బ్రిటిష్ సామ్రాజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రిటిష్ సామ్రాజ్యం
Flag of బ్రిటిష్ సామ్రాజ్యం
ఎడమ: గ్రేట్ బ్రిటన్ జెండా (1707 ఏకీకరణ చట్టాల ప్రకారం)
కుడి: యునైటెడ్ కింగ్‌డం జెండా (1800 ఏకీకరణ చట్టాల ప్రకారం)
ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఉన్న ప్రాంతాలు. ప్రస్తుతం కూడా బ్రిటిష్ ఓవర్‌సీస్ టెరిటరీస్ పేరుతో ఉన్న భూభాగాలను ఎర్ర క్రీగీతతో చూపించబడ్డాయి.

యునైటెడ్ కింగ్‌డమ్, అది ఏర్పడక ముందు ఉనికిలో ఉన్న దేశాలూ పరిపాలించిన దేశాలు, కాలనీలు, ప్రొటెక్టరేట్లు, సామంత ప్రాంతాలు, తదితర భూభాగాలతో కూడిన ప్రాంతాలన్నిటినీ కలిపి బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. ఇది 16 వ శతాబ్దం చివర, 18 వ శతాబ్దాల మధ్య ఇంగ్లాండ్ స్థాపించిన విదేశీ ఆస్తులు, వాణిజ్య పోస్టులతో ప్రారంభమైంది. ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు ఇది చరిత్రలో కెల్లా అతిపెద్ద సామ్రాజ్యం. ఒక శతాబ్దానికి పైగా ప్రపంచ శక్తిగా నిలిచింది.[1] 1913 నాటికి బ్రిటిష్ సామ్రాజ్యంలో 41.2 కోట్ల జనాభా ఉండేది. ఆనాటి ప్రపంచ జనాభాలో అది 23%.[2] 1920 నాటికి దాని విస్తీర్ణం 3,55,00,000 చ.కి.మీ. ఉండేది.[3] యావత్తు భూభాగంలో ఇది 24%. ఫలితంగా, దాని రాజ్యాంగ, చట్టపరమైన, భాషా, సాంస్కృతిక వారసత్వం విస్తృతంగా ఉంది. దాని శక్తి అత్యున్నత స్థాయిలో ఉన్నపుడు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వర్ణించడానికి "సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం" అనే మాటను తరచుగా ఉపయోగిస్తారు.రోజులో ఏసమయంలో నైనా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న దాని భూభాగాలలో కనీసం ఏదో ఒకదాని పైనైనా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు.[4]

15, 16 వ శతాబ్దాలలో డిస్కవరీ యుగంలో, పోర్చుగల్, స్పెయిన్ దేశాలు భూగోళంపై యూరోపియన్ల అన్వేషణకు ముందంజ వేసాయి. ఈ క్రమంలో అవి పెద్ద విదేశీ సామ్రాజ్యాలను స్థాపించాయి. ఈ సామ్రాజ్యాలు సృష్టించిన గొప్ప సంపద గురించి అసూయపడిన ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ దేశాలు [5] అమెరికా, ఆసియాల్లో తమ స్వంత కాలనీలు, వాణిజ్య నెట్‌వర్క్‌లను స్థాపించడం ప్రారంభించాయి. 17, 18 వ శతాబ్దాలలో నెదర్లాండ్స్, ఫ్రాన్స్‌తో వరసగాఅ జరిగిన యుద్ధాల పర్య్వసానంగా ఇంగ్లాండ్ (1707 లో ఇంగ్లాండ్, స్కాట్లాండ్ లు ఏకమైన తరువాత ఇంగ్లాండ్, "బ్రిటన్" అయింది), ఉత్తర అమెరికాలో ఆధిపత్య శక్తిగా రూపొందింది. 1757 లోజరిగిన ప్లాసీ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్ బెంగాల్‌ను స్వాధీనం చేసుకోవడంతో, బ్రిటన్ భారత ఉపఖండంలో ఆధిపత్య శక్తిగా మారింది.

సామ్రాజ్య మూలాలు[మార్చు]

ఇంగ్లాండ్, స్కాట్లాండ్‌లు ప్రత్యేక రాజ్యాలుగా ఉన్న కాలంలోనే బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు ఏర్పడ్డాయి. విదేశీ భూభాగాల అన్వేషణలో స్పెయిన్, పోర్చుగల్ దేశాలు సాధించిన విజయాల తరువాత, 1496 లో, ఇంగ్లాండ్ రాజు హెన్రీ VII, ఉత్తర అట్లాంటిక్ ద్వారా ఆసియాకు ఒక మార్గాన్ని కనుగొనేందుకు ఒక సముద్రయానానికి నిర్దేశించి, దానికి జాన్ కాబోట్‌ను నాయకుడుగా నియమించాడు.[6] అమెరికాను కనుగొన్న ఐదు సంవత్సరాల తరువాత, 1497 లో కాబోట్ ప్రయాణించాడు. కాని అతను న్యూఫౌండ్లాండ్ తీరానికి చేరాడు. క్రిస్టోఫర్ కొలంబస్ లాగానే అతను కూడా తాను ఆసియాకు చేరుకున్నానని తప్పుగా భావించాడు.[7] అతడు, అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చెయ్యలేదు. మరుసటి సంవత్సరం కాబోట్ అమెరికాకు మరో సముద్రయానానికి వెళ్ళాడు. కాని ఆ తరువాత అతని గురించిన సమాచారమేమీ తెలియ రాలేదు.[8]

16 వ శతాబ్దపు చివరి దశాబ్దాలలో క్వీన్ ఎలిజబెత్ I పాలన జరుగుతున్నంత వరకూ అమెరికాలో ఆంగ్ల కాలనీలను స్థాపించడానికి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. [9] ఈ సమయంలో, 1533 నాటి స్టాట్యూట్ ఇన్ రెస్ట్రెయింట్ ఆఫ్ అప్పీల్స్ చట్టం "ఈ ఇంగ్లాండ్ రాజ్యమే ఒక సామ్రాజ్యం" అని ప్రకటించింది.[10] ఇంగ్లాండులో ప్రొటెస్టంట్ సంస్కరణలు జరిగిన తరువాత అది, కాథలిక్ దేశమైన స్పెయిన్లు అనివార్యంగా శత్రువులుగా మారిపోయాయి.[6] 1562 లో, బానిస వాణిజ్యంలోకి ప్రవేశించే లక్ష్యంతో, పశ్చిమ ఆఫ్రికా తీరంలో స్పానిష్, పోర్చుగీస్ నౌకలపై బానిస దాడులకు పాల్పడమని ఇంగ్లీష్ రాణి, ప్రైవేట్ జాన్ హాకిన్స్, ఫ్రాన్సిస్ డ్రేక్‌లను ప్రోత్సహించింది.[11] ఈ ప్రయత్నాలను ఆ దేశాలు తిప్పికొట్టాయి. ఆ తరువాత, ఆంగ్లో-స్పానిష్ యుద్ధాలు తీవ్రతరమైనపుడు ఎలిజబెత్ I, అమెరికాలోని స్పానిష్ ఓడరేవులపైన, కొత్త ప్రపంచం నుండి నిండుగా నిధులతో తిరిగి వస్తున్న ఓడలపైనా మరింతగా దాడులు చెయ్యమని ప్రైవేటు దళాలకు ఆమె ఆశీర్వాదం ఇచ్చింది. [12] అదే సమయంలో, రిచర్డ్ హక్లూయిట్, జాన్ డీ ("బ్రిటిష్ సామ్రాజ్యం" అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించినది ఇతడే)[13] వంటి ప్రభావవంతమైన రచయితలు ఇంగ్లాండు స్వంతంగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకోవాలని వత్తిడి చేయడం ప్రారంభించారు. ఈ సమయానికి, స్పెయిన్ అమెరికాలో ఆధిపత్య శక్తిగా మారి, పసిఫిక్ మహాసముద్రాన్ని జల్లెడ పడుతోంది. పోర్చుగల్, ఆఫ్రికా నుండి బ్రెజిల్ తీరాల నుండి చైనా వరకు వాణిజ్య స్థావరాలను, కోటలనూ ఏర్పాటు చేసుకుంది. ఫ్రాన్స్ సెయింట్ లారెన్స్ నది ప్రాంతంలో స్థావరాలను ఏర్పరచుకోవడాం ప్రారంభించింది. తరువాత కాలంలో అదే "న్యూ ఫ్రాన్స్" అయింది.[14]

మొదటి బ్రిటిష్ సామ్రాజ్యం[మార్చు]

18 వ శతాబ్దంలో ఇంగ్లాండు స్కాట్లాండులు ఏకమై కొత్తగా ఏర్పడిన సమైక్య గ్రేట్ బ్రిటన్, ప్రపంచంలో ఆధిపత్య వలస శక్తిగా ఎదిగింది. వలస సామ్రాజ్య వేదికపై ఫ్రాన్స్, దాని ప్రధాన ప్రత్యర్థిగా మారింది.[15] గ్రేట్ బ్రిటన్, పోర్చుగల్, నెదర్లాండ్స్, పవిత్ర రోమన్ సామ్రాజ్యాలు స్పానిష్ వారసత్వ యుద్ధాన్ని కొనసాగించాయి. ఇది 1714 వరకు కొనసాగి, ఉట్రేక్ట్ ఒడంబడికతో ముగిసింది. దాని ప్రకారం, స్పెయిన్‌కు చెందిన ఫిలిప్ V, ఫ్రెంచ్ సింహాసనంపై తన, తన వారసుల హక్కును త్యజించాడు. స్పెయిన్, ఐరోపాలో తన సామ్రాజ్యాన్ని కోల్పోయింది.[16] బ్రిటిష్ సామ్రాజ్య భాగాలు విస్తరించాయి: బ్రిటన్ ఫ్రాన్స్ నుండి న్యూఫౌండ్లాండ్, అకాడియాలను చేజిక్కించుకుంది. స్పెయిన్ నుండి జిబ్రాల్టర్, మెనోర్కా లను పొందింది. బ్రిటన్‌కు జిబ్రాల్టర్ ఒక కీలకమైన నావికా స్థావరంగా మారింది. మధ్యధరా సముద్రం అట్లాంటిక్ ల మధ్య ప్రవేశ, నిష్క్రమణలను ఇక్కడి నుండి నియంత్రించడానికి బ్రిటన్‌కు వీలు కలిగింది. లాభదాయకమైన ఆసింటో (స్పానిష్ అమెరికాలో ఆఫ్రికన్ బానిసలను విక్రయించడానికి అనుమతి) హక్కులను స్పెయిన్ బ్రిటన్కు అప్పగించింది.[17] 1727-1729 నాటి ఆంగ్లో-స్పానిష్ యుద్ధం తరువాత, స్పెయిన్ రాజు న్యూ స్పెయిన్‌లోని ఓడరేవుల్లోని బ్రిటిష్ ఓడలన్నిటినీ జప్తు చేశాడు. 1739 లో మొదలైన జెంకిన్స్ చెవి యుద్ధంలో స్పానిష్ ప్రైవేటు సైనికులు, ట్రయాంగిల్ ట్రేడ్ మార్గాల్లో బ్రిటిష్ వ్యాపార నౌకలపై దాడి చేశారు. 1746 లో, స్పెయిన్, బ్రిటన్లు శాంతి చర్చలు ప్రారంభించాయి. స్పెయిన్ రాజు బ్రిటిష్ షిప్పింగ్ పై దాడులను ఆపడానికి అంగీకరించాడు; అయితే, మాడ్రిడ్ ఒప్పందంతో దక్షిణ, మధ్య అమెరికాల్లో బానిస వాణిజ్య హక్కులను బ్రిటన్ కోల్పోయింది.[18]

రెండవ బ్రిటిష్ సామ్రాజ్యం[మార్చు]

1718 నుండి, బ్రిటన్లో వివిధ నేరస్థులకు శిక్షగా తమ అమెరికన్ వలసలకు పంపేవారు. సంవత్సరానికి సుమారు వెయ్యి మంది నేరస్థులను అలా రవాణా చేసేవారు. [19] 1783 లో పదమూడు స్థావరాలను కోల్పోవడంతో ఒక ప్రత్యామ్నాయ స్థానాన్ని చూసుకోవలసి వచ్చి బ్రిటిష్ ప్రభుత్వం, ఆస్ట్రేలియా వైపు తిరిగింది. [20] 1606 లో ఆస్ట్రేలియా తీరాన్ని డచ్ వారు కనుగొన్నారు గానీ [21] దానిని వలసరాజ్యం చేసే ప్రయత్నం చెయ్యలేదు. 1770 లో జేమ్స్ కుక్ చేసిన శాస్త్రీయ పరిశోధన యానంలో భాగంగా ఆస్ట్రేలియా తూర్పు తీరాన్ని చూసాడు. ఈ ఖండం బ్రిటన్‌ది అని చాటి, దానికి న్యూ సౌత్ వేల్స్ అని పేరు పెట్టాడు.[22] 1778 లో, కుక్ వద్ద ఉన్న వృక్షశాస్త్రజ్ఞుడు జోసెఫ్ బ్యాంక్స్, బాటనీ బే వద్ద శిక్షా స్థావరాన్ని స్థాపించే వీలుపై ప్రభుత్వానికి ఆధారాలను సమర్పించాడు. 1787 లో నేరస్థులతో కూడిన మొదటి నౌక 1788 లో ఆస్ట్రేలియా చేరుకుంది.[23] అసాధారణమైన రీతిలో బ్రిటన్, ఆస్ట్రేలియాను ఒక చాటింపు ద్వారా తన వలసగ ప్రకటించుకుంది. అక్కడి స్థానిక ప్రజలు ఒప్పందం కుదుర్చుకోడ్నికి పనికిరానంత ఆనాగరికులుగా బ్రిటన్ భావించింది.[24][25] వలస స్థాపనతో రోగలు వచ్చాయి, హింస వచ్చింది. వాటికి తోడు తమ నెలవుల నుండి, తమ సంస్కృతి నుండీ బ్రిటిషు వారు బలవంతంగా తరిమికొట్టడంతో స్థానిక ఆస్ట్రేలియనుల జీవితం అల్లకల్లోలమైంది.[26][27] బ్రిటన్ 1840 దాకా న్యూ సౌత్ వేల్స్‌కు, 1853 దాకా టాస్మానియాకు 1868 దాకా పశ్చిమ ఆస్ట్రేలియాకూ నేరస్థులను పంపుతూనే వచ్చింది.[28] ఆస్ట్రేలియా వలస స్థావరాలు ఉన్ని, బంగారాల లాభదాయక ఎగుమతిదారులుగా మారాయి. ముఖ్యంగా విక్టోరియాలో బంగారం వెల్లువెత్తడంతో, దాని రాజధాని మెల్బోర్న్ కొంతకాలం పాటు ప్రపంచ్ం లోనే అత్యంత ధనిక నగరంగా వెలిగింది.[29]

తన సముద్రయానంలో కుక్, న్యూజిలాండ్‌ను కూడా సందర్శించాడు. 1642 లోనే డచ్ అన్వేషకుడు అబెల్ టాస్మాన్ చేసిన సముద్రయానం కారణంగా దీని గురించి యూరోపియన్లకు ముందే తెలుసు. 1769 లో ఉత్తర దీవులను, 1770 లో దక్షిణ దీవులనూ బ్రిటిష్ రాజ్యానికి చెందినవిగా ప్ర్కటించాడు. ప్రారంభంలో, స్థానిక మావోరీ జనాభాకు, యూరోపియన్లకూ మధ్య సంపర్కం వస్తువుల వర్తకానికి మాత్రమే పరిమితమై ఉండేది. 19 వ శతాబ్దం ప్రారంభ దశాబ్దాలలో యూరోపియన్ స్థావరాలు పెరిగి, అనేక వాణిజ్య కేంద్రాలు స్థాపించబడ్డాయి -ముఖ్యంగా ఉత్తరాన. 1839 లో, ది న్యూజిలాండ్ కంపెనీ పెద్దయెత్తున భూములను కొనుగోలు చేసి, న్యూజిలాండ్‌లో స్థావరాలను స్థాపించే ప్రణాళికలను ప్రకటించింది. 1840 ఫిబ్రవరి 6 న కెప్టెన్ విలియం హాబ్సన్, 40 మంది మావోరీ ముఖ్యులు వైతంగి ఒప్పందంపై సంతకం చేశారు.[30] ఈ ఒప్పందాన్ని న్యూజిలాండ్ దేశ వ్యవస్థాపక పత్రంగా పరిగణిస్తారు. అయితే ఈ ఒప్పందపు మావోరీ భాషా పాఠ్యానికి, ఆంగ్ల పాట్యానికీ చేసిన భాష్యాల మధ్య ఉన్న అంతరాల కారణంగా[31] అది ఇప్పటికీ వివాదాస్పదం గానే ఉంది.[32]

భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పాలన, బ్రిటిష్ రాజ్[మార్చు]

ఆసియాలో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణను ఈస్టిండియా కంపెనీ ముందుండి నడిపించింది. కంపెనీ సైన్యం మొదట ఏడు సంవత్సరాల యుద్ధంలో రాయల్ నేవీతో కలిసి పోరాడింది. ఆ తరువాత ఈ రెండూ భారతదేశం వెలుపల కూడా తమ పరస్పర సహకారాన్ని కొనసాగించాయి. ఈజిప్టు నుండి ఫ్రెంచి వారిని తరిమి కొట్టడం (1799), [33] నెదర్లాండ్స్ నుండి జావాను స్వాధీనం చేసుకోవడం (1811), పెనాంగ్ ద్వీపం (1786), సింగపూర్ (1819), మలక్కా (1824) లను చేజిక్కించుకోవడం, బర్మాను జయించడం (1826) వంటిని ఇందులో ఉన్నాయి. [34]

భారతదేశంలో దాని స్థావరం నుండి కంపెనీ, 1730 ల నుండే చైనాతో లాభదాయకమైన నల్లమందు ఎగుమతి వ్యాపారం చేస్తూ ఉండేది. 1729 లోనే క్వింగ్ రాజవంశం నల్లమందు వ్యాపారాన్ని నిషేధించింది. తాము దిగుమతి చేసుకునే తేయాకు కోసం బ్రిటన్ చైనాకు పెద్దయెత్తున వెండిని చెల్లించాల్సి వచ్చేది. ఈ వాణిజ్య అసమతుల్యతను తిప్పికొట్టడానికి నల్లమందు ఎగుమతి బ్రిటన్‌కు సహాయపడింది.[35] 1839 లో చైనాఅ ధికారులు కాంటన్‌లో 20,000 నల్లమందుల పెట్టెలను జప్తు చేయడంతో బ్రిటన్, చైనాల మధ్య మొదటి నల్లమందు యుద్ధం జరిగింది. దాని ఫలితంగా బ్రిటన్ చైనా నుండి హాంకాంగ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో అది ఒక చిన్న ఆవాస ప్రాంతం మాత్రమే. షాంఘైతో సహా మరికొన్ని రేవులను కూడా స్వస్ధీనం చేసుకుంది. [36]

18 వ శతాబ్దం చివర, 19 వ శతాబ్దం ప్రారంభంలో కంపెనీ వ్యవహారాల్లో బ్రిటిష్ రాచరికపు జోక్యం పెరిగిపోయింది. పార్లమెంటు వరసపెట్టి చేసిన వివిధ చట్టాలతో - 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టం, 1784 పిట్ ఇండియా చట్టం , 1813 నాటి చార్టర్ చట్టం వంటివి - కంపెనీ వ్యవహారాలపై రాజ్య నియంత్రణ పెరిగి, కంపెనీ స్వాధీనం చేసుకున్న భూభాగాలపై తన సార్వభౌమత్వాన్ని స్థాపించుకుంది. [37] 1857 నాటి మొదటి స్వాతంత్ర్య యుద్ధంతో కంపెనీ పాలన ముగిసింది. ఆ యుద్ధాన్ని అణచివేయడానికి బ్రిటిషు వారికి ఆరు నెలలు పట్టింది, రెండు వైపులా భారీ ప్రాణనష్టం జరిగింది. మరుసటి సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీని రద్దు చేసి, భారత ప్రభుత్వ చట్టం 1858 ద్వారా భారతదేశంపై ప్రత్యక్ష నియంత్రణను చేపట్టి, నేరుగా బ్రిటిష్ పాలనను స్థాపించింది. ఇక్కడ నియమించబడిన గవర్నర్ జనరల్ భారతదేశ పాలనను చేపట్టాడు. విక్టోరియా రాణిని భారత సామ్రాజ్యానికి రాణిగా పట్టాభిషేకం చేశారు. భారతదేశం బ్రిటిషు సామ్రాజ్యపు అత్యంత విలువైన కలికితురాయిగా మారింది. బ్రిటన్ బలానికి ఇది చాలా ముఖ్యమైన వనరు అయింది.[38]

19 వ శతాబ్దం చివరలో తీవ్రమైన పంట వైఫల్యాల కారణంగా ఉపఖండంలో విస్తృతంగా కరువులు ఏర్పడ్డాయి. వీటిలో 1.5 కోట్ల మంది మరణించారని అంచనా. ఈస్టిండియా కంపెనీ ఈ కరువులను ఎదుర్కోవటానికి ఏకీకృత విధానాన్ని అమలు చేయడంలో విఫలమైంది. తరువాత, ప్రత్యక్ష బ్రిటిష్ పాలనలో, ప్రతి కరువు తరువాత కారణాలను పరిశోధించడానికి, కొత్త విధానాలను అమలు చేయడానికీ కమీషన్లను ఏర్పాటు చేసింది. ఇది 1900 ల ప్రారంభం నాటికి ఈ చర్యల ప్రభావం కనిపించింది.

రెండో ప్రపంచ యుద్ధం[మార్చు]

సెప్టెంబరు 1939 లో నాజీ జర్మనీకి వ్యతిరేకంగా బ్రిటన్ యుద్ధం ప్రకటించినప్పుడు, భారతదేశంతో సహా వలస రాజ్యాలన్నీ దానితో చేరాయి. కానీ ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, న్యూఫౌండ్లాండ్, దక్షిణాఫ్రికా డొమినియన్లు ఆటోమాటిగ్గా అందులో చేరలేదు. అవి కూడా త్వరలోనే జర్మనీపై యుద్ధం ప్రకటించాయి. ఐర్లాండ్ బ్రిటిష్ కామన్వెల్త్‌ లోనే ఉన్నట్లుగా ఒలి నుండీ బ్రిటన్ పరిగణించినప్పటికీ ఐర్లాండ్, యుద్ధ కాలమంతా తటస్థంగా ఉండాలనే ఎంచుకుంది.

1940 జూన్ లో ఫ్రాన్స్ పతనం తరువాత, 1941 ఏప్రిల్ 7 న గ్రీస్ పై జర్మన్ దాడి చేసే వరకు బ్రిటన్ దేశము, బ్రిటన్ సామ్రాజ్యమూ జర్మనీకి వ్యతిరేకంగా ఒంటరిగా నిలిచాయి. బ్రిటిష్ ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్ అమెరికా నుండి సైనిక సహాయం కోసం ప్రయత్నించాడు. కాని తమ దేశాన్ని యుద్ధం లోకి దించడానికి రూజ్‌వెల్ట్ అప్పటికింకా సిద్ధంగా లేడు.[39] 1941 ఆగష్టులో చర్చిల్, రూజ్‌వెల్ట్‌లు అట్లాంటిక్ చార్టర్‌పై సంతకం చేసారు. ఇందులో "తమ ప్రభుత్వం ఎలా ఉండాలో నిర్ణయించుకునే ప్రజల హక్కును " గౌరవించాలి అని ఉంది. ఈ వాక్యం జర్మనీ, ఇటలీలు ఆక్రమించిన ఐరోపా దేశాలను సూచిస్తుందా లేక ఐరోపా దేశాల వలసరాజ్యాల ప్రజలను సూచిస్తుందా అనేది అస్పష్టంగా ఉంది. తరువాతి కాలంలో దాన్ని బ్రిటిషు వారు, అమెరికన్లు, జాతీయవాద ఉద్యమాలూ విభిన్నంగా వివరించుకున్నారు.

అమెరికా యుద్ధంలోకి ప్రవేశించడం చర్చిల్‌కు "గొప్ప ఆనందం" కలిగించింది.[40] ఇక బ్రిటన్‌కు విజయం ఖాయమని అతను భావించాడు.[41] కాని ఎదర ఉన్న "అనేక విపత్తులు, అపరిమితమైన ఖర్చులు, కష్టాలు (ఇవన్నీ ఉంటాయని అతనికి తెలుసు)" సామ్రాజ్య భవిష్యత్తుకు శాస్వతంగా ప్రభావితం చేస్తాయని 1941 డిసెంబరులో అతడు గుర్తించలేకపోయాడు. దూర ప్రాచ్యంలో బ్రిటిష్ దళాలు వేగంగా ఓడిపోయిన విధానం, సామ్రాజ్య శక్తిగా బ్రిటన్ ప్రతిష్టను తిరిగి మార్చలేని విధంగా దెబ్బతీసింది. [42][43] ప్రత్యేకించి, అజేయమైన కోటగాను, తూర్పు జిబ్రాల్టర్‌గా పేరొందిన సింగపూర్ పతనమవడం బ్రిటన్ ప్రతిష్ఠను భంగపరచింది.[44] ఇక బ్రిటన్ తన సామ్రాజ్యాన్ని కాపాడుకోలేదనే వాస్తవం తెల్లమవగానే, అప్పటికే జపాన్ దళాల బెడదను కనిపెట్టిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు అమెరికాతో సన్నిహిత సంబంధాలకు ముందుకొచ్చాయి. చివరికి 1951 లో ANZUS ఒప్పందం కుదిరింది.[45] యుద్ధం ఇతర విధాలుగా కూడా సామ్రాజ్యాన్ని బలహీనపరిచింది: భారతదేశంలో రాజకీయాలపై బ్రిటన్ నియంత్రణ బలహీనమై, దీర్ఘకాలిక ఆర్థిక నష్టం కలిగింది. సోవియట్ యూనియన్, అమెరికాలు ప్రపంచ వేదికపై కేంద్ర స్థానాలకు చేరుకుని భౌగోళిక రాజకీయాలు శాశ్వతంగా మారిపోయాయి.[46]

మూలాలు[మార్చు]

  1. Ferguson 2004b.
  2. Maddison 2001, p. 97: "The total population of the Empire was 412 million [in 1913]"; Maddison 2001, pp. 241: "[World population in 1913 (in thousands):] 1 791 020".
  3. Taagepera, p. 486.
  4. Jackson, pp. 5–6.
  5. Russo 2012, p. 15 chapter 1 'Great Expectations': "The dramatic rise in Spanish fortunes sparked both envy and fear among northern, mostly Protestant, Europeans.".
  6. 6.0 6.1 Ferguson 2004b, p. 3.
  7. Andrews 1985, p. 45.
  8. Ferguson 2004b, p. 4.
  9. Canny, p. 35.
  10. Koebner, pp. 29–52.
  11. Thomas, pp. 155–58
  12. Ferguson 2004b, p. 7.
  13. Canny, p. 62.
  14. Lloyd, pp. 4–8.
  15. Pagden, p. 90.
  16. Shennan, pp. 11–17.
  17. James, p. 58.
  18. Anderson, p. 277.
  19. Smith, p. 20.
  20. Smith, pp. 20–21.
  21. Mulligan & Hill, pp. 20–23.
  22. Peters, pp. 5–23.
  23. James, p. 142.
  24. Macintyre, pp. 33–34.
  25. Broome, p. 18.
  26. Pascoe
  27. McKenna, pp. 28–29.
  28. Brock, p. 159.
  29. Cervero, p. 320
  30. Smith, p. 45.
  31. Porter, p. 579.
  32. Mein Smith, p. 49.
  33. Mori, p. 178.
  34. Porter, p. 401.
  35. Martin, pp. 146–48.
  36. Janin, p. 28.
  37. Keay, p. 393
  38. Brown, p. 5.
  39. Gilbert, p. 234.
  40. Churchill, p. 539.
  41. Gilbert, p. 244.
  42. Louis, p. 337.
  43. Brown, p. 319.
  44. James, p. 460.
  45. Lloyd, p. 316.
  46. Darwin, p. 340.

వెలుపలి లంకెలు[మార్చు]