భారతదేశంలో ఫ్లూ మహమ్మారి (1918)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రపంచవ్యాప్తంగా సంక్రమించిన  స్పానిష్  ఫ్లూలో భాగంగా 1918-1920 మధ్య కాలంలో భారతదేశంలో  ప్రాణాంతకమైన ఫ్లూ మహమ్మారి ప్రబలి అసాధారణ రీతిలో ప్రజలను బలిగొంది. ఈ మహమ్మారి కారణంగా దేశ జనాభాలో సుమారు 5 శాతం జనాభా తుడిచిపెట్టుకుపోయారు. భారతదేశంలో ఈ అంటువ్యాధిని బాంబే ఇన్‌ఫ్లూయెంజా లేదా బొంబాయి ఫీవర్గా పిలుస్తారు.[1][2] ఈ మహమ్మారి భారతదేశంలో సుమారు 1.4 నుంచి 1.7 కోట్ల వరకు ప్రాణాలను పొట్టనపెట్టుకొన్నదని విశ్వసిస్తారు.   ప్రపంచంలోని మరి ఏ ఇతర దేశంలోను ఇంత భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం జరగలేదు.[3][4]

స్పానిష్ ఫ్లూ

[మార్చు]
స్పానిష్ ఫ్లూ వైరస్

స్పానిష్ ఫ్లూగా పిలవబడే వ్యాధి ఇన్‌ఫ్లూయెంజా A వైరస్ సబ్‌టైప్ H1N1 (Influenza A virus subtype H1N1) తరగతికి చెందింది. H1N1 అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది 1918 మార్చి నెలలో అమెరికా లోని కాన్సస్ రాష్ట్రంలో ఒక సైనిక శిక్షణా శిబిరంలో తొలిసారిగా గుర్తించబడింది. కేవలం 6 నెలలలో మహమ్మారిగా మారి ప్రపంచాన్ని చుట్టుముట్టింది. ఇది మొదటి 6 నెలల వ్యవధి లోనే ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మందిని పైగా బలితీసుకొంది.[5] ఈ వ్యాధి కారణంగా 5 నుంచి 10 కోట్ల మంది వరకు మరణించారని అంచనా.[6] ప్రపంచ జనాభాలో 3 నుంచి 6 శాతం జనాభాను తుడిచిపెట్టింది. ఇది ఎంత అసాధారణంగా ప్రారంభమైందో అంత త్వరగానే దాదాపు 18 నెలల్లో పూర్తిగా అదృశ్యమైంది. ఈ వ్యాధి కారణంగా అమెరికా దేశంలో 6,75,000 మంది,[7] బ్రిటన్ లో 2 లక్షలమంది మరణించగా భారతదేశంలో 1.7 కోట్ల మంది మరణించారు. మహమ్మారి కారణంగా కనీవినీ ఎరుగని స్థాయిలో కోట్లాది మందిని కోల్పోయిన భారతదేశం మృతుల సంఖ్యతో పోలిస్తే అత్యంత ఘోరంగా ప్రభావితమైన ఏకైక దేశంగా చరిత్రలో నిలిచిపోయింది.

భారతదేశంలో వ్యాప్తి-విస్తృతి

[మార్చు]

భారతదేశంలో ఈ మహమ్మారి తొలిసారిగా 1918 జూన్ నెలలో బొంబాయిలో అడుగుపెట్టింది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని ఇండియాకు తిరిగి వచ్చిన సైనికులతో పాటు ఈ ప్రాణాంతక అంటువ్యాధి ముంబై  ఓడ రేవుకు ఒక నౌకలో చేరుకుంది. రెండు నెలల వ్యవధి లోనే ఇది పశ్చిమం నుండి దక్షిణానికి, క్రమంగా తూర్పుకు, ఉత్తరానికి వ్యాపించింది. వాణిజ్య, పోస్టల్, రైల్వే మార్గాలను అనుసరిస్తూ ఉపఖండమంతటా అసమానంగా వ్యాపించింది. ఆగస్టు నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకి ప్రాకిపోయిన ఈ అంటువ్యాధి మహమ్మారిగా మారి దేశాన్ని అతలాకుతలం చేసింది. ఇది దేశంలోని వివిధ ప్రాంతాలను అలల మాదిరిగా మూడు సార్లు తాకింది. మొదటి సారి తాకినప్పుడు ఈ అంటువ్యాధి అంత ప్రమాదకార స్థాయిలో లేదు. కొంతమంది కార్మికులపై దీని ప్రభావాన్ని బ్రిటిష్ అధికారులు గుర్తించారు. రెండవ సారి సెప్టెంబరు నెలలో చెలరేగినపుడు దేశంలో అత్యధిక మరణాలు సంభవించాయి. 2018, సెప్టెంబరు చివరి వారంలో బొంబాయిలో గరిష్ఠ మరణాల రేటు సంభవించింది. మద్రాసులో అక్టోబరు మధ్యలో, కలకత్తాలో నవంబరు  నెలలో మరణాల రేటు గరిష్ఠ స్థాయికి చేరుకొంది. డిసెంబరు నాటికి తీవ్రత తగ్గుముఖం పట్టింది.

ఈ అంటువ్యాధి 20 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను తీవ్రంగా ప్రభావితం చేసింది, పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువగా తల్లడిల్లిపోయారు.[8] 1918 నాటి శానిటరీ కమిషనర్ నివేదిక ప్రకారం, బొంబాయి, మద్రాసు రెండు నగరాలలోను వారానికి 200 మందికి పైగా మరణించారని తెలుస్తుంది..[9] అదే సమయంలో రుతుపవనాలు విఫలం కావడం వలన దేశంలో కరువు కాటక పరిస్థితులు తలెత్తాయి. దానితో వ్యాధి మరింత వేగంగా  విస్తరించింది. సరైన తిండి లేకపోవడంతో ప్రజలు పస్తులతోను, నిస్సత్తువతోను  కృశిస్తూ జనసమ్మర్థంతో కూడిన నగరాలకు వలస పోవడం జరిగింది.[2] దీనివల్ల  అంటువ్యాధులు మరింతగా విజృంభించడంతో పరిస్థితులు తీవ్రంగా  దిగజారిపోయాయి. మరోవైపు ఈ ఘోర విపత్తును ఎదుర్కొనే సామర్థ్యం వలసపాలకులకు  ఏ మాత్రం లేదు. దేశంలో వైద్య సహాయం కోసం ఎదురుచూసిన డిమాండ్లు తారాస్థాయికి చేరుకోవడంతో తట్టుకోలేని దేశ ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పడంతో బ్రిటీష్ ప్రభుత్వం భారతీయులను వారి ఖర్మకు వదిలివేసిందని ఆరోపణలు వచ్చాయి.[10] ఇటువంటి  విపత్కర పరిస్థితులలో ఫ్లూ మహమ్మారి దేశంలో విశృంఖలంగా చెలరేగిపోతూ మరణమృదంగం మోగించింది.

పతనం

[మార్చు]

ఫలితంగా ఈ మహమ్మారి ధాటికి దేశ జనాభాలో 5 శాతం పైగా ప్రజలు అంటే కనీసం కోటి ఇరవై లక్షల పైగా జనాభా తుడిచిపెట్టుకుపోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మొత్తం చనిపోయిన వారి సంఖ్య కన్నా ఇది ఎక్కువ. ఫలితంగా, 1919 సంవత్సరంలో జననాలు 30 శాతం తగ్గాయి. 1911-1921 దశాబ్దంలో భారతదేశ జనాభా వృద్ధి రేటు కేవలం 1.2 శాతం మాత్రమే. యావత్ బ్రిటిష్ రాజ్ పాలనా కాలంలో కనిష్ఠ జనాభా వృద్ధి  రేటు నమోదైన  దశాబ్దం ఇదొక్కటే. విపత్తుకాలంలో నిత్యం 150 నుంచి 200 వరకు మృతదేహాలు శ్మశానవాటికలకు చేరుకునేవని భారతీయ పత్రికలు పేర్కొన్నాయి. ఉత్తరభారతదేశపు ప్రముఖ హిందీ కవి సూర్యకాంత్ త్రిపాఠి తన జ్ఞాపకాలలో " గంగానది శవాలతో ఉప్పొంగిపోయింది..." అని పేర్కొన్నాడు. 1918 నాటి శానిటరీ కమిషనర్ నివేదిక శవాలు కుప్పలుగా పేరుకుపోయాయని, వాటి దహన సంస్కారాలకు కట్టెల కొరత ఉన్నందున, భారతదేశంలోని నదులన్నీ మృతదేహాలతో మూసుకుపోయాయని,[11] పేర్కొంది. భారత స్వాతంత్ర్య  పోరాట నాయకుడైన మహాత్మా గాంధీ కూడా ఈ వైరస్ బారిన పడ్డారు.[4]

1918-19 మధ్య భారతదేశంలో చెలరేగిన ఈ మహమ్మారి వినాశనకర ప్రభావం ఊహలకందనిది. మృతుల సంఖ్య గరిష్ఠంగా 1.8 కోట్లు వరకు ఉండవచ్చని కనిష్ఠంగా 1.2 కోట్లు వరకు ఉంటుందని భావించారు. భారతదేశంలో దీని ప్రభావాన్ని అధ్యయనం చేసిన డేవిడ్ ఆర్నాల్డ్ (2019) ఈ ప్రాణాంతక ఫ్లూ కారణంగా అప్పటి భారతదేశ జనాభాలో 5% మంది అంటే కనీసం కోటి 20 లక్షల పైగా ప్రజలు చనిపోయారని అంచనా వేశారు.[12] ఈ మహమ్మారి  వినాశనం కారణంగా భారతదేశంలోని బ్రిటిష్ పాలిత జిల్లాల్లో 1 కోటి 38 లక్లల పైగా జనాభా మరణించారు.[13] కేవలం ఒక్క సెంట్రల్ ప్రావిన్సెస్ రాష్ట్రంలోనే 9,15,000 కు పైగా మరణాలు సంభవించాయి.[12] ఈ సంఖ్య అమెరికా, బ్రిటన్ దేశాలలో మరణించిన మొత్తం కన్నా ఎక్కువ.

వ్యాప్తిలో అసమానతలు

[మార్చు]
 • అయితే ఈ మహమ్మారి భారత ఉపఖండమంతటా ఒకే విధంగా విస్తరించలేదు. భౌగోళికంగా దక్షిణ, తూర్పు ప్రాంతాలతో పోలిస్తే ఉత్తర, పశ్చిమ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలు వాటి మొత్తం జనాభాలో 4.5 నుండి 6 శాతం జనాభాను కోల్పోయాయి. దక్షిణ, తూర్పు ప్రాంతాలు వాటి మొత్తం జనాభాలో 1.5 నుండి 3 శాతం జనాభాను కోల్పోయాయి.
 • భౌగోళికపరంగానే కాకుండా ఈ మహమ్మారి వ్యాప్తి జాతి, కుల పరంగా కూడా విభజన చూపింది. ఒక్క బొంబాయి నగరాన్ని తీసుకొంటే అక్కడి బ్రిటీషర్లతో పోలిస్తే దాదాపు ఏడున్నర రేట్లు ఎక్కువగా భారతీయులు మరణించారు.[14] మరణించిన భారతీయులలో దిగువకులాల వారు, ముస్లింలు గణనీయంగా ఉన్నారు.[15] మరణించిన ప్రతి నలుగురు హిందువులలో ముగ్గురు దిగువ కులాలవారు ఉన్నారు. హిందూ-ముస్లిం ఇరువురి మరణాలను పోల్చి చూస్తే ప్రతీ ముగ్గురు హిందువులకు ఒకరు ముస్లిం ఉండేవాడు. జాతిపరమైన అసమానతలకు తోడు సామాజిక, ఆర్థిక అసమానతలు కూడా దీనికి కారణమయ్యాయి. కలకత్తా వంటి నగరాలలో బ్రిటీష్ హెల్త్ ఆఫీసర్లు సైతం బ్రిటీషర్ల-దిగువ కులాల భారతీయుల మధ్య నెలకొన్న మరణాల రేటులోని తీవ్ర వ్యత్యాసాన్ని గుర్తించారు.
 • అదే విధంగా ఈ మహమ్మారి ధాటికి పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా మరణించడం జరిగింది.

ప్రభావం

[మార్చు]
 • ఈ ప్రాణాంతక అంటువ్యాధి వల్ల భారత ఉపఖండంలో జనాభా 5 శాతం మేరకు హరించుకుపోయింది. కనీసంలో కనీసంగా 1.2 కోట్ల భారతీయుల ప్రాణాలు కోల్పోయారని అంచనా. దేశ జనాభాలో 5% ప్రజలు తుడిచిపెట్టుకుపోవడంతో దాని ప్రభావం జనాభా లెక్కలపైన ప్రతిఫలించింది. అంతకుముందు దశాబ్దంతో పోలిస్తే 1921 జనాభా గణనలోనే  తొలిసారిగా  భారత జనాభా తగ్గిపోయింది.  భారత జనాభా క్షీణించిన ఏకైక దశాబ్ద కాలంగా  1911-1921 మధ్య గల దశాబ్ద కాలం చరిత్రలో నిలిచిపోయింది.[16][17]
 • ఈ మహమ్మారి దేశంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంపై గణనీయమైన ప్రభావం చూపింది. కుప్ప కూలిపోయిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పర్యవసానంగా సామూహిక మరణాలు, దుర్భర పరిస్థితులతో పాటు మహమ్మారి వల్ల కలిగిన ఆర్థిక పతనం మొదలైన అంశాలు వలస పాలనకు వ్యతిరేకంగా ప్రజలలో భావోద్వేగం పెరగడానికి దారితీసాయి.[4][11]
 • భారతపఖండంలో సంభవించిన ఇతర క్షామాలు, అంటువ్యాధులతో పోలిస్తే ఈ ఫ్లూ మహమ్మారి మరింత వినాశనకారిగా పరిణమించింది. ఉదాహరణకు 1896-1907 లో భారతదేశంలో వ్యాపించిన గ్రేట్ ప్లేగు అంటువ్యాధితో పోలిస్తే రెట్టింపు మరణాలు దీనివల్లనే సంభవించాయి. అయినప్పటికీ ఈ ఇన్‌ఫ్లూయెంజా మహమ్మారి భారతదేశంలో మునుపటి ఘోర విపత్తులు కలిగించిన స్థాయిలో ప్రతిస్పందనలను కలిగించలేకపోయిందనే చెప్పాలి.

రిఫరెన్సులు

[మార్చు]
 • David Arnold, "Death and the Modern Empire: The 1918–19 Influenza Epidemic in India," Transactions of the Royal Historical Society (2019)
 • How the 1918 Flu Pandemic killed 12 million Indians, Madras Courier [1]
 • కరోనావైరస్: ‘అప్పుడు గంగానది శవాలతో ఉప్పొంగింది...’ మరణమృదంగం మోగించిన 1918 నాటి ఫ్లూ నుంచి భారత్ ఏం నేర్చుకోవాలి? [2]

మూలాలు

[మార్చు]
 1. "Deja flu: Spanish Lady killed 14 million in British India a century ago". Times of India. 2020-03-08. Retrieved 2020-04-08.
 2. 2.0 2.1 "Coronavirus: What India can learn from the deadly 1918 flu". BBC. 2020-03-18. Retrieved 2020-04-10.
 3. Mayor, S. (2000). "Flu experts warn of need for pandemic plans". British Medical Journal. 321 (7265): 852.
 4. 4.0 4.1 4.2 "How the Spanish flu changed the course of Indian history". Gulf News. 2015-03-15. Retrieved 2020-04-08.
 5. Taubenberger JK, Morens DM (January 2006). "1918 Influenza: the mother of all pandemics". Emerging Infectious Diseases. 12 (1): 15–22. Archived from the original on 1 October 2009. Retrieved 7 September 2017.
 6. Spanish flu Archived 25 మార్చి 2015 at the Wayback Machine, ScienceDaily
 7. The Great Pandemic: The United States in 1918–1919 Archived 26 నవంబరు 2011 at the Wayback Machine, U.S. Department of Health & Human Services.
 8. Mills, I D (1986). "The 1918-1919 Influenza Pandemic— The Indian Experience". The Indian Economic & Social History Review. 23 (1). doi:10.1177/001946468602300102.
 9. Chandra S, Kassens-Noor E (2014). "The evolution of pandemic influenza: evidence from India, 1918–19". BMC Infectious Diseases. 14 (510).
 10. "Coronavirus: What India can learn from the deadly 1918 flu". BBC. BBC. BBC. 18 March 2020. Retrieved 29 September 2020.
 11. 11.0 11.1 "An unwanted shipment: The Indian experience of the 1918 Spanish flu". Economic Times. 2020-04-03. Retrieved 2020-04-08.
 12. 12.0 12.1 David Arnold, "Death and the Modern Empire: The 1918–19 Influenza Epidemic in India," Transactions of the Royal Historical Society 29 (2019): 181-200
 13. Chandra, S; Kuljanin, G; Wray, J (August 2012). "Mortality from the influenza pandemic of 1918–1919: the case of India". Demography. 49 (3): 857–65.
 14. Chandra S, Kuljanin G, Wray J (August 2012). "Mortality from the influenza pandemic of 1918–1919: the case of India". Demography. 49 (3).
 15. "How the 1918 Flu Pandemic killed 12 million Indians". Madras Courier. April 2020. Retrieved 29 September 2020.
 16. "Why 1918 matters in India's corona war".
 17. "What the history of pandemics tells us about coronavirus".