బ్రహ్మదేవ్ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బి.డి.శర్మ

బ్రహ్మదేవ్ శర్మ (బి.డి.శర్మ గా సుప్రసిద్ధులు) ఐ.ఎ.ఎస్. అధికారి. ఆయన ఒక ఐదు ఆరు దశాబ్దాల పాటు ఈ దేశ పేదప్రజల గురించి ముఖ్యంగా గిరిజనుల కొరకు అహోరాత్రులు తపించి, శ్రమించిన ఒక అధికారి. బస్తర్‌ కలెక్టర్‌గా ఆయన చేసిన పనులను కథలు కథలుగా ప్రజలు ఆ ప్రాంతంలో చెబుతూ ఉంటే జానపద కథా నాయకులు గుర్తుకొస్తారు. ఆయన పర్యావరణ రక్షణకూ ఉద్యమించారు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

బిడి శర్మ 19 జూన్‌, 1931లో ఉత్తరప్రదేశ్‌ మురాదాబాద్‌లో జన్మించారు. అనంతరం ఆయన కుటుంబం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు మారింది. బిడి శర్మ1956లో మధ్యప్రదేశ్‌ కాడర్‌ ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. గణితంలో పిహెచ్‌డి చేసిన శర్మ- 1968 నుంచి 1970 వరకు మధ్యప్రదేశ్‌లోని బస్తర్‌ జిల్లాలో కలెక్టర్‌గా పనిచేశారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో ఆదీవాసీ సమాజంతో ఆయనకు విడదీయరాని బంధం ఏర్పడింది.[2]

గణిత శాస్త్రంలో డాక్టరేటు డిగ్రీ పొంది 1952-53 సంవత్సరంలో అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన తొలిరోజులలోనే సివిల్‌ సర్వీస్‌లో చేరారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టగానే ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ఆది వాసీలను అణచివేస్తున్న పెత్తందారీ వ్యవస్థపై ఉక్కు పాదం మోపారు. ఆయన 1981 వరకు సర్వీసులో కొనసాగారు. కొన్నాళ్లకు షిల్లాంగ్‌లోని నార్త్‌ ఈస్టెర్న్‌ హిల్‌ వర్శిటీ ఉప సంచా లకులుగా బాధ్యతలు నిర్వర్తించారు. 1986లో శర్మను మేఘాలయ ప్రభుత్వం ఎస్సీఎస్టీ కమిషనర్‌గా నియ మించింది. 1991లో పదవీ విరమణ చేసిన శర్మ.. బస్తర్‌ గ్రామాల్లోని ఆదివాసీలకు మద్దతుగా పోరును మొదలు పెట్టారు. భారత రాజ్యాంగం 26 నవంబర్‌ 1949న రాజ్యాంగ సభ ఆమోదించడంతో భారత ప్రజలకి స్వాతంత్య్రం, రాజ్యాంగపర హక్కులు లభిస్తే, ఆరోజే ఈ దేశంలోని గిరిజనులు తమ స్వేచ్ఛను, తమ సహజమైన హక్కులను కోల్పోయారని కరాఖండిగా అన్ని వేదికల మీదినుంచి చెప్పేవారు. బ్రిటిష్‌ వాళ్ళు అడవి సంపదను దోచుకోవడానికి తెచ్చిన ఎమినెంట్‌ డొమేన్ (BBC) అనే భావనను రాజ్యాంగం పునర్‌ నిర్వచించే బదులు దానికి చట్టబద్ధత కల్పించడంతో, ఈ దేశ గిరిజనుల స్వేచ్ఛాయుత జీవితం రాజ్య ఆధిపత్య అధికారానికి ముడివేయబడడంతో, గిరిజనులు ఎంత విలవిలకొట్టుకున్నా ఆ బంధం నుంచి బయటపడలేక పోతున్నారని బాధపడేవారు. ఈ విషాదాన్ని గురించి కేబినెట్‌లో మంత్రులకు, ప్రధాన మంత్రులకు వివరించేవారు, వాళ్ళతో వాదించేవారు, జాతీయ అంతర్జాతీయ వేదికల మీద సవాలు చేసేవారు, విస్తృతంగా దాని గురించి రాసేవారు.[3]

ఎప్పుడూ గిరిజనులు, పేదలు, రైతుల సంక్షేమం గురించే ఆలోచించే శర్మ- ఎస్‌టి కమిషన్‌ కమిషనర్‌గా ఆయన ఇచ్చిన రిపోర్టు ఆదివాసీలకు ఎంతో న్యాయం చేకూరిందని చెబుతారు. 1973-74లో హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా కూడా బిడి శర్మ పనిచేశారు.

నిరాడంబర జీవితం[మార్చు]

ఢిల్లీలో శర్మ గారు ఉండే ఇల్లు ప్రతి వాళ్ళని ఆశ్చర్యపరుస్తుంది. పాత ఢిల్లీ హజ్రత నిజాముద్దీన రైల్వేస్టేషన దగ్గర ఒక మురికివాడలో ఇల్లు. ఒక చిన్న గది, గది నిండా పుస్తకాలు. ఇక ఏ ఇతర సౌకర్యాలు లేవు. తలుపులు తాళాలు లేని ఇల్లు. ఒక సందర్భంలో ఒక జాతీయ ఎలక్ర్టానిక్‌ చానెల్‌ మహిళా రిపోర్టర్‌ ఇంటర్వ్యూ చేయడానికి ఆ ఇంటికి వచ్చి, శర్మ జీవించే పద్ధతి చూసి చలించిపోయి ఏడ్వడం మొదలుపెట్టింది. గత రెండు మూడు ఏళ్ళుగా ఆయన జ్ఞాపకశక్తి తగ్గుతూ వచ్చింది. ఆ జబ్బుకు ఇంతవరకు సరియైున ట్రీట్‌మెంట్‌ లేదు. దాంతో ఆయనను ఢిల్లీ నుంచి స్వంత పట్టణం గ్వాలియర్‌కు షిఫ్ట్‌ చేసారు. ఆయన డిసెంబరు 6 2015 న మరణించారు.

మూలాలు[మార్చు]

  1. ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు బీడీశర్మ ఇకలేరు
  2. "కన్నుమూసిన ఆదివాసి ఉద్యమ నేత బిడి శర్మ". Archived from the original on 2016-03-01. Retrieved 2016-06-08.
  3. బి.డి.శర్మ : ఒక అద్భుత జీవితం 08-12-2015[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]