భారతదేశంలో నా జైలు జీవితం
Mary Tyler ఆంగ్ల రచన "My Years in an Indian Prison(1977) "ను తెలుగులోకి 'సహవాసి' అనువాదం చేశారు. చేయని తప్పులకు నిరపరాధులను ప్రభుత్వాలు ఇనుప చట్టాల యంత్రంలో తోసి ఎట్లా బాధలకు గురిచేయగలవో ఈ ఆత్మకథ ఒక నిదర్శనం.
ఇది కల్పితగాధ కాదు, ఒక విదేశీ యువతి విషాదగాధ.
మేరీకి అమలేందు అనే బెంగాలి విద్యార్థితో పరిచయం అవుతుంది. అతను ఇంజనీరింగ్ విద్యార్థి. పరిచయం స్నేహంగా మారుతుంది. అతను సెలవులకు ఇంగ్లాండ్ నుంచి కలకత్తా వస్తూంటే మేరి అతనివెంట ఇండియా చూడడానికి వస్తుంది.
కలకత్తా పరిసర గ్రామీణ ప్రాంతాల్లో పర్యటన ఆరంభంలోనే ఇద్దరినీ నక్షలైట్లు అని అనుమానించిన పోలీసులు అరెస్టు చేసి బీహారు రాష్ట్రంలోని హజారీబాఘ్ జైలుకు పంపుతారు. నక్షలైట్ బందీలను అశ్లీల పదజాలంతో, నిరాధారమయిన రాజకీయ నేరారోపణలతో స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారుల విచారణ, నిందితులను కోర్టుకు తీసుకొని వెళ్ళే ప్రహసనం తప్ప న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టక పోవడం, రాజకీయ ఖయిదీలకు ఇవ్వవలసిన హక్కులు లేకుండా చేయడం, సెల్లో ఒంటరిగా, ఇనుప సంకెళ్లువేసి నిర్బంధించడం, దేశంలోని నక్షలయిట్ బందీలకు ఒకే విధమయిన అమానుష విధానం అమలు చేయడం వంటి విషయాలను ఆమె ఆత్మకథలో వివరంగా రాసింది.
మేరి ఎటువంటి విచారణ లేకుండా అయిదేళ్ళు హాజరీబాఘ్ జైల్లో గడుపుతుంది. చట్టానికి కళ్ళూ హృదయం ఉండవు. శ్రీ శ్రీ "నిరపరాధులై చెరసాలల్లో మగ్గేవాళ్ళు" అన్న చరణం ఆమెకు సరిపోతుంది.
చివరకు అంతర్జాతీయ జోక్యంతో, బ్రిటీషు ప్రభుత్వం వత్తిడితో బారత ప్రభుత్వం మేరీని విడిచిపెట్టింది. జైలు పాలైన ఆమె యవ్వనాన్ని ఎవరు తిరిగి ఇస్తారు? అమలేందు తర్వాత ఎప్పుడు విడుదలయ్యాడో తెలియదు.
ఆరోజుల్లో స్వయం ప్రకటిత (self-styled) "సూడోభక్తులు" ఏమీ నేరం చెయ్యకుండా ప్రభుత్వం మేరీని ఊరకే నిర్బంధించదని వాదించారు.
మేరి జైల్లో తన కష్టాలుకాక, సాటి బంధితుల కన్నీటి గాధలను రికార్డు చేసింది. సి.పి.ఐ నుంచి ఎన్నికయిన మహిళా ఏం.ఎల్.ఏ కారాగారంలో ప్రజల కడగళ్లను గురించి కాక, అల్లికలు, కుట్టుపనులు వంటి విషయాలమీద ఆసక్తి చూపడం మేరికి ఆశ్చర్యం కలిగిస్తుంది.
మూలలు :1. భారతదేశంలో నా జైలు జీవితం, మేరి టేలర్. 2.Mary Tyler, My Years in an Indian Prison,1977.