Jump to content

బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణం - కోల్ గేట్

వికీపీడియా నుండి


ఏడాదిన్నరగా యూపీఏకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న బొగ్గు క్షేత్రాల అక్రమ కేటాయింపు వ్యవహారం మళ్లీ రాజుకుంది. విపక్షాల ఆందోళనలు, కాగ్‌ నివేదికల నేపథ్యంలో వెలుగు చూసిన బొగ్గు కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివాదాస్పద నిర్ణయాల వెనుక కీలక పాత్ర పోషించిన నాటి బొగ్గు శాఖ సహాయమంత్రి దాసరితో పాటు కాంగ్రెస్‌ ఎంపీ, పారిశ్రామిక దిగ్గజం నవీన్‌ జిందాల్‌ పేర్లను సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది

కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌.....కాగ్‌, 2012 ఫిబ్రవరిలో భారీ కుంభకోణాన్ని బయటపెట్టింది. 2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల్ని మించిన దోపిడి జరిగిందని ఆరోపిస్తూ నివేదికను పార్లమెంటు ముందు ప్రవేశపెట్టింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో అనుసరించిన లోపభూయిష్ట విధానాలతో దేశ ఖజానాకు లక్షా 86వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు కాగ్‌ నివేదిక వెల్లడించింది. యూపీఏ-1లో 2006-2009 మధ్య కాలంలో బొగ్గు గనుల శాఖ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వద్దే ఉండేది. బొగ్గు నిల్వల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, దాదాపు వంద ప్రైవేట్ కంపెనీలు, విద్యుత్, స్టీల్, సిమెంట్ పరిశ్రమలకు చెందిన కొన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఈ బొగ్గు నిల్వలను కారు చౌకగా కొట్టేశాయని కాగ్ వివరించింది.

ఇలా బొగ్గు క్షేత్రాలను దక్కించుకన్న సంస్థల్లో టాటా గ్రూప్ సంస్థలు, జిందాల స్టీల్ పవర్ లిమిటెడ్, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్, అనిల్ అగర్వాల్ గ్రూప్ సంస్థలు, భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్, జైస్వాల్ నెకో, అభిజిత్ గ్రూప్, ఆదిత్యా, బిర్లా గ్రూప్ కంపెనీలు, ఎస్సార్ గ్రూప్ ప్రైవేట్ వెంచర్స్, అదానీ గ్రూప్, ఆర్సిలార్ మిట్టల్ ఇండియా, లాంకో గ్రూప్‌తో పాటు అనేక చిన్న, మధ్య తరహా సంస్థలకూ బొగ్గు నిల్వలను అత్యంత చవకగా కట్టబెట్టారని కాగ్ తప్పుబట్టింది. బొగ్గు గనుల్లో ఉన్న 90 శాతం నిల్వలను., వాటి ఉత్పత్తి ధరతో పోల్చి నష్టాన్ని లెక్కించిన కాగ్‌.. ప్రభుత్వ ఖజానాకు లక్షా 86వేల కోట్ల రూపాయల మేర నష్టం వచ్చిందని అంచనా వేసింది.


నిజానికి బొగ్గు క్షేత్రాల వేలం విధానానికి ప్రధాని సుముఖంగా ఉన్నా.. అది ఆచరణ రూపం దాల్చక పోవడం వెనుక బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఏకపక్ష రీతే కారణమన్న వాదనా వినిపిస్తోంది. సరళీకృత ఆర్థిక విధానాల పుణ్యమాని.. 1990 దశకంలో ప్రైవేటు సంస్థలు.. బొగ్గు వెలికితీత రంగంలోకి ప్రవేశించాయి. దేశవ్యాప్తంగా బొగ్గు నిక్షేపాలు ఉన్నా.. అందుకు తగ్గ డిమాండ్‌ లేకపోవడంతో.. అప్పట్లో బొగ్గు తవ్వకాలకు ఎవరూ ఆసక్తి చూపలేదు. అయితే.. 2003 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విద్యుత్, సిమెంట్‌ ఉత్పాదక రంగంలోకి ప్రైవేట్‌ సంస్థలు ప్రవేశించడంతో బొగ్గుకు డిమాండ్‌ పెరిగింది. అయితే డిమాండ్‌కు తగ్గట్లుగా... బొగ్గు గనుల్ని కేటాయించే విధానాలు లేకపోవడం.. పైగా పాత పద్ధతులే కొనసాగుతుండడంతో.. అక్రమాలకు తెర లేచింది.

2004లో యూపీఏ అధికారంలోకి వచ్చాక.. దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో తవ్వకాలకు... రాష్ట్రాల సిఫార్సుల ఆధారంగా కేంద్రం ప్రైవేట్‌ సంస్థలకు అనుమతులు మంజూరు చేసింది. బొగ్గు గనుల్ని ప్రైవేట్‌ సంస్థలకు ఏకపక్షంగా కట్టబెట్టకుండా.. వేలం పద్ధతిని ఎందుకు అనుసరించలేదన్న ప్రశ్న తలెత్తింది. పైగా ఈ అంశంపై క్యాబినెట్‌లోనూ చర్చకు పెట్టలేదు. బొగ్గుగనుల మంత్రిత్వ శాఖ ఏకపక్షంగా.. ప్రేవేటు సంస్థలకు పాత పద్ధతుల్లోనే గనులను కేటాయించేసింది.

బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్‌జావ్‌దేకర్‌ రెండేళ్ల క్రితం చీఫ్‌ విజిలెన్స్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కాగ్‌ కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. కాగ్‌ అభ్యంతరాలకు అప్పటి బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పి.సి.పరేఖ్‌ కూడా మద్దతు పలకడంతో.. కేంద్రం ఇరుకున పడాల్సి వచ్చింది.

దేశంలో బొగ్గుకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపు విధానాన్ని సవరించాలని 2004లోనే బొగ్గు మంత్రిత్వశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పటి దాకా అమల్లో ఉన్న క్యాప్టివ్‌ విధానానికి బదులు గనుల్ని వేలం వేయడం ద్వారా ఖజానా ఆదాయం ఎలా సమకూరుతుందో వివరిస్తూ అప్పటి బొగ్గు శాఖ కార్యదర్శి పి.సిపరేఖ్‌ ఓ నివేదికను 2004 జూలై 16న దాసరి నారాయణరావుకు సమర్పించారు. 2004 ఏప్రిల్‌ 28న బొగ్గుశాఖ కార్యదర్శి సమర్పించిన ప్రతిపాదనలపై ఇతర ప్రభుత్వ శాఖల అభిప్రాయాలను తెలుసుకోవాలని దాసరి సూచించారు. జూలై 30వ తేదీన దాసరి కోరిన వివరణలను బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పరేఖ్‌ అందచేశారు. ప్రభుత్వం కేటాయించే విధానంలో కొన్ని సంస్థలకే బొగ్గు క్షేత్రాలను కేటాయించే వీలుందని, ఫలితంగా ఇతర కంపెనీలు తప్పనిసరిగా కోల్‌ ఇండియా నుంచి బొగ్గును కొనుగోలు చేయాల్సి ఉంటుందని ..., దీని వల్ల ప్రభుత్వం నుంచి బొగ్గు గనులు దక్కించుకున్న కొన్ని సంస్థలకే మేలు కలుగుతుందని అభ్యంతరం తెలిపారు. 2004 అక్టోబరు నాలుగున వేలం పద్ధతికి సంబంధించిన ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని బొగ్గు శాఖ కార్యదర్శికి దాసరి లేఖ రాశారు. 2000 నాటి బొగ్గు గనుల జాతీయికరణ బిల్లు రాజ్యసభలో పెండింగ్‌ ఉన్నందున మరో ప్రతిపాదన అవసరం లేని చెప్పారు. వాణిజ్య పద్ధతిలో బొగ్గు క్షేత్రాలను ప్రైవేట్‌ సంస్థలకు కేటాయించేందుకు ఉద్దేశించిన బిల్లును వామపక్షాలు మొదట్నుంచి వ్యతిరేకించాయి. బొగ్గు గనుల తవ్వకాల్లో ప్రైవేట్‌ సంస్థల ప్రమేయాన్ని వామపక్షాలు వ్యతిరేకించినా, బొగ్గు క్షేత్రాల వేలం ప్రతిపాదన మాత్రం గతంలో జరగలేదు. దీంతో బొగ్గు మంత్రిత్వ శాఖలో గందరగోళం తలెత్తింది.

దాసరి నారాయణరావు లేవనెత్తిన అభ్యంతరాలపై స్పందింంచాల్సిందిగా 2004 అక్టోబరు 14న ప్రధాన మంత్రి కార్యాలయం బొగ్గు శాఖ కార్యదర‌్శ పరేఖ్‌ను పిఎంఓ ఆదేశించింది. అయితే 2004 నవంబరు1న క్యాప్టివ్‌ మైన్స్‌ కోసం 2004 జూన్‌ 28వరకు అందిన దరఖాస్తుల్ని పాత పద్ధతిలోనే కేటాయించాలని పిఎంఓ నిర్ణయించింది. వేలం పద్ధతిని అమల్లోకి తీసుకువచ్చేందుకు బొగ్గు గనుల చట్టానికి సవరణలు చేయాలని కూడా భావించింది. 2004 శీతాకాల సమావేశాల్లోపు అందుకు అవసరమైన ముసాయిదాను అందచేయాల్సిందిగా బొగ్గుశాఖ కార్యదర్శిని పిఎంఓ ఆదేశించింది. 2004 నవంబరు27న యూపీఏ ప్రభుత్వ మనుగడకు జార్ఖండ్‌ ముక్తిమోర్చా సభ్యుల మద్ధతు అవసరమవడంతో శిబూసోరెన్‌ను క్యాబినెట్‌లోకి తీసుకుని ఆయనకు బొగ్గు మంత్రిత్వ శాఖని తిరిగి అప్పగించారు. 2004 డిసెంబరు 23న ప్రధాన మంత్రి కార్యాలయం కోరిన ముసాయిదాను బొగ్గు శాఖ కార్యదర్శి పరేఖ్‌.....దాసరి నారాయణరావు అమోదం కోసం పంపారు. ఇక అప్పటికే బొగ్గు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శిబూసోరెన్ 2005 జనవరి 28న బొగ్గు గనుల వేలం పద్ధతిని వ్యతిరేకించారు. వేలం పద్ధతి వద్దంటూ బొగ్గు శాఖ కార్యదర్శిని ఆదేశించారు. 2005 మార్చి 2న శిబూసోరెన్‌ రాజీనామాతో బొగ్గుశాఖ తిరిగి ప్రధాన మంత్రి పరిధిలోకి వచ్చింది. సోరెన్‌ పదవి నుంచి తప్పుకోవడంతో పాతప్రతిపాదనలను తిరిగి ప్రధాని అమోదం కోసం పిఎంఓ కార్యాలయానికి పంపారు. బొగ్గు గనుల కోసం అందిన దరఖాస్తుల్ని వేలం వేయాలని సూచించారు. 2005 మార్చి 16 బొగ్గుశాఖ ప్రతిపాదనపై పిఎంఓ స్పందించి....తాజా ప్రతిపాదనను సమర్పించాలని ఆదేశించింది. 2005 మార్చి 24న బొగ్గుశాఖ కార్యదర్శి పరేఖ్‌ కేబినెట్‌ నోట్‌ను వివిధ శాఖలకు పంపారు. విద్యుత్‌, స్టీల్‌ మంత్రిత్వ శాఖల అభిప్రాయాన్ని తెలియచేయాల్సిందిగా లేఖలు రాశారు. రాష్ట్రాలు కూడా తమ అభిప్రాయాలను పంపాలని సూచించారు.

వివిధ ప్రభుత్వ శాఖలు, రాష్ట్రాల నుంచి అందిన సూచనలు, సలహాలను పొందుపరిచి 2005 జూన్‌ 21న ప్రధాని అమోదం కోసం చట్టసవరణకు కొత్త ముసాయిదాను పిఎంఓకు బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంపారు. అయితే 2005 జూలై4న బొగ్గు క్షేత్రాల వేలంలో పాల్గొనేందుకు విద్యుత్‌ సంస్థలు సుముఖంగా లేవని ప్రధానికి దాసరి నారాయణరావు లేఖ రాశారు. వేలం ప్రతిపాదనను మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే బొగ్గు క్షేత్రాల వేలానికి రాష్ట్రాలు, వివిధ ప్రభుత్వ శాఖలు అనుకూలంగా ఉన్నాయనే సంగతిని దాసరి ప్రస్తావించలేదు. ప్లానింగ్‌ కమిషన్‌, ఆర్థిక శాఖ, గనుల శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖలు కూడా బొగ్గు మంత్రిత్వ శాఖ చేసిన వేలం ప్రతిపాదనకు అనుకూలంగా స్పందించాయి. దీంతో 2005 జూలై 25న బొగ్గు క్షేత్రాల వేలానికి ప్రధానమంత్రి కార్యాలయం అమోదం తెలిపింది. బొగ్గు గనుల జాతీయికరణ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. ప్రతిపాదిత సవరణ పార్లమెంటులో నెగ్గడానికి సమయం పడుతున్నందున అప్పటికే అందిన దరఖాస్తుల్ని పరిష్కరించాలని నిర్ణయించి 24 బొగ్గు క్షేత్రాలను వేలం వేశారు. అయితే పిఎంఓలోని కొందరు అధికారులు, బొగ్గు మంత్రిత్వ శాఖ పెద్దలు కలిసి వేలం పద్ధతి అమల్లోకి రాకుండా చట్టపరమైన అడ్డంకులను సృష్టించారని బొగ్గుశాఖ కార్యదర్శి కాగ్‌ నివేదిక వెలుగు చేసిన తర్వాత ఆరోపించారు.

బొగ్గు చట్టాన్ని సవరిస్తూ ప్రతిపాదించిన ముసాయిదా క్యాబినెట్‌ నోట్‌ 2006 జనవరి 12న దాసరి వద్దకు వచ్చింది. అయితే ఆ నోట్‌ను పరిష్కరించాల్సిన అత్యవసర పరిస్థితేమి లేదని, తగిన సమయంలో ప్రతిపాదించాలంటూ పెండింగ్‌లో ఉంచేశారు. ఓ దశలో ప్రధాని సూచించినా దాసరి సరిగా స్పందించలేదని కూడా మీడియా కథనాలు వెలువడ్డాయి. అదే సమయంలో జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తడం, శిబూసోరెన్‌ మళ్లీ పదవిని పోగొట్టుకోవడంతో 2006 జనవరి 29న మళ్లీ బొగ్గుశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2006 ఏప్రిల్‌ 7న బొగ్గు గనుల చట్ట సవరణను మొత్తం ఖనిజాలకు వర్తింపచేయాలని ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశం నిర్ణయించింది. మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ 1957ను సవరించాలని ప్రధాని నిర్ణయించారు. అయితే ఎంఎండిఆర్‌ చట్టాన్ని సవరించడమంటే రాష్ట్రాల హక్కుల్ని అడ్డుకోవడమేనంటూ 2006 ఏప్రిల్‌ 27న దాసరి ఫైల్‌నోట్‌ రాశారు. దాసరి లేవనెత్తిన అభ్యంతరాలకు శిబూసోరెన్‌ కూడా మద్దతిచ్చారు. దీంతో 2006 మే2న బొగ్గు శాఖ లేవనెత్తిన అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని ముసాయిదాలో మార్పులు చేయాల్సిందిగా ఫైల్‌ను గనులశాఖకు పంపారు. అది అక్కడి నుంచి న్యాయశాఖకు, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మధ్య చక్కర్లు కొట్టింది. చివరకు 2006 సెప్టెంబరు 15న ముసాయిదాలో మార్పుల గురించి కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ పిఎంఓకు తెలియచేసింది. బొగ్గు శాఖ కార్యదర్శి సవరణలకు ప్రతిపాదించిన రెండేళ్ల తర్వాత అంటే 2008 అక్టోబరు 17న మైన్స్ అండ్‌ మినరల్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌ చట్ట సవరణ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చింది. అక్టోబరు 31న ప్రతిపాదిత బిల్లు స్థాయి సంఘానికి వెళ్లింది. 2009 ఫిబ్రవరి9న బొగ్గు గనుల స్థాయి సంఘం తన సిఫార్సులను పార్లమెంటుకు సమర్పించింది. 2010 ఫిబ్రవరి 18న ప్రతిపాదిత బిల్లును పార్లమెంటు అమోదించింది. 2010 సెప్టెంబరు 8న రాష్ట్రపతి అమోదం లభించింది. సెప్టెంబరు 9న చట్టాన్ని నోటిఫై చేశారు. 2012 ఏప్రిల్‌తో దాసరి నారాయణరావు పదవీకాలం ముగిసింది. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న దాసరిని మూడోసారి మాత్రం ఎంపిక చేయలేదు.

బొగ్గు క్షేత్రాల కేటాయింపు వ్యవహారంపై సిబిఐ నమోదు చేసిన 12వ ఎఫ్‌ఐఆర్‌లో బొగ్గు మంత్రిత్వ శాఖ మాజీ సహాయమంత్రి దాసరి నారాయణరావుతో పాటు, పారిశ్రామిక దిగ్గజం నవీన్‌ జిందాల్‌ పేర్లను సిబిఐ చేర్చింది. నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టాల ప్రకారం మరో నాలుగు సంస్థలపై కేసులు నమోదయ్యాయి.

బొగ్గు క్షేత్రాల అక్రమ కేటాయింపుల వ్యవహారంలో సూత్రధారులపై ఎట్టకేలకు కేసులు నమోదయ్యాయి. గత ఏడాది కాలంగా యూపీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోన్న బొగ్గు కుంభకోణం వ్యవహారంలో కీలక పరిణమాలు చోటు చేసుకున్నాయి. బొగ్గు క్షేత్రాల అక్రమ కేటాయింపుల వ్యవహారంపై సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావుతో పాటు కాంగ్రెస్‌ ఎంపీ నవీన్‌ జిందాల్‌ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. వీటితో పాటు జిందాల్‌ స్టీల్‌, మరో నాలుగు కంపెనీల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పంతొమ్మిది ప్రాంతాల్లో సోదాలను నిర్వహించారు. కురుక్షేత్ర ఎంపీగా ఉన్న జిందాల్‌ నివాసంతో పాటు జిందాల్‌ గ్రూప్‌ కార్యాలయాల్లో సిబిఐ బృందాలు సోదాలు జరిపాయి. ఇటు హైదరాబాద్‌లోని దాసరినారాయణరావు నివాసంలో సోదాలు జరిగాయి. నవీన్‌ జిందాల్‌కు చెందిన గగన్‌ స్పాంజ్‌, జిందాల్‌ రియాల్టీతో పాటు దాసరి నారాయణరావుకు చెందిన సౌభాగ్య మీడియా సంస్థలపై అభియోగాలను నమోదు చేశారు. నిందితులపై మోసం, వాస్తవాలను దాచిపెట్టడం వంటి అభియోగాలు సిబిఐ దాఖలు చేసింది. జార్ఖండ్‌లోని బిర్బం జిల్లాలోని అమర్‌కొండా ముర్గాదంగల్‌ బొగ్గు క్షేత్రాలను 2008లో అక్రమంగా కట్టబెట్టారని సిబిఐ ఆరోపించింది. అందుకు ప్రతిగా దాసరి కుమార్తె సౌభాగ్యకు చెందిన మీడియా షేర్లను జిందాల్‌ గ్రూప్‌ కొనుగోలు చేసిందని సిబిఐ ఆరోపించింది.

తాజా పరిణామాల నేపథ్యంలో జిందాల్‌ గ్రూప్‌ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆసంస్థ ప్రకటించింది. సిబిఐ విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పింది. బొగ్గు క్షేత్రాల అక్రమ కేటాయింపులకు సంబంధించి సిబిఐ నమోదు చేసిన 12వ ఛార్జిషీటులో ఇద్దరు కాంగ్రెస్‌ నేతల్ని సిబిఐ ప్రశ్నించడం కలకలం సృష్టించింది. ప్రధ్విరాజ్ రోడ్డులోని జిందాల్‌ అధికారిక నివాసంతో పాటు బికాజీ కామా ప్లేస్‌లో ఉన్న జిందాల్‌ కార్యాలయాల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. దాసరి నారాయణరావు బొగ్గు శాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలో జిందాల్‌కు బొగ్గు క్షేత్రాలు దక్కడం వెనుక అక్రమాలు జరిగాయని సిబిఐ ఆరోపిస్తోంది. ఇద్దరు కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసింది. బొగ్గు శాఖ సహాయ మంత్రిగా దాసరి నారాయణ రావు రెండుసార్లు పనిచేశారు. 2000సంవత్సరంలో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన దాసరి 2004-06 మధ్య మొదటిసారి బొగ్గు శాఖలో పనిచేశారు. ఆ తర్వాత 2006-08 మధ్య మరోమారు అదే శాఖను నిర్వహించారు. యూపీఏ తొలిసారి అధికారంలోకి వచ్చినపుడు సంకీర్ణంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జెఎంఎం అధ‌్యక్షుడు శిబూసోరెన్‌కు బొగ్గు మంత్రిత్వ శాఖ దక్కినా ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయనపై హత్యాభియోగాలు రుజువవ్వడంతో పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆ సమయంలో బొగ్గు శాఖ ప్రధాని వద్దే ఉంది. దాసరి సహాయ మంత్రి హోదాలో బొగ్గుశాఖలో చక్రం తిప్పారు. హైదరాబాద్‌లోని దాసరి నివాసంలో తొమ్మిది గంటల పాటు సోదాలు నిర్వహించారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన సోదాల్లో జూబ్లిహిల్స్‌లోని దాసరినారాయణరావు ఇంటితో పాటు ఆయన కుమార్తె సౌభాగ్య, దాసరి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపు వ్యవహారంలో దాసరిని గతంలో కూడా సిబిఐ ప్రశ్నించింది. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన సోదాలు ఏకథాటిగా తొమ్మిది గంటలపాటు సాగాయి. హైదరాబాద్‌లో దాసరికి సంబంధించిన నాలుగు చోట్ల సోదాలు జరిగాయి. మాధాపూర్‌లో నివసించే దాసరి నారాయణరావు కుమార్తె సౌభాగ్య నివాసంతో పాటు రెండు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.. బొగ్గు బ్లాకులను కేటాయించింనందుకు ప్రతిగా దాసరి కూతురు సౌభాగ్యకు చెందిన మీడియా సంస్థ షేర్లను జిందాల్ గ్రూపు అధిక ధరకు కొనుగోలు చేసిందని ఆరోపణల నేపథ్యంలో సీబీఐ పలు అంశాలను వెలికి తీసేందుకు దాసరి కుమార్తెను కూడా ప్రశ్నించారు. దాసరి నివాసం., కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

బొగ్గు క్షేత్రాల కేటాయింపుకు సంబంధించి నవీన్‌ జిందాల్‌, దాసరి నారాయణరావుల పేర్లను చేర్చడం వెనుక ఆసక్తికరమైన పరిణామాలే ఉన్నాయి. లక్షా 86వేల కోట్ల నష్టం వాటిల్లిందని భావిస్తోన్న బొగ్గు గనుల కేటాయింపుల్లో దాసరికి చెందిన సంస్థలకు జిందాల్‌ గ్రూపు నుంచి నిధులు అందాయని సిబిఐ ఆరోపిస్తోంది.

బొగ్గు క్షేత్రాల అక్రమ కేటాయింపుల వ్యవహారంలో మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కొన్నేళ్ల క్రితం దాసరి నారాయణరావు దాసరి హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ అనే సంస్థను ఏర్పాటు చేశారు. తర్వాత దానినే సిరి మీడియాగా మార్చారు. మూడేళ్ల క్రితం స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్టెడ్‌ కంపెనీ అయిన సౌభాగ్య సంస్థలో దాసరికి చెందిన సిరి మీడియా మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది. దీంతో ఈ సంస్థ దాసరి సొంతమైంది. ఈ కంపెనీలలో దాసరి వివిధ హోదాలలో వ్యవహరించారు. 2004లో కేంద్ర మంత్రి పదవిని చేపట్టాక ఆ పదవుల నుంచి వైదొలిగారు. అప్పట్నుంచి ఈ సంస్థ బాధ్యతలను దాసరి కుటుంబసభ్యులు చూస్తున్నారు. అయితే ఈ సంస్థల్లో దాసరి వాటా మాత్రం అలాగే కొనసాగింది. కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రిగా దాసరి బాధ్యతలు చేపట్టాక ఆయనకు చెందిన సంస్థల్లో నవీన్‌ జిందాల్‌ పెట్టుబడులు పెట్టారు. జిందాల్ ఏర్పాటు చేసిన ఎగ్జిమ్ కంపెనీ, జిందాల్‌కే చెందిన కంపెనీ నుంచి తీసుకున్న రూ.2.25 కోట్ల రుణాన్ని... హైదరాబాద్‌కు చెందిన సౌభాగ్య మీడియా అనే లిస్టెడ్ కంపెనీలో పెట్టుబడి పెట్టింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రూ.27 పలుకుతున్న సౌభాగ్య షేరును ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ఏకంగా రూ.112.50 పెట్టి కొనుగోలు చేసింది.

నవీన్ జిందాల్ కంపెనీలకు చెందిన మాజీ డైరెక్టర్లు, ప్రస్తుత డైరెక్టర్లు కలిసి 2008లో న్యూఢిల్లీ ఎగ్జిమ్ అనే ఒక ట్రేడింగ్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ప్రారంభమైనప్పుడు దాని ఆదాయం రూ.12,182 మాత్రమే. అదే కంపెనీకి నవీన్ జిందాల్‌కు చెందిన డ్యూస్ ప్రాపర్టీస్ అనే సంస్థ రూ.2.25 కోట్ల రుణాన్ని ఎలాంటి షరతులు, గ్యారెంటీలు లేకుండా న్యూ ఎగ్జిమ్‌కు ఇచ్చింది. ఆ సమయంలో డ్యూస్ కంపెనీ విలువ రూ.1.17 కోట్లు మాత్రమే. ఇలా వచ్చిన డబ్బును దాసరికి చెందిన సౌభాగ్య మీడియాలో పెట్టుబడులుగా పెట్టారు. న్యూ ఎగ్జిమ్‌, డ్యూస్‌ కంపెనీల డైరెక్టర్లు గతంలో నవీన్ జిందాల్ కంపెనీల్లో పనిచేశారు. 2007 సెప్టెంబరులో డ్యూస్ కంపెనీలో షేర్ హోల్డర్లుగా ఉన్న ఆనంద్ గోయల్, సురీందర్‌పాల్ సింగ్, రాజీవ్ అగర్వాల్..... నవీన్ జిందాల్ కంపెనీల్లో డైరెక్టర్లుగా పనిచేశారు. 2009 సెప్టెంబరులో డ్యూస్ కంపెనీ జిందాల్ రియాల్టీగా మారింది. ఈ కంపెనీ షేర్లను నవీన్ జిందాల్, ఆయన భార్య షల్లు జిందాల్‌లకు చెందిన రెండు కంపెనీలు చేజిక్కించుకున్నాయి. న్యూఢిల్లీ ఎగ్జిమ్‌కు ఎలాంటి ష్యూరిటీలు లేకుండా డ్యూస్‌ సంస్థ రూ.2.25 కోట్లు ఎందుకు ఇచ్చారన్న సిబిఐ ప్రశ్నకు జిందాల్ రియాల్టీ సీఎఫ్‌వో సునీల్ మల్హోత్రా తగిన సమాధానం ఇవ్వలేదు. న్యూఎగ్జిమ్‌ పెట్టుబడులు పెట్టిన సౌభాగ్య మీడియా కంపెనీ సినిమాలు, టీవీ కార్యక్రమాలను నిర్మిస్తోంది. అసలు విషయమేమిటంటే... ఈ కంపెనీలో దాసరి నారాయణరావుకు చెందిన సిరి మీడియాకు 59.6 శాతం వాటా ఉంది.

బొగ్గు క్షేత్రాలను కేటాయించినందుకు జిందాల్‌... దాసరి రుణం తీర్చుకున్నారని సిబిఐ అనుమానిస్తోంది. 2009 ఫిబ్రవరిలో ఒడిషాలోని తాల్చేరులో 1500మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బొగ్గు గనుల్ని ప్రభుత్వరంగ కోల్‌ ఇండియాకు కాదని జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌కు కట్టబెట్టారు. ఇందుకు ప్రతిగా సౌభాగ్య మీడియాలో జిందాల్‌ పెట్టుబడులు పెట్టారని అనుమానిస్తున్నారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపు వ్యవహారం వెలుగు చూసిన తర్వాత 2012 సెప్టెంబరు 15న కేంద్రం ఏర్పాటు వివిధ మంత్రిత్వ శాఖల బృందం ఈ కేటాయింపుల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.