మారిష
1.మారిష ప్రచేతసుల భార్య. కండుఁడు అను ఒక మహర్షికి ప్రమ్లోచ అను అప్సరస యందు పుట్టిన కన్య. తొల్లి కండుఁడు అను ఒక ఋషి తపము చేయుచు ఉండఁగా దేవేంద్రుఁడు దానికి విఘ్నము కావించుటకయి ప్రమ్లోచ అను అప్సరసను పంపెను. దానిని చూచి ఆఋషి చిత్తచాంచల్యము చెంది అనేకసంవత్సరములు దానితోకూడి ఉండి పిదప ఒకనాడు తెలివిఒంది దానిని కోపదృష్టితో చూచుచు విడనాడెను. అపుడు అది కడుభీతిచెంది ఆ మహర్షిచే తనకు కలిగిన గర్భముచెడి స్వేదరూపముగ శరీరమునుండి బయటవెడలఁగా ఆస్వేదమును ప్రమ్లోచ వృక్షపల్లవముల చేత తుడిచెను. ఆవృక్షపల్లవములను అంటిన స్వేదబిందువులను ఎల్లను వాయువు ఒక్కటిగ కూర్చి ఒక స్త్రీరూపపిండమునుగా చేసెను. దానిని చంద్రుఁడు తన కిరణముల చల్లదనముచేత పెంచెను. అట్లు జనియించి పెరిగిన ఈకన్యకను వాయువును, చంద్రుఁడును తండ్రులు అయిరి అనియు చెప్పుదురు.
ఈమె పూర్వజన్మమున పడుచుతనమున ఉండునపుడే భర్త గతించిపోయి సంతానము లేనందున విష్ణువునుగూర్చి తపస్సు చేయ, అతఁడు ప్రత్యక్షము అయి మీఁది జన్మమున నీకు పదుగురు భర్తలు అగుదురు అనియు, ప్రతాప తేజో ధైర్య స్థైర్యములు కల ఒక కొమరుఁడు కలుగును అనియు వరము ఇచ్చెను. కనుక సోదరులు అయిన ప్రచేతసులు పదుగురికిని భార్య అయి వారి వలన పూర్వజన్మమున బ్రహ్మపుత్రుఁడు అయి ఉండిన దక్షప్రజాపతిని కొడుకుగా కనెను.
మూలాలు
[మార్చు]https://web.archive.org/web/20140209111013/http://www.andhrabharati.com/dictionary/