భానుభక్త ఆచార్య
This article needs additional citations for verification. (July 2017) |
శ్రీ ఆదికవి భానుభక్త ఆచార్యa | |
---|---|
![]() A portrait of Bhanubhakta Acharya | |
రచయిత మాతృభాషలో అతని పేరు | శ్రీ ఆదికవి భానుభక్త ఆచార్య |
పుట్టిన తేదీ, స్థలం | 1814 (1871 B.S.) చుండి రంగా, నేపాల్ |
మరణం | 1868 (aged 53–54) (1925 విక్రమ సంవత్సరంB.S.) సెటిఘట్ |
వృత్తి | కవి |
భాష | నేపాలి (Khas) |
జాతీయత | నేపాలి |
పౌరసత్వం | నేపాల్ |
నేపాలి భాషను అంధకారం ఆవరించుకున్న కాలంలో, సాహిత్యసృష్టికి ఆభాష అర్హతని పొందని తరుణంలో భానుభక్త అవతరించాడు.ఆతని ఆవరణతో నేపాలీ భాషా సాహిత్యాలను అలముకున్న చీకట్లు పటాపంచలైనాయి. భానుభక్త అవతరణ నేపాలీ జాతికీ, భాషా సాహిత్యాలకూ అపూర్వమైన వెలుగును, జీవాన్నీ, ఉజ్వలమైన ప్రగతినీ ప్రసాదించింది.
భారతదేశంలో వలనే ప్రాచీన నేపాలు దేశంలో కూడా సంస్కృతభాషకే రాజస్థానలలో గౌరవం లభించేది.సంస్కృతభాషా సాహిత్యాలపై అపారమైన అభిమానం వల్లనైతేనేమి, ప్రభువుల ప్రాపకాన్ని సంపాందించడాని కైతేనేమి నాటి నేపాలీ కవి పండితులంతా తమ సాహిత్య సృష్టిని సంస్కృతభాషలోనే చేసేవారు.కాని, ఏఒక్కరూ ప్రాంతీయ భాషలైన మగధి, పర్బాతే, నేవారీ మున్నగు భాషలలో సాహిత్యాన్ని సృష్టించేందుకు ప్రయత్నించలేదు. ఆకారణంగా ప్రాచీన నేపాలు దేశంలో సాహిత్యసృష్టి అంతా సంస్కృతంలోనే రూపొంది-మహామహానులైన సంస్కృత విద్వత్కవులనూ, అపూర్వమైన సంస్కృత సాహిత్యాన్నీ సాహిత్య ప్రపంచానికి సపర్పించింది. అదే సమయంలో నేపాలీ రాజకీయ పరిణామాలలో పలు విపత్తులు దండయాత్రలు సంభవించాయి. ఇటువంటి విషమ పరిస్థితులలో మహాకవి భానుభక్త అవతరించాడు. మహారాజా పృధ్వీనారాయణ్ షా దేశంలో రాజకీయ సమైక్యతను సాధించినట్లుగా, మహాకవి భానుభక్త ప్రజల భాషలో సాహిత్యాన్ని సృష్టించడం ద్వారా నేపాలీ భాషా సాహిత్యాలలో మహత్తరమైన విప్లవాన్ని సాధించాడు.తద్వారా సాహిత్యాన్ని ప్రజలందరికీ సన్నిహితపరచడమే కాకుండా, విభిన్న భాషా వర్గాల మధ్య భావ సమిక్యతను సాధించాడు. ప్రజల భాషయైన నేపాలీ భాషకు గౌరవాన్ని సంతరింపజేస్తూ, ఆ భాషలో సాహిత్యానికి నాడే బలమైన పునాదులు వేశాడు.
జీవితం[మార్చు]
భానుభక్త నేపాలులో తానాహు జిల్లాలోని రాంఘా గ్రామంలో 1814 సం.లో జన్మించాడు.భానుభక్త తండ్రి ధనుంజయ ఆచార్య ప్రభుత్యుద్యోగిగా ఉండేవారు.రాజ్యకార్య నిర్వహణలో ఉండడం వలన ఆయన భానుభక్త సంరక్షణ భారాన్ని తండ్రి శ్రీకృష్ణ ఆచార్యకు అప్పగించారు. తాతగారి సంరక్షణలోనే భానుభక్త బాల్యం విద్యార్థిదశలు గడిచాయి. శ్రీ కృష్ణ ఆచార్య అప్పటి సంస్కృత విద్వాంసులలో పేరుగాంచినవారు కారణంగా, భానుభక్త పిన్నవయసులోనే సంస్కృతభాషా సాహిత్యాలలో అపారమైన పాండిత్యాన్ని గడించుకున్నాడు. అటుపిమ్మట ఉన్నత విద్యాభ్యాసానికై సరస్వతీ నిలయమైన కాశీ విద్యాపీఠానికి వెళ్ళాడు.కాని, తన తండ్రికి అస్వస్థత కారణంగా భానుభక్త తన విద్యాభ్యాసాన్ని చాలించవలసి వచ్చింది.
అప్పటికే సంస్కృత సాహిత్యాన్ని విశేషంగా జీర్ణించుకోవడంతో భానుభక్తకు ప్రకృతంతా ఎంతో వింతగా అగుపించింది. భానుభక్త వీలైననంతవరకూ నగరంలోని కృతక వాతావరణపు పొలిమేరలు దాటిపోయి పచ్చని పొలాలనూ, పల్లెప్రజల జీవితాలనూ పరిశీలిస్తూ వారి సంభాషణలలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉండేవాడు.ఆకవి హృదయతంత్రులు రామనామాన్ని స్పందింపచేసినాయి.అంతటితో ఆదికవి వాల్మీకి విరచితమైన శ్రీ మద్రామాయణ మహాకావ్యాన్ని అసాధారణ ప్రతిభా సంపత్తితో, అంతవరకూ సాహిత్యభాషగా అర్హతకు నోచుకోని మాతృభాషయైన నేపాలీ భాషలో అనువదించ పూనుకొని నేపాలీ భాషా సాహిత్యాలలో అపూర్వమైన రచనకి నాయకత్వం వహించాడు. భానుభక్త రచనకు కొద్ది కాలం లోనే (1841) లో బాలకాండ అనువాదం పూర్తిగావించాడు.
కాని తండ్రి అస్వస్థతతో, తానొక్కడే సంతతి కావడంవల్ల కుటుంబ వ్యవహారాలన్నీ చూసే బాధ్యత స్వీకరించవలసి వచ్చింది.దానితో రామాయణానువాదం కొంతకాలం నిలచిపోయింది. తన తండ్రి రాజ్యవ్యవహారాలలో అవకతోకలకు భానుభక్తను రాజధాని ఖ్సాట్మండుకు నిర్బంధంలో ఉంచబడ్డారు. ఈ నిర్బంధం భానుభక్తకు నేపాలీ భాషా సాహిత్యాలకు అపూర్వమైన, అమూల్యమైన, అత్యావశక్యమైన అవకాశాన్నీ ప్రసాదించింది.ఈ 5 మాసాలలో ఆయన రామాయణ మహాకావ్యంలో మరొక 4 కాండాల్ని అనువదించారు.
ప్రజల భాషయైన నేపాలీలో కావ్యరూపంలో అంతవరకూ వచ్చిన భానుభక్తరామాయణానువాదం అతి స్వల్ప కాలంలో అతిమిక్కిలి ప్రచారాన్ని పొందింది.రామకథను ప్రజలు గానం చేయసాగారు.సలక్షణమైన నిర్దుష్టమైన పదజాలాన్ని భానుభక్త తన రామాయణ రచనకు సమకూర్చుకొనడంతో ప్రాకృత భాషా స్వరూపమైన పర్బాతే (నేపాలీ) భాషపై విశేషంగా సంస్కృతభాషా ప్రభావం పడి, ఆభాష ప్రత్యేక స్వరూపాన్నీ సంపూర్ణతనూ సిద్ధించుకుంది.అందువల్ల నేపాలీ భాష అధికార భాషగా గుర్తించబడింది. సాహిత్య భాషగా నేపాలీ భాషను ప్రజలు ఆమోదించసాగిరి.
మహాకవి భానుభక్తను నేపాలు రాజ్యాధిపతులు 1850లో ఒక ఉన్నతమైన పదవిలో నియమించారు.కాని, ఆకవి హృదయానికీ, యాంత్రికమయిన ప్రభుత్వ కార్యకలాపాలకూ సాయోధ్య కుదరకపోవడంతో భానుభక్త అచిరకాలంలోనే ఉద్యోగాన్ని విరమించాడు.
భానుభక్త 1853 నాటికి రామాయణ కావ్యంలో మిగిలిన కాండాల్ని అనువదించాడు.అదే సం.లో భక్తమాల అను సృజనాత్మకమైన నేపాలీ కావ్యాన్ని రచించాడు.పిమ్మట ఈకావ్యం మరొక విద్వాంసునిచే సంస్కృతభాష లోనికి అనువదించబడింది.భానుభక్త విరచితమైన మరొక సృజనాత్మకమైన నేపాలీ కావ్యం విధుశిక్ష. ఇది హృహిణులకు హితబోధ గావించే ముప్పది మూడు కవితలుగల చక్కని కావ్యం. 1862లో భానుభక్త తన స్నేహితుడైన తారాపతి ఇంట అతిధిగా ఉంటూ ఒకే రాత్రిలో రచించాడు. ప్రశ్నోత్తరి అను మరొక మహాకావ్యాన్ని కూడా నేపాలీ భాషలోనికి అనువదించి సామాన్య ప్రజలందరికీ అందించాడు. ఇవికాక, వివిధ కథావస్తువులను తీసుకొని పలు కవితలను రచించాడు.భానుభక్తలో మరొక ప్రత్యేకత ఏమిటంటే మిత్రులకు లేఖలు వ్రాసినా, ప్రభుత్వానికి మహాజర్లు పంపినా, ప్రజలకు హితం చెప్పినా కవితల్లోనే చెప్పేవాడు. భానుభక్త రచనలలో సరసమైన, సున్నితమైన హాస్యం లభిస్తుంది.
భానుభక్త అస్వస్థుడుగా ఉన్నప్పటికీ ఏకైక కుమారుడైన రామ్‌నాధ్ సరసన కూర్చొని కవితలు వ్రాయింపజేసేవాడు.కడకు అవసాన దశలో కూడా రామగీత ను తను చెబుతూ, కుమారునిచే వ్రాయిపించి, శ్రీ మద్రామాయణం అనువాదం సంపూర్ణం చేయగలిగానన్న సంతృప్తి హృదయం నిండగా 1868లో కడపటి శ్వాసను విడిచాడు.
మూలాలు[మార్చు]
- 1964 భారతి పత్రిక.