బ్లాక్ ఐ గెలాక్సీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Coordinates: Sky map 12h 56m 43.7s, +21° 40′ 58″

మెసియర్ 64[1]
బ్లాక్ ఐ గెలాక్సీ యొక్క కేంద్రభాగం (M64)
పరిశీలనా సమాచారం (J2000 epoch)
నక్షత్రాల కూటమికోమా బెరినిసిస్[2]
సరైన స్థితిRA:  12h 56m 43.696s[3]
దిక్పాతంdec: +21° 40′ 57.57″[3]
రెడ్ షిఫ్ట్0.001361±0.000013[4]
వ్యాసార్థ వేగం410[5]
గాలక్సీ కేంద్రక వేగం400±4[6]
దూరం (ఖగోళశాస్త్రం)17.3 Mly (5.3 Mpc) [5]
గాలక్సీ గుంపు లేదా సమూహంCVn I[7]
రకం(R)SA(rs)ab,[4] HIISy2
కోణీయ వ్యాసార్థం (V)10.71 × 5.128 arcminute [8]
దృశ్యమాన పరిమాణం (V)8.52[9]
దృశ్యమాన పరిమాణం (B)9.36[9]
Other designations
ఈవిల్ ఐ గెలాక్సీ (Evil Eye Galaxy), M64, NGC 4826, PGC 44182, UGC 8062[8]
ఇవి కూడా చూడండి: గాలక్సీ, గాలక్సీల జాబితా


బ్లాక్ ఐ గెలాక్సీ (Black Eye Galaxy) అనేది కోమా బెరినిసిస్ (Coma Berenices) అనే నక్షత్రరాశి (constellation) లో వున్న ఒక సర్పిలాకారపు గెలాక్సీ. భూమి నుంచి సుమారు 17 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో వున్న ఈ గెలాక్సీ, విశ్వంలోని మిగిలిన గెలాక్సీలతో పోలిస్తే ఏకాంతంగా వుంది.[7] దీని వ్యాసం 54,000 కాంతి సంవత్సరాలు. ఈ గెలాక్సీ యొక్క ప్రకాశవంతమైన న్యూక్లియస్ ముందు భాగంలో, ఆ కాంతిని శోషించుకొంటున్న కాస్మిక్ ధూళి అద్భుతమైన చీకటి పట్టీలుగా కనిపించడం చేత దీనికి బ్లాక్ ఐ గెలాక్సీ లేదా ఈవిల్ ఐ గెలాక్సీ (Evil Eye Galaxy) అనే పేర్లు వచ్చాయి.[10][11] ఈ గెలాక్సీ ని మెసియర్ 64, M 64, NGC 4826 లుతో సూచిస్తారు. దీనిని తొలిసారిగా 1779 లో ఎడ్వర్డ్ పిగోట్ గుర్తించాడు. చిన్న టెలీస్కోప్ లతో కూడా కనిపించేది కావడంతో ఔత్సాహిక ఖగోళ వేత్తలలో ఈ M 64 గెలాక్సీ బాగా ప్రాచుర్యం పొందింది.[12]


పరిశీలనా చరిత్ర[మార్చు]

ఎడ్వర్డ్ పిగట్ అనే బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త 1779 మార్చి 23 తేదీన తొలిసారిగా బ్లాక్ ఐ గెలాక్సీ ని గుర్తించాడు.[13] పన్నెండు రోజుల అనంతరం ఏప్రిల్ 4 వ తేదీన జోహన్ ఎలెర్ట్ బోడె అనే జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త దీనిని స్వతంత్రంగా గుర్తించాడు.[13] 1780 మార్చి 1 వ తేదీన చార్లెస్ మెస్సియర్ అనే ఫ్రెంచి ఖగోళ శాస్త్రవేత్త కూడా దీనిని స్వతంత్రంగా గుర్తించి, తన వర్గీకరణ జాబితా (మెసియర్ కేటలాగ్) లో దీనిని 64వ ఆబ్జెక్ట్ (ఖగోళ రాశి) గా పేర్కొన్నాడు.[13] అయితే బోడె శాస్త్రజ్ఞుని ఆవిష్కరణ మాత్రమే శాస్త్ర ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రచురించబడింది. పిగట్ ఆవిష్కరణ ప్రచురణకు నోచుకోక పూర్తిగా విస్మరించబడింది. తిరిగి బ్రైన్ జోన్స్ 2002 ఏప్రిల్ లో ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చేవరకూ పిగట్ తొలిసారి కనుగొన్న విషయం మరుగునపడిపోయింది.[13] విలియం హెర్షల్ ఈ గెలాక్సీ యొక్క చీకటి ధూళి పట్టీని తొలిసారిగా కనుగొన్నశాస్త్రజ్ఞునిగా గుర్తింపు పొందాడు.[13] ఈ గెలాక్సీ ని పరిశీలిస్తూ హెర్షల్ చేసిన వర్ణన తరువాత కాలంలో ఈ గెలాక్సీకి బ్లాక్ ఐ అనే పేరు రావడానికి కొంతవరకు కారణమయ్యింది.[13][11]

వర్గీకరణ[మార్చు]

జాన్ హెర్షల్ ఈ గెలాక్సీని మరింత వివరంగా పరిశీలించి తన జాబితాలో దీనిని h 1486 ఖగోళ రాశిగా వర్గీకరించి, తరువాత జనరల్ కేటలాగ్ లో GC 3321 ఖగోళ రాశిగా చేర్చాడు.[13] ఈ గెలాక్సీ నుంచి రేడియో తరంగాలు ఉద్గారమవుతుండడంతో, బ్లాక్ ఐ గెలాక్సీని ఒక రేడియో మూలంగా గుర్తించారు. దీనిని PKS 1254 + 21 గా జాబితాలో చేర్చడం జరిగింది.

దీని స్వరూపాన్ని బట్టి సాండేజ్ అనే అమెరికన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు కేవలం ఒక 'Sb spiral' గా వర్గీకరించినప్పటికీ, డి వాకులేయర్స్ అనే ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఈ గెలాక్సీని (R) SA (rs) ab రకంగా వర్గీకరించాడు. ఇక్కడ (R)' అనేది బాహ్య రింగ్-వంటి నిర్మాణాన్ని సూచిస్తుంది, 'SA' అనగా మధ్యభాగంలో కడ్డీ (bar) లేని సర్పిలాకారాన్ని (unbarred spiral) సూచిస్తుంది, '(rs)' ఒక పరివర్తన లోపలి రింగ్/ సర్పిలాకార నిర్మాణం ను సూచిస్తుంది. 'ab' అనేది సర్పిలాకారం యొక్క భుజాలు (arms) చాలా గట్టిగా బందించబడినట్లు సూచిస్తుంది.[14] అనగా డి వాకులేయర్స్ వర్గీకరణలో బ్లాక్ ఐ గెలాక్సీ అనేది ఒక కడ్డీ (bar) రహిత సర్పిలాకార భుజాలున్న గెలాక్సీ అని, దీనికి వెలుపలి రింగులున్నాయని, లోపలి రింగులు పరివర్తన చెందుతున్నాయని, దీని భుజాలు మధ్యభాగంలో కడ్డీకి చాలా గట్టిగా బందించబడినట్లున్నాయని సూచిస్తుంది.

2015 లో దక్షిణ కొరియాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞులు హొంగ్ బె ఆన్ (H.B.Ann), మిరా సియెవ్ (Mira Seo), డి.కె.హా (D.K.Ha) లు ఈ గెలాక్సీని 'SABA' తరగతికి చెందినదిగా పేర్కొన్నారు.[15] ఇది మధ్యభాగంలో బలహీనమైన కడ్డీ గల సర్పిలాకార భుజాలున్న గెలాక్సీ అని, దీని భుజాలు కడ్డీకి గట్టిగా బందించబడినట్లున్నాయని సూచిస్తుంది.

దృశ్యత[మార్చు]

M64 గెలాక్సీ ఉనికి

ఉత్తర మండలానికి చెందిన కోమా బెరినిసిస్ (Coma Berenices) అనే నక్షత్రరాశి (constellation) లో ఈ గెలాక్సీ కనిపిస్తుంది. కాంతిని శోషించుకొంటున్న అద్భుతమైన ధూళి పట్టీలు ఈ గెలాక్సీ కేంద్రభాగం ముందర పరుచుకోవడం వల్ల, ఈ గెలాక్సీ అంతరిక్షంలో నల్లటి కన్ను (Black Eye) వలె కనిపిస్తుంది. దీనినిబట్టి సులభంగా గుర్తించవచ్చు.[10] అయితే దీని దృశ్య ప్రకాశం పరిమాణం +8.52 కావడంతో మధ్యస్థ పరిమాణపు టెలీస్కోప్ నుంచి చూస్తేనే తప్ప మామూలు కంటికి కనపడదు. దీని దిక్పాతం (Declination) 21.68° N, కుడి ఆరోహణం (Right Ascension) 12h 56m కావడంతో, ఉత్తరార్ధ గోళంలో ఈ గెలాక్సీ వసంత ఋతువులో ముఖ్యంగా మే నెలలో స్పష్టంగా కనిపిస్తుంది.

స్వాతి నక్షత్రానికి కొద్దిగా ఉత్తర భాగాన్న, దానికి 19° పశ్చిమ దిశలో M64 గెలాక్సీ వుంది. ఈ గెలాక్సీ ఉనికిని ఆల్ఫా Com, 35 Com అనే తారల స్థానం ద్వారా గుర్తుపట్టవచ్చు.

రాత్రిపూట ఆకాశంలో ఉజ్వలంగా కనిపించే నాలుగవ నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రానికి 5° పశ్చిమాన్న ముఫ్రిద్ (Muphrid) అనే రెండవ ప్రకాశ పరిమాణ తార కనిపిస్తుంది. స్వాతి-ముఫ్రిద్ తారలను కలిపే రేఖను, రెట్టింపు దూరానికి పొడిగిస్తే ఆల్ఫా Com అనే నక్షత్రం వస్తుంది. ఆల్ఫా Com అనేది కోమా బేరియలిసిస్ నక్షత్ర మండలంలో +4.3 ప్రకాశ పరిమాణం గల నక్షత్రం కావడంతో మామూలు కంటితో చూస్తే ఒక పట్టాన కనిపించదు.

35 Com అనేది కోమా బెరినిసిస్ నక్షత్రరాశి లోని 5వ ప్రకాశ పరిమాణపు జంట నక్షత్రం. ఇది ఆల్ఫా Com, గామా Com అనే రెండు నక్షత్రాలను కలిపే రేఖపై ఆల్ఫా Com తార నుండి 1/3 వ దూరంలో ఉంటుంది. 35 Com నక్షత్రం గుర్తించిన తరువాత దానికి ఈశాన్యంగా సుమారు ఒక డిగ్రీ (1° NE) దూరంలో బ్లాక్ ఐ గెలాక్సీని (M64)గుర్తుపట్టవచ్చు.

లక్షణాలు[మార్చు]

బ్లాక్ ఐ గెలాక్సీ సుమారు 10 వేల కోట్ల నక్షత్రాలను కలిగి ఉంది. ప్రకాశవంతమైన న్యూక్లియస్ ను కలిగివున్న ఈ గెలాక్సీ శక్తివంతమైన పరారుణ మూలంగా (Infrared source) వుంది. ఇది బలహీనమైన రేడియో ఉద్గార మూలం (Radio source) గాను వుంది. ఈ గెలాక్సీ లో సూపర్ నోవా లను కానీ, అస్థిర తారలను (Cepheid variables) గాని ఇప్పటివరకు కనుగొనలేదు. బ్లాక్ ఐ గెలాక్సీ సుమారు 410 కిమీ/సె. రేడియల్ వేగంతో మన సౌర వ్యవస్థ నుండి తిరోగమిస్తుంది.[11] అంటే ఇది మన సూర్యునికి దూరంగా పోతుంది అని అర్ధం.

ఆకృతి[మార్చు]

బ్లాక్ ఐ గెలాక్సీ (మౌంట్ లెమాన్ స్కై సెంటర్ అబ్జర్వేటరీ, USA నుండి తీసిన చిత్రం)

ఇది విష్ణుచక్రం (pinwheel) ఆకృతిలో కనిపించే ఒక సర్పిలాకారపు గెలాక్సీ. ఈ గెలాక్సీ యొక్క ప్రకాశవంతమైన న్యూక్లియస్ ముందు భాగంలో కాంతిని శోషించుకొనే కాస్మిక్ ధూళి పట్టీలు చీకట్లో కూడా ప్రస్ఫూటంగా కనిపిస్తాయి.

ఈ గెలాక్సీ యొక్క అంతర నక్షత్ర మాధ్యమం, సమాన ద్రవ్యరాశులతో పరస్పరం ప్రతి భ్రమణం (counter rotation) చేస్తున్న రెండు డిస్కులను కలిగివుంది.[16] లోపలి డిస్క్ లో వున్న నక్షత్రాలు, వాయువులు భ్రమణం చేస్తున్న దిశకు వ్యతిరేకంగా వెలుపలి డిస్క్ లోని వాయువులు భ్రమణం చేస్తున్నాయి.

ఈ గెలాక్సీ ఆకృతి నేడు మనకు కనిపిస్తున్న విధంగా ఉండటం వెనుక రెండు తార్కిక కారణాలు ఊహిస్తున్నారు. మొదటిది - ఈ గెలాక్సీకి వక్ర గమనం (retograde motion) లో వున్న సమీప పొరుగు గెలాక్సీ M64 ను ఢీ కొని దీనిలో అసౌష్టవంగా విలీనం కావడం. రెండవది - అంతర గెలాక్సీ మాధ్యమం లోని వాయు మేఘాలు గుత్వాకర్షణ శక్తి కారణంగా ఒకదానిలో ఒకటి కలిసిపోతూ చివరకు ఈ గెలాక్సీ పరివేషం (halo) లోనికి కూలిపోవడం, దానివల్ల M64 గెలాక్సీ కేంద్రభాగం మీదకు అసౌష్టవంగా ధూళి మేఘాలు చేరి క్రమేణా పరిమాణంలో పెరిగిపోవడం. [17][18]

చీకటి ధూళి పట్టీలు (Dark dust bands)[మార్చు]

ఈ గెలాక్సీ యొక్క ప్రకాశవంతమైన న్యూక్లియస్ ముందరి భాగంలో కాంతిని శోషించుకొనే అద్భుతమైన కాస్మిక్ ధూళి పట్టీలు వ్యాపించి వుండటం ఈ గెలాక్సీ యొక్క ప్రత్యేకత. ఇవి చీకట్లో కూడా ప్రముఖంగా కనిపిస్తాయి.[11] చీకటి ధూళి పట్టీలు ఉజ్వలమైన గెలాక్సీ కేంద్రభాగం ముందర పరుచుకోవడం వల్ల, ఈ గెలాక్సీ అంతరిక్షంలో నల్లటి కన్ను (Black Eye) వలె కనిపిస్తుంది. అందువలన దీనికి బ్లాక్ ఐ గెలాక్సీ లేదా ఈవిల్ ఐ గెలాక్సీ (Evil Eye Galaxy) అనే పేర్లు ఏర్పడ్డాయి.

ఈ చీకటి ధూళి పట్టీలు గెలాక్సీ యొక్క లోపలి డిస్క్ లో ఏర్పడ్డాయి. వీటిని 6 అంగుళాల ద్వారం గల టెలీస్కోప్ లో కూడా స్పష్టంగా గమనించవచ్చు. పొరుగున వున్న చిన్న గెలాక్సీ ఈ పెద్ద గెలాక్సీ (M64) లో విలీనమైనపుడు, విలీనమైన చిన్న గెలాక్సీ లోని కొంత ద్రవ్యం ఇంకా పెద్ద గెలాక్సీ కక్ష్యలో స్థిరపడలేదు. M64 గెలాక్సీ కేంద్రభాగం యొక్క కాంతిని అడ్డుకుంటున్న ఈ చీకటి ధూళి పట్టీలు వాస్తవానికి దీని కక్ష్యాతలంలో సరిగా స్థిరపడని పొరుగు గెలాక్సీ యొక్క ద్రవ్యం కావచ్చు.

ఈ ధూళి పట్టీలు గెలాక్సీ కేంద్రకాన్ని కొద్దిమేరకు కప్పి వేస్తున్నట్లు కనిపిస్తాయి. ఈ పట్టీలు కనిపించే విధం బట్టి ఈ గెలాక్సీ యొక్క దక్షిణ వైపు భాగం మనకు దగ్గరగా ఉందని తెలుస్తున్నది.[11] ఈ చీకటి ధూళి పట్టీలు వున్న భాగంలోనే కొత్త తారలు పుడుతున్నాయి.

దూరం[మార్చు]

ఈ గెలాక్సీ మనకు ఎంత దూరంలో వున్నది అనేది నిర్ధారణగా తెలియదు. ఈ గెలాక్సీలో అస్థిర తారలను ఇప్పటివరకు గుర్తించలేదు. ఒకవేళ అవి ఉన్నప్పటికీ, వాటి నుంచి ప్రసారమవుతున్న హెచ్చు తగ్గులతో కూడిన అస్థిర కాంతి ఇంకా మన టెలీస్కోప్ లకు చేరుతున్న పరిధిలోనే ఉండవచ్చు. ఏమైనప్పటికి ఈ గెలాక్సీలో అస్థిర తారల ఉనికి ఇప్పటివరకు కనుగొనలేనందువల్ల ఈ గెలాక్సీ భూభూమికి ఎంత దూరంలో వున్నదని విషయం ఇదమిద్ధంగా చెప్పలేకున్నారు.

కెన్నెత్ గ్లిన్ జోన్స్, క్రెయిమెర్ లు ఈ గెలాక్సీ కి మనకు మధ్య దూరం సుమారు 12 మిలియన్ కాంతి సంవత్సరాలని, తుల్లీ తన 'సమీప గెలాక్సీ కేటలాగ్' లో 14 మిలియన్ కాంతి సంవత్సరాలని, బర్న్ హామ్ 20-25 మిలియన్ల కాంతి సంవత్సరాలని సూచించారు. అంతరిక్ష టెలిస్కోప్ సైన్స్ ఇన్స్టిట్యూట్ (STScI) వారు ఈ దూరాన్ని 19 మిలియన్ కాంతి సంవత్సరాలుగాను, ది ఆస్ట్రోనమికల్ జర్నల్ లో తుల్లి, బ్రెంట్ లు 17.3 మిలియన్ కాంతి సంవత్సరాలుగా అంచనా వేశారు.

ఈ గెలాక్సీ మనకు 19 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో వున్నదనే అంచనాను స్వీకరిస్తే, ఈ గెలాక్సీ యొక్క దృశ్య కోణీయ వ్యాసం 9.3 ఆర్క్ నిమిషాలకు[19] అనుగుణంగా దీని రేఖీయ వ్యాసం సుమారు 51,000 కాంతి సంవత్సరాలుంటుంది. అదేవిధంగా +8.52 దృశ్య ప్రకాశ పరిమాణానికి అనుగుణంగా నిరాపేక్ష ప్రకాశ పరిమాణం -20.3 ఉంటుంది. తుల్లి, బ్రెంట్ ల ప్రకారం ఈ గెలాక్సీ మనకు 17.3 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో వున్నదనే అంచనాను స్వీకరిస్తే, ఈ గెలాక్సీ దృశ్య కోణీయ వ్యాసం 10.71 ఆర్క్ నిమిషాలకనుగుణంగా గెలాక్సీ యొక్క రేఖీయ వ్యాసం సుమారు 54,000 కాంతి సంవత్సరాలుంటుంది. అదేవిధంగా +8.52 దృశ్య ప్రకాశ పరిమాణానికి అనుగుణంగా నిరాపేక్ష ప్రకాశ పరిమాణం -22.6 వుంటుంది.

ప్రతి భ్రమణ వాయు వ్యవస్థ (counter rotating gas system)[మార్చు]

ఈ గెలాక్సీ వ్యాసం 54,000 కాంతి సంవత్సరాలు.[20] ఈ బ్రహ్మండమైన గెలాక్సీ వెలుపలి ప్రాంతాలలోని వాయువులు, గెలాక్సీ లోపలి ప్రాంతాలలోని వాయువులు, నక్షత్రాలు తిరిగే దిశకు వ్యతిరేక దిశలో తిరుగుతున్నాయి.[10] సుమారు 100 కోట్ల సంవత్సరాల క్రితం M 64 గెలాక్సీ, దానికి వ్యతిరేక దిశలో పరిభ్రమణం చేస్తున్న ఒక చిన్న సమీప పొరుగు గెలాక్సీ - ఈ రెండు గెలాక్సీ లు ఒకదానిలో మరొకటి కలిసిపోవడంతో బ్లాక్ ఐ గెలాక్సీ కి ఈ విలక్షణమైన ప్రత్యేకత ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.[10]అంటే ఇతర గెలాక్సీల మాదిరిగానే, M64 లోని అన్ని నక్షత్రాలు ఒకే దిశలో భ్రమణం చెందుతున్నాయి. అయితే M64 యొక్క వెలుపలి ప్రాంతాలలోని అంతర నక్షత్ర వాయువులు (interstellar gases), లోపలి ప్రాంతాలలోని వాయువులు, నక్షత్రాలు తిరిగే దిశకు వ్యతిరేక దిశలో తిరుగుతున్నాయి. స్పైరల్ గెలాక్సీ లకి సంబంధించినంతవరకూ వాయువులు ఇలా ప్రతి భ్రమణం (counter rotation) చేస్తుండటమనేది ఇది ఒక అసాధారణమైన దృగ్విషయం. [21]

ఈ విధంగా వ్యతిరేక దిశలలో భ్రమణం చెందుతున్న అంతర నక్షత్ర వాయువులు పరస్పరం ఢీ కొని సంపీడనం చెందడం వల్ల ఆ విరూపణ ప్రాంతంలో కొత్త నక్షత్రాలు పుడుతున్నాయి. ఏర్పడుతున్న నక్షత్రాలనుండి వెలువడే అతినీల లోహిత కిరణాలు హైడ్రోజన్ వాయు మేఘాలపై పడి ప్రతిపలించడం వలన హైడ్రోజన్ వాయు మేఘాలు పింక్ రంగులో ప్రతిదీప్తి (fluorescence) చెందుతున్నాయి. ముఖ్యంగా ఈ గెలాక్సీ చిత్రంలో పింక్ రంగులో ప్రతిదీప్తినిస్తున్న హైడ్రోజన్ వాయు మేఘాలు వెంబడి నవ్య నీలి,అరుణ తారలు ఆవిర్భవిస్తున్నాయి.

రెండవ రకానికి చెందిన సెఫర్ట్ గెలాక్సీ (Type II Seyfert Galaxy)[మార్చు]

గెలాక్సీలలో ప్రకాశవంతమైన న్యుక్లియస్ ను కలిగివున్నవి సెఫర్ట్ గెలాక్సీ తరగతికి చెందుతాయి. చాలా బలమైన పరారుణ కిరణాలను ఉద్గారించే సెఫర్ట్ గెలాక్సీలు శక్తివంతమైన పరారుణ మూలాలుగా (Infrared source) ఉంటాయి.[22]

HII/LINER న్యూక్లియస్ ను కలిగి వున్న బ్లాక్ ఐ గెలాక్సీ “టైపు 2 సెఫర్ట్” (Type II Seyfert) గెలాక్సీ తరగతికి చెందినది.[23] ఈ టైపు II సెఫెర్ గెలాక్సీలు ప్రకాశవంతమైన కోర్ ను కలిగిఉండటమే కాక, పరారుణ తరంగదైర్ఘ్యాలు వద్ద చూసినప్పుడు కూడా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. [24]వీటి న్యూక్లియస్ కూడా శక్తివంతమైన స్పెక్ట్రమ్ రేఖలను ఉద్గారిస్తాయి అయితే వీటి కేంద్రభాగం నుండి వెలువడే ఉష్ణవాయువులు ఒక మోస్తరు వేగంతోనే (1000 కి.మీ./సె. వేగం కన్నా తక్కువ వేగంతో) విస్తరిస్తాయి.[22]LINER (low-ionization nuclear emission-line region - తక్కువ అయనీకరణ న్యూక్లియర్ ఉద్గార రేఖా ప్రాంతం) అనేది వర్ణపట రేఖలను ఆధారంగా వర్గీకరించిన గెలాక్సీ యొక్క న్యుక్లియస్ రకం. ఒక గెలాక్సీ LINER న్యూక్లియస్ ను కలిగి వుంది అంటే ఆ గెలాక్సీ కేంద్రభాగం నుండి ఉద్గారమయ్యే స్పెక్ట్రమ్ రేఖలు తక్కువ అయనీకరణ న్యూక్లియర్ ఉద్గార రేఖా ప్రాంతంలో వున్నాయని అర్ధం.

ఈ గెలాక్సీ యొక్క న్యుక్లియస్ బలహీనమైన రేడియో ఉద్గార మూలంగా (Radio source) వుంది.[7] దీని కేంద్రకం వద్ద మృదు X- రే మూలాన్ని గుర్తించారు. ఇది క్రియాశీలకమైన గెలాక్సీ కేంద్రకం నుండి ప్రత్యక్షంగా కాకుండా పరికేంద్రక ప్రాంతం నుంచి నేరుగా వస్తుంది.[25]పరమాణు వాయువుతో కూడిన దీని లోపలి డిస్క్ 2,300 కాంతి సంవత్సరాల (700 parsec) వ్యాసార్థంలో ఖండితమైవుంది. ప్రస్తుతం ఈ లోపలి డిస్క్ కు చెందిన భ్రమణ రహితమైన చలనాలు, కోర్ భాగాన్ని అంతగా ఉత్తేజీతం చేయడం లేదు. కానీ ఈ లోపలి డిస్క్ మాత్రం కొత్త నక్షత్రాల ఏర్పడే రేటును మరింతగా పెంచుతున్నది. కొత్తగా అంతర నక్షత్ర ద్రవ్యం పెద్ద ఎత్తున లోపలికి కేంద్రీకరించబడుతున్న విషయానికి సంబందించిన సాక్షం కూడా వుంది.[26]

రెండవ అల క్రియాశీలత ఉద్భవించిన గెలాక్సీ (ESWAG)[మార్చు]

జే. డి వ్రే (J.D Wray) తన "కలర్ అట్లాస్ అఫ్ గెలాక్సీస్" అనే గ్రంధం (1988) లో బ్లాక్ ఐ గెలాక్సీ ని "రెండవ అల క్రియాశీలత ఉద్భవించిన గెలాక్సీ" గా (Evolved Second Wave Activity Galaxies-ESWAG) ప్రతిపాదించారు. [11]దీని ప్రకారం ఈ రకమైన గెలాక్సీలు, నక్షత్ర ఆవిర్భావనలో రెండవ తరంగదశను కూడా చవిచూస్తాయి. ఇటువంటి గెలాక్సీలలో ప్రధాన సర్పిలాకార భాగం, మధ్యంతర వయస్సు గల తారలను కలిగి ఉంటుంది. నక్షత్రాలు ఏర్పడే ప్రక్రియ మొదటగా ఈ గెలాక్సీ కి బాహ్యంగా ప్రారంభమవుతుంది. ఆ బాహ్య ప్రాంతంలో తగినంత అంతర నక్షత్ర ద్రవ్యం ఉన్నంతవరకూ తారలు ఏర్పడుతూనే ఉంటాయి. క్రమేణా ద్రవ్యం క్షీణించుకుపోవడంతో కొత్త తారలు ఏర్పడటం ఆగిపోతుంది. తిరిగి ఇక్కడ కొత్త తారలు పుట్టాలంటే, అంతకు ముందు ఇక్కడ పుట్టిన తారలు తమ పరిణామ క్రమంలో కొత్త పదార్ధాన్ని ఏర్పరచాల్సి ఉంటుంది. అంటే సూపర్ నోవా లాంటి ప్రేలుళ్ళ జరిగి వాటివల్ల ఏర్పడిన కొత్త పదార్ధం తిరిగి దట్టంగా పోగుపడేవరకూ ఆ ప్రాంతంలో కొత్తగా తారలు పుట్టవు. ఒకసారి ఇలా కొత్త పదార్ధ ద్రవ్యం తగినంతగా ఏర్పడితేనే, మళ్ళీ ఆ ప్రాంతంలో కొత్త తారలు పుడతాయి. M 64 గెలాక్సీ లో కూడా చీకటి ధూళి పట్టీలు కనిపిస్తున్న భాగంలోనే ఇలా నక్షత్రాలు రెండవ తరంగ దశలో ఏర్పడుతున్నాయి.

రిఫరెన్సులు[మార్చు]

  1. Tonry, J. L.; et al. (2001), "The SBF Survey of Galaxy Distances. IV. SBF Magnitudes, Colors, and Distances", Astrophysical Journal, 546 (2): 681–693, arXiv:astro-ph/0011223, Bibcode:2001ApJ...546..681T, doi:10.1086/318301.
  2. Dreyer, J. L. E. (1988), Sinnott, R. W. (ed.), The Complete New General Catalogue and Index Catalogue of Nebulae and Star Clusters, Sky Publishing Corporation/Cambridge University Press, ISBN 978-0-933346-51-2.
  3. 3.0 3.1 Skrutskie, M. F.; et al. (February 2006), "The Two Micron All Sky Survey (2MASS)", The Astronomical Journal, 131 (2): 1163–1183, Bibcode:2006AJ....131.1163S, doi:10.1086/498708.
  4. 4.0 4.1 de Vaucouleurs, G.; et al. (1991), Third reference catalogue of bright galaxies, 9, New York: Springer-Verlag.{{citation}}: CS1 maint: multiple names: authors list (link)
  5. 5.0 5.1 Tully, R. Brent; et al. (August 2016), "Cosmicflows-3", The Astronomical Journal, 152 (2): 21, arXiv:1605.01765, Bibcode:2016AJ....152...50T, doi:10.3847/0004-6256/152/2/50, 50.{{citation}}: CS1 maint: unflagged free DOI (link)
  6. "NASA/IPAC Extragalactic Database", Results for NGC 4826, retrieved 2018-12-13.
  7. 7.0 7.1 7.2 Israel, F. P. (January 2009), "CI and CO in nearby galaxy centers. The bright galaxies NGC 1068 (M 77), NGC 2146, NGC 3079, NGC 4826 (M 64), and NGC 7469", Astronomy and Astrophysics, 493 (2): 525–538, arXiv:0811.4058, Bibcode:2009A&A...493..525I, doi:10.1051/0004-6361:200810655.
  8. 8.0 8.1 మూస:Cite simbad
  9. 9.0 9.1 Gil de Paz, Armando; et al. (2007), "The GALEX Ultraviolet Atlas of Nearby Galaxies", Astrophysical Journal Supplement Series, 173 (2): 185–255, arXiv:astro-ph/0606440, Bibcode:2007ApJS..173..185G, doi:10.1086/516636.
  10. 10.0 10.1 10.2 10.3 "Messier 64 (The Black Eye Galaxy)". nasa. nasa. Retrieved 4 March 2019.
  11. 11.0 11.1 11.2 11.3 11.4 11.5 "Black Eye Galaxy – Messier 64". Constellation Guide. Retrieved 12 March 2019.
  12. "Messier 64 – The Black Eye Galaxy". universetoday.com. Retrieved 12 March 2019.
  13. 13.0 13.1 13.2 13.3 13.4 13.5 13.6 "Messier 64". THE MESSIER CATALOG. Retrieved 8 March 2019.
  14. de Vaucouleurs, Gérard (April 1963), "Revised Classification of 1500 Bright Galaxies", Astrophysical Journal Supplement, 8: 31, Bibcode:1963ApJS....8...31D, doi:10.1086/190084.
  15. Ann, H. B.; et al. (2015), "A Catalog of Visually Classified Galaxies in the Local (z ∼ 0.01) Universe", The Astrophysical Journal Supplement Series, 217 (2): 27–49, arXiv:1502.03545, Bibcode:2015ApJS..217...27A, doi:10.1088/0067-0049/217/2/27.
  16. Brawn, R.; Walterbos, R. A. M.; Kennicutt, Robert C., Jr. (1992). "Counter-rotating gaseous disks in the "Evil Eye" galaxy NGC4826". Nature. 360 (6403): 442. Bibcode:1992Natur.360..442B. doi:10.1038/360442a0.{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link)
  17. "Messier Monday: The Black Eye Galaxy, M64". Retrieved 8 March 2019.
  18. Rix, Hans-Walter R.; Kennicutt, Robert C., Jr.; Walterbos, Rene A. M. (1995). "Placid stars and excited gas in NGC 4826". Astrophysical Journal. 438: 155. Bibcode:1995ApJ...438..155R. doi:10.1086/175061.{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link)
  19. "M64 - Black Eye Galaxy". astropixels.com. Retrieved 10 March 2019.
  20. From trigonometry: diameter = distance × sin( diameter_angle) = 17.3 Myr × sin(10.71′) = 53,896 ly.
  21. "Counter-rotating gas and a leading spiral arm in the 'Black Eye' galaxy NGC 4826". PASJ: Publications of the Astronomical Society of Japan (ISSN 0004-6264). 45 (No. 3): L47-L51. 1 June 1993. Retrieved 4 March 2019. {{cite journal}}: |issue= has extra text (help)
  22. 22.0 22.1 "Seyfert galaxy". Encyclopedia Britanica. Encyclopedia Britanica Inc. Retrieved 10 March 2019.
  23. Malkan, Matthew A.; et al. (September 2017), "Emission Line Properties of Seyfert Galaxies in the 12 μm Sample", The Astrophysical Journal, 846 (2): 26, arXiv:1708.08563, Bibcode:2017ApJ...846..102M, doi:10.3847/1538-4357/aa8302, 102.{{citation}}: CS1 maint: unflagged free DOI (link)
  24. Morgan, Siobahn. "Distant and Weird Galaxies". Astronomy Course Notes and Supplementary Material. University of Northern Iowa. Retrieved 10 October 2013.
  25. Grier, C. J.; Mathur, S.; Ghosh, H.; Ferrarese, L. (April 2011), "Discovery of Nuclear X-ray Sources in Sings Galaxies", The Astrophysical Journal, 731 (1): 13, arXiv:1011.4295, Bibcode:2011ApJ...731...60G, doi:10.1088/0004-637X/731/1/60, 60.
  26. García-Burillo, S.; et al. (August 2003), "Molecular Gas in NUclei of GAlaxies (NUGA). I. The counter-rotating LINER NGC 4826", Astronomy and Astrophysics, 407 (2): 485–502, arXiv:astro-ph/0306140, Bibcode:2003A&A...407..485G, doi:10.1051/0004-6361:20030866.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]