మరకత శివలింగ దేవాలయం
మరకత శివలింగ దేవాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | రంగారెడ్డి జిల్లా |
ప్రదేశం: | చందిప్ప, శంకర్‌పల్లి మండలం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శివలింగం |
ముఖ్య_ఉత్సవాలు: | శివరాత్రి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | దేవాలయ శైలీ |
మరకత శివలింగ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, చందిప్ప గ్రామంలో ఉన్న దేవాలయం. మహారాష్ట్రలోని పర్లి వైద్యనాథుడిని పోలిన బ్రహ్మసూత్రం కలిగిన ఈ మరకత శివలింగానికి శతాబ్దాల చరిత్ర ఉంది. మూసీనది (ముచుకుందానది) ఒడ్డునున్న ఈ దేవాలయంలోని మరకత సోమేశ్వర లింగాన్ని పూజిస్తే వ్యాధులు నయమవుతాయిని, సకల ఐశ్వర్యాలు వస్తాయని భక్తుల నమ్మకం.[1]
చరిత్ర
[మార్చు]ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న మరకత లింగం కొలువై ఉన్న ఈ దేవాలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. సామాన్య శకం 1076-1126 మధ్య పశ్చిమ చాళుక్య రాజు చక్రవర్తి శ్రీత్రిభువన మల్లబిరుదాంకింతుడైన ఆరో విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని, క్రీ.శ.1101 సంవత్సరం కార్తిక శుద్ధ పంచమి గురువారం నాడు ప్రతిష్ఠ ఉత్సవం జరిగిందని ఇక్కడి శాసనం ద్వారా తెలుస్తోంది. దేవాలయ ప్రాంగణంలో వెలిసన క్షేత్ర పాలకుడైన కాలభైరవుడు ఈ దేవాలయాన్ని రక్షిస్తున్నాడు. ఆదివారం కాలభైరవుడిని పూజిస్తే సమస్త గ్రహదోషాలు పోతాయిని, సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ నాగుపాము రూపంలో సంచరిస్తూ ఉంటాడని భక్తుల నమ్మకం.[2]
పునర్నిర్మాణం
[మార్చు]2007లో శివరాత్రి పండుగ సందర్భంగా ఒక భక్తుడు దేవాలయంలో అభిషేకం చేయగా, శివలింగంపై ప్రసరించిన సూర్యకిరణాలు పరావర్తనం చెందడంతో దానిని మరకత లింగంగా గుర్తించాడు.[3] ఆ తరువాత ప్రముఖ సినీ నటులు తనికెళ్ళ భరణి, అతని బంధువులు ఇక్కడికి వచ్చి పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆ తరువాత 2011లో శంకర్‌పల్లికి చెందిన వెంకటేశ్వర్ రావు కుటుంబ సమేతంగా ఈ దేవాలయాన్ని దర్శించి, దేవాలయ పునర్నిర్మాణానికి పూనుకున్నాడు. శిథిలమైపోయిన పురాతన శివాలయం పునరుద్ధరించి, గర్భాలయాన్ని నిర్మించాడు.[4] 2012 అక్టోబరు 2న ఇక్కడ గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, రాజరాజేశ్వరిదేవి, నందీశ్వరుల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి.
పూజలు
[మార్చు]శ్రావణమాసం, కార్తీకమాసం పర్వ దినాలలో ఇక్కడ విశేష పూజలు నిర్వహించబడుతాయి. శివరాత్రి రోజున ఉత్సవాలు జరుగుతాయి. ఐదు సోమవారాలు కానీ, ఐదు పౌర్ణములు కానీ, ఐదు మాస శివరాత్రులు కానీ ఇక్కడి మరకత లింగాన్ని అర్చిస్తే సకల కోరికలూ నెరవేరుతాయని, పౌర్ణమినాడు లింగాభిషేకం చేసిన జలాలతో స్నానం చేస్తే వైకుంఠప్రాప్తి కలుగుతుందని ఇక్కడి చరిత్ర చెబుతోంది.[3]
దేవాలయ భూములు
[మార్చు]విక్రమాదిత్యుడి కాలంలోనే ఈ దేవాలయానికి వందలాది ఎకరాల భూమిని సమర్పించినట్టు, దేవాలయ నిర్వహణ, విశేష పూజలు, శివరాత్రి వంటి ఉత్సవాల నిర్వహణకు దాదాపు 254 ఎకరాలు కేటాయించినట్లు ఇక్కడి శాసనంలో రాయబడింది. దేవాలయానికి పశ్చిమ దిశలో 153 ఎకరాలు, తూర్పు దిశలో 2.20 ఎకరాలు, వరి పంట, పూలతోట కోసం 54 ఎకరాలు, దేవాలయ అర్చకులకు, నిత్యాన్నదానం కోసం మరికొన్ని ఎకరాల భూమి ఉంది.[2]
మూలాలు
[మార్చు]- ↑ పూజలందుకొని వెలుగులోకొచ్చిని చందిప్ప మరకత దేవాలయం, ఆంధ్రభూమి, హైదరాబాదు ఎడిషన్, 2007 జూన్ 27, పుట. 15.
- ↑ 2.0 2.1 "మోక్షమిచ్చే మరకతశివలింగం". www.andhrabhoomi.net. 2018-01-07. Archived from the original on 2022-10-24. Retrieved 2022-10-24.
- ↑ 3.0 3.1 telugu, NT News (2022-10-23). "హైదరాబాద్ సమీపంలో ఉన్న మరకత శివలింగ ఆలయం ప్రాముఖ్యత తెలుసా". Namasthe Telangana. Archived from the original on 2022-10-23. Retrieved 2022-10-24.
- ↑ చారిత్రక మరకత శివలింగానికి పూర్వవైభవం, ఆంధ్రభూమి, హైదరాబాదు ఎడిషన్, 2012 జనవరి 26, పుట. 16.