Jump to content

ఫ్రాంకెన్‌స్టీన్ (1931 సినిమా)

వికీపీడియా నుండి
ఫ్రాంకెన్‌స్టీన్
ఫ్రాంకెన్‌స్టీన్ సినిమా పోస్టర్
దర్శకత్వంజేమ్స్ వేల్
స్క్రీన్ ప్లేఫ్రాన్సిస్ ఎడ్వర్డ్ ఫరాగో, గారెట్ ఫోర్ట్
కథజాన్ ఎల్. బాల్డెస్టన్ (అనుసరణ), రిచర్డ్ షాయేర్ (దృశ్య ఎడిటర్)
నిర్మాతకార్ల్ లెంమెల్ జూనియర్
తారాగణంకాలిన్ క్లైవ్, బోరిస్ కార్లాఫ్, మే క్లార్క్, డ్వైట్ ఫ్రైయ్
ఛాయాగ్రహణంఆర్థర్ ఎడెన్సన్
కూర్పుక్లారెన్స్ కోల్స్టెర్, మారిస్ పివార్
సంగీతంబెర్న్‌హార్డ్ కౌన్
పంపిణీదార్లుయూనివర్సల్ పిక్చర్స్
విడుదల తేదీ
నవంబరు 21, 1931 (1931-11-21)
సినిమా నిడివి
71 నిముషాలు
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్
బడ్జెట్$262,007[1]
బాక్సాఫీసు$12 మిలియన్[2]

ఫ్రాంకెన్‌స్టీన్ 1931, నవంబర్ 21న విడుదలైన అమెరికా హర్రర్ సినిమా. యూనివర్సల్ పిక్చర్స్ నిర్మాణంలో జేమ్స్ వేల్ దర్శకత్వంలో కాలిన్ క్లైవ్, బోరిస్ కార్లాఫ్, మే క్లార్క్, డ్వైట్ ఫ్రైయ్ తదితరులు నటించిన ఈ చిత్రం, పెగ్గి వెబ్లింగ్ రాసిన ఫ్రాంకెన్‌స్టీన్ నాటకం ఆధారంగా రూపొందించబడింది.[3] ఈ రెండింటికి మేరీ షెల్లీ 1817లో రాసిన ఫ్రాంకెన్‌స్టీన్[4] అనే నవల మాలం. ఈ చిత్రంద్వారా ఫ్రాంకెన్‌స్టీన్ అనే రాక్షసుడు హాలీవుడ్ సినీచరిత్రలో మరుపురాని పాత్రగా మిగిలిపోయాడు.

డాక్టర్ హెన్రీ ఫ్రాంకెన్‌స్టీన్ (కాలిన్ క్లైవ్), అసిస్టెంట్ ఫ్రిజ్ (డ్వైట్ ఫ్రైయ్) సహకారంతో తన ప్రయోగాల కోసం శవాలను సమకూర్చుకుంటాడు. శవాల నుండి శరీరభాగాలను వేరు చేసి, అతికి కొత్త శరీరాన్ని తయారు చేసి ప్రాణ ప్రతిష్ట చెయ్యాలని హెన్రీ ఆశయం. విద్యుత్ పరికరాల వాడకం మీద పట్టు సాధించిన హెన్రీ విద్యుత్ ద్వారా మానవజీవితానికి అంకురార్పణ చెయ్యవచ్చని, మృతదేహంలో జీవం పోయవచ్చనీ నమ్ముతాడు. తన అనుచరుడిని మనిషి మెదడుకోసం వైద్యకళాశాలకు వెళ్ళిన ఫ్రిజ్, నేరస్థుడి మెదడు తెస్తాడు.

ఎక్కడో కొండ మీద ఏకాంతంలో పాడుబడ్డ కోటలో ప్రయోగశాల ఏర్పరచుకుని, అందులో ఏకాకి జీవితం గడుపుతూ, ఏవేవో రహస్య ప్రయోగాలు చేస్తూ, ఎవ్వరినీ కలవకుండా, ఎవ్వరికీ ప్రవేశం లేకుండా అతడు చేస్తున్నదేమిటో హెన్రీ పెళ్లాడబోయే యువతి ఎలిజబెత్ కు అర్థంకాదు. ప్రపంచంలో జీవితాన్ని మొట్టమొదటిసారిగా అంకురింపజేసిన విద్యుత్ కిరణాన్ని తాను కనుగొన్నానని, దాన్ని చూడడానికి గురువు, ప్రియురాలును హెన్రీ ఆహ్వానిస్తాడు. వాళ్ళయుందు తాము అతికిన శరీరాన్ని ఆపరేషన్ బల్ల మీది నుంచి ఆకాశంలోకి తెరిచి ఉంచిన కప్పు గుండా పైపైకి లేపుతాడు. ఆకాశంలోని ఉరుములతో పిడుగుపాటుకు లోపల ప్రయోగశాలలో యంత్రాలు భయంకరమైన హోరులో శవంలో కదలిక వస్తుంది. ప్రాణం పోసుకున్న ఆ కృత్రిమప్రాణి (బోరిస్ కార్లాఫ్) వికృతమైన ముఖకవళికలు కలిగి ఉండి, అతని ప్రవర్తనలో అమాయకత్వం కనిపిస్తుంది. మంటలను చూసి విచిత్రంగా ప్రవర్తిస్తున్న ప్రాణి ప్రమాదకరమైన నేరస్థుడి మెదడు కల జీవి అని గురువు వాల్డ్ మాన్ చెప్పటంతో ఆ జీవి ప్రపంచంలోకి అడుగుపెడితే అల్లకల్లోలం సృష్టిస్తుందని నమ్మి మాళిగకు బలమైన తాళాలు వేస్తాడు. అయినాకాని ఆ ప్రాణి ఫ్రిజ్ ను చంపేస్తుంది.

ఎలాగైనా దానిని అంతం చేయాలని నిర్ణయించుకున్న హెన్రీ, వాల్డ్ మాన్ లు ఒక శక్తివంతమైన మందుతో ఇంజక్షన్ తయారు చేసి, గురుశిష్యులిద్దరూ తాళం తీసి ఆ భయంకర ప్రాణిని విడుదలచేసి ఇంజక్షన్ ఇవ్వడంతో అది స్పృహ కోల్పోతుంది. హెన్రీకి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటికి వెళ్ళిపోతాడు. డాక్టర్ వాల్డ్ మాన్ దానిని అంతంచేసే ప్రయత్నంలో ఉండగానే అది మేల్కొని అతడి గొంతు నులిమి చంపేసి, ప్రయోగశాల నుండి తప్పించుకుంటుంది.

అక్కడికి దగ్గరలో ఒక రైతు తన చిన్నారి కూతురితో నివసిస్తూ ఉంటాడు. తండ్రి ఇంటలేని సమయంలో మారియా అనే ఆ పసిపాప కొలనులో పువ్వులను విసిరి, అవి పైకి తేలుతుంటే చూసి ఆనందిస్తూ ఉంటుంది. వింతప్రాణి అక్కడికి చేరుకుంటే చూసిన మారియా, భయం తెలియని అమాయకత్వపు పసితనం మూలంగా ఆ ప్రాణిని తనతో పాటు ఆటకు రమ్మని ఆహ్వానిస్తుంది. పువ్వులు నీటిలో గిరాటు వేస్తే అవి తేలటం చూచి పసిపాపలాగే ప్రాణి కూడా ఆనందిస్తుంది. పువ్వులు అన్నీ వేశాక మరి ఏవీ మిగలనప్పుడు ప్రాణి పసిబిడ్డను ఎత్తి పువ్వును గిరాటు వేసినట్లే నీళ్ళల్లోకి విసిరేస్తుంది. పసిబిడ్డ పైకి తేలదు. మునిగి పోతుంది. అది చూచి అర్థం కాని ఏదో భయం కలిగి ప్రాణి వడివడిగా అక్కడి నుంచి పారిపోతుంది.

ఇక్కడ హెన్రీ జీవితంలోకి సంతోషం తిరిగి వస్తుంది. అతడి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరిగి అతడు ఆనందంగా ఉంటాడు. వాల్డ్ మాన్ ఆగమనం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతడు వస్తేనే హెన్రీ వివాహం జరుగుతుంది. ఇంతలో ఎలిజబెత్ స్నేహితుడు విక్టర్ వచ్చి డాక్టర్ వాల్డ్ మాన్ పీక నులిమి చంపబడినట్లు చెబుతాడు. ఇదంతా తాను సృష్టించిన ప్రాణి పనేనని హెన్రీ నమ్ముతాడు. ఇంతలో ప్రాణి అక్కడికి చేరుకొని చాటుగా ఎలిజబెత్ గదిలోకి దూరి ఆమెను భయపెడుతుంది. ఆమె భయంతో స్పృహ కోల్పోవడంతో ప్రాణి అక్కడి నుండి పారిపోతుంది.

ఇంతలో పసిపాప మారియా తండ్రి నీళ్ళల్లో మునిగి చనిపోయిన పసిబిడ్డ శవాన్ని మోసుకుని హెన్రీ ఇంటికి వస్తాడు. తన బిడ్డ నీటిలో జీవం లేకుండా దొరికిన వైనం చెబుతాడు. గ్రామీణులంతా కోపంతో రెచ్చిపోయి మూడు గుంపులుగా తలా ఒక దిక్కు వైపు బయలుదేరి భయంకర ప్రాణి ఆచూకీ కోసం అడవులు, పర్వత ప్రాంతం, పల్లెప్రాంతాలు వెదకటం మొదలుపెడతారు. ఆ వెదుకులాటలో తన గుంపునుండి విడిపోయిన హెన్రీని చూసిన ప్రాణి, అతడితో పెనుగులాడి అతడు స్పృహ తప్పిన తరువాత ఈడ్చుకు వెళ్లి కొండమీద కోటలో ప్రయోగశాలకు చేరుస్తుంది. స్పృహ వచ్చిన హెన్రీ ఆర్తనాదాలు విన్న రైతులు ప్రాణి ఈడ్చుకువెళ్తున్న హెన్రీని చూస్తారు. ప్రాణి హెన్రీని కోట పైనుండి కిందికి విసిరేస్తుంది. హెన్రీ గాలిమర చక్రాలకు తగులుకుని మధ్యలో ఆగిపోయి, ప్రాణహాని జరగకుండా బయటపడతాడు. కొందరు గ్రామస్థులు అతడిని ఇంటికి మోసుకువెళ్తే,మరి కొందరు గాలిమర ఉన్న పాడుబడిన కోటను నూనెలు పోసి తగులవేస్తారు. లోపల ఉన్న ప్రాణి ఈ మంటల్లో కాలిపోతుంది.

ఫ్రాంకెన్‌స్టీన్ ట్రైలర్

నటవర్గం

[మార్చు]
  • కాలిన్ క్లైవ్
  • బోరిస్ కార్లాఫ్
  • మే క్లార్క్
  • డ్వైట్ ఫ్రైయ్
  • జాన్ బోల్స్
  • ఎడ్వర్డ్ వాన్ స్లోన్
  • ఫ్రెడెరిక్ కెర్
  • లియోనెల్ బెల్మోర్
  • మార్లిన్ హారిస్
  • మైఖేల్ మార్క్

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: జేమ్స్ వేల్
  • నిర్మాత: కార్ల్ లెంమెల్ జూనియర్
  • స్క్రీన్ ప్లే: ఫ్రాన్సిస్ ఎడ్వర్డ్ ఫరాగో, గారెట్ ఫోర్ట్
  • కథ: జాన్ ఎల్. బాల్డెస్టన్ (అనుసరణ), రిచర్డ్ షాయేర్ (దృశ్య ఎడిటర్)
  • ఆధారం: మేరీ షెల్లీ 1817లో రాసిన ఫ్రాంకెన్‌స్టీన్ నవల, పెగ్గి వెబ్లింగ్ రాసిన ఫ్రాంకెన్‌స్టీన్ నాటకం
  • సంగీతం: బెర్న్‌హార్డ్ కౌన్
  • ఛాయాగ్రహణం: ఆర్థర్ ఎడెన్సన్
  • కూర్పు: క్లారెన్స్ కోల్స్టెర్, మారిస్ పివార్
  • పంపిణీదారు: యూనివర్సల్ పిక్చర్స్

చిత్రవిశేషాలు

[మార్చు]
  1. కృత్రిమ ప్రాణాన్ని సృష్టించటం అప్పటి కాలానికి ఒక గొప్ప దృశ్యంగా నిలిచింది, అందులో వాడిన స్పెషల్ ఎఫెక్ట్స్ చెప్పుకోదగినవిగా ఉన్నాయి. ఈ దృశ్యాన్ని తదుపరి ఫ్రాంకెన్ స్టీన్ చిత్రాలన్నింటిలో కూడా వాడుకున్నారు.
  2. ఈ చిత్రంలో హింస ఆనాటి కాలంలో ఎక్కువగానే చూపించారని, అందువల్ల దీనిలో ఎన్నో కత్తిరింపులు జరిగాయని, అయినా హింస వల్లనే చిత్రం విజయవంతమైందని విశ్లేషకుల అభిప్రాయం.
  3. పాపను నీళ్ళల్లోకి విసిరి ఆమె మునిగిపోతే ప్రాణి ముఖంలో ఆశ్చర్యం, భయం కనిపిస్తాయి. రాక్షసుడిలో కూడా మానవీయ కోణాలు ఉన్నాయని దర్శకుడు చూపిస్తున్నాడనిపిస్తుంది.
  4. ఈ చిత్ర నిర్మాణానికి రెండున్నర లక్షల డాలర్లు ఖర్చుకాగా, కోటి ఇరవై లక్షల డాలర్లు వసూలు చేసిందని అంచనా.[3]
  5. ఇందులోని కృత్రిమ ప్రాణి పాత్రకు డ్రాకులా సినిమాలో నటించిన బెలా లుగోసీని తీసుకుందామనుకున్నారు. కానీ, ఆ పాత్ర వేస్తే తన ముఖం కనిపించదని బెలా లుగోసీ తిరస్కరించాడు. దాంతో చిన్నచిన్న పాత్రలు వేస్తున్న బోరిస్ కార్లాఫ్ కు ఆ పాత్ర వేసే అవకాశం వచ్చింది.[3]
  6. ఈ పాత్ర మేకప్ కు ప్రతిరోజూ సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. ముఖంను బాక్స్ లాగా, రబ్బరుతో తొండకళ్ళు ఆకారంలో కళ్ళు, కాళ్ళకు రెండు ప్యాంట్స్, పాదాలకు తారురోడ్డు వేసేవారి షూలు, వేలిగోళ్ళకు నల్ల రంగు, ముఖానికి ఆకుపచ్చ గ్రీస్ రంగు మొదలైనవి వాడారు.[3]
  7. షూటింగ్ పూర్తయ్యే నాటికి బరువు మోయలేక బోరిస్ కార్లాఫ్ రెండు పౌన్లు తగ్గడమేకాకుండా, వెన్నెముక ఆపరేషన్ చేయించుకోవలసి వచ్చింది.[3]

గుర్తింపులు

[మార్చు]

ఫ్రాంకెన్‌స్టీన్ విమర్శకులచే ప్రశంసలను అందుకొని,1931 సంవత్సరం యొక్క ఉత్తమ చిత్రాలలో ఒకటిగా పరిగణించబడింది.[5][6][7][8] అంతేకాకుండా గొప్పచిత్రాలలో ఒకటిగా నిలిచింది.[9][10] రొట్టెన్ టొమాటోస్ వెబ్ సైట్ సమీక్షలో 100% "ఫ్రెష్" రేటింగును కలిగి ఉంది.[11] 1991లో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో "సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా, ఆకర్షణీయంగా ముఖ్యమైనది"గా ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది.[12][13] 2004లో ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఉత్తమ 1000 చిత్రాల జాబితాలో ఈ చిత్రాన్ని ఉంచింది.[14] అమెరికన్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ ఎంపిక చేసిన 100 ఉత్తమ అమెరికన్ చిత్రాల జాబితాలో ఈ చిత్రం 87వ స్థానంలో నిలిచింది.[9] చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ వారు ఈ చిత్రాన్ని ఇప్పటిదాకా వచ్చిన చిత్రాలలో 14వ అతి భయంకరమైన చిత్రంగా పేర్కొన్నారు.[15]

మూలాలు

[మార్చు]
  1. Michael Brunas, John Brunas & Tom Weaver, Universal Horrors: The Studios Classic Films, 1931-46, McFarland, 1990 p24
  2. Box Office Information for Frankenstein. Archived 2014-02-23 at the Wayback Machine The Numbers. Retrieved 12 February 2019
  3. 3.0 3.1 3.2 3.3 3.4 పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 21.
  4. నమస్తే తెలంగాణ, సంపాదకీయం (1 August 2018). "మానవా, ఏ దశలో ఉన్నావు!". సి.పి. రాజేంద్రన్. Archived from the original on 12 February 2019. Retrieved 12 February 2019.
  5. "The Greatest Films of 1931". AMC (TV channel). Retrieved 12 February 2019.
  6. "The Best Movies of 1931 by Rank". Films101.com. Archived from the original on 1 మార్చి 2021. Retrieved 12 February 2019.
  7. "The Best Films of 1931". listal.com. Archived from the original on 10 మార్చి 2021. Retrieved 12 February 2019.
  8. "Most Popular Feature Films Released in 1931". IMDb.com. Retrieved 12 February 2019.
  9. 9.0 9.1 "AFI's 100 Years... 100 Movies" (PDF). American Film Institute. Archived from the original (PDF) on 14 ఫిబ్రవరి 2010. Retrieved 12 ఫిబ్రవరి 2019.
  10. "5-Star Movies by Rank". Films101.com. Archived from the original on 1 మార్చి 2021. Retrieved 12 February 2019.
  11. "Frankenstein Movie Reviews, Pictures". Rotten Tomatoes. Retrieved 12 February 2019.
  12. "Films Selected to the National Film Registry, Library of Congress 1989 to 2009". Library of Congress. Retrieved 12 February 2019.
  13. "Frankenstein: Award Wins and Nominations". IMDb.com. Retrieved 12 February 2019.
  14. "The Best 1,000 Movies Ever Made". The New York Times. April 29, 2003. Retrieved 12 February 2019.
  15. "Chicago Critics' Scariest Films". AltFilmGuide.com. Retrieved 12 February 2019.

ఇతర లంకెలు

[మార్చు]

ఆధార గ్రంథాలు

[మార్చు]