రథకారన్యాయము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది సంస్కృత న్యాయములలో ఒకటి. కొంచెం క్లిష్టంగా ఉన్నా ఇక్కడ మంచి అర్థం ఉంది.

'రథకారాధికరణన్యాయము' లో 'రథకార' అన్న మాటకు రెండు అర్థాలు ఉన్నాయి: ఒకటి రథము చేయువాఁడు అనే వ్యుత్పత్తి సిద్ధమగు అర్థము. రెండు, 'రథకారుఁడు' అనే రూఢార్థం ఉన్నాయి. అయినా ఈ రూఢార్థమే గ్రహింపఁబడినట్లు - అని ఈ "న్యాయం" అర్థం. రథకారుడు అంటే ఏమిటి? ఈ శ్లోకం చూడండి.

ఆధానే శ్రూయతే, వర్షాసు రథకార ఆదధీతేతి!
తత్రరథం కరోతీతి వ్యుత్పత్త్యా త్రైవర్ణికో రథకార ఇతిచేత్‌|
నైవమ్‌ సంకీర్ణజాతివిశేషే రూఢత్వాత్‌|
వైశ్యాయాం క్షత్రియాదుత్పన్నో మాహిష్యః|
శూద్రాయాం వైశ్యా ఉత్పన్నా కరణీ|
తస్యాం కరణ్యాం మాహిష్యాదుత్పన్నో రథకారః|
తథా చ యాజ్ఞవల్క్యః-'మాహిష్యేణ కరణ్యాంతు రథకారః ప్రజాయతే' ఇతి 'తస్య చ రథకార స్యాధానకాలో వర్షర్తుః||

వైశ్యస్త్రీ యందు క్షత్రియుని వలన జనించినవాఁడు మాహిష్యు డనఁబడును. శూద్ర స్త్రీ యందు వైశ్యుని వలన జనించిన స్త్రీ కరణి యనబడును. ఆ కరణియందు మాహిష్యుని వలన జనించినవాడు రథకారుడు అని చెప్పబడుచున్నాఁడు. ఇది రూఢార్థం. ఇక్కడ ముచ్చటించినవి అన్నీ సంకీర్ణజాతులు.

"రథం కరోతీతి రథకారః" అను వ్యుత్పత్తిచే రథకార శబ్దమునకు రథము చేయువాడు అని అర్థం. కాని రథము చేయువాడు అనునది గౌణార్థము; సంకీర్ణజాతి జనితుడు అనునది ముఖ్యార్థము. గౌణము అనగా వ్యుత్పత్తి సిద్ధము; ముఖ్యము అనగా రూఢము.

అట్టియెడ ఆధాన ప్రకరణమున వర్ష ఋతువునందు రథాకారున కాధానము కావింపఁబడవలయు నని చెప్పఁబడింది. ఇందు బ్రకరణ గృహీత రథకారశబ్దమునకు సంకీర్ణజాతి జనితుడు రథకారుఁడా, లేక రథములు చేయువాడా అని శంక వొడమ, "అవయవసిద్ధేః సముదాయసిద్ధి ర్బలీయసీ" (అవయవ సిద్ధార్థము కంటే సముదాయ సిద్ధార్థము అనఁగా రూఢార్థము బలవత్తరము అను పరిభాషచే పంకజమునకు అవయవసిద్ధములవు బురదలో పుట్టిన నత్త మున్నగునవి నిరాకృతములై పద్మము అను ముఖ్యార్థమే స్వీకరింప బడుచున్నటుల గౌణార్థము నిరాకృతమై ముఖ్యమవు సంకీర్ణజాతివాచక రథకారుఁడే గ్రహింపఁబడవలయునని యాచార్యులచే సిద్ధాంతీకరింపఁబడింది.) ఏతావతా గౌణార్థమును వదలి ముఖ్యార్థమును బోధించు పట్ల నీ న్యాయము ప్రవర్తించును అని సారాంశము.

  • రూఢ్యార్థం, n. usually understood meaning; common meaning; important meaning;
  • గౌణార్థం, n. వ్యుత్పత్తి సిద్ధము; derived meaning

పంకజం అంటే పద్మము అయినా కావచ్చు, నత్త అయినా కావచ్చు కాని పంకజము అనగానే అందరికీ సామాన్యంగా అర్థం అయేది పద్మము అనే కనుక ఆ అర్థమే రూఢి చేద్దాం అని తాత్పర్యం.

మూలాలు[మార్చు]

  • సంస్కృతన్యాయములు (కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939