బెన్ హర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెన్ హర్
సినిమా పోస్టర్
దర్శకత్వంవిలియమ్‌ వైలర్
స్క్రీన్ ప్లేకార్ల్ టున్‌బర్గ్
నిర్మాతశామ్ జింబాలిస్ట్
తారాగణంఛార్ల్‌టన్ హెస్టన్
జాక్ హాక్సిన్స్
హయా హరారీట్
స్టీఫెన్ బాయిడ్
హ్యూ గ్రిఫిత్
Narrated byఫిన్‌లే క్యూరీ
ఛాయాగ్రహణంరాబర్ట్ ఎల్.సర్టీస్
కూర్పుజాన్ డి. డన్నింగ్
రాల్ఫ్ ఇ.వింటర్స్
సంగీతంమిక్లోస్ రోజా
నిర్మాణ
సంస్థ
మెట్రో - గోల్డ్‌విన్ - మేయర్ (MGM)
పంపిణీదార్లులూయీస్ ఇంక్[1]
విడుదల తేదీ
నవంబరు 18, 1959 (1959-11-18)
సినిమా నిడివి
212 నిముషాలు
దేశంఅమెరికా
భాషఆంగ్ల భాష
బడ్జెట్$15,175,000[2]
బాక్సాఫీసు$146,900,000 (తొలి విడుదల)

బెన్ హర్ ఆంగ్లం-Ben-Hur 1959 ప్రఖ్యాత అమెరికన్ "చారిత్రక నాటక చిత్రం". ఈ చిత్రాన్ని విలియం వైలర్ దర్శకత్వం వహించారు. మెట్రొ గొల్డ్విన్ మేయర్ సంస్థ నిర్మాణంలొ సాం జింబాలిస్ట్ నిర్మించారు. ఈ చిత్రంలొ బెన్ హర్‌గా చార్ల్‌టన్ హెస్టన్ నటించారు. స్టీఫెన్ బొయ్డ్, హ్యుజ్ గ్రిఫిత్, జాక్ హాకిన్స్ ఇతరులు నటించారు. ఈ చిత్రం పురాతన రోమ్, పురాతన జుడియాలలొ కథ నడుస్తుంది. ఈ చిత్రంలొ యూదుల రాజు అయిన బెన్ హర్ , రొమన్ న్యాయాదీశుడైన అతని మిత్రుడు మెస్సలాల చుట్టూ కథ నడుస్తుంది. మొదట్లో మిత్రులు కాలక్రమంలో విరోధులుగా మారతారు. ఈ చిత్రంలో రథాలపొటీ, ఏసుక్రీస్తు శిలువ ఎక్కించే సన్నివేశాలు ప్రధాన అకర్షణ.

బెన్-హర్ కథంతా క్రీస్తుశకం ఒకటో శతాబ్దంలో జెరూసలేంలో జరుగుతుంటుంది. అదంతా క్రీస్తు జీవితకాలానికి సమకాలీనం. అప్పట్లో రోమన్ సామ్రాజ్యాన్ని ఆగాస్టస్ సీజర్ పరిపాలించేవాడు. ఆయన పరిపాలనా కాలంలోని ఏడో సంవత్సరంలో అందరు జూడా (యూదు)లను వారి వారి జన్మ స్థలాలకు వెళ్లాల్సిందిగా ప్రభుత్వం ఆజ్ఞాపిస్తుంది. అలా యూదులంతా వారి వారి జన్మస్థలాలకు చేరితే, జనాభా లెక్కలకు, పన్నుల విధింపునకు వీలుగా ఉంటుందని ప్రభుత్వం ఆలోచన. ఫలితంగా యూదులంతా జెరూసలేం చేరుకుంటూ ఉంటారు. ఈ కష్టాలనుంచి తమను గట్టెక్కించే నాథుడు పుట్టకపోతాడా అనేది వారి ఆశ. తర్వాత కథ క్రీ.శ. 26వ సంవత్సరానికి మారిపోతుంది. అంటే అప్పటికి క్రీస్తు జన్మించి 26 సంవత్సరాలయిందన్నమాట. ఈసరికి పరిస్థితి అంతా మారి ఉంటుంది. జూడియా ప్రాంతానికి గవర్నర్గా నియమితులైన గ్రేటస్ కు సహాయకుడుగా, సైనిక అధికారిగా ఉండే మెసాలా, జెరూసలేంకు గ్రేటస్ వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తుంటాడు. మసాలాను చూసేందుకు ఒక యూదు వచ్చాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోతారు. వచ్చిన వ్యక్తి జూడా బెన్-హర్. మోసాలా, బెన్హర్లు చిన్ననాటి స్నేహితులు. ఏనాటికైనా ప్రపంచాధిపత్యం రోమన్లదే అవుతుంది గనుక, వారికి లొంగిపోయి, వారి తరపున పనిచేయాలని మెసాలా, బెన్ హర్‌ను కోరుతాడు. దానికి బెన్ హర్ ఒప్పుకోడు. 'నా జాతి ప్రజల్ని ఈ దాస్యంనుంచి విముక్తి చేసే మహానుభావుడు తప్పక వస్తాడు' అని మెసాలాకు బెన్ హర్ చెప్తాడు. అది మెసాలాకు నచ్చదు. బెన్ హర్ మీద, అతని కుటుంబం మీద మెసాలా ఒత్తిడి తెస్తాడు. ఆ తర్వాత గ్రేటస్ ఊరేగింపు జరుగుతున్న సమయంలో, బెన్ హర్ ఇంటి మీది పెంకులు ప్రమాదవశాత్తూ జారి, గవర్నర్ గుర్రాల మీద పడతాయి. వెంటనే బెన్ హర్‌ను, అతని కుటుంబ సభ్యులైన అమ్మ మిరియమ్ను, చెల్లెలు తీర్జాను విప్లవకారులుగా మెసాలా అరెస్టు చేయిస్తాడు. ఆ నిర్బంధంలోంచి తప్పించుకొని వచ్చి, తన అమ్మాచెల్లెళ్లను వదలమని బెన్ హర్ కోరతాడు. లేకపోతే ఈటెతో చంపేస్తానంటాడు. అదే చేస్తే, మిరియమ్, తిర్జాలను శిలువ వేయిస్తానని చెప్తాడు మెసాలా. దాంతో బెన్ హర్ లొంగిపోతాడు. అతన్ని రోమన్ నౌకలకు తెడ్డువేసే బానిసగా పంపేస్తారు. ఇలా వెళ్తున్న సమయంలో- మార్గమధ్యంలో బెన్ హర్ దాహంతో పడిపోతే, ఆ దాహం తీర్చేందుకు ఒక మహానుభావుడు నీళ్లు అందిస్తాడు. మూడేళ్ల తర్వాత- బెన్-హర్ ఒక రోమన్ నౌకలో తెడ్లు వేస్తున్నప్పుడు జరిగిన యుద్ధంలో రోమన్ ఎడ్మిరల్ క్వింటన్ ఎరియను బెనహర్ రక్షిస్తాడు. దానికి కృతజ్ఞతగా ఆ ఎడ్మిరల్, బెన్-హర్ను తన కుమారుడుగా దత్తత స్వీకరిస్తాడు. అక్కడ జూడియాలో తన అక్క, అమ్మల క్షేమం తెలుసుకోవాలని బెన్ హర్ తిరిగి జెరూసలేం వస్తున్న సమయంలో - అరేబియన్ గుర్రాల వర్తకుడైన షేక్ ఇల్దేరిమ్ పరిచయం అవుతాడు. బెన్ హర్‌కు అశ్వశిక్షణలో, అశ్వపాలనలో ఉన్న నైపుణ్యం గుర్తించిన షేక్ ఇల్దేరిమ్, త్వరలో జరగబోయే రథాల పందెంలో, తన రథాన్ని నడపాల్సిందిగా బెన్ హర్‌ను కోరతాడు. ఆ పందెంలో మసాలా కూడా పాల్గొంటాడని తెలుసుకొన్న బెన్ హర్ దానికి సరే అంటాడు. ఈలోగా తన అమ్మ, అక్కలను కలుసుకోవాలని జెరూసలేంలో ఇంటికి వచ్చిన బెన్ హర్‌కు వాళ్లు కనపడరు. వెంటనే బెన్ హర్, మెసాలా వద్దకు వెళ్లి రేపటిలోగా వాళ్ల ఆచూకీ కనుక్కో! వాళ్ల క్షేమాన్ని చెబితే నీ మీద నాకున్న పగను మర్చిపోతా!' నంటాడు. అయితే బెన్ హర్ అక్క, అమ్మలకు కుష్టువ్యాధి సోకిందని తెలుసుకొంటాడు మెసాలా. ఇటు రథాల పందెం ఆరంభం అవుతుంది. ఆ పందెంలో ఎలాటి నియమాలూ లేవు. ఎరీనాలో మొత్తం 9 రౌండ్లు చేసిన వారిదే గెలుపు. మసాలా నల్లటి గుర్రాలతో, తన రథం చక్రాలకు పదునైన బ్లేడ్లతో సిద్ధం అవుతాడు. ఆ బ్లేడ్లు గనుక పక్కరథం చక్రాలకు తగిలితే, అవి కోసుకుపోయి, ఆ రథం కుప్పకూలటం జరుగుతుందన్న విషయాన్ని షేక్ ఇల్దేరిమ్ గుర్తించి, బెన్-హర్‌కు చెప్తాడు. బెన్ హర్ తన శ్వేతాశ్వరథం (తెల్ల గుర్రాల రథం) మీద పోటీకి సిద్ధమవుతాడు. ఈ రథాల పోటీ చూసేందుకు అలెగ్జాండ్రియా, మెసినా, సైప్రస్, రోమ్, ఏథెన్స్, కార్తేజ్, జడియా వంటి దూర ప్రాంతాల నుంచి కూడా లక్షలాదిగా ప్రేక్షకులు వస్తారు. పదునైన పళ్ల చక్రాలున్న తన రథాన్ని సమీపంలోకి తెస్తూ, మెసాలా ఒకటొకటిగా అన్ని రథాలనూ కూల్చేస్తాడు. ఇక మిగిలింది ఒకే ఒక్క బెన్ హర్ రథం. కానీ దురదృష్టవశాత్తూ మెసాలా రథం చక్రం ఊడిపోయి, అతను గుర్రాలు కింద పడిపోతాడు. మర్నాడు మృత్యుశయ్య మీద ఉన్న మెసాలా-బెన్ హర్‌ను పిలిపించి, 'మీ అమ్మ, అక్కలు చనిపోలేదు! వాళ్లను నువ్వు గుర్తించగలుగుతావేమో చూడు. వాళ్లు కుష్టువాళ్లుండే లోయలో ఉన్నారు!' అంటాడు. దానితో బెన్ హర్ విజయానందం మాయమై, విషాదం అలముకొంటుంది. రథాల పందెంలో గెలిచిన హీరో అయిన బెన్ హర్‌కు రోమన్ సామ్రాజ్యం, రోమన్ పౌరసత్వాన్ని ఇస్తుంది. కానీ తన జీవితం జూడియాలో ఉందని చెప్తూ, బెన్ హర్ తనకు ఎడ్మిరల్ ఎరియస్ ఇచ్చిన రాజముద్రిక (ఉంగరం)ను తిరిగి ఇచ్చేస్తాడు. ఇటు కుష్టువారి లోయలో ఉన్న తన అక్క, అమ్మలను ఏసుక్రీస్తు దర్శనానికి తీసుకువెళితే, వారికి బాగు అవుతుందని భావించి, బెనార్ జెరూసలేంకు వస్తాడు. అప్పటికే క్రీస్తుపై నేరారోపణ చేసి, శిలువ వేయాలని గవర్నర్ ఆదేశాలు ఇస్తాడు. శిలువ మోస్తున్న క్రీస్తును చూసి, గతంలో తనకు మంచినీళ్లిచ్చిన మహానుభావుడు అతడేనని బెనార్ గుర్తిస్తాడు. ఆ వ్యక్తే ప్రపంచంలోని మానవుల పాపాల్ని మోస్తున్నాడని తల్లి అంటుంది. తర్వాత క్రీస్తును శిలువ వేయటంతో పెద్ద తుఫాను వస్తుంది. ఆ వర్షపు నీటిలో క్రీస్తు రక్తం కలిసి, ఆ నీరు వీళ్లను తాకుతుంది. ఆ పవిత్ర జలం కారణంగా వీరి వ్యాధులు నయమైపోతాయి. క్షమా గుణమే తనను, తన జాతి గతినీ మార్చిందనీ బెన్ హర్ గుర్తిస్తాడు. దూరంగా ఒక కొండ మీద మూడు శిలువలు కానవస్తూ ఉండగా కథ ముగుస్తుంది.[3]

నటీనటులు

[మార్చు]
  • ఛార్ల్‌టన్ హెస్టన్ - జూడా బెన్ హర్
  • జాక్ హాక్సిన్స్ - క్వింటస్ ఆరియస్
  • హయా హరారీట్ - ఎస్తర్
  • స్టీఫెన్ బాయిడ్ - మెసాలా
  • హ్యూ గ్రిఫిత్ - షేక్ ఇల్దేరిమ్
  • మార్తా స్కాట్ - మిరియమ్
  • కాథీ ఓ'డొనెల్ - తీర్జా
  • సామ్ జఫే
  • ఫిన్లే క్యూరీ
  • ఫ్రాంక్ థ్రింగ్
  • టెరెన్స్ లాంగ్డన్
  • జార్జ్ రెల్ఫ్
  • ఆండ్రె మోరెల్
  • లారెన్స్ పేయ్న్
  • క్లాడ్ హీటర్- ఏసుక్రీస్తు[4]
  • జోస్ గ్రేసీ - మేరీ[5]

నిర్మాణం

[మార్చు]

ఈ చలనచిత్రం కోసం ఏకంగా 1,00,000 (లక్ష) కాస్ట్యూములు, 18 వేల మంది ఎక్‌స్ట్రాలు, 300 సెట్లు, కోటిన్నర డాలర్ల ఖర్చుపెట్టారు. ప్రధానమైన రథాల రేసును ఇటలీలోని రోమ్‌లో సినీసిట్టా స్టూడియో బయట చిత్రీకరించారు.

పురస్కారాలు

[మార్చు]

ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల కోసం 12 విభాగాలలో నామినేట్ చేయబడగా 11 విభాగాలలో అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కథానాయకుడు, ఉత్తమ సహాయకనటుడు, ఉత్తమ కళాదర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ ఫిలిం ఎడిటింగ్, ఉత్తమ సంగీతం, ఉత్తమ సౌండ్ రికార్డింగ్ మొదలైన అన్ని విభాగాలలొ అవార్డులను గెల్చుకున్న మొదటి చిత్రంగా ప్రసిద్ధి చెందింది.

మూలాలు

[మార్చు]
  1. "Ben-Hur". The American Film Institute Catalog of Motion Pictures. American Film Institute. Retrieved July 6, 2013. Production Company: Metro-Goldwyn-Mayer Corp. (Loew's Inc.); Distribution Company: Loew's Inc.
  2. Sheldon Hall, Epics, Spectacles, and Blockbusters: A Hollywood History Wayne State University Press, 2010 p 162
  3. పాలకోడేటి సత్యనారాయణరావు (1 April 2007). హాలీవుడ్ క్లాసిక్స్ మొదటి భాగం (1 ed.). హైదరాబాదు: శ్రీ అనుపమ సాహితి. pp. 116–123.
  4. "Personal Website | Claudeheater".
  5. "Boot Hill: RIP José Greci". June 2, 2017. Archived from the original on December 29, 2019. Retrieved November 13, 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=బెన్_హర్&oldid=4202956" నుండి వెలికితీశారు