మైసూర్ వి.దొరైస్వామి అయ్యంగార్
మైసూర్ వి.దొరైస్వామి అయ్యంగార్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | మైసూర్ వెంకటేశ దొరైస్వామి అయ్యంగార్ |
జననం | 1920 |
మరణం | 1997 అక్టోబరు 28 బెంగళూరు, భారతదేశం | (వయసు 76–77)
వృత్తి | వైణికుడు |
మైసూర్ వెంకటేశ దొరైస్వామి అయ్యంగార్ (1920-1997) ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు, వైణికుడు.[1][2]
విశేషాలు
[మార్చు]ఇతడు 1920లో ఒక సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి వెంకటేశ అయ్యంగార్ గొప్ప వైణికుడు, మైసూరు సంస్థానం ఆస్థాన విద్వాంసుడు. ఇతడు మొదట తన తండ్రి వద్ద తరువాత వీణ వెంకటగిరియప్ప వద్ద వీణావాదన అభ్యసించాడు. ఇతడు తన 12వ యేట అప్పటి మైసూర్ మహారాజు "నాలుగవ కృష్ణరాజ ఒడయారు" సమక్షంలో తొలి ప్రదర్శన గావించాడు. మహారాజు ఇతని వీణావాదనకు సంతుష్టుడై 50 వెండి నాణాలు బహూకరించాడు.
ఇతడు 1943లో మొదటి బహిరంగ కచేరీ బెంగళూరు గాయన సమాజలో చేశాడు. ఇతడు అనేక సంగీత సదస్సులలో పాల్గొన్నాడు. 1969లో ఇరాన్ దేశం షిరాజ్‌లో జరిగిన సదస్సులో పాల్గొని అక్కడ తన వీణావాదనను ప్రదర్శించాడు. ఇతడికి అనేక పురస్కారాలు వరించాయి. 1983లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో ఇతడిని సత్కరించింది.[3]1984లో మద్రాసు సంగీత అకాడమీ సంగీత కళానిధి పురస్కారాన్ని ప్రకటించింది. ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, చెన్నై 1994లో ఇతడికి "సంగీత కళాశిఖామణి" బిరుదు ప్రదానం చేసింది. బెంగళూరు గాయన సమాజ ఇతడికి "సంగీత కళారత్న" అనే బిరుదును ఇచ్చింది. ఇంకా ఇతనికి చౌడయ్య జాతీయ స్మారక పురస్కారం కూడా వచ్చింది.
ఇతడు మైసూరు మహారాజా కళాశాల నుండి బి.ఎ. పట్టా పొందాడు. ఆకాశవాణి బెంగళూరు కేంద్రంలో ప్రొడ్యూసర్‌గా పనిచేశాడు. 1975లో మైసూరు విశ్వవిద్యాలయం ఇతడికి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
ఇతడు వీణ వాయించే శైలి విభిన్నంగా ఉండేది. ఈ శైలిని కొన్నిసార్లు "మైసూరు బాణీ"గా పిలిచేవారు.
ఇతడు వాయులీన విద్వాంసుడు మైసూరు చౌడయ్యతో కలిసి చేసిన కచేరీలు జనాదరణ పొందాయి. ఇతడు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ వంటి హిందుస్తానీ కళాకారులతో జుగల్‌బందీ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. ఇతడు డి.వి.గుండప్ప, ఆర్.ఎస్.ముగలి, పి.టి.నరసింహాచార్ వంటి కన్నడ రచయితల అనేక కన్నడ సంగీత నృత్య రూపకాలకు సంగీతాన్ని సమకూర్చాడు.[4] 1966లో విడుదలైన సుబ్బాశాస్త్రి కన్నడ సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతని శిష్యులలో సి.కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.
ఇతడు తన 77వ యేట బెంగళూరులో 1997, అక్టోబరు 28వ తేదీన మరణించాడు. ఇతని కుమారుడు డి.బాలకృష్ణ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ మైసూరు బాణీలో వైణికుడిగా రాణిస్తున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Archived copy". Archived from the original on 31 డిసెంబరు 2003. Retrieved 26 మే 2014.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Latest Volume14-Issue23 News, Photos, Latest News Headlines about Volume14-Issue23".[permanent dead link]
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.
- ↑ Krupa Joseph (5 March 2020). "Festival to honour veena maestro". డెక్కన్ హెరాల్డ్. Retrieved 25 March 2021.
బయటి లింకులు
[మార్చు]- Listen to Tyagaraja Compositions performed by Sri Doreswamy Iyengar
- [1] Image of Sri Doraiswamy Iyengar
- [2] his compositions in mp3 format
- A gentle musician: Tribute to Doreswamy Iyengar
- R.K. Narayan on Doreswamy Iyengar