Jump to content

మధుమేహంలో పాదాల సంరక్షణ

వికీపీడియా నుండి

ప్రపంచ వ్యాప్తంగా మధుమేహవ్యాధి అత్యంత ఆందోళనకరమైన రీతిలో విస్తరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది సెకన్లకు ఇద్దరు కొత్తగా మధుమేహ వ్యాధికి గురవుతున్నారు. ప్రస్తుతం 28.5 కోట్ల మంది మధుమేహ రోగుల్లో 5 కోట్ల 8 లక్షల మంది భారతదేశంలోనే ఉండడం గమనార్హం. మధుమేహ వ్యాధితో ఉన్న రోగి ఆసుపత్రిలో చేరడానికి దారితీస్తున్న అతిసాధారణ కారణం పాదాల సమస్య. చిన్న పుండుగా మొదలై పాదం తొలగింపునకు దారితీసే ప్రమాదకర పాదాల సమస్యను మధుమేహ రోగులు సరైన అవగాహనతో తగిన జాగ్రత్తలు పాటించి నివారించుకోవాలి. అందుకే మధుమేహ వ్యాధి ఉన్నవారు తమపాదాల సంరక్షణ గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. పాదాల సంరక్షణ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం.

ప్రత్యేక వైద్య విభాగం

[మార్చు]

మధుమేహ వ్యాధి ఉన్న వారిలో ప్రతి నలుగురిలో ఇద్దరికి పాదాలకు సంబంధించిన సమస్య ఉంది. సగటున ప్రతి 30 సెకన్లకు ఒక అంగచ్ఛేదం (అంప్యూటేషన్‌) మధుమేహం కారణంగా జరుగుతున్నది. మధుమేహ వ్యాధిలో పాదాలకు సమస్యలు రావడంవల్ల దీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండాల్సిరావడం, సంక్లిష్టమైన చికిత్స, ఒక్కోసారి అంగవైకల్యం ప్రాప్తించడం వంటి ఇబ్బందుల కారణంగా రోగులకే కాకుండా దేశానికి కూడా ఆర్థికభారమై, ఉత్పత్తి సామర్థ్యం కూడా దెబ్బ తింటున్నది. ఇంతగా ప్రాధాన్యత సంతరించుకున్న పాదాల సమస్యకు చికిత్స చేసేందుకు మధుమేహ వ్యాధిలోనే ప్రత్యేకంగా 'పొడియాట్రి' అన్న స్పెషాలిటీ ఆవిర్భవించింది. దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నవారిలో 15 శాతం మందికి పాదాల సమస్య వచ్చే అవకాశం ఉన్నది. పాదాలపై ఏర్పడే పుండ్లు, ఎర్రని మచ్చలు, లోపలకుపెరిగిన గోళ్లు, తీయడానికి కష్టంగా ఉన్న ఆనెలు, చీము ఏర్పడడం, ఒక్కోసారి తీవ్రమైన కేసు. వేలు లేదా పాదం నల్లబడడం (గ్యాంగ్రీన్‌), ముదిరితే ఆ భాగం లేదా మొత్తం పాదం తీసివేయాల్సి రావడం జరుగుతుంది.

మధుమేహ పాద ఇన్ఫెక్షన్

ఐదు అంచెలు

[మార్చు]

పాదాల పుండ్లను అంచనావేసి చికిత్స చేసేందుకు చాలా పద్దతులున్నప్పటికీ సాధారణంగా వేగర్స్‌ పద్ధతి ప్రకారం ఆరు గ్రేడులుగా విభజిస్తారు.

  • గ్రేడ్‌ 0 : పుండ్లు లేనప్పటికీ పుండ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
  • గ్రేడ్‌ 1 : పుండు ఉపరితం వరకే పరిమితమై ఉంటుంది.
  • గ్రేడ్‌ 2 : పుండు చర్మం కింద కండరం, ఎముక, కీలు లోకి పాకి ఉంటుంది.
  • గ్రేడ్‌ 3 : పుండు లోతుగా క్రిమి దోషం తో ఉంటుంది. ఆస్టియోమైలైటిస్‌ అంటే ఎముకకు కూడా క్రిమి దోషం ఉంటుంది.
  • గ్రేడ్‌ 4 : ఏదో ఒక భాగంలో కణజాలం కుళ్లిపోయి ఉంటుంది. దీనినే లోకలైజ్డ్‌ గాంగ్రీన్‌ అంటారు.
  • గ్రేడ్‌ 5 : ఈ దశలో గాంగ్రీన్‌ చాలా విస్త్రృతంగా వ్యాపించి ఉంటుంది. ఆ భాగం తొలగించాల్సి వస్తుంది.

పాదాల పుండ్లకు చికిత్స

[మార్చు]
  • అవసరమైన మేరకు ఇన్సులిన్‌ ఇంజక్షన్‌తో మధుమేహాన్ని నియంత్రించాలి.
  • చెడు, చనిపోయిన కణజాలాన్ని తొలగించి, గాయాన్ని శుభ్రపరచాలి.
  • ఇన్‌ఫెక్షన్‌ నియంత్రించేందుకు సరైన యాంటిబయాటిక్స్‌ వాడాలి.
  • పుండు మానేసేందుకు వీలుగా పాదంపై బరువుమోపకుండా చూడాలి.
  • చర్మం ఎక్కువగా పోయిన సందర్భాల్లో మానని పుండుపై చర్మం అతికించడం చికిత్సలో భాగం.
  • మొండిగా ఉన్న కేసుల్లో ఆ భాగాన్ని లేదా పాదాన్ని తొలగించి ప్రొస్తెటిక్‌ ఆంగాల్ని అమర్చడం మరో చికిత్స.

పాదాల సంరక్షణ

[మార్చు]
  • మధుమేహ రోగి ప్రతి రోజూ తన పాదాలను పరీక్షించుకోవాలి. ఏవైనా పుండ్లు, కాలిన గుర్తులు, బొబ్బలు, చర్మం నల్లబడడం, లేదా ఎర్రని ఆనెలు, వేళ్ల వంకర, లోపలికి పెరుగుతున్న వేలిగోళ్లు వంటి మార్పులు గుర్తించాలి. పాదాల అడుగు భాగాన్ని కూడా పరీక్షించుకోవాలి. వంగకపోతే అడుగు భాగాన్ని ఒక అద్దం సహాయంతో పరీక్షించుకోవాలి.

చేయాల్సినవి

[మార్చు]
  • ప్రతి రోజూ మీ పాదాలను గోరువెచ్చని నీళ్లు, సబ్బుతో శుభ్రపరుచుకోవాలి.
  • పాదాలను వేళ్ల మధ్య భాగంలో కూడా పొడిగా ఉండేలా తుడుచుకోవాలి.
  • వేళ్ల గోళ్లను సమంగా కత్తిరించండి.
  • పాదాల చర్మం పొడిగాఉంటే మాయిశ్చరైజర్‌ లోషన్‌ రాయండి. వేళ్ల మధ్య రాయకండి.
  • పాదాలకుఎక్కువ చెమట పడుతుంటే, ఏదైనా టాల్కమ్‌ పౌడర్‌ రాయండి.
  • ప్యూమైస్‌ రాయితో ఆనెలను లేదా గరుకు చర్మాన్ని అరిగేలా చేయండి.
  • మెత్తని, సరైన పాదరక్షలు ధరించండి. కాళ్లకు సరిపడే మేజోళ్లను వాడండి. కాస్త వదులుగా ఉంటే మంచిది.
  • పాదరక్షలు కొత్తవి కొన్నప్పుడు నిదానంగా, రాపిడి తగలకుండా అలవాటు చేసుకోండి. ఎంచుకునేటప్పుడు వేళ్లవైపు వెడల్పుగా ఉండేలా, మడమ భాగం కూడా ఇరుకుగా లేకుండా చూసుకోండి.
  • రోజూ ధరించడానికి ముందు మట్టి, చిన్న రాళ్లు, మేకులు వంటి వాటికై పాదరక్షలు పరిశీలించాలి.
  • కాళ్లల్లో రక్తప్రసారం మెరుగయ్యేందుకు రోజూ పాదాల్ని కిందకూ, పైకీ, పక్కలకూ కదుపుతూ వ్యాయామం చేయాలి.

పుండ్లు ఎప్పుడు ఏర్పడతాయి ?

[మార్చు]
  • ఇంతకుముందు పాదానికి పుండు ఏర్పడి, తగ్గి పోయినప్పుడు.
  • ఇప్పటికే ఒక కాలు తీసివేసి ఉన్నవారిలో, రెండో కాలికి ఏర్పడే అవకాశం ఎక్కువ.
  • ఆనెలు వంటివి ఏర్పడటం.
  • పాదాల నిర్మాణంలో తేడా ఉండడం. అంటే వంకర పాదం, వేళ్లు వంకర.
  • పాదానికి రక్తప్రసరణ తగ్గడం.
  • పెరిఫరల్‌ నాడీవ్యవస్థ దెబ్బతిని నొప్పి, వేడి, చల్లదనం వంటి జ్ఞానం తెలీకుండా మొద్దుబారడం.
  • చూపు కోల్పోయిన వారిలో.
  • మూత్రపిండాల పనితీరు మందగించిన వారిలో.
  • ఒంటరిగా ఉండే వృద్ధుల్లో.
  • ఇవి గాక ధూమపానం, మద్యపానం, అవగాహన లోపం వంటివి అదనంగా పుండ్లు ఏర్పడేందుకు దారితీస్తాయి.

కారణాలు ఏమిటి ?

[మార్చు]
  • పాదాలకు రక్తప్రసరణ తగ్గిపోవడం.
  • పాదాలకు సంబంధించిన నాడీవ్యవస్థ పనితీరు మందగించడం.
  • క్రిమిదోషం (ఇన్‌ఫెక్షన్‌).

పై మూడు కారణాల వల్ల సంభవించే ప్రమాదకరమైన పాదాల సమస్యలకు చికిత్స కంటే పాదాల సమస్య రాకుండా నివారణ అత్యంత ముఖ్యం.

సూచికలు

[మార్చు]