా కూరగాయల నుండి వచ్చే నీటిని సూచించడానికి 'జ్యూస్' అనే పదాన్ని మొదట 14వ శతాబ్దంలో ఉపయోగించారు.[2] 19వ శతాబ్దం నుండి 'జ్యూస్' అనే పదం రూపక అర్ధంలో ఉపయోగించబడుతుంది. నేడు, "au jus" అనేది దాని స్వంత రసంతో పాటుగా వండిన మాంసాన్ని సూచిస్తుంది, సాధారణంగా ఇది గ్రేవీగా ఉంటుంది.[3]

దానిమ్మ రసం

చరిత్ర

[మార్చు]

క్రీ.పూ 8000 నాటి ద్రాక్ష గుంటల సమూహాలు, వైన్ ఉత్పత్తికి ద్రాక్షలను విపరీతంగా ఉపయోగించి ఉండవచ్చని ఆధారాలు చూపాయి. మొదటిసారి పద్ధతిగా ఉత్పత్తి అయిన రసాల్లో ఒకటి లిమనేడ్. ఇది మధ్యప్రాచ్యంలో మొదట తయారైంది. 16వ శతాబ్దంలో ఇటలీ లోకి దిగుమతి అయింది. నారింజ రసాన్ని తీయడం 17వ శతాబ్దంలో ప్రారంభమైంది. 18వ శతాబ్దంలో జేమ్స్ లిండే, సిట్రస్ పండ్లు స్కర్వీ నివారణకు ఉపయోగపడతాయని గమనించాడు. ఒక శతాబ్దం తరువాత మర్చంట్ షిప్పింగ్ యాక్ట్ 1867 అమలుకు ఇది దారితీసింది. సముద్రంలోకి వెళ్ళే అన్ని బ్రిటిష్ నౌకలు సిట్రస్ ఆధారిత రసాన్ని నౌకలో తీసుకెళ్లాలి అని ఈ చట్టం ద్వారా నిబంధన విధించారు.

1869లో థామస్ బి. వెల్చ్ అనే దంతవైద్యుడు ద్రాక్షరసం మద్యంగా మారకుండా నిల్వ చేయడానికి పాశ్చరైజేషన్ విధానాన్ని అభివృద్ధి చేశారు. ముడి రసాన్ని వడకట్టి సీసాల్లో పెట్టి దాని మూతలను కార్క్ తో మూసి, తరువాత ఆ రసాన్ని మరిగిన నీటిలో ఉంచడమే ఈ విధానంలోని ప్రక్రియ. ఈ పద్ధతి పులియబెట్టడానికి కారణమైన ఈస్ట్ ను చంపుతుంది. ఆ తర్వాత ఆయన తన కొత్త ఉత్పత్తిని "డాక్టర్ వెల్చ్ పులియబెట్టని వైన్" అనే పేరుతో అమ్మారు. 18వ శతాబ్దం చివరిన అమెరికా సంయుక్త రాష్ట్రాలలో విదేశీ పండ్ల రసాలపై అధిక సుంకాలను విధించి, భారీగా నియంత్రించింది. 1890 నాటి మెకిన్లీ టారిఫ్ చట్టం దిగుమతి పన్నులను 38 నుండి 49.5 శాతానికి పెంచింది. ఈ చట్టం పండ్ల రసాలలోని మద్యం శాతం ఆధారంగా పన్నులను నిర్ణయించింది. 18 శాతం లేదా అంతకంటే తక్కువ మద్యం శాతం ఉన్న రసాలపై గాలన్ కు 60 సెంట్లు, 18 శాతం కంటే ఎక్కువ ఉన్న రసాలపై గాలన్ కు $2.5 డాలర్లూ పన్ను విధించింది.

పదజాలం

[మార్చు]

ఫ్రూట్ జ్యూసెస్ అండ్ ఫ్రూట్ నెక్టర్స్ (ఇంగ్లాండు) రెగ్యులేషన్స్, ఫ్రూట్ జ్యూసెస్ అండ్ ఫ్రూట్ నెక్టార్స్ (స్కాట్లాండ్) రెగ్యులేషన్స్ 2003, నిర్దేశించిన ప్రకారం 100% ఫలరసం ఉన్న పండ్ల ఉత్పత్తికి మాత్రమే 'రసం' అనే పదాన్ని ఉపయోగించాలనే చట్టాన్ని యునైటెడ్ కింగ్‌డమ్ చేసింది. అయితే చిక్కగా ఉన్న రసాన్ని ఫలరసం అని పిలవవచ్చు. కనీసం 25% నుండి 50% ఫలరసం ఉన్న వాటిని మకరందం అని అంటారు. ఎంత శాతం రసం కలిగిన పానీయానికి "జ్యూస్ డ్రింక్" అనే పదం ఉపయోగించాలో రెగ్యులేషన్స్‌లో నిర్వచించలేదు. యూరోపియన్ యూనియన్ (ఈయు)లో అన్ని సభ్య దేశాల స్థానిక భాషలలో కూడా ఇలాంటి నియమాలే ఉన్నాయి.

అమెరికాలో చట్టపరంగా పండ్ల రసం అంటే,100% ఫల రసమే ఉన్న ఉత్పత్తిని మాత్రమే వివరిస్తుంది. ఇతర పదార్థాలతో, ఉదాహరణకు హై-ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ తో కలిపిన పండ్ల రసం మిశ్రమం, జ్యూస్ కాక్‌టెయిల్ అనీ, జ్యూస్ డ్రింక్ అనీ అంటారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్.డి.ఏ) ప్రకారం సాధారణంగా అమెరికాలో, అంతర్జాతీయ వాణిజ్యంలో పండ్ల రసం లేదా గుజ్జు, నీరు, కృత్రిమ తీపి పదార్థాలు కలిపిన పలుచటి రసాన్ని సూచించడానికి "నెక్టార్" అనే పదాన్ని వాడతారు. "ఏ అదనపు చక్కెర లేదు" అని సాధారణంగా జ్యూస్‌ల లేబుల్స్‌పై ముద్రించబడుతుంది. కానీ వీటిలో, సహజంగా లభించే చక్కెర పెద్ద మొత్తంలో ఉండవచ్చు. అయితే, చాలా దేశాలలో లేబుల్స్‌ మీద, ఇతర కార్బోహైడ్రేట్లతో పాటు, చక్కెర ఎంత ఉందో కూడా చూపిస్తారు.

తయారీ

[మార్చు]
ఆఫ్ఘనిస్తాన్‌లో పండ్ల రసం తయారీ పరిశ్రమలో, ప్రాసెసింగ్‌కు ముందు దానిమ్మలను శుభ్రం చెయ్యడం

ఉష్ణం లేదా ద్రావకాలు ఉపయోగించకుండా పండ్లు, కూరగాయలను యాంత్రికంగా పిండి లేదా ముక్కలుగా చేయడం ద్వారా రసం తీయడాన్ని కోల్డ్ ప్రెస్సింగ్ అంటారు. ఉదాహరణకు బత్తాయి రసం అనేది బత్తాయి పళ్ళ లోంచి తీసే రసం, టమాటో రసం అనేది టమాటో పళ్ళను పిండి తీసే ద్రవం. రసం అనేది పండ్లు, కూరగాయల నుండి వివిధ రకాల చేతి సాయంతో రసాన్ని తీసే యంత్రం లేదా వడపోత యంత్రాలు ఉపయోగించి రసం తీయవచ్చు.[4] వాణిజ్యంగా లభించే కొన్ని రసాలను వడగట్టి ఫైబర్, గుజ్జును తొలగిస్తారు. ఈ ప్రక్రియలో పండ్ల గుజ్జు వడగట్టబడి, స్పష్టమైన రసం మిగులుతుంది, కానీ ఎక్కువ గుజ్జు ఉన్న తాజా బత్తాయి రసం ప్రజలు ఎక్కువగా ఇష్టపడే పానీయం. కొన్ని రసాలలో చెక్కర, కృత్రిమ రుచులు లేదా రుచిని కలిగించే పదార్థాలను (ఉదా: క్లామాటో లేదా సీజర్ టమాటో జ్యూసులలో) కలుపుతారు. పండ్ల రసాలను భద్రపరచడానికి, ప్రాసెస్ చేయడానికి సాధారణంగా కేనింగ్, పాశ్చరైజేషన్, కాన్‌సెంట్రేషన్, ఫ్రీజింగ్, ఇవాపొరేషను, స్ప్రే డ్రయింగ్ వంటి పద్ధతులను వాడతారు.

చేతి సాయంతో రసాన్ని తీసే యంత్రం

రసాలను ప్రాసెస్ చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నప్పటికీ, సాధారణంగా ప్రాసెసింగ్ పద్ధతి ఈ విధంగా ఉంటుంది:

  • పండ్లని కడిగి వర్గీకరించడం
  • రసం తీయడం
  • వడకట్టడం, వడపోత, స్పష్టీకరణ
  • బ్లెండింగ్, పాశ్చరైజేషన్
  • ఫిల్లింగ్, సీలింగ్, స్టెరిలైజేషన్
  • శీతలీకరణ, లేబులింగ్, ప్యాకింగ్

ఎంచుకున్న పండ్లను కడిగిన తర్వాత, ఆటోమాటిక్ పద్ధతిలో రసం తీస్తారు. ఈ పద్ధతులు రెండు. వీటిలో ఏదో ఒకటి వాడతారు. మొదటి పద్ధతిలో రెండు లోహపు కప్పులు ఒకదానిపై ఒకటి ఉంటాయి. దిగువ కప్పుపై పదునైన లోహపు గొట్టాలుంటాయి. తొక్కను తీసివేసి, పండ్ల గుజ్జును లోహపు గొట్టాల ద్వారా వెళ్ళేలా నొక్కుతారు. దాంతో పండ్లలోని రసం చిన్న చిన్న రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. పండ్ల తొక్కల నుండి తీసిన నూనెను తిరిగి ఉపయోగించవచ్చు. రెండవ పద్ధతిలో పండ్లను సగానికి కోసి, రీమర్లపై నొక్కి రసాన్ని వెలికితీస్తారు.[5]

రసాన్ని వడకట్టిన తర్వాత, దానిని ఆవిరిభవకాల్లో ఘనీభవింపజేయవచ్చు. ఈ ప్రక్రియలో రసం నుండి నీటిని తొలగించి, ఘనపరిమాణాన్ని దాదాపు ఐదు రెట్లు తగ్గిస్తారు. తద్వారా రవాణా చెయ్యడం సులభం అవుతుంది. అలాగే అది నిల్వ ఉండే సమయం కూడా పెరుగుతుంది. రసంలో ఉన్న నీటిని తీసివేయడానికి వాక్యూమ్ లో వేడి చేసి తర్వాత సుమారు 13 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు చల్లబరుస్తారు. దీని ద్వారా రసంలో ఉన్న నీరు దాదాపు మూడింట రెండు వంతులు తీసివేయబడుతుంది. ఆ తర్వాత, రసంలో నీరు, ఇతర పదార్థాలను కలిపి నష్టపోయిన రుచిని తిరిగి కలగజేస్తారు. రసాలను సంకీర్ణత స్థితిలో కూడా అమ్మవచ్చు, ఇందులో వినియోగదారుడు సంకీర్ణ రసానికి నీటిని కలిపి త్రాగవచ్చు.[6]

ఆ తర్వాత, రసాన్ని పాశ్చరైజ్ చేసి, అది వెచ్చగా ఉన్నప్పుడే కంటైనర్లలో నింపుతారు. దాంతో అది వీలైనంత త్వరగా చల్లబడుతుంది. వేడిని తట్టుకోలేని ప్యాకేజీల విషయంలో, వాటిని క్రిమిరహితంగా చేసి, నింపాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను ఉపయోగించి ఈ కంటైనర్లను శుద్ధి చేస్తారు. ప్లాంట్లు రోజుకు 1 నుండి 20 టన్నులు వరకు రసాన్ని ఉత్పత్తి చేస్తాయి.[7]

మూలాలు

[మార్చు]
  1. "Feeding Your Baby", Caring for Your Baby and Young Child, 6th Ed, American Academy of Pediatrics, pp. 83–131, 2014-09-01, ISBN 978-1-58110-872-9, ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-11-19{{citation}}: CS1 maint: work parameter with ISBN (link)
  2. Ashurst, Philip R.; Hargitt, Robert; Palmer, Fiona (2017), "Fruit Juices and Fruit Nectars", Soft Drink and Fruit Juice Problems Solved, Elsevier, pp. 137–144, ISBN 978-0-08-100918-5, ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-11-19{{citation}}: CS1 maint: work parameter with ISBN (link)
  3. "MERCHANT SHIPPING ACT 1995", Statutes on International Trade 3/e, Routledge-Cavendish, pp. 294–296, 1999-07-30, ISBN 978-1-84314-302-4, ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-11-19{{citation}}: CS1 maint: work parameter with ISBN (link)
  4. Ashurst, Philip R.; Hargitt, Robert; Palmer, Fiona (2017), "Fruit Juices and Fruit Nectars", Soft Drink and Fruit Juice Problems Solved, Elsevier, pp. 137–144, ISBN 978-0-08-100918-5, ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-11-20{{citation}}: CS1 maint: work parameter with ISBN (link)
  5. West, Brett (2022-11-10). "Antiviral properties of noni fruit juice". doi.org. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-11-19.
  6. Rennick, Robert M. (2001-07-01). "California Place Names: The Origin and Etymology of Current Geographical Names1500 California Place Names: Their Origin and Meaning". Journal of American Folklore. 114 (453): 385–387. doi:10.2307/542031. ISSN 0021-8715.
  7. Faith, Myles S.; Dennison, Barbara A.; Edmunds, Lynn S.; Stratton, Howard H. (2006-11-01). "Fruit Juice Intake Predicts Increased Adiposity Gain in Children From Low-Income Families: Weight Status-by-Environment Interaction". Pediatrics (in ఇంగ్లీష్). 118 (5): 2066–2075. doi:10.1542/peds.2006-1117. ISSN 0031-4005.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫలరసం&oldid=4682900" నుండి వెలికితీశారు