Jump to content

ఉప్పల మెల్లీ షోలింగర్‌ లక్ష్మణరావు

వికీపీడియా నుండి
(మెల్లీ నుండి దారిమార్పు చెందింది)
మెల్లీ
జననంమెల్లీ
స్విట్జర్లాండ్
ప్రసిద్ధిస్వాతంత్ర్యోద్యమ నాయకురాలు
భార్య / భర్తఉప్పల లక్ష్మణరావు

మెల్లీ ప్రముఖ అనువాద రచయిత ఉప్పల లక్ష్మణరావు భార్య. అతడు - ఆమె, బతుకు పుస్తకం మొదలగు రచనలతో తెలుగు సాహితీలోకానికి ఉప్పల వారు సుపరిచితులే. మెల్లీ ఈ దేశంలో పుట్టకపోయినా, ఈ దేశాన్ని ప్రేమించి, ఈ దేశ దాస్యశృంఖలాలను తెంచుటకు స్వాతంత్ర్యోద్యమంలో తెగువతో పోరాడిన మహిళ. జీవితాన్ని నిర్భయంగా, నిర్నిబంధంగా గడిపిన ఆదర్శ మహిళ. స్విట్జర్లాండ్లో జన్మించి, తెలుగింట కోడలుగా అడుగుపెట్టిన మహిళ.

మానవతామార్తి

[మార్చు]

మెల్లీ కరుణామయి. 24 సంవత్సరాల వయసు. మెడిసిన్ చదివే రోజులు. ఒకరోజు ఓ విందుకు హాజరవటానికి వెలుతుంది. ఆ దారిలో ఓ వృద్దుడు తన పెంటబండిని లాగలేక అవస్థలు పడుతున్నాడు. ఆ దృశ్యం మెల్లీ కంటబడింది. పార్టీ, తన విలువైన బట్టలు, హోదా ఏవీ గుర్తురాలేదు ఆ క్షణాన మెల్లీకి, ఏ మాత్రం సంకోచించకుండా, ఆ పెంటబండిని వెనుక నుండి తోసి వృద్దుడికి సహాయపడింది. పెంటమరకలంటిన బట్టలతోనే ఆ పార్టీకి ఆలస్యంగా హాజరైంది ఆ మానవతామూర్తి. ఆ విందులోనే లక్ష్మణరావు మెల్లీని మొదటిసారి చూశాడు.

సాహసానికి మారు పేరు

[మార్చు]

మెల్లీ సాహసానికి మారు పేరు. తనకు అవమానమో, తాను తలపెట్టిన మంచిపనికి అవరోధమో కలిగితే ఆమె సహించేది కాదు. ఒకరోజు తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురానికి తిరుగు ప్రయాణమైంది. గోదావరి నది దాటటానికి ఒక లాంచీ ఎక్కింది. అయితే ఎవరో పెద్ద అధికారి లాంచీలో ప్రయాణం చేయడానికి వస్తున్నాడని, లాంచీని చాలా సేపు ఆపివేశారు. చాలా సేపు ఎదురుచూసినా అతను రాలేదు. లాంచీ కదలలేదు. సహనం కోల్పోయిన మెల్లీ ఈతకు అనువైన బట్టలు ధరించి ఆలస్యం చేయకుండా అమాంతం గోదావరిలో దూకి, అమావాస్య నాటి ఆ సాయంకాలం, ఐదు గంటలపాటు, 15 మైళ్ళు ఈది నరసాపురం చేరుకుంది. ఒళ్ళు గగురుపొడిచే మెల్లీ సాహసానికి లక్ష్మణరావు మొదట నొచ్చుకున్నా, ఆ తరువాత మెచ్చుకున్నాడు.

అన్నింటా సగం

[మార్చు]

స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఒకసారి గాంధీజీ ఎరవాడ జైలులో ఉన్నాడు. అదే సమయంలో మెల్లీ సబర్మతీ ఆశ్రమంలో ఉంది. ఆశ్రమంలో, ఆ చుట్టుపక్కల పురుషులు గస్తీ తిరుగడం ఆనవాయితీ. స్త్రీలకు ఆ పని నిషేధం. స్త్రీలను పిరికివారిగా చూడటం మెల్లీకి నచ్చలేదు. స్త్రీలకు కూడా గస్తీ తిరిగే అవకాశం ఇవ్వాలని ఆశ్రమంలో సత్యాగ్రహం చేపట్టింది. విషయం గాంధీజీ దాకా వెళ్ళింది. గాంధీజీ అర్థం చేసుకొని, అంగీకరించాడు. అదీ అమె పట్టుదల.

స్వాతంత్ర్యోద్యమంలో

[మార్చు]

మెల్లీ విదేశీయురాలైనా, ఈ దేశాన్ని ప్రేమించి, దేశ స్వేచ్ఛావాయువులకై ఆమె ఎడతెగని పోరాటమే చేసింది. అప్పటికి ఆమె లక్ష్మణరావు అర్ధాంగిగా కూడా మారలేదు. ఆ పోరాటంలో భాగంగా మూడున్నర సంవత్సరాలు జైలు జీవితాన్ని కూడా గడిపింది. జైలులో గడిపిన క్షణాళ్ళో కూడా అమె ప్రశాంతంగా జీవించలేదు. జైలులోను స్త్రీల సమస్యలకై పోరాటం చేసింది. స్త్రీలకు జైలులో మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని నిరహార దీక్ష చేపట్టింది. అనుకున్నది సాధించింది.

తూర్పు గోదావరి జిల్లాలో, స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా ఖాదీ ప్రదర్శన కార్యక్రం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనవొద్దని అప్పటి, అక్కడి పోలీసు సూపరింటెండెంట్ అమెను హెచ్చరించాడు. నేను పాల్గొనకూడదని ఏ ప్రభుత్వ ఆదేశాల్లో ఉందో చూపించాలని పట్టుపట్టింది మెల్లీ. అంతటితో ఊరుకోకుండా, మీరు నన్నీలాగే నిరోధిస్తే, నేను మాదేశ రాయబారికి విషయం తెలియజేయవలసి ఉంటుంది. అప్పుడు సమస్య అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. అప్పుడు మీ పరిస్థితి ఆలోచించుకొండి అని ఎదురు బెదిరించింది. పాపం ఎస్పీకి తోక ముడువక తప్పలేదు. అదీ అమె ధీరత్వం.

దుందుడుకు కాదు అతి నెమ్మదస్తురాలు

[మార్చు]

మెల్లీ జీవితమంతా అలజడే. స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, పోరాటం. ఇదీ స్తూలంగా అమె జీవితం. ఈ ప్రస్థానంలో అమె మనకు దుందుడుకురాలిగా కనిపించవచ్చు. అది కొంత వరకు వాస్తవం కూడా కావొచ్చు. కాని ఆమె అంతకు మించిన నెమ్మదస్తురాలని ఆమె వైవాహిక జీవితమే చెబుతుంది. లక్ష్మణరావుతో పరిచయం, స్నేహంగా, స్నేహం ప్రేమగా, ప్రేమ పెళ్ళిగా మారడానికి అమెకు పద్నాలుగు సంవత్సరాలకు పైగానే పట్టింది. ఏడు సంవత్సరాల స్నేహం అనంతరం, మిమ్మల్ని, మీ దేశాన్ని, అక్కడి పరిస్థితులను అర్థం చేసుకున్నాకే అర్ధాంగిగా మారుతానని షరతు పెట్టింది. ఆ మాట ప్రకారమే దేశంలో అడుగుపెట్టింది. లక్ష్మణరావుకన్నా ముందు దేశ పరిస్థితులను అర్థం చేసుకుంది. తన తొలి ప్రాధాన్యం ఏమిటో అమెకు బోధపడింది. దేశ స్వాతంత్ర్యం కొరకు, వివిధ రంగాలలో దేశ పురోగమనం కొరకు, స్త్రీ స్వేచ్ఛా హక్కుల కొరకు తదాత్మ్యంతో పాటుపడింది. ఈ ప్రయాణంలో మరో ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తరువాత లక్ష్మణరావును అర్థం చేకుంది. అర్ధాంగిగా అతని జీవితంలో అడుగుపెట్టింది. అది కూడా షరతులతోనే. మెల్లీ అస్తమించినా ఈ దేశ స్వేచ్ఛావాయువులలో, స్త్రీ సమానత్వపు హక్కులలో అమె పోరాటం, అమె త్యాగం అంతర్లీనమై, సజీవంగా కొనసాగుతూనే ఉంటాయి.

మూలాలు

[మార్చు]
  • బతుకు పుస్తకం, రచన:సావిత్రి, తెలుగుదివ్వెలు-1 తెలుగు వాచకం,9 వ తరగతి, ప్రభుత్వ ప్రచురణలు, 2014, పుట-101.
  • "తెలుగింటి కోడలు". m.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-08-08. Retrieved 2022-10-20.