Jump to content

మనిషి మెదడు

వికీపీడియా నుండి
(మానవ మెదడు నుండి దారిమార్పు చెందింది)

మనిషి శరీరంలో వివిధ అవయవాలు నాడీమండలం ఆధీనంలో ఉంటాయి. నాడీమండలంలో కేంద్ర నాడీమండలం, వికేంద్ర నాడీమండలం భాగాలు.కేంద్ర నాడీమండలంలో పెద్దమెదడు, మస్తిష్కమూలం, చిన్నమెదడు, కపాలనాడులు వివిధ భాగాలు. పెద్దమెదడు క్రింద మస్తిష్కమూలం ఉంటుంది. మస్తిష్కమూలంలో మధ్యమస్తిష్కం, వారధి ( పాన్స్ ), మజ్జాముఖం ( మెడుల్లా ఆబ్లాంగేటా ) ఉంటాయి. మస్తిష్కమూలానికి చిన్నమెదడు మూడు జతల నాడీకాండాలతో కలుపబడి ఉంటుంది. మజ్జాముఖం వెన్నుపాముగా వెన్నెముకలో కొనసాగుతుంది. వికేంద్ర నాడీమండలంలో వెన్నుపాము , వెన్నునాడులు , సహవేదన నాడీవ్యవస్థ ( సింపథెటిక్ నెర్వస్ సిష్టెమ్ ), పరానుభూత నాడీవ్యవస్థ ( పారాసింపథెటిక్ నెర్వస్ సిష్టెమ్ ) భాగాలు.

పెద్ద మెదడు

[మార్చు]

పెద్దమెదడు ఆలోచనలకు , విషయగ్రాహణంకు , జ్ఞాపకశక్తికి , విచక్షణా జ్ఞానానికి , విషయ చర్చలకు , వివిధ భావాలకు స్థానం. పంచేద్రియాలు గ్రహించే వాసన , దృష్టి, వినికిడి , రుచి , స్పర్శ మొదలైన సమాచారాలు జ్ఞాననాడుల ద్వారా ప్రసరించి పెద్దమెదడులో జ్ఞానంగా రూపొందుతాయి.

మెదడు పొరలు

[మార్చు]

మెదడు కపాలంలో రక్షించబడుతుంది. మెదడును మూడు పొరలు కప్పి ఉంచుతాయి. అందులో పై పొరను డ్యూరా అంటారు. డ్యూరా కపాలము లోపలి భాగంను అంటి ఉంటుంది. ఈ పొరలో తంతుకణజాలం, సాగుకణజాలం ఉంటాయి. ఈ పొర దళసరితనాన్ని గట్టిదనాన్ని కలిగి ఉంటుంది.మధ్య పొరను ఎరఖ్ నాయిడ్ అంటారు. సాలెగూడును పోలి ఉండడం వలన ఈ పొరకు ఆ పేరు వచ్చింది. ఈ సన్నని పొరలో తంతుకణజాలం ఉంటుంది.లోపలి సున్నితమైన పొరను పయా అంటారు. ఈ పొర మెదడును అంటిపెట్టుకొని ఉంటుంది. ఈ పొరలో తంతుకణజాలం ఉంటుంది. తంతుకణజాలానికి వెలుపల చదును కణాలు ఉంటాయి. మెదడుకు రక్తప్రసరణ కూర్చే రక్తనాళాలు ఈ పొరను చొచ్చుకొని లోపలకు వెళ్తాయి. ఎరఖనాయిడ్ కు పయాకు మధ్య గల జాగాలో నాడీద్రవము ఉంటుంది.

మెదడులో భాగాలు

[మార్చు]

పెద్దమెదడులో రెండు అర్ధగోళాలు ఉంటాయి. రెండు అర్ధగోళాలు [1]కార్పస్ కల్లోజమ్ అనబడే శ్వేత తంతువుల బంధనంతో కలుపబడి ఉంటాయి. ప్రతి అర్ధగోళంలోను లలాటభాగం, పార్శ్వభాగం, కర్ణభాగం, పృష్ఠభాగం ఉంటాయి. పెద్దమెదడులో వెలుపలి భాగంలో ధూసర పదార్థం, లోపలి భాగంలో శ్వేతపదార్థం ఉంటాయి.

లలాట భాగం

[మార్చు]

లలాట భాగాలు పెద్దమెదడుకు ముందు భాగంలో ఉంటాయి. ఇవి పార్శ్వ భాగాల నుంచి మధ్య గర్తాలతోను ( సెంట్రల్ సల్కస్ ), కర్ణభాగాల నుంచి పక్క గర్తాలతోను ( లేటరల్ సల్కస్ ) వేఱుచేయబడి ఉంటాయి. స్వయంనియంత్రణ, విచక్షణ, ప్రణాళికా రచన, తర్కం వంటి క్రియలు లలాట భాగాలపై ఆధారపడి ఉంటాయి. లలాట భాగంలో మధ్య గర్తంకు ముందున్న మెలికలో చలన వల్కలం ఉంటుంది . చలన వల్కంలోని నాడీకణాలపై శరీరంలోని ఇచ్ఛాకండరాల ఇచ్ఛా చలనాలు ఆధారపడి ఉంటాయి. కుడి చలన వల్కలం శరీరం ఎడమ భాగపు ఇచ్ఛాకండరాలను , ఎడమ చలన వల్కలం శరీరంలోని కుడిభాగపు ఇచ్ఛాకండరాలను నియంత్రిస్తాయి.

చలన వల్కలంలో నాడీకణాలను ఊర్ధ్వ చలన నాడీకణాలుగా పరిగణిస్తారు. వీటి నుంచి వెలువడే అక్ష తంతులు మెదడులో క్రిందకు సాగుచు అంతర గుళిక ( ఇంటర్నల్ కాప్సూల్ ) అనే భాగంలో గుమికూడి ఆపై మస్తిష్క మూలానికి చేరుతాయి. ఈ అక్ష తంతులు రెండవ ప్రక్కకు దాటుకొని కపాల నాడుల కేంద్రాలలో ఉన్న అధో చలన నాడీకణాలతోను, వెన్నుపాములోని అధో చలన నాడీకణాలతోను సంధానం అవుతాయి.

కపాల నాడుల కేంద్రాలలో చలన నాడీకణాలనుండి వెలువడే అక్షతంతులు కపాలనాడుల ద్వారాను, వెన్నుపాములోని చలన నాడీకణాల అక్షతంతులు వెన్నునాడుల ద్వారాను పయనించి వివిధ కండరాలకు చేరుకుంటాయి.

పార్శ్వ భాగం

[మార్చు]

మధ్య గర్తానికి వెనుక పార్శ్వ భాగాలలో [2]జ్ఞానవల్కలం ఉంటుంది . శరీరంలో వివిధ భాగాల నుంచి జ్ఞాన నాడులు సమీకరించే స్పర్శ, కంపన స్పర్శ, నొప్పి, ఉష్ణోగ్రత జ్ఞానసంజ్ఞలు మెదడులో థలమస్ లకు ఆపై జ్ఞాన వల్కలాలకు చేరడం వలన ఆయా జ్ఞానాలు కలుగుతాయి. కుడి జ్ఞాన వల్కలం వలన శరీరపు ఎడమభాగంలో స్పర్శ మొదలగు జ్ఞానాలు, ఎడమ జ్ఞాన వల్కలం వలన శరీరపు కుడి భాగములో స్పర్శ మొదలగు జ్ఞానాలు పొందుతాం.

కర్ణ భాగం

[మార్చు]

మెదడు కర్ణ భాగాలలో శ్రవణ వల్కలాలు ఉంటాయి. వినికిడి , వినిన పదాలు, సంభాషణలు అర్థం చేసుకొనడం ఈ శ్రవణ వల్కలాల వలన కలుగుతాయి.

దృశ్య సంజ్ఞల బట్టి చూసిన వస్తువులు గుర్తుపట్టడం, దీర్ఘకాలపు జ్ఞాపకాలు కూడ మస్తిష్కంలోని కర్ణ భాగాల వలన కలుగుతాయి.

పృష్ఠ భాగం

[మార్చు]

మెదడులో పృష్ఠ భాగాలలో దృష్టి వల్కలాలు ఉంటాయి. కంటితెరలపై నుండి వచ్చే సంజ్ఞలను బోధచేసుకొని దృష్టి వల్కలాలు దృష్టి జ్ఞానాన్ని కలుగ చేస్తాయి.

వాక్కు మెదడులో వివిధ భాగాలపైన ఆధారపడి ఉన్నా మెదడులో [3]బ్రోకా ప్రాంతంగా పరిగణించబడే లలాట భాగం వెనుక క్రిందిభాగం మాటలు పలకడంలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది.

మెదడుకు రక్తప్రసరణ

[మార్చు]

మెదడుకు రక్తప్రసరణ అంతర కంఠధమనుల ద్వారాను, వెన్నుధమనుల ద్వారాను కలుగుతుంది. మస్తిష్క మూలానికి, చిన్నమెదడుకు రక్తప్రసరణ వెన్నుధమనుల ద్వారా కలుగుతుంది.

మస్తిష్కమునుండి రక్తము బాహ్య సిరల జాల , అంతర సిరల జాల వ్యవస్థల ద్వారా వివిధ సిరాపరిఖలకు చేరి ఆపై అంతర కంఠసిరలకు కొనిపోబడుతుంది.

చిన్న మెదడు

[మార్చు]

చిన్నమెదడు (సెరిబెల్లమ్) చలన ప్రక్రియలను సమన్వయపరచుటకు, శరీరాన్ని సమస్థితిలో ఉంచడానికి తోడ్పడుతుంది.

మూలాలు

[మార్చు]
  1. "ACKNOWLEDGEMENTS", Gray's Anatomy, Elsevier, pp. x, 2008, retrieved 2023-05-03
  2. Hall, John E.; Guyton, Arthur C. (2011), "Respiration", Guyton and Hall Physiology Review, Elsevier, pp. 113–138, retrieved 2023-05-03
  3. www.coursehero.com https://www.coursehero.com/study-guides/wmopen-psychology/outcome-parts-of-the-brain/. Retrieved 2023-07-16. {{cite web}}: Missing or empty |title= (help)