భవబంధాలు
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం భవబంధాలు పారద్రోలి పరము నొసంగే సాధనం అని పాట. మనిషి సంసారంలో చిక్కుకొని ప్రేమలు, అభిమానాలు, బంధుత్వాలు అంటూ చివరి దాకా పెనుగులాడుతూనే ఉంటాడు. ఆ బంధువులు, స్నేహితులు ఒక్కోసారి ఎదురు తిరిగి తిట్టడం, కొట్టడం లాంటివి చేసినా వారి మీద ప్రేమానురాగాలు తగ్గకపోగా వారి చుట్టూనే మనసు తిరుగుతుంటుంది. తానెంతగానో ప్రేమతో చూసుకుంటూ పెంచి పెద్ద చేసిన వారు, తన సంపదలన్నీ అనుభవిస్తున్న వారు ఏదో ఒకనాడు ఏదో ఒక సందర్భంలో ఎదురు తిరగటం, నువ్వు మాకేం చేశావు అని తిరస్కరించటం సర్వసాధారణం. కడుపు మాడ్చుకొని వారి కోసం తన కోర్కెలన్నింటినీ చంపుకొని అంతా కూడపెట్టి అప్పజెబితే వారిలా అన్నప్పుడు కష్టం కలుగుతుంది. అయితే ఛీ ఇలాంటి వాళ్ళతో నాకేంటి పని అనుకుని తెగతెంపులు చేసుకోవటం మాత్రం జరగదు. తన పొట్ట మాడుతున్నా గూట్లో ఉన్న పిల్లలకోసం ఆహారం తెచ్చి నోటి కందిస్తుంది పెద్ద పక్షి. కానీ ఆ పిల్లలు పెద్త్దె రెక్కలొచ్చాక వాటి దోవన అవి ఎగిరిపోతాయి.