Jump to content

మల్లాది సూరిబాబు

వికీపీడియా నుండి

మల్లాది సూరిబాబు ప్రముఖ సంగీత విద్వాంసుడు, ఆకాశవాణి కళాకారుడు.

విశేషాలు

[మార్చు]

మల్లాది సూరిబాబు 1945లో జన్మించాడు. ఇతని కుటుంబంలో వంశపారంపర్యంగా సంగీతం అబ్బింది. ఇతని తండ్రి శ్రీరామమూర్తి గొప్ప సంగీత విద్వాంసుడు. కాబట్టే పుట్టుక నుంచి గొప్ప సంగీత సంస్కారం సూరిబాబుకు ఆనువంశికంగానే వచ్చింది. ఇతని మృదుమధుర స్వరం గాంభీర్య మాధుర్యాలతో ఉండడం అనే ప్రత్యేక లక్షణమే ఇతనికి విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ఎనౌన్సర్‌గా ఉద్యోగం వచ్చేలా చేసింది. తండ్రి శ్రీరామమూర్తి స్ఫూర్తితో నేర్చిన సంగీత బాణి సూరిబాబుకు దశదిశలా పేరు ప్రజ్వలిల్లేలా చేసింది.

శ్రుతిమీద విశేష దృష్ట్టి ఉన్నవాడవడం చేత సూరిబాబు అన్ని శ్రుతులకూ తంబూరా శ్రుతి చేసి సి.డిల రూపంలో వెలువరించాడు. నారాయణతీర్థులూ, రామదాసూ, సదాశివ బ్రహ్మేంద్రులూ, అన్నమయ్య, కైవారం నారాయణ, ఆదిభట్ల నారాయణదాసుల కీర్తనలకు స్వరరచన చేసి సంగీత చరిత్రలో సమున్నత స్థానాన్ని పొందాడు. విజయవాడ కేంద్రంనుంచి ప్రసారమయ్యే సంగీత శిక్షణ కార్యక్రమంలో ఇతని గంభీరకంఠం ఇతని గురువు ఓలేటి శిక్షణతో మరింత మెరుగైన బంగారంలా మెరిసింది. సూరిబాబును ఒక అగ్రశ్రేణి కళాకారునిగా నిల్పింది. లలిత సంగీతాన్నికూడా శాస్ర్తీయ సంగీతానికి జోడించి చక్కని ప్రయోగాలు సూరిబాబు ఆకాశవాణి ద్వారా శ్రోతలకు అందించాడు. శ్రీపాద పినాకపాణి వద్ద ఇతడూ సంగీత అభ్యాసంచేసి తన సంగీత పరిజ్ఞానానికి మరింత సానబెట్టాడు. సూరిబాబు అనేక దేశ విదేశాలలో లెక్కలేనన్ని కచేరీలు చేశాడు. అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో 6 నెలల పాటు అక్కడి విద్యార్థులకు సంగీత పాఠాలు బోధించాడు. ఇతని కుమారులు శ్రీరామప్రసాద్‌, రవికుమార్‌ ఇద్దరూ "మల్లాది సోదరులు" పేరుతో సంగీత కచ్చేరీలు చేస్తున్నారు.

మూలాలు

[మార్చు]