యమకాలంకారము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యమకము లేదా యమకాలంకారము : రెండు లేక అంతకంటే ఎక్కువ అర్థభేదముగల అక్షరముల సమూహమును మరల మరల ప్రయోగింపబడినచో దానిని యమకాలంకారము అంటారు.[1]

లక్షణం: "పౌనరుక్త్యేన ద్వయో ర్వ్యంజన యుగ్మాయోః"

ఛేకాను ప్రాసమునకు - యమకమునకు, భేదమేమనగా, యమకమున అక్షరముల సమూహము మరల మరల వచ్చుటలో వ్యవధానముండ వచ్చును. ఛేకాను ప్రాసమున నట్టి వ్యవధానము పనికిరాదు.

యమకం అంటే సంస్కృతంలో "జత" అని అర్థం. అదే అక్షరసమూహాన్ని రెండుసార్లు (లేక అంతకంటే ఎక్కువసార్లు) వాడుతున్నారు కాబట్టి యమకాలంకారం అయ్యింది.

  • ఉదాహరణ 1 : ప్రతి వారికి ఒక ప్రతి ఉచితం.
  • ఉదాహరణ 2 : యమనియమం.
  • ఉదాహరణ 3 : రంగా దయాపరంగా.

సినిమా పాటలలో యమకం[మార్చు]

  1. సీతాకోక చిలుక సినిమాలో వేటూరి సుందరరామమూర్తి రాసిన పాట లోని ఒక చరణంలో "ఓ చుక్కా, నవ్వవే! నావకు చుక్కానవ్వవే" అని రాసాడు. ఇందులో "చుక్కా నవ్వవే" అనగా ఓ నక్షత్రమా నవ్వవే అని. అలాగే రెండవసారి ఉపయోగించిన "చుక్కానవ్వవే" అనగా నావకు చుక్కాని అవ్వవే అని. ఇందులో ఒకే పదాల సమూహాన్ని వేర్వేరు అర్థాలలో ఉపయోగించడం జరిగింది. ఇది యమకం.
  2. శుభలేఖ సినిమాలో వేటూరి రాసిన ఒక పాటలో "నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక" అని రాసాడు. ఇందులో మొదట ఉపయోగించిన జడ-కుచ్చులు అంటే స్త్రీలు జడలోని అల్లిక. రెండవసారి ఉపయోగించిన మెడకుచ్చులు (మెడకు+ఉచ్చులు) అనగా మెడకు వేసిన ఉచ్చులు అనిర్థం. అనగా అమ్మాయి జడలోని కుచ్చులు అబ్బాయి మెడను బంధిస్తున్నాయి. ఇక్కడ "కుచ్చులు" అనే పదం రెండు అర్థాలలో ఉపయోగించడం యమకం అవుతుంది.

శ్రీమదాంధ్ర మహాభాగవతంలో యమకం[మార్చు]

బమ్మెర పోతన రాసిన శ్రీమదాంధ్ర మహాభాగవతంలో "నరకాసుర వధ" ఘట్టంలో రాసిన పద్యం[2]

లేమా! దనుజుల గెలువగ
లేమా? నీవేల కడగి లేచితి? విటురా;
లే మాను మానవేనిన్,
లే! మా విల్లందుకొనుము లీలం గేలన్

ఈ పద్యంలో "లేమా" అనే పదం నాలుగు పాదాలలో నాలుగు అర్థాలలో వాడబడింది.

అదే విధంగా "గోపికా వస్త్రాపహరణం" ఘట్టంలోని ఒక పద్యంలో

మా, మా వలువలు ముట్టకు
మామా! కొనిపోకు పోకు మన్నింపు తగన్
మా మానమేల కొనియెదు
మా మానసహరణ మేల మానుము కృష్ణా!

ఈ పద్యంలో మా, మా అనే పదాన్ని నాలుగు పాదాలలోనాలుగు విధాలుగా ఉపయోగించాడు.

వేటూరి పాటలలో యమకం[మార్చు]

వేటూరి తారు రాసిన గీతాలలో యమకాలంకారాన్ని ఉపయోగించాడు. అందులో కొన్ని గీతాలు[3]

  • మా రేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకూ
  • ఓ చుక్కా నవ్వవే.. నావకు చుక్కానవ్వవే
  • ఆబాల గోపాల మాబాల గోపాలుని
  • అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ
  • ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
  • ఏ కులమూ నీదంటే గోకులమూ నవ్విందీ
  • బజ్జోరా నా కన్నా లాలిజో, ఎవరయ్యా నీకన్నా లాలిజో
  • శంకర గళ నిగళము
  • పరవశాన శిరసూగంగా, ధరకు జానెనా శివగంగా

మూలాలు[మార్చు]

  1. "Klasspm-learn online". www.klasspm.com. Archived from the original on 2021-04-23. Retrieved 2021-04-23.
  2. "అలంకారములు (Alankaramulu)". పెద్ద బాల శిక్ష (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-04-23.
  3. పప్పు, శ్రీనివాస్ (2014-11-05). "వేటూరి పాటల్లో అలంకార వైభవం ( చిమట శ్రీనివాసరావు)". Veturi (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-04-23. Retrieved 2021-04-23.