మెరామిక్ జలాంతర్గత గుహలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెరామిక్ జలాంతర్గత గుహల లోపలి దృశ్యం

మెరామిక్ జలాంతర్గత గుహలు యునైటెడ్ స్టేట్స్‌ లోని సెయింట్ లూయిస్ పట్టణం తూర్పున ఉన్న మిస్సోరీ నది కింది భాగములో ఏర్పడిన అద్భుతమైన గుహలు. ఇవి లైమ్ స్టోన్స్ (సున్నపురాయి) నీటి కలయిక వలన భూ అంతర్భాగములో రూపు దిద్దుకున్నాయి. అనేక వేల సంవత్సరాల నుండి విస్తారమైన సున్నపురాయి నిలువల మీద ప్రవహిస్తున్న మిస్సోరీ నది కారణంగా అద్భుత జలాంతర్గత గుహలు రూపు దిద్దుకున్నాయి. ఈ గుహల్లో కొలంబస్‌కు పూర్వపు స్థానిక అమెరికన్ అవశేషాలు కనుగొనబడ్డాయి. ప్రస్తుతము ఇవి సెయింట్ లూయిస్ పట్టణ ప్రత్యేక పర్యటక ఆకర్షణలలో ప్రధానమైనవి. యు ఎస్ హైవే 66 ప్రధాన ఆకర్షణలలో ఇది ఒకటి. దీనిని సంవత్సరానికి 1,50,000 మంది సందర్శిస్తుంటారని అంచనా. యు.ఎస్.ఎ. బాబ్ కేవ్ కామ్ ఈ గుహలను అమెరికాలో ఉన్న పొడవైన గుహలలో 171వ శ్రేణిలో ఉన్నట్లు గుర్తించారు.

చరిత్ర[మార్చు]

మెరామిక్ కేవర్న్ గుహలు 400 వేల సంవత్సరాల నుండి చిన్నగా సున్నపురాయి నిలువల కారణంగా రూపు దిద్దుకుంటున్నట్లు పరిశీలకుల భావన. శతాబ్దాల ముందు కాలములో స్థానిక అమెరికన్లు వీటిని నివాసార్థము ఉపయోగించారు. మొదటి సారిగా మిసిసిపి నది పశ్చిమ తీరములో ఐరోపా వారు దీనిని గుర్తించారు. ఒక ఫ్రెంచి మైనరు (గనుల తవ్వకము దారు) దీనిని 1722 వ సంవత్సరములో కనిపెట్టాడు. 18వ శతాబ్దములో ఈ గుహల నుండి లభించిన మూల పదార్థము గన్ పౌడర్ (తుపాకీ మందు) తయారీకి వాడబడింది. సివిల్ వార్ శకములో యూనియన్ ఆర్మీ ఈ గుహలను సాల్ట్ పీటర్ తయారీ సంస్థకు ఉపయోగించారు. కాని ఈ తయారీ సంస్థను కాన్‌ఫిడరేట్ గొరిల్లాల చేత కనిపెట్టబడి ధ్వంసము చేయబడింది. 1870 లో ఈ గుహలను జేమ్స్, అతడి నేరాలలో భాగస్థుడు అయిన సొదరునితో తన మరుగైన స్థావరంగా చట్టము నుండి దాగుకొనడానికి ఉపయోగించుకున్నాడు. షెరీఫ్, ఈ గుహల ముందు భాగములో వారు బయటకు వచ్చినప్పుడు పట్టుకునే ప్రయత్నములో కూర్చుని ఎట్టకేలకు మరొక మార్గములో వారిని పట్టుకున్నాడు. 1933 లో ఈ గుహల విస్తరణను పూర్తిగా గుర్తించారు. ఈ గుహలు 4.6 మైళ్ల పొడవున విస్తరించి ఉన్నాయి. ఈ గుహలు 1935 వ సంవత్సరము నుండి పర్యటకులకు ఆకర్షణగా బంపర్ స్టిక్కర్ స్థాపకుడైన డి.బిల్ చేత తెరువబడ్డాయి. 1960 లో మెరామిక్ కేవర్న్‌లో ప్రకటన ఫలకాలు చోటు చేసుకున్నాయి. వీటి యజమానులు ప్రపంచములోనే భూమిలోపల చోటుచేసుకున్న ప్రకటనలు తమవేనని తమ ప్రత్యేకత చాటుకున్నారు.

గుహల సందర్శన[మార్చు]

ఈ గుహలను చూడడానికి సందర్శకులు తమ తమ వాహనాలలో ఇక్కడకు చేరుకుంటారు. గుహలను చూడడానికి ప్రత్యేక రుసుము వసూలు చేస్తారు. ఈ రుసుమును చెల్లించి లోపలికి ప్రవేశించిన తరువాత ఒక్కొక్క బృందాన్ని ఒక్కొక్క మార్గదర్శకుడు (గైడు) గుహల గురించి ఆంగ్లములో వివరిస్తూ సందర్శకులను ముందుకు తీసుకు వెళతాడు. ఇలా అనేక బృందాలు లోపల సందర్శన చేస్తు ఉంటాయి. లోపలకు వెళ్ళే ముదు సందర్శకులు కొనుగోలు చేయడనికి వీలుగా ఒక విక్రయశాల ఉంటుంది. ఇక్కడ ఆకర్షణీయమైన అనేక వస్తువులను విక్రయిస్తుంటారు. గుహలకు సంబంధించిన అనేక అలంకార ఇతర ఉపయోగకరమైన వస్తువులను ఇక్కడ విక్రయిస్తుంటారు. వీటిని సందర్శకులు తాము గుహలను చూసిన దానికి గుర్తుగా కొనుగోలు చేస్తుంటారు. తరువాత గైడు సహాయముతో లోనికి ప్రవేశించిన తరువాత, ముందుగా ఆ గుహలను తమ రహస్య స్థావరంగా ఉపయోగించిన జెస్, జేమ్స్ శిల్పాలు, వారి స్థావరము చూడ వచ్చు. దానిని దాటి లోపలకు వెళ్ళే ముందు ఒక పెద్ద దర్బారు వంటి ప్రదేశములో లోలకములా ఒక తాడు పైకప్పు నుండి వేలాడుతూ ఉంటుంది. దానిని ఆగుహలను ఉపయోగించిన వారు దిక్కులను తెలుసుకోవడానికి ఉపయోగించుకున్నారు. గుహల లోపల గాఢాంధకారముగా ఉంటుంది కనుక అక్కడక్కడా విద్యుద్దీపాలను ఏర్పాటు చేసారు. ఆ దీపాలను గైడులు వెలిగిస్తూ సందర్శకులను ముందుకు తీసుకు వెడుతుంటారు. సందర్శకులు దాటగానే ఆ దీపాలను ఆర్పి వేస్తుంటారు. అలా ముందుకు సాగుతూ సందర్శకులు అద్భుతమైన గుహలను దర్శించవచ్చు. లోపల అత్యల్ప ఉష్ణోగ్రత ఉంటుంది కనుక చలి అధికముగా ఉంటుంది. సందర్శకులు చలి తట్టుకోవడానికి ఉన్ని వస్త్రాల వంటి వాటిని ధరించడము ముఖ్యము. లోపలికి వెళ్ళే కొద్దీ వివిధ రూపాలలో, వివిధ వర్ణాలలో, వివిధ పరిమాణాలలో నీటికి కరిగి రూపుదిద్దుకుని పై కప్పు నుండి కిందకు జాలు వారిన గుహల సహజ సౌందర్యము సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది. కొన్ని చోట్ల దారికి ఇరువైపులా అడుగున చేరి ఉన్న స్వచ్ఛమైన జలాలో ప్రతిబింస్తున్న అందమైన గుహలు సందర్శకులను ఆశ్చర్యానందాలకు గురి చేస్తాయి. అలా గుహలను మొత్తముగా సందర్శించిన తరువాత, చివరగా చిన్న ప్రదర్శన ఉంటుంది. దీనికి ప్రత్యేక రుసుము చెల్లించ వలసిన పని లేదు. ఈ ప్రదర్శనలో ప్రేక్షకులు గుహల అందాలను వివిధమైన వర్ణాల విద్యుద్దీప కాంతిలో చూడవచ్చు. తరువాత గైడులు సందర్శకులను ప్రధాన ద్వారానికి చేర్చడంతో సందర్శన పూర్తి అవుతుంది. రెండు నుండి మూడు గంటల సమయములో ఈ గుహ సందర్శన పూర్తి చేయవచ్చు. గుహల ప్రధాన ద్వారములో ఉన్న అల్పాహారశాలలో కాఫీ, టీ, ఐస్ క్రీమ్ లతో పాటు వివిధ పానీయాలు, అల్పాహారము లభిస్తుంది.

గుహల వెలుపలి ప్రదేశము[మార్చు]

గుహల వెలుపల ఉన్న నదీతీరములో సందర్శకులు కొంత సమయము సేద తీర్చుకోవచ్చు. రెండు వైపులా దట్టముగా పెరిగి ఉన్న చెట్ల మధ్య ప్రవహిస్తున్న నదీ ప్రాంతము సందర్శకులకు మరింత ఆహ్లాదము చేకూరుస్తుంది. ఈ నదిలో రుసుము చెల్లించి పడవలలో, చిన్న బోట్లలో ప్రయాణము చేయవచ్చు. కేవర్న్ క్వీన్ 1, కెవర్న్ క్వీన్ 2 పడవలు ఒక్కో దఫా 25 మందిని నదీ విహారానికి తీసుకుని వెడతాయి. ఈ ప్రయాణము అరగంట సమయము సాగుతుంది. ఇవి ఏప్రిల నుండి సెప్టెంబరు వరకు వాతావరణానుకూలముగా నడుస్తుంటాయి. ఇవి కాక కేనో ఫ్లోట్స్ అనే కార్యక్రమాలు కూడా సందర్శకులకు అందుబాటులో లభిస్తాయి. ఆరు నుండి పదకొడు మైళ్లు ప్రయాణించే ఈ పడవలలో ప్రయాణించడానికి షటిల్స్ అనే ఉచిత బస్సులు లభిస్తాయి. ఈ బస్సులలో ప్రయాణించి, పడవలు లభించే ప్రదేశానికి చేరి, పడవలను ఎక్కి, తిరిగి తమ వాహనాలను నిలిపిన ప్రదేశానికి చేరుకోవచ్చు.

ఇతర ఆకర్షణలు[మార్చు]

  1. . జిప్ లైన్ సాహసిక క్రీడలలో మే మాసము నుండి అక్టోబరు వరకు రుసుము చెల్లించి పాల్గొన వచ్చు. ఈ క్రీడలలో పాల్గొన్న క్రీడాకారులు ఎత్తైన ప్రదేశము నుండి నడుముకు బెల్టు కట్టుకుని తీగ ద్వారా ప్రయాణించి నదిని దాటవచ్చు. నదిని ఒక సారి దాటి, అవతల తీరానికి చేరుకుని తిరిగి అక్కడ నుండి బయలుదేరిన ప్రదేశానికి చేరుకుంటారు. ఇలా నది మీద అటూ ఇటూ దాటడానికి అరగంట సమయము పడుతుంది. దీనిలో పాల్గొనడానికి రుసుము అధికమే.
  2. . లాంతర్న్ టూర్ అనే మరో ఆకర్షణ శని ఆది వారాలలో మాత్రమే ఉంటుంది. దీనికి ప్రత్యేక రుసుము వసూలు చేస్తారు. లాంతర్న్ టూరుకు సందర్శకులు రుసుము చెల్లించి, లాంతరు చేతితో పట్టుకుని గైడు సహాయముతో గుహలను సందర్శించ వచ్చు.
  3. . గుహలలో ఉన్న విక్రయ శాలలో క్రిస్టల్ తో చేసిన అలంకార సామాగ్రి, సహజమైన మధ్యకు కోసిన ఆకర్షణీయమైన క్రిస్టల్ రాళ్లు, శిలాజాలు, వివిధమైన బహుమతి ప్రదానమైన వస్తువులు లభిస్తాయి.
  4. . ప్రదర్శనకు పెట్టిన పురాతన వస్తులు, ఉపయోగించిన పురారాతన వస్తువులు, సందర్శకులను ప్రత్యేకముగా ఆకర్షిస్తాయి.
  5. . గుహలలో సందర్శకుల సౌకర్యార్ధం ఆల్పాహార విక్రయశాల ఉంది. ఇక్కడ దేశీయ ఆహారపదార్ధాలు, ఐస్‌క్రీమ్స్, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, కుక్క్డ్ కార్న్ వంటి అహారపదార్థాలు, ఇతర చిరుతిండ్లు లభిస్తాయి.

చిత్ర మాలిక[మార్చు]