రచయితగా జవాహర్ లాల్ నెహ్రూ
రాజకీయ నాయకునిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా మాత్రమే కాక జవాహర్‌లాల్ నెహ్రూ రచయితగా విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. 1928 నుంచి పలుమార్లు తాను అనుభవించిన జైలు జీవితంలో ఖాళీ సమయాన్ని అధ్యయనంతో పాటుగా తన కుమార్తె ఇందిరకు ప్రపంచ చరిత్ర మీద ఉత్తరాలుగా రాయడంతో ప్రారంభించి క్రమేపీ పలు విశిష్టమైన, ప్రాచుర్యం పొందిన రచనలు చేశాడు. 1918 నాటికే తండ్రి ప్రారంభించిన ఇండిపెండెంట్ పత్రిక సంపాదకత్వ బాధ్యతలతో పాటు వ్యాసరచన కూడా చేసేవాడు. రాజకీయ జీవితం అంతటా రాజకీయాంశాలపై తన భావాలు, కార్యాచరణ వివరిస్తూ రాయడం సమాంతరంగా కొనసాగుతూ వచ్చింది.
రచనా కెరీర్[మార్చు]
గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ[మార్చు]
జవాహర్‌లాల్ తన మొదటి ప్రధానమైన రచన అయిన గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీని ఉద్దేశపూర్వకంగా పాఠకుల కోసం కాక తన కుమార్తె ఇందిరకు ఉత్తరాలుగా రాశాడు. ఆ ఉత్తరాల్లో ప్రపంచ చరిత్రను వ్రాస్తూ పోయాడు. ఒక ప్రణాళికను అనుసరించి వ్రాసిన ఆ ఉత్తరాలే క్రమేపీ "గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ" గ్రంథంగా తయారయ్యాయి. 1928లో ఇందిర ముస్సోరీలోనూ, తాను దూరంగా భారత జాతీయోద్యమ కార్యకలాపాల్లోనూ ఉండగా భూమి ఎలా పుట్టింది అన్నదాని నుంచి మొదలుపెట్టి క్రమేపీ 1930 నాటికి వర్గాల ఏర్పాటు, వ్యవస్థీకృతమైన మతం ఏర్పాటు, భారతదేశానికి ఆర్యుల రాక వంటివి సంక్షిప్తంగా రాశాడు.[1] తర్వాత 1930లో రెండవ సారి అరెస్టు చేసినప్పుడు సహాయంగా ఆకర గ్రంథాలు లేకపోయినా జ్ఞాపకశక్తి మీద ఆధారపడి మొహంజదారో, ప్రాచీన గ్రీసు నుంచి తన సమకాలం వరకూ పలు అంశాలపై ఉత్తరాలు రాశాడు. 1931లో తిరిగి అరెస్టై సుదీర్ఘకాలాన్ని బారకాసుల వెనుక గడపాల్సివచ్చినప్పుడు కుమార్తెకు ఉత్తరాలు రాయడం మళ్ళీ కొనసాగించాడు. డెహ్రాడూన్ జైలులో జైలరు సహకరించడం, జైలు పరిస్థితులు కఠినంగా లేకుండడం వంటివాటితో పాటు ముఖ్యంగా ఎన్ని పుస్తకాలైనా తెచ్చుకునేందుకు సమస్య లేకపోవడం వల్ల ఈ లేఖారచన వేగం పుంజుకుంది. ఇందరకు ఉత్తరాలు ఎప్పటికప్పుడు పంపలేకపోయినా రాసినది రాసినట్టు పక్కన పెట్టుకుంటూ ఒకేసారి పంపుతూ రచన సాగించాడు. ఒక్కో ఉత్తరంలో ఒక్కో అంశమో, విశేషమో తీసుకుని రాసేవాడు. ఆ అంశంపై తన భావాలు తెల్లకాగితంపై పెట్టడం, వాటిని 14 సంవత్సరాల బాలికకు అర్థమయ్యేంత తేటతెల్లమైన శైలిలో రాశాడు. విడివిడి లేఖలుగా రాసిన పుస్తకంలో గ్రంథవిషయమైన ఏకత, పరిశోధనకు పుస్తకాలు కూడా లేకుండా యథార్థాంశాలపై ఉన్న పట్టు పరిశీలకులను విస్తుగొలిపాయి. జవాహర్‌లాల్ రాజకీయ సైద్ధాంతికత ఈ గ్రంథం రాసేనాటికే స్పష్టంగా ఉండడంతో ప్రపంచ చరిత్రలోని వివిధ అంశాల సంకలనంగా కాక విశిష్టమైన ఏకసూత్రతతో సమగ్రంగా తయారైంది. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ప్రపంచ చరిత్రను వివిధ వ్యక్తుల చరిత్రగానో, వివిధ సంఘటనల చరిత్రగానో కాక ప్రపంచ శక్తుల చరిత్రగా ఒకే కథను చెప్తూ సాగింది.[2]
ఆత్మకథ[మార్చు]
జవాహర్‌లాల్ ఆత్మకథను 1934 జూన్‌లో ఆల్మోరా జైలులో ఉండగా ప్రారంభించాడు. జవాహర్ భార్య కమల క్షయవ్యాధి కారణంగా మృత్యుముఖంలో ఉన్న ఆ దశలో తన మనస్సును సంబాళించుకుని, ఆ వేదన నుంచి బయటకు లాగడానికి ఒక సాధనంగా రచనను వాడుకున్నాడు. అలా ప్రారంభించిన తొమ్మిది నెలలోపే 1935 ఫిబ్రవరి 14న ఆ 976 పేజీల ఉద్గ్రంథం రాత ప్రతిని పూర్తిచేశాడు. జవాహర్ జీవితచరిత్రకారుడు ఎస్.గోపాల్ మాటల్లో చెప్పాలంటే - "సాహిత్య విషయకంగా... ఆ గ్రంథం (ఆత్మకథ) ఆయన (జవాహర్‌లాల్ నెహ్రూ) సాధించిన మహోన్నత విశేషం".[3] 1936లో ఆత్మకథ ప్రచురితమైంది. జవాహర్‌లాల్ ఆత్మకథ ఒక విశిష్టమైన గంభీరమైన రచన. కేవలం తన జీవిత రేఖలను మాత్రమే వ్యక్తం చేయలేదు. నూతనమైన ప్రపంచ భావాలను, రాజకీయాలను తనదైన రీతిలో వ్యాఖ్యానిస్తూ, ఆసియా ఖండపు జాతీయవాదాన్ని పాశ్చాత్య ప్రపంచానికి జవాహర్‌లాల్ దృక్పథం నుంచి పరిచయం చేసిన గ్రంథం అది. నెహ్రూ తన నుంచి వెలుపల నిలబడి తాను జీవిస్తున్న యుగాన్ని గురించి, సమాజాన్ని గురించి, తనకు తెలిసిన మనుషుల గురించి, తన మానసిక వికాసాన్ని గురించి అరమరికలు లేకుండా నిజాయితీగా చెప్పుకున్నాడు.[4] సాధారణంగా తనను తాను ప్రదర్శించుకునే లక్షణం లేని జవాహర్ వ్యక్తిత్వం ఇందులో భారతదేశ పరిస్థితులు, దాన్ని బ్రిటీష్ పాలన ఎలా తయారుచేసింది, దేశీయుల్లో అధికసంఖ్యాకులు దుర్భర స్థితిలో ఉంచిన ఆ పాలన తననెంత నొప్పించి గాయపరిచిందో చూపించాడు. ఇందుకు తోడు నాజూకైన సొగసుతో నుడికారంతో, పదబంధాలతో తన హృదయంలోని భావాన్ని విడమరిచి చెప్పగల ఆంగ్లశైలిని ఈ రచన ప్రదర్శించింది.[5] ఎవరి అనారోగ్యం వల్ల గాయపడ్డ మనస్సును చిక్కబట్టుకోవడానికి ఆత్మకథ రాశాడో ఆమె - అతని భార్య కమల - గ్రంథం వెలుగుచూసేనాటికి మరణించడంతో "ఈ లోకంలో లేని కమలకు" అంటూ పుస్తకాన్ని అంకితం ఇచ్చాడు.[6]
ప్రాచుర్యం[మార్చు]
జవాహర్‌లాల్ నెహ్రూ రచనలు విస్తృతమైన ప్రాచుర్యం పొందాయి. తండ్రి మోతీలాల్ మరణానంతరం జవాహర్‌లాల్ ఆనందభవన్‌లోని పెద్ద కుటుంబాన్ని నడపడానికి 1930ల్లో కొన్ని కంపెనీల్లో అతనికి మిగిలిన వాటాలతో పాటు తాను రాసిన పుస్తకాలపై వచ్చే రాయల్టీలు కూడా ప్రధానంగా ఉపయోగపడేవి.[3] 1936లో తొలి ముద్రణ పొందిన ఆత్మకథ రచయితగా అతనికి మంచి స్థానాన్ని సంపాదించిపెట్టింది. భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా తనకంటూ పాఠకులను సంపాదించుకుంది.[5] బ్రిటన్‌లో జవాహర్ రాజకీయాలకు బద్ధ వ్యతిరేకులైన కన్సర్వేటివ్ పార్టీ వారి పత్రిక సహా ప్రతీ పత్రికా ఆత్మకథ అనుకూల సమీక్షలు చేస్తూ ఆ పుస్తక ప్రాముఖ్యతను, గొప్పదానాన్ని గుర్తించే స్థాయిలో అది ఉంది.[7] ఆత్మకథ విడుదలైన కొన్ని వారాల్లోనే పలు ముద్రణలు పొందింది.[4]
మూలాలు[మార్చు]
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 125.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 148.
- ↑ 3.0 3.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 163.
- ↑ 4.0 4.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 169.
- ↑ 5.0 5.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 170.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 173.
- ↑ సర్వేపల్లి గోపాల్ 1993, p. 168.
ఉపయుక్త గ్రంథాలు[మార్చు]
- సర్వేపల్లి గోపాల్ (1993). జవహర్‌లాల్ నెహ్రూ జీవిత చరిత్ర. Translated by రామలింగం, డి,. సాహిత్య అకాడెమీ. ISBN 81-7201-212-8.
{{cite book}}
: CS1 maint: extra punctuation (link)