Jump to content

బెల్లంకొండ సంపత్ కుమార్

వికీపీడియా నుండి
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో భాగంగా మామిడి హరికృష్ణ నుండి సత్కారం అందుకుంటున్న బెల్లంకొండ సంపత్ కుమార్

బెల్లంకొండ సంపత్ కుమార్ మెదక్ జిల్లాకు చెందిన కవి, కథా రచయిత, విమర్శకుడు, పత్రికా సంపాదకుడు, పాఠ్య పుస్తక రచయిత. అతను తొలుత తెలంగాణ బాల సాహిత్య పరిషత్తులో, తర్వాత తెలంగాణ రచయితల వేదికలో బాధ్యుడు .[1]

జీవిత విశేషాలు

[మార్చు]

బెల్లంకొండ సంపత్ కుమార్ మెదక్ జిల్లాలోని నార్సింగిలో 1965 జూలై 7న బెల్లంకొండ భారత లక్ష్మి శ్రీ నరసింహాచార్యులు దంపతులకు జన్మించాడు. విద్యార్థి దశనుండే కవిత్వం రాయడం ప్రారంభించిన అతను తన తొలి కవిత తొమ్మిదవ తరగతి విద్యార్థిగా రాశాడు. ఎం.ఎ. తెలుగు చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో '20వ శతాబ్దపు మెదక్ జిల్లా రచయితల సాహిత్యం వివిధ ధోరణులు' అంశంపై పిహెచ్.డి చేశాడు. తెలంగాణ ఆవిర్భావ సందర్భంలో డా॥భూపాల్, డా॥వి.ఆర్. శర్మలతో కలిసి తెలంగాణ బాలసాహిత్య పరిషత్తును ఏర్పాటు చేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో మెదక్ జిల్లా నుండి తెచ్చిన బాలల రచనల విషయంలో సంపత్ ముందువరుసలో నిలిచి పనిచేశాడు. విద్యార్ధి రచయితలను వెన్ను, పెన్ను తట్టి ప్రోత్సహించిన సంపత్ వివిధ ప్రక్రియలు, రూపాల్లో, పిల్లలతో రచనలు చేయించాడు. పాఠశాల గోడపత్రిక ద్వారా ఎందరో బాల రచయితల్ని తయారుచేసి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, విద్య, హేతువు వంటి వాటితో పిల్లలతో కథలు, కవిత్వం రాయించి, నాటకలు వేయించాడు.

అనేక బాలసాహిత్య కార్యశాలలకు విషయనిపుణులుగా ఉండటమే కాక స్వయంగా పిల్లల కోసం కార్యశాలలు జరిపాడు. తెలంగాణ ఉపాధ్యాయ పత్రికకు సంపాదకులుగా ఉన్నాడు. రచనల చెరువు సాహితీ బులెటన్లకు సంపాదకత్వం వహిస్తున్నాడు. కవిగా సంపత్ తొలి సంతకంగా తెచ్చిన పుస్తకం "ఒక వేకువ కోసం కవిత్వం. తరువాత తెలంగాణ.. యోదుడు. విస్తృత వీరుడు. కేవల్ రెషన్' జీవిత కథను మనకోసం తెచ్చాడు. విద్వత్కవి వేముగంటి నరసింహాచార్యుల జీవిత కథను సంక్షిప్తంగా అందించాడు. అవధాని 'గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ' మోనోగ్రాఫ్ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు అకాడమి వారికోసం తెచ్చాడు. తెలంగాణ సాహిత్య అకాడమి కోసం 'మెదక్ జిల్లా సాహిత్య చరిత్ర' కూర్చాడు. కవి వారం కవితా సంకలనాలకు సంపాదకులుగా, తొలినాళ్ళలో తెలంగాణ రచయితల వేదిక తెచ్చిన 'సోయి'కి సంపాదకులుగా ఉన్నారు. 2019లో 'నూరు పూలు' తన సంపాదకత్వంలో తెచ్చారు. తెలంగాణ విస్తృత కవులు రచయితల సాహిత్యంపై పరిశోదన చేసి సాధికారిక వ్యాసాలు రాసిన సంపత్ అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పత్రసమర్పణ చేశారు. జనసాహితి మెదక్ యూనిట్, మంజీర కళా సమితి, రామాచంపేట, సింగిడి మెదక్ జిల్లా వంటి సంస్థల ఆవిర్భావాల్లో ఉన్న సంపత్ రచనల చెరువు వ్యవస్థాపక అధ్యక్షుడు. బి.ఎస్. రాములు కథా పురస్కారం, లయన్స్ క్లబ్ వారి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, గుర్రం జాషువా అవార్డు. బసవేశ్వర పురస్కారం, డాక్టర్ మాడనాగభూషణం సాహితీ పురస్కారం, సుదర్శనం హనుమాండ్లు స్మారక పురస్కారం వంటివి సంపత్ అందుకున్న పురస్కారాలు, గౌరవాలు.

రచనలు

[మార్చు]
  1. ఒక వేకువ కోసం కవిత్వం
  2. మల్లెపూల వాన బాల్యం బతుకు కథలు
  3. అక్షర శిల్పి వేముగంటి
  4. మెదక్ జిల్లా సాహిత్య చరిత్ర - తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ
  5. గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ - మోనో గ్రాఫ్ - తెలుగు అకాడమీ ప్రచురణ
  6. తెలంగాణ విస్మృత వీరుడు కేవల్ కిషన్
  7. మెతుకు కతలు - సంపాదకత్వం
  8. తొలినాళ్ళ సోయి - సంపాదకత్వం - తెలంగాణ సాహిత్య అకాడమీ
  9. నూరు పూలు డాక్టర్ నందిని సిధారెడ్డి ముందుమాటలు

మూలాలు

[మార్చు]