Jump to content

మల్లికార్జున పండితారాధ్యుడు

వికీపీడియా నుండి
దస్త్రం:జగద్గురు శ్రీమల్లికార్జునపండితారాధ్యులు.jpg

శ్రీమల్లికార్జున పండితారాధ్యులు పండితత్రయములో, శివకవిత్రయములో ఒకరు. శివకవిగా, "కవిమల్లు"నిగా ప్రసిద్ధి చెందినారు.

వీరి కాలము : 1120- 1180

[మార్చు]

జీవితము

[మార్చు]

వీరు దక్షారామ శ్రీభీమేశ్వరస్వామివారి అర్చకులైన భీమన పండితులు, గౌరాంబలకు జన్మించినారు. కోటిపల్లి ఆరాధ్యదేవరగారు వీరి దీక్షాగురువులు. కర్ణాటకలో శ్రీబసవేశ్వరులు ప్రబోధించిన వీరశైవమును వీరు శ్రుతిస్మృతి పురాణేతిహాసాది ప్రమాణములతో ప్రతిపాదించినారు. వీరు వీరభద్రావతారమని వీరశైవులు విశ్వసిస్తారు. పండితారాధ్యులు పరమశివపూజాదురంధరులు; జంగమార్చనాశీలురు. శాపానుగ్రహసమర్థులు.

ఒకనాడు మల్లికార్జున పండితారాధ్యులు లింగార్చన కోసం పూలు కోయబోయినారు. అప్పుడు వెల్లగొండ మహదేవయ్య అనే మహాశివభక్తుడు పూలు కోసి శివార్చనకు ప్రొద్దు పోతుందని తొందరగా పోతూఉండగా అతని పాదములు శివార్చోపకరణములను తాకినవి. అతడా అపరాధమునకుగాను తన పాదములు రెండింటిని నరకుకొని పడిఉన్నాడు. పండితారాధ్యులతనిని చూచి, అతని భక్తిపెంపునకాశ్చర్యపడి, శివపూజాగృహములో వెలుగుతూ ఉన్న దీపపు ప్రమిదలోని నూనెను తీసి మహదేవయ్య పాదములకు మర్దింపగా అతని పాదములు మళ్ళీ శరీరముతో కలుసుకొన్నవి.

పండితారాధ్యులు సనదవోలులో (నేటి చందవోలు) తన మహిమను చూపిస్తూ ఉండగా వెలనాటి చోడునికి గురువైన బౌద్ధుడొకడు రాజుతో "తాను వాదములో పండితారాధ్యులనోడించి బౌద్ధమే ఉత్కృష్టమైనదని స్థిరపరుస్తాన"ని చెప్పగా రాజు సమ్మతించి, సభ చేయించి, అన్ని మతములవారిని పిలిపించినాడు. పండితారాధ్యులు శివభక్తులతో కూడి సభను ప్రవేశించి, "వేదవాదము, కర్మవాదము, కాలవాదము, వేదాంతమతము, సాంఖ్యవాదము, యోగవాదము, చార్వాకవాదము, పాంచరాత్రవాదము, బౌద్ధవాదము, జైనవాదము" అనే వివిధవాదములను శ్రుతి, స్మృతి, పురాణేతిహాసోదాహరణ పూర్వకముగా ఖండించారు. ఆ బౌద్ధుడోర్వలేక శివుని ఇందుధారణము, బ్రహ్మముఖావిర్భావము, కపాలాస్థిమాలా-చర్మధారణము, ఉమాపతిత్వము, భిక్షాటన, గంగాధారణము, త్రివిక్రమఖండనము, హరిహరాభేదము, గరళధారణము, నగ్నత్వము, దక్షాధ్వరధ్వంసములు శివుని సర్వాధిక్యమును స్థాపింపజాలవని నిందింపగా, ఆయా విషయములు శివుని ఆధిక్యమునెట్లు స్థాపిస్తున్నవో నిరూపించి, హరుని పంచవింశతిలీలాపరిగణనము చేసి, రుద్రాధికత్వమును, హరిహరతారతమ్యమును నిరూపించి, శివుని ప్రళయలీలను, మహాతాండవలీలను వర్ణించి, సభలోనివారంతా నివ్వెరపోయేలా చేయగా, అందరూ పండితారాధ్యులను కీర్తించసాగినారు. దీనిని చూచి సహించలేక, మారుమాట పలుకలేక, బౌద్ధుడు కోపోద్రిక్తుడై, పండితారాధ్యులను ధిక్కరించి, సభాస్థలిని విడిచిపోయినాడు. అక్కడ చేరినవారికందరికీ బౌద్ధుని మీద కోపము, ఏవ కలిగినవి.

రేమయ, దేవయలు తమ గురువైన పండితారాధ్యులను అవమానించినందుకు ఆ బౌద్ధుని చంపుతామని కంకణము కట్టి, అతడు సముద్రములోని ఒక లంకలో బుద్ధవిగ్రహమును పూజించడానికి పోతాడని తెలిసి వాడు రాకముందే బుద్ధవిగ్రహము వెనుక దాక్కుని ఉండి, వాడు రాగానే వానిపైబడి వధించారు. ఎంతసేపటికీ తమ గురువు మరలి రానందుకు బౌద్ధుని శిష్యులు పోయి వాని శవమును చూచి, ఏడ్చుకుంటూ రాజుతో మొరపెట్టుకోగా, రాజు పండితారాధ్యులను పిలిపించి " నీవేనా ఈ పనిని చేయించినది" అని అడిగినాడు. "అవును, నేనే చంపించినాను. బుద్ధుడే పరదైవమో, శివుడే పరదైవమో నీవు చూచినావు కదా! నీవు నన్ను దండించనెంచుతున్నావు. నీవు నన్ను దండించేదేమిటి? నన్ను నేనే దండించుకొంటాను, చూడు. మూడుసార్లు తల కోసుకొంటే, మూడు సార్లున్ను తల మొలవవలెను. మూడుసార్లు కళ్ళను పెరకుకొంటే, మూడు సార్లు మళ్ళీ అవి రావలెను. దేశదేశములలోను చాటించి అందరినీ రప్పించు. వారందరూ చూస్తారు" అని పలుకగా రాజట్లే అందరినీ రప్పించాడు. అందరూ చూస్తూ ఉండగా పండితారాధ్యులు రెండుసార్లు కన్నులు గోరుగొంటితో పెకలించి తీసినారు. రెండుసార్లు వారికి కళ్ళు వచ్చినవి. చోడునికి క్రోధము హెచ్చింది. ఇక మూడోసారి తానే కింకరులచేత పండితారాధ్యుల కన్నులను పెరికించి, జీళ్ళపాలు తెప్పించి, నిండ బోయించి చోడుడు పోయినాడు. అప్పుడు పండితారాధ్యులు " అసంఖ్యాత మహేశ్వరోత్థిత సమాయత క్రోధోత్కటానలపటల విరచిత జ్వాలల వెలనాఁటి చోడ ధరణీతలేశ్వరాధమపతంగంబు భస్మమయ్యెడన్! తద్బంధులు సుతులు విస్మయంబుగ నిప్డ భస్మమైపోదురు" అని శాపమిచ్చారు. వెలనాటి చోడుని వంశము శాపప్రకారము నాశనము పొందినది.

పండితారాధ్యులు బౌద్ధునితో సంభాషించటం, వాడు శివనింద చేయగా వినటం మొదలైన పాపములను తొలగించుకోవటానికి గణసహస్రనామములను పఠించి, అమరారామమునకు పోయి, అమరేశ్వరుని అమరేశ్వరాష్టకముతో కీర్తించి, తన కన్నులనెప్పటివలె పొందటమేగాక ఊర్ధ్వనేత్రమును కూడా పొందినారు.

ఆ తర్వాత పండితారాధ్యులు బసవేశ్వరులను చూడవలెనని కళ్యాణకటకమునకు బయలుదేరి, త్రోవలో ఊరూర శివభక్తులు తమకెదురువచ్చి పూజిస్తూ ఉండగా ఇరుగుడుముల అనే గ్రామం చేరి, అచ్చట వీరచాకిదేవయ్యచేత ప్రణిపత్తి చేయించుకొని, అక్కడ ఉండగా బసవేశ్వరులు ఆయనకు విభూతి పంపినారు. దానివల్ల ఆయనకు కన్నడభాష వచ్చింది. ఆ భాషలో పండితారాధ్యులు బసవేశ్వరులను కీర్తించారు. ఇరుగుడుముల నుండి పానుగంటికి రాగా, అచ్చట బండరువు గోవిందప్రెగడ ఆయనను   మహావైభవముతో పూజించాడు. పానుగంటికి ఉదయావనీశుడనేవాడు రాజు. ధవళేశునామయ్య అతని లెంక. నామయ్య శివభక్తిపెంపుతో సంచరిస్తున్నాడు. తక్కిన లెంకలది చూచి సహించక రాజుతో కొండెములు చెప్పినారు. రాజు అతనిని పిలిచి తన తమ్మను తినుమంటే అతడట్లు చేయ నిరాకరించాడు. తన్ను దండించకముందే నామయ్య రాజుకు బసవేశ్వరుల మహిమలను తెలిపి, తన తలను తానే ఖండించుకొని కైలాసమునకు పోయినాడు. ఉదయావనీశుడు వంశముతో నాశనమయినాడు.

పండితారాధ్యులు అక్కడ నుంచి వనిపురము పోగా శంకరయ్య అనే భక్తుడు ఆయనకు సకలోపచారములను చేసి ఆదరించాడు. అక్కడ నుంచి కళ్యాణకటకమునకు పండితారాధ్యులు బయలుదేరుతూ ఉండగా, ఒక జంగముడు కళ్యాణములో భక్తి గజిబిజి పుట్టి బిజ్జలుని జగదేవ మొల్లెబొమ్మయ్యలు చంపినారని, బసవేశ్వరులు కప్పడిసంగమేశ్వరమునకు పోయి దేహముతో సంగమేశుని గర్భములో చొచ్చినారని చెప్పగా, పట్టరాని దుఃఖముతో విలపించారు.

పండితారాధ్యులు వనిపురం శంకరయ్యగారిని వీడ్కొని బయలుదేరి శ్రీశైలమును చేరుకొన్నారు. వారికి ఆ శ్రీశైలము లింగాకారముగా తోచింది. శ్రీశైలోత్పత్తిని స్మరించి, దాని మహిమను స్తుతించి, దానిపైనెక్కి పాదములతో తాకుటకు జంకి, శిష్యుడైన దోనయ్యను శ్రీశైలమునెక్కి మల్లికార్జునస్వామి దర్శనము చేసి, తన భక్తిని నివేదించవలసినదని నియోగించారు. నానాదేశములనుండి శ్రీశైలయాత్రార్థమై వచ్చిన భక్తసంఘములతో దోనయ్య కొండ యెక్కుతూ ఉండగా, మల్లికార్జున స్వామి అతనికి వృద్ధతపోధనుని వేషముతో ఎదురై, పండితారాధ్యుల కుశలమడిగి, దోనయ్యకు శ్రీశైలములో ఉండే ప్రదేశములను ఒక దీపవృక్షము మీదనుంచి చూపినాడు. దోనయ్య పట్టరాని సంతోషముతో అన్నిటినీ చూచి, పండితారాధ్యుల అనుగ్రహముచేత గదా ఈ భాగ్యము నాకు కలిగినదని వెల్లటూరికి పోయి జరిగినదంతా విన్నవించాడు. పండితారాధ్యులు కూడా " నేనే కదా చరితార్థుడను! మల్లికార్జున స్వామి తలచినాడా? నీవంటి శిష్యుడు కలుగబట్టి కదా నేను ధన్యుడనైనాను" అని తనను ప్రమథగణములలో చేర్చుకోవలసినదిగా మల్లికార్జున స్వామివారిని వేడుకున్నారు. ఆ ప్రార్థననాలించి శివుడు ఆయనను ఆత్మగర్భస్థుని చేసాడు. అంతలోనే పండితారాధ్యుల ఆత్మసంతతికుల సతీసమేతముగా లింగోదరములో లీనమైనది. ఇది పండితారాధ్యులచరిత్ర

పండితారాధ్యులు వీరశైవాచార్యులుగా, వీరశైవ కవీశ్వరులుగా ప్రసిద్ధి చెందినారు. వీరు లింగోద్భవదేవగద్యము, అక్షరాంకగద్యము, పర్వతవర్ణనము, హరలీల, అమరేశ్వరాష్టకము, రుద్రమహిమ, బసవమహిమ  మొదలగు అనేక కృతులు రచించినప్పటికీ నేడు మనకు "శివతత్త్వసారము, గణసహస్రనామస్తవము" మాత్రమే లభ్యమవుతున్నాయి. ఇవి వీరశైవులకు ఉపాదేయములు.