Jump to content

మలావిలో హిందూమతం

వికీపీడియా నుండి

19వ శతాబ్దం చివరిలోను, 20వ శతాబ్దం ప్రారంభంలోనూ బ్రిటిష్ మధ్య ఆఫ్రికాకు (తరువాతి కాలంలో దీన్నే న్యాసాలాండ్‌ అన్నారు) భారతీయ వలసవాదులను, వర్తకులను వలసవాద బ్రిటిషు నిర్వాహకులు తీసుకువచ్చినప్పుడు వారివెంట మలావికి హిందూమతం వచ్చింది. [1] [2] మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించడంలో సహాయం చేయడానికి, సేవలు, రిటైల్ మార్కెట్ల కోసం, పరిపాలనా మద్దతు కోసమూ తూర్పు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలకు చేసిన కార్మికుల తరలింపుల్లో భాగంగా వారు ఇక్కడికి వచ్చారు. [1] [2] [3] వలసదారుల్లో కొంతమంది విద్యావంతులు, నైపుణ్యం ఉన్నవారు. కానీ చాలా మంది పేదవారు. పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌లోని కరువు పీడిత ప్రాంతాలలో జీవనం గడుపుతున్నవారు. మలావి, మొజాంబిక్ మధ్య మొదటి రైలు మార్గాన్ని నిర్మించడంలో వారు సహాయపడ్డారు. [2] [4] [5]

క్రైస్తవం ప్రధానంగా ఉన్న మలావిలో హిందూమతానికి చాలా తక్కువ ఉనికి ఉంది. ప్రభుత్వం క్రైస్తవ, ముస్లిం జనాభాను ట్రాక్ చేస్తుంది గానీ ఇతర మతాలను విడిగా గుర్తించదు. హిందువులను, సాంప్రదాయ ఆఫ్రికన్ మతాలనూ "ఇతరులు" వర్గంలో భాగంగా పరిగణిస్తుంది. 2006 నాటికి దేశ జనాభాలో "ఇతరులు" దాదాపు 3.1% మంది. [6] [7]

1994 నాటి మలావి రాజ్యాంగం, దాని సెనేట్‌లో చాలా సీట్లు "మలావి లోని ప్రధాన మత విశ్వాసాల" కోసం ప్రత్యేకించింది. క్రైస్తవం, ఇస్లాం మాత్రమే "ప్రధాన విశ్వాసాలు"గా గుర్తించింది. హిందూ మతం వంటి విశ్వాసాలను ఆచరించే వ్యక్తులు సెనేట్‌లో రాజకీయ ప్రాతినిధ్యం వహించడాన్ని రాజ్యాంగం నిషేధించింది. కేవలం క్రైస్తవులు, ముస్లింలు మాత్రమే రాజకీయ అధికార స్థానాలను పొందడాన్ని అనుమతించింది. [8]

వలస పాలన ముగిసిన తర్వాత, తూర్పు ఆఫ్రికాలోని హిందువులు (జైనులు, సిక్కులతో పాటు) వివక్షకు గురయ్యారు. తూర్పు ఆఫ్రికా లోని వివిధ ప్రభుత్వాలు ఆఫ్రికనీకరణను ప్రోత్సహించాయి. ఆర్థిక వ్యవస్థలోని వాణిజ్య, వృత్తిపరమైన రంగాలను యూరోపియనేతర, ఆసియనేతర, ఆఫ్రికా వ్యక్తులకు మాత్రమే పరిమితం చేస్తూ చట్టాలు, విధానాలను రూపొందించాయి. [9] గతంలో మలావిలో నివసిస్తున్న చాలా మంది హిందువులు ఈ కాలంలో ఇతర దేశాలకు వలస వెళ్లారు. ప్రత్యేకించి 1960ల తరువాత యునైటెడ్ కింగ్‌డమ్‌కు వలస వచ్చారు. [1]

మలావిలో హిందువుల ప్రధాన భాషలు గుజరాతీ, సింధీ, బెంగాలీ. బ్రహ్మ కుమారీలకు బ్లాంటైర్‌లోని త్రికం మాన్షన్‌లో రాజయోగ కేంద్రం ఉంది. [10]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Sushil Mittal; Gene Thursby (2009). Studying Hinduism: Key Concepts and Methods. Routledge. pp. 87–88. ISBN 978-1-134-41829-9.
  2. 2.0 2.1 2.2 Kim Knott (2016). Hinduism: A Very Short Introduction. Oxford University Press. pp. 91–92. ISBN 978-0-19-874554-9.
  3. DAVID LEVINSON; KAREN CHRISTENSEN (2003). Encyclopedia of Community: From the Village to the Virtual World. Sage Publications. p. 592. ISBN 978-0-7619-2598-9.
  4. Frederic L. Pryor (1990). Malaŵi and Madagascar. World Bank. pp. 29–34. ISBN 978-0-19-520823-8.
  5. Harry Brind (1999). Lying Abroad: Diplomatic Memoirs. The Radcliffe Press. pp. 189–195. ISBN 978-1-86064-377-4.
  6. International Religious Freedom Report 2006, Malawi, State Department of the United States
  7. Malawi IFPRI
  8. Jeroen Temperman (2010). State-Religion Relationships and Human Rights Law: Towards a Right to Religiously Neutral Governance. BRILL Academic. pp. 94–95 with footnote 4–5. ISBN 90-04-18148-2.
  9. Steven Vertovec (2013). "Chapter 4". The Hindu Diaspora: Comparative Patterns. Taylor & Francis. pp. 87–89. ISBN 978-1-136-36712-0.
  10. Brahma Kumaris in Malawi, Brahma Kumaris Official Site, Malawi